ప్రధాన మంత్రి కార్యాలయం
78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని ప్రసంగం
Posted On:
20 MAY 2025 4:38PM by PIB Hyderabad
ప్రముఖులు, ప్రతినిధులకు నమస్కారం. 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఈ ఏడాది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇతివృత్తం ‘ఆరోగ్యం దిశగా ప్రపంచ ఐక్యత (వన్ వరల్డ్ ఫర్ హెల్త్)’. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలన్న భారత దృక్పథం ఇందులో ప్రతిధ్వనిస్తుంది. 2023లో ఈ సమావేశంలో ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ గురించి నేను మాట్లాడాను. భవిష్యత్ ఆరోగ్యకరమైన ప్రపంచం సమ్మిళితత్వం, సమగ్ర దృక్పథం, సహకారంపైనే ఆధారపడి ఉంటుంది.
మిత్రులారా,
భారత ఆరోగ్య సంస్కరణల్లో సమ్మిళితత్వమే కీలకంగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను మేం నిర్వహిస్తున్నాం. 58 కోట్ల మంది దీని పరిధిలోకి వస్తారు. దీని ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నాం. 70 ఏళ్ల వయస్సు పైబడిన భారతీయులందరికీ వర్తించేలా ఇటీవల ఈ పథకాన్ని విస్తరించాం. వేలాది ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల వ్యవస్థ మాకుంది. పరీక్షల ద్వారా అవి క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులను గుర్తిస్తాయి. వేలాది ప్రభుత్వ ఫార్మసీలు మార్కెట్ ధర కన్నా చాలా తక్కువకే నాణ్యమైన ఔషధాలను అందిస్తున్నాయి.
మిత్రులారా,
ఆరోగ్యపరంగా సత్ఫలితాలను అందించడంలో టెక్నాలజీ ముఖ్యమైన ఉత్ప్రేరకంగా నిలుస్తోంది. గర్భిణులు, చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించేలా ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మా దేశంలో ఉంది. లక్షలాదిగా ప్రజలకు ప్రత్యేకమైన డిజిటల్ ఆరోగ్య గుర్తింపు ఉంది. ప్రయోజనాలు, బీమా, రికార్డులు, సమాచారాన్ని ఏకీకృతం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. టెలిమెడిసిన్ ద్వారా అందరికీ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. మా ఉచిత టెలిమెడిసిన్ సేవల ద్వారా వైద్యులతో 34 కోట్లకు పైగా సంప్రదింపులకు అవకాశం కలిగింది.
మిత్రులారా,
మా కార్యక్రమాలతో ప్రోత్సాహకరమైన అభివృద్ధి జరిగింది. మొత్తం వైద్య ఖర్చుల్లో ప్రజలకు అయ్యే ఖర్చు శాతం భారీగా తగ్గింది. అదే సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం గణనీయంగా పెరిగింది.
మిత్రులారా,
అత్యంత దుర్బలురైనవారిని మనమెంత బాగా చూసుకుంటామన్నదే ఆరోగ్యకరమైన ప్రపంచానికి ప్రాతిపదిక. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారత విధానాలు అనుసరణీయమైన, స్పష్టమైన, సుస్థిరమైన నమూనాలుగా నిలుస్తున్నాయి. మా అధ్యయనాలు, అత్యుత్తమ విధానాలను ప్రపంచంతో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో సంతోషంగా పంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
మిత్రులారా,
జూన్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోంది. ఈ ఏడాది ఇతివృత్తం ‘ప్రపంచ ఐక్యత, అందరికీ ఆరోగ్యం కోసం యోగా (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్)’. అన్ని దేశాలూ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రపంచానికి యోగాను అందించిన దేశం తరఫున నేను ఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా,
ఐఎన్‌బీ ఒడంబడికను విజయవంతం చేసినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, అన్ని సభ్య దేశాలకు అభినందనలు. గొప్ప అంతర్జాతీయ సహకారంతో భవిష్యత్ విపత్తులను ఎదుర్కొనే దిశగా ఉమ్మడి నిబద్ధతకు ఇది నిదర్శనం. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుదాం. ఎన్నటికీ కాలదోషం పట్టని ఓ వైదిక ప్రార్థనతో నేను ముగిస్తాను. సర్వే భవన్తు సుఖినః సర్వే సన్తు నిరామయాః । సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్॥ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, రోగాలు దరిచేరకుండా జీవించాలని వేల ఏళ్ల కిందటే మా రుషులు ప్రార్థించారు. ఈ దృక్పథం ప్రపంచాన్ని ఐక్యం చేస్తుంది.
ధన్యవాదాలు!
***
(Release ID: 2130106)