రక్షణ మంత్రిత్వ శాఖ
కేరళ తీరంలో మునిగిన లైబీరియా సరకు రవాణా ఓడ: భారత నావికాదళంతో కలిసి 24 మంది సిబ్బందిని రక్షించిన భారత తీర గస్తీ దళం (ఐసిజి)
ఓడలోని హానికర రసాయనాలపై ఆందోళన
Posted On:
25 MAY 2025 11:45AM by PIB Hyderabad
లైబీరియాకు చెందిన కంటైనర్ నౌక - ఎంఎస్సీ ఈఎల్ఎస్ఏ 3 (ఐఎంఓ నెం.9123221) 2025 మే 25న ఉదయం 7.50 గంటలకు కొచ్చి తీరంలో మునిగిపోయింది. నౌక లోని 24 మంది సిబ్బందిని భారత తీర గస్తీ దళం (ఐసీజీ) , మరో ముగ్గురిని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుజాత రక్షించాయి. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా, వాటిలో 13 కంటైనర్లలో హానికరమైన పదార్థాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నాయి. అంతేకాక, నౌకలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నెస్ ఆయిల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నౌకతో పాటు సముద్రంలో మునిగిపోయాయి.
కేరళ తీర ప్రాంతంలో ఉన్న సున్నితమైన సముద్ర జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత తీర గస్తీ దళం పూర్తిస్థాయి కాలుష్య నివారణ చర్యలను చేపట్టింది. చమురు లీకేజిని గుర్తించే (ఆయిల్ స్పిల్ డిటెక్షన్) అత్యాధునిక వ్యవస్థలతో కూడిన ఐసీజీ విమానం నిఘాతో పాటు కాలుష్య ప్రతిస్పందన పరికరాలతో కూడిన ఐసీజీ నౌక సాక్షంను ఘటనా స్థలంలో మోహరించారు. ఇంతవరకు ఎక్కడా చమురు లీక్ అయిన సమాచారం ఏదీ లేదు.
మే 24న విజింజం నుంచి కొచ్చి ఓడరేవుకు వస్తున్న ఎంఎస్సీ ఈఎల్ఎస్ఏ 3 కొచ్చికి నైరుతి దిశగా 38 నాటికల్ మైళ్ల దూరంలో స్టార్ బోర్డ్ వైపు 26 డిగ్రీల మేర వంగి స్థిరత్వం కోల్పోయింది. దీనితో నౌక నుంచి అత్యవసర సహాయ సంకేతం (డిస్ట్రెస్ కాల్) అందడంతో భారత తీర గస్తీ దళానికి చెందిన కోచ్చి సముద్ర రక్షణ ఉపకేంద్రం (ఎంఆర్ఎస్సి) తక్షణం రంగంలోకి దిగి అవసరమైన చర్యలను ప్రారంభించింది. గస్తీ కోసం మోహరించిన ఐసిజి డార్నియర్ విమానం మనుషులతో ఉన్న రెండు లైఫ్ రాఫ్టులను గుర్తించింది. గ్లోబల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రోటోకాల్స్ కు అనుగుణంగా ఐసిజి గస్తీ నౌకలు, వాణిజ్య నౌకలు - ఎంవి హాన్ యి, ఎంఎస్సి సిల్వర్ 2 లను కూడా సహాయక చర్యల కోసం మళ్లించారు.
రష్యా, ఉక్రెయిన్, జార్జియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సిబ్బంది సహా మొత్తం 24 మందిలో 21 మంది సిబ్బందిని సాయంత్రం పొద్దుపోయే సమయానికి రక్షించారు. ముగ్గురు సీనియర్ సిబ్బంది రక్షణ చర్యల్లో భాగంగా నౌకపైనే ఉండిపోయారు. అయితే రాత్రికి రాత్రే నౌక మరింతగా మునుగుతూ 2025 మే 25 ఉదయానికి పూర్తిగా మునిగిపోయింది. నౌకలో ఉండిపోయిన ముగ్గురు సహాయ సిబ్బందిని కూడా బలవంతంగా బయటకు తెచ్చారు. వారిని ఐఎన్ఎస్ సుజాత రక్షించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
***
(Release ID: 2131171)