Posted On:
26 MAY 2025 9:52PM by PIB Hyderabad
భారత్ మాతా కీ-జై!
మన త్రివర్ణ పతాకాన్ని ఎన్నటికీ కిందకు దించకూడదు.
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ మనోహర్ లాల్ జీ, క్యాబినెట్లోని మిగతా సభ్యులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర విశిష్ట ప్రముఖులు, కచ్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు!
శరద్ నిలయమైన, ధైర్యవంతులైన కచ్చి ప్రజల భూమి అయిన కచ్ కు నేను ఎందుకు వచ్చాను? కచ్ పుత్ర రత్నం, విప్లవ నాయకుడైన శ్యామ్ జీ కృష్ణ వర్మకు నా హృదయపూర్వక వందనం చేస్తున్నాను. నా కచ్చి సోదరులు, సోదరీమణులందరినీ, మనస్ఫూర్తిగా 'రామ్ రామ్' అంటూ పలకరిస్తున్నాను.
మిత్రులారా...
ఈ పవిత్ర కచ్ భూమిపై, మన ఆశలన్నీ మాతా ఆశాపురా ఆశీర్వాదంతో నెరవేరుతాయి. మాతా ఆశాపురా ఎల్లప్పుడూ ఈ ప్రాంతంపై తన కృప చూపిస్తూ వచ్చింది. ఈ రోజు, నేను మాతా ఆశాపురాకు వినమ్రపూర్వక భక్తితో నమస్కరిస్తున్నా. మరియు కచ్ నేల నుంచి ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా...
కచ్ తో నా బంధం ఈనాటిది కాదు. నా పట్ల మీకున్న ప్రేమ, నన్నిక్కడికి రాకుండా ఎప్పటికీ ఆపదు. నేను రాజకీయాలలో లేనప్పుడు, అధికారంతో సంబంధం లేనప్పుడు కూడా, క్రమం తప్పకుండా కచ్ కి వచ్చేవాడిని- నా పనిలో, జీవితంలో ఇది సహజమైపోయింది. ఈ ప్రాంతంలోని ప్రతి ప్రదేశాన్నీ సందర్శించే అవకాశం నాకు లభించింది. ఎన్ని కష్టాలున్నా కచ్ ప్రజలు, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్పం ఎల్లప్పుడూ నా జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. ప్రస్తుత తరం కాకపోయినా, పాత తరాలవారికి తెలుసు.. ఇక్కడ జీవితం ఇప్పుడు చాలా సులభం అయ్యింది, కానీ అప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొదటిసారి నర్మదా జలాలు కచ్ భూమికి చేరుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. అప్పుడది కచ్ కు దీపావళి వచ్చినట్లు అనిపించింది. ఆనాటి వెలుగుల్ని కచ్ ఎప్పుడూ చూసి ఉండదని అనుకుంటున్నా. శతాబ్దాలుగా నీటి కోసంఅలమటించిన కచ్ ను నర్మదా మాత ఆశీర్వదించింది. ఈ పొడిబారిన భూమికి జలాలను తీసుకువచ్చే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కచ్ ను ఎన్నిసార్లు సందర్శించానో ప్రజలు లెక్కపెట్టేవారు.. గమనించేవారు! కొందరు "మోదీజీ సెంచరీ సాధించారు" అని కూడా అన్నారు. అనేక గ్రామాలను సందర్శించడం, నా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, ప్రజలను కలవడం, స్థానిక కార్యాలయాల్లో కూర్చోవడం, పనిచేయడం… ఇవన్నీ నా రోజువారీ కార్యకలాపాలలో సహజమైన భాగాలుగా నిలిచిపోయాయి.
మిత్రులారా...
కచ్ కు నీటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, కచ్ రైతులు ఉత్సాహంగా ఉండటాన్ని నేను చూశాను - వారి సంకల్పం ఎల్లప్పుడూ గొప్పదే. ఈ ప్రాంతంలో గడిపిన అనేక సంవత్సరాల అనుభవంతో ఇక్కడ అభివృద్ధికి గొప్ప ఆస్కారం ఉండటాన్ని నేను గమనించా. కచ్ ను తక్కువ అంచనా వేయలేం. వేల సంవత్సరాల క్రితం ధోలావీరా నివసించిన ఈ భూమి కచ్చితంగా అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. అటువంటి భూమిని మనం గౌరవించాలి.
మిత్రులారా...
ఆశ, నిరంతర కృషితో, పరిస్థితులను మార్చవచ్చని, ప్రతికూలతను అవకాశంగా మార్చవచ్చని, కావలసిన లక్ష్యాలను సాధించవచ్చని కచ్ చూపించింది. ఇక్కడ భూకంపం సంభవించినప్పుడు, "ఇది అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేదు" "అని ప్రపంచమంతా అనుకుంది. భూకంపం తరువాత కచ్ జీవచ్ఛవమైపోయింది. కానీ మిత్రులారా, నేను ఎప్పుడూ నా విశ్వాసాన్ని కోల్పోలేదు. కచ్ ప్రజల అదమ్య స్ఫూర్తి-"కచ్చి ఖమీర్" పై నాకు నమ్మకం ఉంది. అందుకే కచ్ లో 'క', ఖమీర్ లో 'ఖ' (గ్రిట్ అండ్ స్పిరిట్) గురించి పిల్లలకు నేర్పించాలని చెప్పేవాడిని. భూకంపాన్ని కూడా కదిలించేలా ఈ సంక్షోభాన్ని కచ్ అధిగమిస్తుందని, నా కచ్చిమాడు (ప్రియమైన కచ్ ప్రజలు) మళ్లీ లేస్తుందని నాకు నమ్మకం ఉంది. మీరు సరిగ్గా అదే చేసి చూపించారు. నేడు, కచ్ వాణిజ్యం, వ్యాపారం, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉంది. రాబోయే కాలంలో కచ్ పాత్ర మరింత పెరుగుతుంది. అందుకే నేను కచ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి వచ్చినప్పుడల్లా, నేను మరింత చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలి, ఇంకా మెరుగ్గా చేయాలి అని భావిస్తాను- పురోగతి ఆగిపోవడానికి నా హృదయం ఒప్పుకోదు. నేడు, అభివృద్ధికి సంబంధించిన 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. లేదా వాటి శంకుస్థాపనలు జరిగాయి. గుజరాత్ రాష్ట్రం మొత్తం చూసినా.. 50,000 కోట్ల రూపాయల విలువైన ప్రణాళికల గురించి వినబడని సమయం ఉండేది. నేడు, కేవలం ఒక జిల్లాలో అంత విలువైన పని జరుగుతోంది!
మిత్రులారా...
ఈ ప్రాజెక్టులు భారతదేశాన్ని నీలి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ప్రపంచ శక్తిగా, హరిత శక్తి కేంద్రంగా మారడానికి కూడా సహాయపడతాయి. ఈ అద్భుతమైన అభివృద్ధి ప్రయత్నాలకు గాను మీ అందరికీ-కచ్ లోని నా ప్రియమైన ప్రజలకు-నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, మీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేయండి!
మిత్రులారా...
మన కచ్ హరిత ఇంధనానికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా మారుతోంది. ఈ మాట విన్నారా? నేనేం చెప్పాను? ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం- ఆ సంబరాలు జరుపుకోవడానికి ఇంకొన్నాళ్ళు ఆగుదాం! హరిత ఉదజని అనేది ఒక కొత్త రకం ఇంధనం. రాబోయే కాలంలో కార్లు, బస్సులు, వీధి దీపాలు-ఇవన్నీ గ్రీన్ హైడ్రోజన్ తో నడుస్తాయి. దేశంలోని మూడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ల్లో కాండ్లా ఒకటి. ఈ రోజు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు కూడా శంకుస్థాపన జరిగింది. మిత్రులారా, ఈ కర్మాగారంలో ఉపయోగించే సాంకేతికత మేడ్ ఇన్ ఇండియా అని తెలిస్తే మీరు గర్వపడతారు. మన కచ్ భారతదేశ సౌర విప్లవానికి కూడా గుండెకాయ. ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి ఇక్కడే నిర్మితమవుతోంది.. మన కచ్ లో. చాలామంది కచ్ గురించి మాట్లాడేటప్పుడు... "మీకు అక్కడ ఏమి ఉంది? ఇది కేవలం ఒక ఎడారి. అక్కడ ఏం సాధిస్తావ్? అని అనేవారు. "ఇది కేవలం ఎడారి కాదు... ఇది గుజరాత్ ప్రవేశ ద్వారం (తోరణ్)! " అని చెప్పేవాడిని. ఒకప్పుడు దుమ్ము తుఫానులు, బంజరు భూమితో నిండిపోయిన ఆ ఎడారి ఇప్పుడు మనకు సాధికారత కల్పించడమే కాకుండా, మొత్తం దేశానికి శక్తినివ్వడం ప్రారంభించింది. ఖావ్డా కాంప్లెక్స్ కు ధన్యవాదాలు, కచ్ ఇప్పుడు ప్రపంచ ఇంధన పటంలో తనదైన ముద్ర వేసింది.
మిత్రులారా...
మీకు తగినంత విద్యుత్ లభించడమే కాకుండా, మీ విద్యుత్ బిల్లు సున్నా అయ్యేలా చూడటానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించాం. గుజరాత్లోని లక్షలాది కుటుంబాలు ఇప్పటికే ఈ కార్యక్రమం లో భాగమయ్యాయి.
సోదర సోదరీమణులారా...
సుసంపన్నంగా విరాజిల్లుతున్న ప్రతి దేశంలోనూ, ఆ విజయంలో సముద్రం ప్రధాన పాత్ర పోషించింది. ఇక్కడ కూడా మనకు ధోలావీరుడి ఉదాహరణ ఉంది. లోథల్ వంటి పురాతన ఓడరేవు నగరాలు ఇక్కడ ఉండేవి-ఇవి భారతదేశ ప్రాచీన నాగరికతలో సంపద, పురోగతికి కేంద్రాలుగా ఉండేవి. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి గురించి మన దార్శనికత ఈ గొప్ప వారసత్వం నుంచి ప్రేరణ పొందింది. భారత్ తన నౌకాశ్రయాల చుట్టూ నగరాలను అభివృద్ధి చేస్తోంది. సముద్రపు ఆహారం నుంచి పర్యాటకం వరకు, వాణిజ్యం వరకు, తీరప్రాంతాన్ని పూర్తిగా కొత్త పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నారు. నౌకాశ్రయాల విస్తరణ, ఆధునికీకరణలో దేశం భారీ పెట్టుబడులు పెడుతోంది. ఫలితాలు విశేషంగా ఉన్నాయి. దేశంలోని కొన్ని ప్రధాన ఓడరేవులు, మొదటిసారిగా, ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో 150 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించాయి. ఇందులో కాండ్లాలోని మన సొంత దీనదయాళ్ నౌకాశ్రయం కూడా ఉంది. దేశంలోని మొత్తం సముద్ర వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు కచ్ నౌకాశ్రయాల ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాల సామర్థ్యం, అనుసంధానం నిరంతరం పెంచుతున్నాం. ఈరోజు కూడా ఇక్కడ అనేక కొత్త షిప్పింగ్ సంబంధిత సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. కొత్త జెట్టీని నిర్మించారు. మరింత సరుకులను నిల్వ చేయడానికి, ఆధునిక నిల్వ సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో, మేము సముద్ర రంగం కోసం ప్రత్యేక నిధిని ప్రకటించాం. నౌకానిర్మాణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చాం. మన సొంత, ప్రపంచ అవసరాల కోసం మనం ఇప్పుడు భారతదేశంలో పెద్ద నౌకలను నిర్మిస్తాం. ఒకప్పుడు మాండ్వి సరిగ్గా భారీ నౌకా నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. మన ప్రజలు వాటిని గొప్ప నైపుణ్యంతో నిర్మించేవారు, ఆ బలం నేటికీ మాండ్విలో ఉంది. ఇప్పుడు, ఈ నౌకలను తయారు చేసి, ఎగుమతి చేయడానికి, ఆధునిక నౌకానిర్మాణంలో భారత్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇది మన యువతకు వేలాది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. మనకు ఇప్పటికే ఇక్కడ అలంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడు, మేం నౌకానిర్మాణంలో మా పూర్తి బలాన్ని వెచ్చిస్తున్నాం. ఉద్యోగ కల్పనకు అత్యధిక సామర్థ్యం ఉన్న రంగాలలో ఇది ఒకటి.
మిత్రులారా...
మన కచ్ ఎల్లప్పుడూ దాని వారసత్వాన్ని గౌరవించింది. ఇప్పుడు, ఈ వారసత్వం కచ్ అభివృద్ధికి ప్రేరణగా కూడా మారుతోంది. గత రెండు నుంచి రెండున్నర దశాబ్దాలుగా వస్త్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్, సెరామిక్స్, ఉప్పునకు సంబంధించిన పరిశ్రమలు భుజ్లో గణనీయమైన వృద్ధిని సాధించాయి. కచ్ ఎంబ్రాయిడరీ, బ్లాక్ ప్రింటింగ్, బంధనీ ఫాబ్రిక్, తోలు పనికి లభిస్తున్న ప్రజాదరణ ప్రతిచోటా చూడవచ్చు. ఎక్కడ వర్క్ షాప్ జరిగినా అక్కడ మన భుజోడి ని ప్రతిబింబించే చేనేత లేదా హస్తకళలు లేకపోవడం చాలా అరుదైన విషయం. అజ్రఖ్ ముద్రణ సంప్రదాయం కచ్ కు ప్రత్యేకమైనది. ఇప్పుడు మన కచ్ నుంచి ఈ కళా రూపాలన్నీ జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ ను కలిగి ఉంటాయి. ఈ గుర్తింపు స్థానికంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా లభించింది. అంటే ఈ కళారూపాలు కచ్ నుంచి ఉద్భవించాయని ఇప్పుడు అధికారికంగా గుర్తింపు లభించిందన్న మాట. ముఖ్యంగా మన గిరిజన కుటుంబాలకు, చేతివృత్తులవారికి ఇది గణనీయమైన గుర్తింపు. ఈ ఏడాది బడ్జెట్లో తోలు, వస్త్ర పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది.
మిత్రులారా...
కచ్ లోని మహిళలైనా, పురుషులైనా.. రైతులంతా చేసిన కృషికి కూడా నేను వందనం చేస్తున్నా. కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మీరు వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు గుజరాత్లో నీటి మట్టం వందల అడుగులు పడిపోయింది. నర్మదా మాత దయతో, ప్రభుత్వ ప్రయత్నాలతో, ఈ రోజు పరిస్థితి మారిపోయింది. కచ్లోని కెవాడియా నుంచి మోడ్ క్యూబా వరకు నిర్మించిన కాలువ ఈ ప్రాంతం తలరాతను మార్చివేసింది. నేడు, కచ్ మామిడి, ఖర్జూరాలు, దానిమ్మ, జీలకర్ర, డ్రాగన్ పండ్లు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇలాంటి అనేక పంటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు చేరుతున్నాయి. ఒకప్పుడు ప్రజలు కచ్ నుంచి వలస వెళ్ళవలసి వచ్చేది- అందువల్ల ఇక్కడ జనాభా పెరుగుదల ఉండేది కాదు. మనకు ప్రతికూల జనాభా పెరుగుదల ఉండేది. కానీ నేడు, కచ్ ప్రజలు ఇక్కడే కచ్ లో ఉపాధి పొందుతున్నారు. అంతే కాదు మిత్రులారా బయటి ప్రజలు కూడా ఇప్పుడు కచ్ వైపు చూస్తున్నారు.
మిత్రులారా...
దేశంలోని యువతకు గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించడమే బీజేపీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. భారీ సంఖ్యలో ఉద్యోగాలను అందించే రంగాలలో పర్యాటకం ఒకటి. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి-ఈ మూడింటినీ కచ్ కలిగి ఉంది. కచ్ లో జరిగే రణ్ ఉత్సవ్ రోజు రోజుకు కొత్త శిఖరాలకు చేరుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక్కడ భుజ్లో నిర్మించిన స్మృతి వన్ ను ప్రపంచంలోనే అత్యంత అందమైన మ్యూజియంగా యునెస్కో గుర్తించింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటకం మరింత విస్తరిస్తుంది. ధోర్డో గ్రామం ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా నిలిచింది. ధోర్డో ప్రజలు ఈ రోజు ఇక్కడ ఉన్నారా? ఉంటే దయచేసి జాతీయ జెండాను ఎగురవేయండి! మాండ్వి సముద్ర తీరం కూడా పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారుతోంది. రణ్ ఉత్సవ్ జరిగే సమయంలోనే మనం కూడా బీచ్ పోటీలను నిర్వహించవచ్చా? అని భూపేంద్ర భాయ్ ను, ఇక్కడ ఉన్న కచ్ నాయకులందరినీ అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో బీచ్ గేమ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటీవల, డయ్యూలో జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. ఇక్కడ వేలాది మంది పిల్లలు ఇసుక బీచ్లలో జరిగిన పోటీల్లో పాల్గొనడానికి, ఆడటానికి వచ్చారు. రణ్ ఉత్సవ్ సమయంలో మాండ్వి బీచ్లో క్రమం తప్పకుండా జరిగే బీచ్ పండుగలు, ఆటలను చూడటానికి నేను ఇష్టపడతాను, ఇవి దేశంలోని ప్రజలందరినీ ఆకర్షిస్తాయి. ఈ విధంగా, కచ్ పర్యాటకం కొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటుంది. మీకు ఏ సహకారం అవసరమైనా మీ కోసం ఎల్లప్పుడూ నేను ఉంటాను.
మిత్రులారా...
అహ్మదాబాద్, భుజ్ మధ్య నడిచే నమో భారత్ రాపిడ్ రైలు కూడా పర్యాటకానికి బలమైన ఊపునిచ్చింది.
మిత్రులారా...
ఈ రోజు మే 26-అకస్మాత్తుగా అందరూ ఎందుకంత నిశ్శబ్దంగా మారిపోయారు? గుజరాత్ లోని నా సోదరీ సోదరులు.. మీరంతా నన్ను గుజరాత్ నుంచి ఢిల్లీకి పూర్తి వేడుకలతో పంపారు. ఆరోజు.. అంటే 2014 మే 26వ తేదీన ఇదే సమయంలో నేను మొదటిసారిగా ప్రధాన మంత్రిగా-దేశానికి 'ప్రధాన సేవక్' గా ప్రమాణ స్వీకారం చేశాను. మీ ఆశీస్సులతో, గుజరాత్ కు సేవ చేయడం నుంచి దేశానికి సేవ చేయడం వరకు జరుగుతున్న ఈ ప్రయాణం ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరియు విధి రాత చూడండి.. ఈ మే 26 కు ప్రధానమంత్రి పాత్రలో 11 సంవత్సరాలు గడిచాయి. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు.. 11 సంవత్సరాల తరువాత మనం 4వ స్థానానికి చేరుకున్నాం.
మిత్రులారా...
భారత్ పర్యాటకాన్ని విశ్వసిస్తుంది.. పర్యాటకం ప్రజలను కలుపుతుంది. కానీ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావించే పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి, ఇది ప్రపంచానికి పెద్ద ముప్పు. సంవత్సరాల క్రితం, గాంధీనగర్ నుంచి ఒక మంత్రో లేదా ముఖ్యమంత్రో ఇక్కడకు వచ్చినప్పుడల్లా వారి ప్రసంగాలు పాకిస్తాన్తో ప్రారంభమై పాకిస్తాన్తో ముగిసేవన్న విషయం గుజరాత్లోని కచ్ ప్రజలకు తెలుసు. వారు కచ్ ప్రజలకు పాకిస్తాన్ గురించి పదే పదే గుర్తు చేసేవారు. 2001లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని మీరు గమనించాలి: నేను దాని కోసం సమయాన్ని వృధా చేయను. నేను దాన్నిప్రస్తావించడం పూర్తిగా మానేశాను. నేను కచ్ సామర్ధ్యం గురించి మాత్రమే మాట్లాడాను. అలాగే ముందుకు సాగాను. నా మిత్రులారా!కచ్ ప్రజలు, వారి పూర్తి సామర్థ్యంతో పాకిస్తాన్ కూడా అసూయపడేలా కచ్ ను తీర్చిదిద్దుకున్నారు.
మిత్రులారా...
ఉగ్రవాదానికి పాల్పడే వారిని ఉపేక్షించకూడదన్నది మా విధానం. ఆపరేషన్ సిందూర్ ఆ విషయాన్నే స్పష్టం చేసింది. భారతీయుల రక్తాన్ని కళ్ళచూడాలనుకునే వారు ఎవరికైనా వారి సొంత భాషలో సమాధానం ఇస్తాం. భారత్ పై కన్ను ఎత్తే ధైర్యం చేసేవారు ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం.
మిత్రులారా...
ఆపరేషన్ సిందూర్ అనేది మానవాళిని రక్షించడానికి, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించినది. మే 22 తర్వాత నేను ఏమీ దాచలేదు. "ఉగ్రవాదుల స్థావరాల దుమ్ము దులుపుతా"నని నేను బీహార్లో ఒక బహిరంగ సభలో ప్రకటించాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకుంటుందని ఆశిస్తూ మేము 15 రోజులు వేచి ఉన్నాం. కానీ బహుశా ఉగ్రవాదమే వారి జీవనోపాధి అనుకుంటా. వారు ఏమీ చేయనప్పుడు, నేను మన సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను మన దళాలు లక్ష్యంగా చేసుకుని సమీపంలోని ఎవరికీ హాని కలిగించకుండా నేరుగా దాడి చేసి, కచ్చితమైన దెబ్బకొట్టాయి. మన సైన్యం ఎంత సమర్థవంతంగా, క్రమశిక్షణతో వ్యవహరించిందో ఇది నిరూపిస్తుంది. ఇక్కడ భారతదేశంలో కూర్చుని ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించగలమని మేం ప్రపంచానికి చాటిచెప్పాం.
మిత్రులారా...
భారత్ చర్య తర్వాత పాకిస్తాన్ ఎంత అల్లకల్లోలంగా మారిందో మనమందరం చూశాం. 9వ తేదీ రాత్రి మన కచ్ సరిహద్దు వెంబడి కూడా డ్రోన్లు కనిపించాయి. మోడీ గుజరాత్ కు చెందినవాడు కాబట్టి, వారు ఇక్కడ దాడికి ప్రయత్నించవచ్చని భావించారు.కాని వారు ఎవరితో పెట్టుకున్నారో వారికి తెలియదు. 1971 ను గుర్తు చేసుకోండి.. ఈ రోజు ఇక్కడ ఉన్న ధైర్యవంతులైన మహిళలు, అంతా పాకిస్తాన్ దుమ్ము దులుపేలా చేశారు! ఈ తల్లులు, సోదరీమణులు కేవలం 72 గంటల్లో రన్వేను నిర్మించారు ప్రభుత్వం దాడులను కొనసాగించింది. ఈ రోజు, 1971 నాటి ఈ పోరాట యోధ మహిళలు నన్ను ఆశీర్వదించడానికి రావడం నా అదృష్టం. అంతే కాదు, వారు నాకు సిందూర్ మొక్కను బహుకరించారు. తల్లులు, సోదరీమణులారా.. మీరు నాకు ఇచ్చిన ఈ మొక్క ఇప్పుడు ప్రధానమంత్రి నివాసంలో నాటుతారు. ఈ సిందూర్ మొక్క పెరిగి 'వట్ వృక్ష' (పెద్ద మర్రి చెట్టు) లాగా ఎదుగుతుంది.
మిత్రులారా...
మేము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నప్పుడు, పాకిస్తాన్ మన అమాయక పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారి డ్రోన్లు కనిపించగానే వాటిని రెప్పపాటులో ఒకదాని తరువాత ఒకటి కూల్చేయడాన్ని మీరు చూశారు. భారత్ అప్పుడు రెట్టింపు బలంతో వారి సైన్యంపై ఎదురుదాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలపై భారత్ చేసిన కచ్చితమైన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నేను చెప్పినట్లుగా-మీరు 1971 యుద్ధాన్ని చూశారు-కానీ ఈసారి, పాకిస్తాన్ మొత్తం వణుకుతోంది మిత్రులారా.. వారు భయభ్రాంతులయ్యారు. 1971లో వారు మన భుజ్ వైమానిక స్థావరంపై దాడి చేస్తే మన సోదరీమణులు అసమాన ధైర్య సాహసాలకు ఉదాహరణగా నిలిచారు.
మిత్రులారా...
పాకిస్తాన్ దాడులకు మేమిచ్చిన బదులుకు వారి వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాయి.. నేటికీ, అవి కోలుకోలేదు! తప్పించుకునే మార్గం లేదని గ్రహించిన పాకిస్తాన్ చివరకు లొంగిపోవాల్సి వచ్చింది. భారత్ తన అద్వితీయమైన బలాన్ని చూపించింది. అంతిమంగా, మన సాయుధ దళాల శౌర్యం, ధైర్యం, కచ్చితత్వం దీనికి దోహదపడ్డాయి. కొన్ని గంటల్లోనే తోక ముడిచి, ఇకపై కాల్పులు జరపాలనుకోవడం లేదంటూ పాకిస్తాన్ తెల్ల జెండాను ఎగురవేయడం ప్రారంభించింది. "ఆ విషయాన్ని మేం ఇదివరకే స్పష్టం చేసాం. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, దాడి చేయడం, గుణపాఠం నేర్పించడం మా లక్ష్యం. కానీ మీరు పొరపాటు చేసినందున తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది" అని వారికి తెలియజెప్పాం.
మిత్రులారా...
సరిహద్దు ఉగ్రవాదంతో భారత్ పోరాడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచే, మద్దతు ఇచ్చే వారితోనే మన శత్రుత్వం. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ కచ్ నేల నుంచి నేను పాకిస్తాన్ ప్రజలకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా: మీరు ఏమి సాధించారు? భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.. మీ పరిస్థితి ఏమిటి? మీ పిల్లల భవిష్యత్తును ఎవరు నాశనం చేశారు? వారు నిస్సహాయులుగా తిరగడానికి కారకులు ఎవరు? ఇది ఉగ్రవాదానికి పరాకాష్ట; మీ సొంత సైన్యం సొంత అజెండా తో చేసిన పని ఇది. పాకిస్తాన్ పౌరులు, ముఖ్యంగా యువత, పిల్లలు.. మోదీ మాట జాగ్రత్తగా వినండి. మీ ప్రభుత్వం, మీ సైన్యం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వానికి డబ్బు సంపాదించే వ్యాపారంగా ఉగ్రవాదం మారింది. పాకిస్తాన్ యువత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవాలి: ఇది సరైన మార్గమా? ఇది నిజంగా వారికి ఉపయోగపడుతుందా? అధికార రాజకీయాల ఈ ఆట-పాకిస్తాన్ పిల్లల జీవితాలను మెరుగుపరుస్తుందా? నేను పాకిస్తాన్ పిల్లలకు చెప్తున్నా: మీ పాలకులు, మీ సైన్యం, ఉగ్రవాద నీడలో జీవించడం ద్వారా, మీ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు, మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మిమ్మల్ని చీకటిలోకి నెట్టివేస్తున్నారు. ఉగ్రవాద వ్యాధి నుంచి పాకిస్తాన్ ను విముక్తి చేయాలంటే, పాకిస్తాన్ ప్రజలు ధైర్యంగా నిలబడాలి. పాకిస్తాన్ యువత ఒక వైఖరి తీసుకోవాలి. శాంతి, గౌరవాలతో బతకండి. మీ రొట్టెను ప్రశాంతంగా తినండి, లేకపోతే-నా బుల్లెట్ సిద్ధంగా ఉంది.
మిత్రులారా...
భారత్ దిశ సుస్పష్టం. భారత్ అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు మార్గాన్ని ఎంచుకుంది. కచ్ స్ఫూర్తి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రేరేపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా.
నా కచ్చి సోదరులు, సోదరీమణులకు, కచ్ నూతన సంవత్సరం అయిన ఆశాధి బిజ్ పండుగ కొద్ది రోజుల్లో రాబోతోంది. ఇంతకుముందు, నేను మీతో కలిసి ఆశాది బిజ్ జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చేవాడిని. కానీ ఈసారి, నేను రాలేకపోవచ్చు కాబట్టి, ఈ రోజే నా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నా. కచ్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులకు-మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు వెలకట్టలేనివి. ఈ రోజు ఈ రోడ్ షో అద్భుతం! ఇంత వేడిలో విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకు జనాలు గుమిగూడారు. కచ్ కు వంద వందనాలు. నా స్నేహితులారా-మరోసారి మీకు వంద వందనాలు! అన్ని అభివృద్ధి పథకాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు, త్రివర్ణ పతాకాన్ని పైకి లేపి, నేను చెప్పినట్లు బిగ్గరగా చెప్పండి...
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
భారత్ మాతా కీ-జై!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
గమనిక: ప్రధాన మంత్రి ప్రసంగంలోని కొన్ని భాగాలు గుజరాతీ భాషలో ఉన్నాయి. వాటికి ఇది తెలుగు అనువాదం.
***