పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఐ 171 ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు


బహుళ స్థాయి దర్యాప్తులు, మార్గదర్శక భద్రతా సంస్కరణల ప్రకటన

Posted On: 14 JUN 2025 6:42PM by PIB Hyderabad

సమీక్ష

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆ శాఖ సహాయమంత్రి శ్రీ మురళీధర్ మొహోల్, కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, సీనియర్ అధికారులతో కలసి ఈరోజు న్యూఢిల్లీలోని ఉడాన్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 ప్రమాద విషాదానికి సంబంధించి వివరాలను సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తక్షణ స్పందన, దర్యాప్తు స్థితి, విమానయాన భద్రతను బలోపేతం చేసేలా చేపట్టబోతున్న సంస్కరణలను వివరించారు.

మృతులకు నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించి విలేకరుల సమావేశాన్ని ప్రారంభించారు.

ఘటన వివరాలు

అహ్మదాబాద్ - గాట్విక్ విమానాశ్రయం (లండన్) మధ్య నడుస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిరిండియా విమానం ఏఐ 171 జూన్ 12న టేకాఫ్ అయిన నిమిషంలోనే కూలిపోయింది. అహ్మదాబాద్‌లో జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న మేఘాని నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది.

మృతుల్లో ప్రయాణికులు, అహ్మదాబాద్‌లోని మేఘని నగర్‌కు చెందిన యువ వైద్య విద్యార్థులు ఉన్నారు. వారి అకాల మరణం వారి కుటుంబాలకే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా తీవ్ర నష్టం.

సీనియర్ నేతల సందర్శన, క్షేత్రస్థాయిలో స్పందన

ప్రమాద ఘటన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రమాద స్థలాన్ని, అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను పరామర్శించారు. రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. తదుపరి చర్యలను నిర్దేశించడానికి విమానాశ్రయంలో ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు.

హోంమంత్రి శ్రీ అమిత్ షా సంఘటన స్థలానికి చేరుకుని, క్షేత్రస్థాయి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా సహాయాన్ని అందించాలని కేంద్ర సంస్థలను ఆదేశించారు.

ప్రమాద ఘటన అనంతరం, వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మెహన్ నాయుడు సహాయమంత్రి శ్రీ మురళీధర్ మొహోల్‌తో కలిసి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. బాధితుల కుటుంబాలను, అత్యవసర సంరక్షణ సేవల్లో పాల్గొన్న వైద్య సిబ్బందిని వారు కలిశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిని, సహాయక ఏర్పాట్లను సమీక్షించారు.

సంతాపం, సానుభూతి

ఈ విషాదకరమైన ప్రాణనష్టం పట్ల పౌర విమానయాన మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన యావద్దేశాన్ని కుదిపేసిందన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా యువ విద్యార్థులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన వాడిగా బాధితుల వేదనను వ్యక్తిగతంగా తాను అర్థం చేసుకోగలనని మంత్రి అన్నారు.

అత్యవసర స్పందన, సమన్వయం

ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ, బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్, ఏఏఐ సిబ్బంది మధ్య సమన్వయంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. మరోవైపు నేషనల్ మీడియా సెంటర్‌లో మీడియా కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

కుటుంబాలకు సాయమందించేందుకు వివిధ హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు:

·        అహ్మదాబాద్ విమానాశ్రయం అత్యవసర హెల్ప్ లైన్: 9974111327

·        పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్: 011-24610843/9650391859

·        ఎయిరిండియా ప్రయాణికుల హెల్ప్ లైన్: 1800-5691-444

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ, ఏఏఐబీ, ఏఏఐ, బీసీఏఎస్ సీనియర్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కుటుంబాలకు చేయూత

బాధిత కుటుంబాలకు సమగ్ర సహాయాన్ని అందించాలని ప్రభుత్వం ఎయిర్ ఇండియా యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల కోసం చేపట్టిన సహాయక చర్యలు:

·        పరిహారాన్ని వెంటనే చెల్లించడం

·        కుటుంబీకులకు రవాణాపరంగా, భావోద్వేగపరంగా అండగా నిలవడం

·        బాధిత కుటుంబాలను కలిసి, సహాయం చేసే బాధ్యతలను సీనియర్ ఎయిరిండియా అధికారులకు కేటాయించడం

·        బ్రిటిష్ పౌరులు, వారి కుటుంబాల కోసం లండన్‌లోని గాట్విక్‌లో ప్రత్యేక సహాయక విభాగం ఏర్పాటు

·        క్షతగాత్రుల కోసం డాక్యుమెంటేషన్, ప్రయాణ ఏర్పాట్లు, ఆస్పత్రులతో సమన్వయ సహకారం

కేవలం సాంకేతిక దర్యాప్తుగా మాత్రమే కాకుండా, మానవతా ప్రాధాన్యంగా ఈ ఘటనను పరిగణిస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

కొనసాగుతున్న దర్యాప్తు

ప్రమాదం జరిగిన రోజునే విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడికి పంపారు. అనంతరం ఫోరెన్సిక్, వైద్య నిపుణులను నియమించారు.

జూన్ 13న సాయంత్రం 5 గంటల సమయంలో విమానం బ్లాక్ బాక్స్‌ లభించడం ముఖ్యమైన పురోగతి. డీకోడింగ్ ప్రక్రియ ద్వారా విమానం చివరి క్షణాల్లో ఏం జరిగిందన్నదానిపై కీలకమైన వివరాలు లభించే అవకాశముందని భావిస్తున్నారు.

వివిధ కోణాల్లో సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి కమిటీ

స్వతంత్ర, సమగ్ర విచారణ నిర్వహించడానికి కేంద్ర హోం కార్యదర్శి అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కింది విభాగాలకు చెందిన అధికారులు కమిటీలో ఉన్నారు:

·        పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

·        హోం మంత్రిత్వ శాఖ

·        గుజరాత్ ప్రభుత్వం

·        డీజీసీఏ, బీసీఏఎస్, భారత వైమానిక దళం, ఇంటెలిజెన్స్ బ్యూరో

·        రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

·        జాతీయ, రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ నిపుణులు

కమిటీ ముఖ్య విధులు:

·        సాంకేతిక, నిర్వహణ, నియంత్రణపరమైన కోణాల్లో సంఘటనను పరిశీలించడం

·        వ్యవస్థాగత లేదా సంస్థాగత అంతరాలున్నాయో గుర్తించడం

·        మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించడం

·        ధ్రువీకరణ వ్యవస్థలు, అత్యవసర నిర్వహణ నియమాలు, సిబ్బంది శిక్షణ, వాయు రద్దీ నిర్వహణ వ్యవస్థలు సహా వైమానిక భద్రతను బలోపేతం చేయడం కోసం దీర్ఘకాలిక సంస్కరణలను సిఫార్సు చేయడం

ఏఏఐబీ తన దర్యాప్తులో సాంకేతిక అంశాలను పరిశీలిస్తుండగా, ఈ ఉన్నత స్థాయి కమిటీ భవిష్యత్ రక్షణ చర్యల కోసం సమగ్రమైన, విధానపరమైన ప్రణాళికను అందిస్తుందని మంత్రి తెలిపారు.

ఈ కమిటీ జూన్ 16 నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.

విమాన నిర్వహణ మరియు నిఘా చర్యలు

జెనెక్స్ ఇంజిన్లను అమర్చిన అన్ని బోయింగ్ 787-8, 787-9 విమానాల్లో వెంటనే సాంకేతిక తనిఖీలు చేపట్టాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 33 డ్రీమ్ లైనర్లలో ఎనిమిదింటిని ఇప్పటికే పరిశీలించారు. మిగిలిన విమానాల్లోనూ అత్యవసరంగా పరిశీలనలు జరుపుతున్నారు.

దేశంలో వినియోగిస్తున్న అన్ని భారీ విమానాల నిర్వహణ నియమాలు, వాటి వైమానిక రవాణా యోగ్యత విధానాలపై పర్యవేక్షణను కూడా డీజీసీఏ ముమ్మరం చేసింది.

విమానయాన భద్రతకు కట్టుబడి ఉన్న భారత్

విమానయాన భద్రతలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో నిలిచిందని మంత్రి పునరుద్ఘాటించారు. భారత విమానయాన నియంత్రణ వ్యవస్థలు దృఢమైనవని, సానుకూలమైనవని ఐసీఏవో సహా అంతర్జాతీయ సంస్థలు స్థిరంగా పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేశారు భద్రత, పారదర్శకతల్లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ప్రభుత్వం స్పష్టంగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

సహనంతో వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయాలని విజ్ఞప్తి

ఊహాగానాలకు లేదా ధృవీకరణ పొందని రిపోర్టింగుకు దూరంగా ఉండాలని ప్రజలు, మీడియాను మంత్రిత్వ శాఖ కోరింది. దర్యాప్తుల్లో పురోగతి సాధిస్తున్న కొద్దీ అన్ని అధికారిక అంశాలను సకాలంలో, పారదర్శకంగా వెల్లడిస్తామని తెలిపారు. వాస్తవాలను గుర్తించడం, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 


(Release ID: 2136554) Visitor Counter : 3