రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కొట్టిన అత్యంత తీవ్రమైన దెబ్బ... పాక్ ఏదైనా దుర్మార్గానికి పాల్పడితే, భారత నౌకాదళం పోరాట శక్తిని చవిచూడాల్సివస్తుంది: ఐఎన్ఎస్ విక్రాంత్ మీది నుంచి రక్షణ మంత్రి స్పష్టీకరణ
* ‘‘ఆపరేషన్ సిందూర్ ఇప్పుడే ముగియలేదింకా.. ఇది కేవలం విరామమే’’
* ‘‘మన ప్రచండ ‘క్యారియర్ బ్యాటిల్ గ్రూపు’ నిశ్శబ్గంగా ఉంటూనే, పాకిస్తానీ నేవీ బయటకు రాకుండా చూసింది... లేకపోతే అది (పాక్ నేవీ) పర్యవసానాల్ని ఎదుర్కొని ఉండేది’’
* ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేయడానికి ప్రతి ఒక్క పద్ధతినీ ఉపయోగించేందుకు భారత్ సంకోచించదన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్
* ‘‘చర్చల విషయంలో పాకిస్తాన్ సీరియస్‌గా ఉంటే హఫీజ్ సయీద్, మసూద్ అజహర్‌లను భారత్ కు అప్పగించాలి.. అలా అప్పగిస్తేనే న్యాయం దక్కుతుంది’’
* ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఉనికిని బలపరుస్తున్న వ్యూహాత్మక శక్తిగా మారిన నౌకాదళం... భారత్ ఇక ఒక ప్రాంతీయ శక్తి ఎంత మాత్రం కాదు, ప్రపంచ శక్తిగా మారుతోందంటూ శత్రువును మన నౌకాదళం హెచ్చరిస్తోంది’’
Posted On:
30 MAY 2025 1:18PM by PIB Hyderabad
‘‘ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య ఒక్కటే కాదు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముఖం పగిలిపోయేటట్టుగా భారత్ కొట్టిన దెబ్బ.. పాక్ గనక ఏ విధమైన దుర్మార్గ చర్యకో, లేదా అనైతిక చర్యకో ఒడిగడితే, ఆ దేశం ఈసారి భారతీయ నౌకాదళం పోరాట శక్తిని చవిచూసి దాని కోపాగ్నికి గురి కావలసివస్తుంది’’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన ఈ రోజు గోవా సముద్ర తీరానికి ఆవల ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను సందర్శించి, ఆ విమాన వాహక నౌకలోని అధికారులను, నావికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశంలో రూపుదిద్దిన తొలి విమానవాహక నౌక. ‘ఆపరేషన్ సిందూర్’లో భారతీయ నౌకాదళం అందించిన ‘‘నిశ్శబ్ద సేవ’’ను రక్షణ మంత్రి ప్రశంసించారు. శక్తిశాలి ‘క్యారియర్ బ్యాటిల్ గ్రూపు’ పాకిస్తానీ నౌకాదళం ముందడుగు వేయకుండా చూసిందని, ఇలా చేయకపోయి ఉండి ఉంటే పాక్ తత్పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చేది అని ఆయన తెలిపారు. దురాగతాలకు పాల్పడేందుకు పాక్ తెగించిన పక్షంలో న్యూ ఢిల్లీ నాయకత్వం తీసుకొనే ప్రతి చర్య తాలూకు పగ్గాల్నిక భారతీయ నౌకాదళం అందుకొంటుంది అంటూ ఆయన ఒక సుస్పష్ట సందేశాన్నిచ్చారు.
స్వాతంత్య్రం వచ్చింది మొదలు పాకిస్తాన్ తాను ఆడుతున్న ఉగ్రవాదమనే ప్రమాదకరమైన ఆటకు ఇక కాలం చెల్లిందని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ఇకమీదట, భారత్‌కు వ్యతిరేకంగా ఏదైనా ఉగ్రవాద చేష్టను పాకిస్తాన్ ఉసిగొల్పినట్లయితే, పర్యవసానాల్ని ఆ దేశం భరించడమే కాకుండా ఓటమిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. భారత్ వెనుకాడబోదు. ఉగ్రవాదమనే ముప్పును వేళ్లతో సహా పెకలించివేయడానికి అన్ని పద్దతులనూ ఇండియా ఉపయోగించుకొంటుంది’’ అని ఆయన కరాఖండీగా చెప్పారు.
పాకిస్తానీ గడ్డ మీద నుంచి భారత్-వ్యతిరేక కార్యకలాపాలు బాహాటంగా జరుగుతున్నాయని, సరిహద్దులో రెండు వైపులా, సముద్రంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క తీరులోనూ ఆపరేషన్ చేపట్టడానికి భారత్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని రక్షణ మంత్రి అన్నారు. ఇవాళ, భారత్‌కు ఉగ్రవాదం బారి నుంచి తన పౌరులను రక్షించుకొనే హక్కు ఉంది అని ప్రపంచం అంగీకారాన్ని తెలియజేస్తోంది అని ఆయన అన్నారు. పాకిస్తాన్ తన గడ్డ మీద పెరుగుతున్న ఉగ్రవాద మొక్కలను- తన సొంత చేతుల తోనే- వేళ్లతో సహా పెరికివేయాలి అని ఆయన ఉద్ఘాటించారు.
హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కోరారు. ‘‘వాళ్లిద్దరూ భారతదేశ ‘‘మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల’ జాబితాలో ఉండటం ఒక్కటే కాదు, వాళ్లు యూఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులుగా కూడా. ముంబయి దాడుల నిందితుల్లో ఒకరైన తహవ్వుర్ రాణాను ఇటీవలే ఇండియాకు తీసుకు వచ్చాం. హఫీజ్ సయీద్ కూడా మంబయి దాడులలో అపరాధిగా ఉన్నాడు, అతడు చేసిన నేరానికి న్యాయ నిర్ణయం జరగాల్సిందే’’ అని మంత్రి అన్నారు.
చర్చల కోసం పాకిస్తాన్ పదే పదే సంసిద్ధతను వ్యక్తం చేస్తుండడంపై రక్షణ మంత్రి మరోసారి స్పష్టం చేస్తూ, ‘‘చర్చలంటూ జరిగితే, అవి కేవలం ఉగ్రవాదంతోపాటు పీఓకేపైనే జరగాలి. చర్చలపై పాకిస్తాన్ చిత్తశుద్ధితో ఉందంటే గనక హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలి, అలా అయితేనే న్యాయం దక్కుతుంది’’ అన్నారు.
సమగ్ర ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళం పోషించిన పాత్ర ప్రశంసాయోగ్యంగా ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. భారతీయ వైమానిక దళం పాకిస్తానీ గడ్డ మీది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ ఉన్న వేళ.. నౌకాదళం అరేబియా సముద్రంలో ఆక్రమణకారక మోహరింపుతోనూ, సముద్ర రంగం పట్ల తనకున్న సాటి లేని జాగృతి, ఆధిపత్య వైఖరులతోనూ పాకిస్తానీ నౌకాదళాన్ని దాని సొంత తీరప్రాంతానికే పరిమితమై ఉండేటట్టు చేసిందన్నారు. ‘‘మన పశ్చిమ ప్రాంత యుద్ధనౌకలు సముద్రంలో మోహరించి- పహల్‌గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 96 గంటల లోపే- పశ్చిమ, తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో ఉపరితలం మీది నుంచి ఉపరితలానికి, ఉపరితలం మీది నుంచి నింగిలోకి క్షిపణులను, నౌకా విధ్వంసక ఆయుధాలను విజయవంతంగా ప్రయోగించాయి. ఇది మన ప్లాట్‌ఫారాలు, సిస్టమ్స్, సిబ్బంది సమర సన్నద్ధతతో పాటు మన ఉద్దేశాన్ని, అప్రమత్తతను కూడా తెలియజెప్పి, శత్రువు రక్షణాత్మకంగా వ్యవహరించక తప్పని స్థితిని కల్పించింది’’ అని ఆయన అన్నారు.
‘క్యారియర్ బ్యాటిల్ గ్రూపు’ బల ప్రదర్శన భారత్ ఉద్దేశాన్ని, సత్తాను సమర్ధంగా తెలియజెప్పిందని కూడా రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. భారతీయ నౌకాదళానికున్న భీకర శక్తి, సైనిక చతురత, విధ్వంసక సామర్థ్యాలు శత్రువు నైతిక స్థితిని దెబ్బ తీశాయని ఆయన అన్నారు. నౌకాదళం తన సన్నాహక చర్యలలో ఎంతమాత్రం వెనుదీయకుండా వ్యవహరిస్తూ ఉండాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. భరత భూమి పైన ఏదైనా ఉగ్రవాద దాడి జరిగిందా అంటే గనక దానిని ఒక ‘యుద్ధ చేష్ట’గా పరిగణిస్తామని, అదే విధంగా ప్రతిస్పందిస్తామంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన సంగతిని మంత్రి పునరుద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్ ఇంతటితో ముగియలేదు, ఇది కేవలం విరామం.. ఇదొక హెచ్చరిక అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ అదే పొరపాటును పునరావృత్తం చేస్తే, భారత్ ఇచ్చే జవాబు మరింత కఠినంగా ఉంటుంది అని కూడా ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కనబరచిన వేగాన్ని, తీవ్రతను, స్పష్టతను రక్షణ మంత్రి ప్రశంసిస్తూ, కచ్చితత్వంతో చేసిన దాడులు త్రివిధ దళాల నడుమ పటిష్ట సహకారాన్నే కాకుండా మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని కూడా చాటిచెప్పాయి అన్నారు. ఈ ఆపరేషన్.. భారత్ ఇక ఎంతమాత్రం సహనాన్ని ప్రదర్శించదని, దీటైన జవాబిస్తుందని ఉగ్రవాదులకు, ఉగ్రవాదులకు కొమ్ముకాసే శక్తులకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది అని ఆయన అన్నారు. ‘‘చాలా కొద్ది కాంలో, మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాన్ని, దాని ఉద్దేశాల్ని తునాతునకలు చేసేశాం. మన ప్రతిస్పందన ఎంత బలంగా ఉందంటే పాకిస్తాన్ ఇక ఆపేయండంటూ అభ్యర్థించింది. మనం మన సొంత షరతులతోనే మన సైనిక చర్యలను ఆపాం. మన బలగాలు వాటి శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శించడాన్నింకా మొదలుపెట్టనే లేదు సుమా’’ అని ఆయన అన్నారు.
సైన్యం, వైమానిక దళం.. ఈ రెండిటి సిబ్బందితోనూ, నౌకాదళ యోధులతోనూ ఆపరేషన్ సిందూర్ అనంతర కాలంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తాను జరిపిన సమావేశాలపై వ్యాఖ్యానిస్తూ నేల, నింగి, సముద్రం.. ఈ మూడిటిలో దేనిలోనైనా ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. గోవా విముక్తి వేళ ఐఎన్ఎస్ విక్రాంత్ పాత వెర్షన్ అందించిన సేవలను ఆయన గుర్తుకు తెచ్చారు. ఆ విమాన వాహక నౌక 1961లో యుద్ధ కార్యకలాపాల్లో భారతీయ నౌకాదళ ఓడల గుంపునకు సారథ్యం వహించిందని, మరి ఇప్పుడు, దీని కొత్త స్వదేశీ రూపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశ దృఢసంకల్పానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి అన్నారు.
రక్షణ మంత్రి తన ప్రసంగం చివర్లో ‘‘ఈ రోజు, మనం తుపాకిగుళ్లు, బాంబులతోనే యుద్ధాలు చేసే కాలంలో లేం, సైబర్ జగతిలో, సమాచార ఆధిపత్యం, వ్యూహాత్మక నిరోధం ద్వారా కూడా యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఉన్నాం. ఈ రంగాల్లో నౌకాదళం ముందుకు సాగుతూ ఉండడం గర్వకారణం’’ అన్నారు. భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్రానికి కాపలాదారుగా మాత్రమే కాక, ఈ ప్రాంతంలో మన దేశం ఉనికిని బలోపేతం చేస్తున్న వ్యూహాత్మక శక్తిగా కూడా ఉంది. ఇది భారత్ కేవలం ఒక ప్రాంతీయ శక్తి ఎంతమాత్రం కాదు, ఇది ప్రపంచ శక్తిగా మారే దిశగా పయనిస్తోందని శత్రువును హెచ్చరిస్తోంది’ అని ఆయన అభివర్ణించారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ వద్దకు వచ్చినప్పుడు ఆయన వెంట నౌకా దళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠీ, పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్‌లతో పాటు భారతీయ నౌకాదళానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
రక్షణ మంత్రి గురువారం (మే 29న) గోవాకు చేరుకొని, ఆపరేషన్ సిందూర్ తొలి దశలో పాలుపంచుకొన్న భారతీయ నౌకాదళ సిబ్బందితో సమావేశమయ్యారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటే కాకుండా, అవతలి సేనతో తలపడిన ఇతర కీలక యుద్ధనౌకలను కూడా సందర్శించారు. ఆ నౌకలు క్యారియర్ బ్యాటిల్ గ్రూపులో భాగంగా ఉండి, పాకిస్తానీ నౌకాదళానికి చెందిన యూనిట్లు మక్రాన్ కోస్తాతీరానికి సమీపంలోనే ఉండిపోక తప్పని స్థితిని కల్పించడంలో కీలక పాత్రను పోషించాయి.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హంసకు వచ్చిన సందర్బంగా, ఆయనకు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఆ తరువాత, సముద్ర తలంలో కార్యకలాపాల పురోగతి వివరాలతో పాటు వివిధ విభాగాలు సమగ్ర సన్నద్ధత వివరాలను కూడా ఆయనకు నివేదించారు.
***
(Release ID: 2132767)