యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

కొత్త దరఖాస్తు పోర్టల్‌ను ప్రారంభించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2025 6:02PM by PIB Hyderabad

నమోదు చేసుకోవడం, దరఖాస్తు ఫారాలను ఆన్ లైన్‌లో నింపడం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ కొత్త ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టలును ప్రవేశపెడుతోంది. యూపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్‌లో నాలుగు భాగాలుంటాయి. అవి హోమ్ పేజీలో 4 ప్రత్యేక కార్డుల్లో ఇమిడి ఉంటాయి. వాటిలో మూడు- అకౌంట్ తెరవడం, సార్వత్రిక నమోదు (యూనివర్సల్ రిజిస్ట్రేషన్), ఉమ్మడి దరఖాస్తు ఫారం. అన్ని పరీక్షలకూ ఉమ్మడిగా అవసరమైన సమాచారం ఇందులో ఉంటుంది. అభ్యర్థులు దీనిని ఎప్పుడైనా నింపవచ్చు. నాలుగో భాగం పరీక్షకు సంబంధించినది. పరీక్ష నోటీసులు, దరఖాస్తు, దరఖాస్తు స్థితి వంటి వివరాలు ఇందులో ఉంటాయి. పరీక్ష ప్రకటనలో అనుమతించిన కాల వ్యవధిలోపే, ఈ భాగంలో ఆ నిర్దిష్ట పరీక్షకు సంబంధించిన సమాచారాన్నే అభ్యర్థులు అందించాలి.

అభ్యర్థులు మొదటి మూడు భాగాలను ఎప్పుడైనా పూర్తి చేసుకుని, ప్రకటన వెలువడగానే అవసరమైన అదనపు సమాచారాన్ని జోడిస్తూ ఏదైనా యూపీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా సిద్ధంగా ఉండటానికి ఈ పోర్టల్ వీలు కల్పిస్తుంది. తద్వారా సమయం ఆదా అవడంతోపాటు చివరి నిమిషంలో తడబాట్లు, తొందరపాటు సమస్యలను పరిష్కరిస్తుంది.

దరఖాస్తుదారులందరూ https://upsconline.nic.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి కొత్తగా ప్రవేశపెట్టిన పోర్టలులో దరఖాస్తును పూర్తి చేసి, పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఇకపై వర్తించదు.

దరఖాస్తును పూర్తిచేయడం, పత్రాలను అప్‌లోడ్ చేయడంలో అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేలా హోమ్ పేజీలో, అలాగే అన్ని ప్రొఫైల్‌లు/మాడ్యూళ్లలో వివరణాత్మకమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి.

యూనివర్సల్ అప్లికేషన్‌లో గుర్తింపు, ఇతర వివరాల ధ్రువీకరణ, ప్రామాణీకరణ సులభంగా, సజావుగా జరిగేలా దరఖాస్తుదారులు ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అనంతరం అన్ని పరీక్షలకు శాశ్వత, ఉమ్మడి రికార్డుగా ఇది పనిచేస్తుంది.

కొత్త అప్లికేషన్ పోర్టల్ మే 28 నుంచి ప్రారంభమవుతోంది. మే 28న ప్రకటన వెలువడనున్న సీడీఎస్ ఎగ్జామ్-II, ఎన్డీఏ-ఎన్ఏ-II పరీక్షలకు దరఖాస్తులను ఈ కొత్త పోర్టల్ ద్వారానే స్వీకరిస్తారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2132200) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam