భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం ఇ-డ్రైవ్ పథకం ద్వారా దేశంలో వేగంగా ఈవీ ఛార్జింగ్ వ్యవస్థ విస్తరణ
* దేశవ్యాప్తంగా 72,000 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల నిధుల కేటాయింపు
* ప్రధాన నగరాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు
* కొనుగోలుదారుల అవసరాలను ఒక్కచోట చేర్చే నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూనే ఏకీకృత ఈవీ సూపర్ యాప్‌ను తయారు చేయనున్న బీహెచ్ఈఎల్
* పథకం అమలుపై జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర భారీ పరిశ్రమల శ్రీ హెచ్‌డీ కుమార స్వామి
Posted On:
21 MAY 2025 3:42PM by PIB Hyderabad
పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అమలును సమీక్షించి వేగవంతం చేయడంపై ఈ రోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమన్వయ సమావేశానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ హెచ్‌డీ కుమార స్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పెట్రోలియం-సహజవాయు, రోడ్డురవాణా – జాతీయ రహదారులు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా ఈవీలకు అనువైన వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది దేశంలో పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. శిలాజ ఇంధనాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన పీఎం ఇ-డ్రైవ్ పథకం దేశవ్యాప్తంగా సుమారు 72,000 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తుంది. వీటిని 50 జాతీయ రహదారి కారిడార్లలో, ట్రాఫిక్ అధికంగా ఉండే మెట్రో నగరాల్లో, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇంధన అవుట్‌లెట్లు, రాష్ట్ర రహదారులపై ఏర్పాటు చేస్తారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో సుస్థిర రవాణా వ్యవస్థకు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచే మార్గంలో భారత్ ప్రయాణిస్తోంది. దేశ పౌరులకు పర్యావరణ హితమైన, చౌకైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను కల్పించే పరివర్తనాత్మక పథకమే పీఎం ఇ-డ్రైవ్. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికే మనం పరిమితం కాలేదు. ఇంధన భద్రతకు, పర్యావరణహిత ఆర్థికాభివృద్ధికి పునాదిని నిర్మిస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి శ్రీ హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం అమలులో వివిధ మంత్రిత్వ శాఖలు పోషిస్తున్న సమగ్ర పాత్రను మంత్రి గుర్తించారు. కొనుగోలుదారుల అవసరాలను ఒక్కచోట చేర్చే నోడల్ ఏజెన్సీగా బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్రికల్స్ లిమిటెడ్) పనిచేస్తుంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న ఈవీ వినియోగదారులకు సేవలందించేలా ఏకీకృత డిజిటల్ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద జాతీయస్థాయిలో సేవలను పర్యవేక్షించేందుకు ఈ యాప్‌లో రియల్ టైమ్ స్లాట్ బుకింగ్, చెల్లింపుల ఏకీకరణ, చార్జర్ అందుబాటు స్థితి, ప్రోగ్రెస్ డ్యాష్ బోర్డు ఉంటాయి. ఛార్జర్లను ఏర్పాటు చేసేందుకు వచ్చిన ప్రతిపాదనలను సంకలనం చేసి, మూల్యాంకనం చేయడానికి రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలతో బీహెచ్ఈఎల్ సమన్వయ చేసుకుంటుంది.
సహకారపూరిత సమాఖ్య విధానం, పథకాల ఏకీకరణ ప్రాధాన్యాన్ని మంత్రి కుమారస్వామి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘పర్యావరణహిత ఇంధన మార్పును ఒంటరిగా సాధించడం అసాధ్యం. ఒకే ప్రభుత్వంగా అందరూ కలసి పనిచేస్తామనే మా నిబద్ధతకు ఈ సమావేశం నిదర్శనంగా నిలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించడానికి మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్రాలు అన్నీ కలసి పనిచేస్తున్నాయి. పీఎం ఇ-డ్రైవ్ పథకం కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, హరిత ఉద్యోగాలను కల్పిస్తుందని, ప్రతి భారతీయునికి విద్యుత్ వాహన సదుపాయాన్ని అందిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని వెల్లడించారు.
దేశంలో రవాణారంగంలో కర్భన ఉద్ఘారాలను గణనీయంగా తగ్గించడంలో, ఈవీ మౌలిక సదుపాయాల కల్పనలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడంలో, భవిష్యత్తులో సున్నా-కర్భన ఉద్ఘారాల రవాణా వ్యవస్థకు బలమైన పునాది వేయడంలో ఈపథకం విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 2130390)