భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద ప్రధాన నగరాల్లో ఇ-బస్సులు: ప్రభుత్వ చర్యలు వేగవంతం
· ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి అధ్యక్షతన సమావేశం
· ప్రధాని శ్రీ మోదీ లక్ష్యమైన కాలుష్య రహిత పట్టణ రవాణా దిశగా వేగంగా పురోగతి
· ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్ నగరాలకు విశేషంగా లబ్ధి
· కేంద్రం-రాష్ట్రాల మధ్య సమన్వయంతో దేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థ బలోపేతం
Posted On:
22 MAY 2025 3:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఇ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా పర్యావరణ హిత, సమ్మిళితమైన పట్టణ రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా ఇదో కీలకమైన ముందడుగు.
సవివరంగా చర్చించిన అనంతరం.. పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు 4,500, హైదరాబాద్‌కు 2,000, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తామని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
“గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో పర్యావరణ హిత పట్టణ రవాణా దిశగా భారత్ నేడు సాహసోపేతంగా అడుగులేస్తోంది” అని శ్రీ హెచ్.డి. కుమారస్వామి అన్నారు. “బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు నగరాలు చాలావరకూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ప్రజా రవాణాను కాలుష్య రహితంగా, ఆధునికంగా, సమర్థంగా తీర్చిదిద్దుతున్నాయి’’.
“కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాదు – ఆవిష్కరణ, పర్యావరణ స్పృహతో దేశ రవాణా వ్యవస్థ భవితను మేం తీర్చిదిద్దుతున్నాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. “కేంద్ర ప్రభుత్వమూ - తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల మధ్య సన్నిహిత సమన్వయంతో పీఎం ఇ-డ్రైవ్ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మేం కృతనిశ్చయంతో ఉన్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఇ-డ్రైవ్ కార్యక్రమం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రెండేళ్ల కాలంలో మొత్తం రూ. 10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెద్దఎత్తున ప్రజా రవాణాను విద్యుదీకరించడం దీని లక్ష్యం. ఈ తరహాలో చేపట్టిన ప్రపంచంలో అతిపెద్ద జాతీయ కార్యక్రమాల్లో పీఎం ఇ-డ్రైవ్ పథకం ఒకటి. భాగస్వాములైన అన్ని రాష్ట్రాలకు సకాలంలో బస్సులను అందించడం, అమలు దిశగా సంసిద్ధత, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2130624)