యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ఫిట్ ఇండియా 'సండేస్ ఆన్ సైకిల్'లో మీడియా సోదరులతో కలిసి సైకిల్ తొక్కిన కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ


జర్నలిస్టులు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్సే

వారికి కూడా ఫిట్‌నెస్ అత్యంత అవసరం: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2025 6:42PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జర్నలిస్టులు, మీడియా సోదరులు ముఖ్య అతిథులుగా ఈరోజు నిర్వహించిన ఉత్సాహభరితమైన 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ 300 మందికి పైగా ఫిట్‌నెస్ ఔత్సాహికులతో కలిసి సైకిల్ తొక్కి వారిలో ఉత్సాహం నింపారు.

ఢిల్లీ జర్నలిస్ట్ అసోసియేషన్, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, అథ్లెట్లు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాలుగు కిలోమీటర్లు అందరూ సైక్లింగ్ చేశారు. దీనిలో పాల్గొన్న మీడియా రంగ నిపుణులు, ఈ అనుభవాన్ని "మేల్కొలుపు’’ గా అభివర్ణించారు.

"వర్షం ఉన్నప్పటికీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నాకు సంతోషం కలిగించింది. మా జర్నలిస్టు మిత్రులు పూర్తి ఉత్సాహంతో దీనిలో పాలుపంచుకోవడం నిజమైన ఆనందాన్ని ఇచ్చింది. జర్నలిస్టులకు ప్రశాంతమైన దినచర్య లభించడం చాలా అరుదు. సాధారణంగా వారు పగలూ, రాత్రీ తేడా లేకుండా పని చేస్తారు. మనం ప్రతి ఉదయం చదివే ముఖ్యాంశాలు రాత్రంతా వారి అవిశ్రాంత ప్రయత్నం ఫలితమే. వారు ఈ ముఖ్యమైన పనిని విజయవంతంగా కొనసాగించడానికి, వారు ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. అందుకే వారి పట్ల కృతజ్ఞతను చూపించడానికి, అలాగే ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్ లేదా ఏదైనా కసరత్తు అవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ సున్నితంగా గుర్తు చేయడానికే ఈరోజు వీరందరినీ ఆహ్వానించాం" అని డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

"ఈరోజు నాకు ఇక్కడ అద్భుతమైన అనుభవం లభించింది. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చొరవతో ప్రారంభించిన సండేస్ ఆన్ సైకిల్.. ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు ఒక అద్భుతమైన మార్గం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం అని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఫిట్‌గా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలి.. అయితే సైక్లింగ్ కూడా అంతే ప్రయోజనకరం అని నేను భావిస్తున్నాను! జంక్ ఫుడ్ మానుకోండి, ఒకే చోట నిశ్చలంగా ఉండకుండా అటూ ఇటూ నడవండి, ఫిట్‌గా ఉండండి" అని ఈ కార్యక్రమానికి జర్నలిస్టులతో పాటు అతిథిగా విచ్చేసిన, తైక్వాండో ఆసియా ఛాంపియన్‌షిప్ పతక విజేత శ్రీమతి రోడాలి బారువా అన్నారు.

ఢిల్లీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాకేష్ థాప్లియాల్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, "కేంద్ర మంత్రి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అద్భుతమైన అనుభవం. వర్షం కురుస్తున్నా, మా పనిలో భాగంగా అర్థరాత్రి వరకు పనిచేయాల్సి ఉన్నా, చాలా మంది జర్నలిస్టులు ఇక్కడకు వచ్చారు. ఫిట్‌నెస్ సరదాగా ఉంటుందనే విషయాన్ని ఇది రుజువు చేస్తుంది. సైక్లింగ్ వంటి కేవలం ఒక గంట కార్యాచరణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే వైద్యం కోసం చేయాల్సిన ఖర్చులను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది" అని అన్నారు.

ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అభిషేక్ త్రిపాఠి మాట్లాడుతూ... ‘‘సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయతో కలిసి పాల్గొనడం వాస్తవిక ప్రపంచంలోని విషయాల ప్రాధాన్యాలను గుర్తుచేసింది. కేవలం 3-4 కిలోమీటర్లు మాత్రమే సైకిల్ తొక్కినా.. మనలో చాలా మందికి ఊపిరి ఆడనంత ఇబ్బందిగా అనిపించింది! ముఖ్యంగా ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే మీడియా రంగంలో పనిచేస్తున్న వారి కోసం ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తు చేసింది. సైక్లింగ్ మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణం కోసం కూడా చాలా ముఖ్యమైనది” అని అన్నారు.

ఢిల్లీ మీడియా దృష్టి నుంచి అగర్తలా రాజ వీధుల వరకు, ఈ పెడల్ ఆధారిత ఉద్యమం దేశమంతటా వివిధ ప్రదేశాల్లో ప్రతిధ్వనించింది. వందలాది మంది ఔత్సాహికులను ఒకచోట చేర్చింది.

త్రిపుర గవర్నర్ ముఖ్య అతిథిగా ఉజ్జయంత ప్యాలెస్ నుంచి 120 మందికి పైగా సైక్లిస్టులు ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీ టింకూ రాయ్, యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ డైరెక్టర్ శ్రీ ఎస్.బి. నాథ్, సాయ్ ప్రాంతీయ డైరెక్టర్ వంటి సీనియర్ అధికారులు ఆరోగ్యకరమైన, ఐక్య త్రిపురకు ప్రతీక అయిన ఈ కమ్యూనిటీ రైడ్‌లో పాలుపంచుకున్నారు. "ఈ ఉద్యమంలో భాగం కావడం మాకు దక్కిన గౌరవం" అని తన అగర్తలా సైక్లోహాలిక్స్ ఫౌండేషన్‌తో కలిసి ఈ రైడ్‌కు నాయకత్వం వహించిన సైకిల్ మేయర్ శ్రీ గోపేశ్ దేబ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

బెంగళూరులోని సాయ్ ఎస్‌టీసీ వద్ద, మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ అరుణ్ శర్మ, శ్రీమతి అమితా శర్మలతో పాటు 70 మంది మీడియా సిబ్బంది సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. చక్రాలను తిప్పడం, సరదాగా సంభాషణలు సాగించడంతోనే, సమాచారాత్మక, ప్రేరేపిత మీడియాతో ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం ప్రారంభమవుతుందని ఈ రైడ్ చాటి చెప్పింది.

సాయ్ ఎస్‌టీసీ నుంచి బోడోలాండ్ సచివాలయం వరకు ఆరు కిలోమీటర్ల కోక్రాఝార్ ఎడిషన్ సుందరమైన ప్రాంతాలను కవర్ చేస్తూ సాగింది. దీనిని ప్రెస్ క్లబ్ కోక్రాఝార్‌కు చెందిన శ్రీ ప్రీతమ్ బ్రహ్మ చౌదరి, శ్రీ సూరజ్ బసుమత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మాజీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి బిబారి బ్రహ్మ పెడల్ శక్తికి క్రీడా ప్రతిష్ఠను జోడించారు.

మోస్తరు సంఖ్యలో జనం హాజరైనప్పటికీ, ఎస్‌టీసీ రాయ్‌పూర్ కార్యక్రమంలో మీడియా అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శ్రీ పి.కె. రావు, భారతీయ రాష్ట్రీయ పత్రికా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మనోహర్ సింగ్ వంటి మీడియా రంగ ప్రముఖులతో పాటు 35 మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఈ సైక్లింగ్ కార్యక్రమం ఇప్పుడు 5,500 లకు పైగా ప్రదేశాలకు విస్తరించి మూడు లక్షలకు పైగా ప్రజలకు చేరువైంది. శ్రీమతి సానియా మీర్జా, శ్రీ మిలింద్ సోమన్, శ్రీ ఇమ్రాన్ హష్మి, శ్రీ జాన్ అబ్రహం, శ్రీ ఇంతియాజ్ అలీ, శ్రీ శంకర్ మహదేవన్, శ్రీ దారా సింగ్ వంటి దిగ్గజాల మద్దతుతో సోషల్ మీడియా హోరెత్తింది. వీరంతా ఫిట్‌నెస్‌ కోసం ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరని చెప్పారు.

విధాన నిర్ణేతలు, అథ్లెట్లు, పౌర సమాజం నుంచి పెరుగుతున్న మద్దతుతో, సండేస్ ఆన్ సైకిల్.. నగరాలను సైక్లింగ్ కారిడార్‌లుగా, పౌరులను ఆరోగ్య రాయబారులుగా మారుస్తూ వారి హృదయాలలోకి, వార్తల ముఖ్యాంశాల్లోకి ప్రవేశిస్తూనే ఉంది. వర్షం కురుస్తున్నా.. ఎంత ఎక్కువ ఎండగా ఉన్నా.. ఫిట్‌నెస్ ఎప్పుడూ వాతావరణం కోసం వేచి ఉండదు అని ఇలాంటి కార్యక్రమాలు చాటుతూనే ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2131249) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil