ఉప రాష్ట్రపతి సచివాలయం
కన్సల్టెన్సీ సంస్థలకు చెందిన ఒక్కో ఇంజినీరు అధీనంలోని ప్రాజెక్టుల సంఖ్యపై పరిమితిని విధించిన ఎన్‌హెచ్ఏఐ
Posted On:
13 JUN 2025 5:46PM by PIB Hyderabad
జాతీయ హైవే ప్రాజెక్టుల్లో నాణ్యత, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం లేదా నిర్వహణ కోసం పెట్టుకున్న కన్సల్టెన్సీ సంస్థలకు సంబంధించి ప్రతి ఇంజినీరుకూ గరిష్ఠంగా 10 ప్రాజెక్టులనే ఇవ్వాలంటూ భారత జాతీయ హైవే ప్రాధికరణ సంస్థ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. ఎన్‌హెచ్ఏఐ) తాజాగా ఓ పరిమితిని నిర్దేశించింది. స్వతంత్ర ఇంజినీరు, ప్రాధికరణ ఇంజినీరు లేదా సూపర్‌విజన్ కన్సల్టెంట్లుగా పనిచేసే కన్సల్టెన్సీ సంస్థలు ఒక డిజిగ్నేటెడ్ ఇంజినీరుకే అనేక ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నాయన్న విషయం పరిశీలనలో తెలియవచ్చింది.
స్పెసిఫికేషన్లను, కాంట్రాక్టు నిబంధనలను పాటించాల్సిన బాధ్యతను ప్రధానంగా కన్సల్టెంటు టీమ్ ఏదైనా ప్రత్యేక ప్రాజెక్టుకు నియోగించే (డిజిగ్నేటెడ్) ఇంజినీరు పర్యవేక్షిస్తుంటారు. అయితే చేతిలో ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు ఉంటున్న కారణంగా, ఇలా నియుక్తుడైన ఇంజినీరు తనకు కేటాయించిన బాధ్యతలను పూర్తి చేయలేకపోవచ్చు. ఈ స్థితిలో, ప్రాజెక్టు రాశి- వాసిల పర్యవేక్షణ ఉద్దేశం నెరవేరకుండా పోతోంది.
నేషనల్ హైవే ప్రాజెక్టులను హైబ్రిడ్ యాన్యుయిటీ పద్దతి (హెచ్ఏఎమ్), ఇంజినీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతి.. ఈ రెండు పద్ధతుల్లోనూ అమలుచేయడంతో పాటు నిర్వహించే కన్సల్టెన్సీ సంస్థలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో సవివర క్లాజులను కూడా చేర్చారు. ఈ క్లాజుల్లో స్వతంత్ర ఇంజినీర్లు, ప్రాధికరణ ఇంజినీర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలతో పాటు బాధ్యతల అప్పగింత నియమాలను పేర్కొన్నారు.
కన్సల్టింగ్ సంస్థకు చెందిన నియుక్తుడైన ఇంజినీరు నిర్ధారిత ప్రాజెక్టు స్థలాన్ని ప్రతి నెలా చూసి కన్సల్టెన్సీ, సివిల్ కాంట్రాక్టు నిబంధనలలో పేర్కొన్న విధంగా ఇన్‌పుట్స్‌ను నెలవారీ ప్రగతి నివేదికలో పేర్కొనాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇంజినీరుకు ఎక్కువలో ఎక్కువగా పది ప్రాజెక్టుల పరిమితి నియమం 60 రోజుల తరువాత నుంచి అమలులోకి వస్తుంది. దీంతో ఈ వ్యవధి లోపల తగిన ఏర్పాట్లను చేయడానికి కన్సల్టెన్సీ సంస్థలకు వీలు కలుగుతుంది.
ఒక్కో ఇంజినీరుకు ప్రాజెక్టుల పరంగా గరిష్ఠ సంఖ్యపై పరిమితిని విధించడం నిర్వహణ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడం ఒక్కటే కాకుండా హైవేల నిర్వహణతో పాటు ఆయా ప్రాజెక్టులను అధిక నాణ్యతతో అమలుపరచడంలో కూడా తోడ్పడనుంది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేల్లో సురక్షిత, సరళతర, అంతరాయ రహిత ప్రయాణానుభూతికి కూడా మార్గాన్ని సుగమం చేయడంలో ఈ నిర్ణయం దోహదపడనుంది.
***
(Release ID: 2136222)