మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల సదస్సు, గ్లోబల్ యంగ్ అకాడమీ వార్షిక సర్వసభ్య సమావేశం
విజ్ఞానశాస్త్రాల్లో సహానుభూతి, నైతికత, నిష్పాక్షికతలను భారత్ విశ్వసిస్తుంది – శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
వికసిత భారత్ సాకారమయ్యేలా, మానవుడే కేంద్రంగా అభివృద్ధి ముందుకురికేలా శాస్త్రవేత్తల్లో సహకార ధోరణి ఆవశ్యకం.. ఉమ్మడి లక్ష్యం, సహానుభూతి ఆవిష్కరణలకు స్ఫూర్తిగా ఉండాలి – శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
10 JUN 2025 2:38PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల సదస్సు, గ్లోబల్ యంగ్ అకాడమీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, భారత జాతీయ విజ్ఞాన శాస్త్రాల సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, హైదరాబాద్ ఐఐటీ నిర్వాహక మండలి (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) అధ్యక్షుడు శ్రీ బి.వి. ఆర్. మోహన్ రెడ్డి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ సదస్సుకు హాజరైన యువ శాస్త్రవేత్తలకు తన ప్రసంగంలో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్లోబల్ యంగ్ అకాడమీలో కొత్తగా చేరిన 30 మంది సభ్యులను శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం భారత్‌ను, హైదరాబాద్ ఐఐటీని ఎంపిక చేసినందుకు గ్లోబల్ యంగ్ అకాడమీని ఆయన అభినందించారు. ఈ సదస్సు కేవలం శాస్త్రవేత్తల సమావేశం మాత్రమే కాదనీ.. ఆశ, లక్ష్యం, ఉమ్మడి గమ్యాన్ని ప్రతిబింబించే వేదిక అని వ్యాఖ్యానించారు.
వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత) అన్న భావన భారత్‌కు ఓ నినాదం మాత్రమే కాదనీ.. ఇక్కడ ఇదో జీవన విధానమని శ్రీ ప్రధాన్ స్పష్టం చేశారు. భారత్ విజ్ఞానశాస్త్రాన్ని విశ్వసిస్తుందనీ.. ఆ విషయంలో సహానుభూతి, నైతికత, నిష్పాక్షికతతో వ్యవహరిస్తుందని అన్నారు. విజ్ఞానాన్ని అందరితో పంచుకోవాలన్నారు. పేటెంట్లు కాదు, భాగస్వామ్యాలే భవితను తీర్చిదిద్దుతాయని స్పష్టం చేశారు.
భారత అంతర్జాతీయ సంబంధాలకు ఈ విలువలే ప్రాతిపదిక అని మంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, మిషన్ లైఫ్ (ఎల్ఐఎఫ్ఈ), ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి కార్యక్రమాలు విజ్ఞానశాస్త్రం ప్రాతిపదికన విశ్వ బంధుత్వం దిశగా భారత దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.
శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలు ఏకతాటిపైకి వచ్చి అత్యంత బలహీనులను సాధికారులను చేసేలా వ్యవస్థాగత నిర్మాణాలు, పరిష్కారాలకు ఇది అత్యంత అనుకూలమైన సమయమని ఆయన పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని పరోపకారం దిశగా మళ్లించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి, మానవుడే కేంద్రంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్రవేత్తలు సహకార ధోరణితో మెలగాలని శ్రీ ప్రధాన్ కోరారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో ఇతర ప్రముఖులతో కలిసి శ్రీ ప్రధాన్ మొక్కలు నాటారు. తల్లి గౌరవార్థం మొక్కను నాటడమన్నది చిన్న పనే అయినా విస్తృతమైన సందేశాన్నిస్తుందని, అమితంగా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ, ముఖ్యంగా అన్ని ప్రాంగణాల్లోని విద్యార్థులు ఈ హరిత ఉద్యమంలో ముందుండాలన్నారు. సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.
గ్లోబల్ యంగ్ అకాడమీ (జీవైఏ), భారత జాతీయ యువ వైజ్ఞానిక సంస్థ (ఐఎన్ వైఏఎస్), భారత జాతీయ వైజ్ఞానిక శాస్త్రాల సంస్థ (ఐఎన్ఎస్ఏ) సహకారంతో- హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్) అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల సదస్సును (స్వాప్నికుల సదస్సు: అంతర్జాతీయ మార్పు దిశగా విజ్ఞానశాస్త్ర సాధికారత) నిర్వహిస్తోంది. భారత్‌లో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు వారం రోజులపాటు జరగనుంది. అంతర్జాతీయ సవాళ్లకు విజ్ఞానశాస్త్ర ఆధారంగా పరిష్కారాలను అందించేలా.. రాబోయే తరం అంతర్జాతీయ వైజ్ఞానిక నిపుణులను ఒక్కచోటకు చేర్చడంలో ఇదో కీలకమైన మైలురాయి. ఈ సదస్సులో 60 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు 65 మంది జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. తద్వారా భాగస్వామ్యంలో వైవిధ్యాన్ని, సమ్మిళితత్వాన్ని గమనించవచ్చు. గ్లోబల్ యంగ్ అకాడమీ (జీవైఏ) వార్షిక సర్వసభ్య సమావేశం కూడా ఈ సదస్సులో భాగంగా ఉంది. అంతర్జాతీయ వైజ్ఞానిక సమాజంలో వర్ధమాన నిపుణుల మధ్య వివరణాత్మక చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
ఈ సమావేశంలో కింది అంశాలపై ఉత్తేజకరమైన చర్చలు, అంశాలవారీగా సదస్సులు ఉంటాయి:
• పర్యావరణం, సామాజికం, పరిపాలన (ఈఎస్జీ),
• అంతర్జాతీయ సంక్షేమం కోసం ఆరోగ్యం, పోషకాహారం,
• ఇండస్ట్రీ 5.0: మానవ- యాంత్రిక ఇంటర్ఫేస్ను పెంచడం,
• ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక అవకాశాలు: అంతర్జాతీయ స్థాయి.
***
(Release ID: 2135438)