సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు సంఘీభావం: సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన
Posted On:
14 MAY 2025 8:49PM by PIB Hyderabad
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన విషాదకరమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హిందూ పర్యాటకులు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. భారత్ దీటుగా బదులిచ్చింది. పహల్గాం ఉగ్రవాద దాడిపై నిశ్చయాత్మకంగా స్పందించిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్).. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ నిరంతరం అందిస్తున్న మద్దతుకు వ్యతిరేకంగా పలు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అవి:
· పాకిస్తాన్ నమ్మకంగా, ఖండితంగా సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకునే వరకు 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేయడం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది.
· అట్టారీ చెక్ పోస్టును తక్షణం మూసివేయడం.
· సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్‌వీఈఎస్) వీసాలతో పాకిస్తానీయులు భారత్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉండదు.
· న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లోని రక్షణ/సైనిక, నావిక, వాయుసేన సలహాదారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించడం.
· హై కమిషన్‌లలోని మొత్తం సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు. మున్ముందు ఇది మరింత తగ్గుతుంది.
|
పరిమితంగానే అయినా, కచ్చితత్వంతో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా దోషులను శిక్షించి, సీమాంతర ఉగ్రవాదానికి అడ్డాగా ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. వివిధ సంస్థల నిఘా సమాచారం మేరకు బహవల్పూర్, మురిద్కే సహా తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలను గుర్తించి, సమన్వయంతో కూడిన వైమానిక, భూ తల కార్యకలాపాల ద్వారా వాటిని నిర్వీర్యం చేశారు.
ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం:
· ఉగ్రవాదానికి పాల్పడేవారిని, కుట్రదారులను శిక్షించేందుకు దీన్ని రూపొందించారు.
· సరిహద్దు వెంబడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం లక్ష్యం.
నిఘా, లక్ష్యాన్ని ఎంచుకోవడం:
· ఉగ్రవాద కార్యకలాపాలను నిశితంగా పరిశీలించారు.
· అనేక ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ ప్రాంతాలను గుర్తించారు.
అమలులో నైతికత, సంయమనం:
· సంయమనంతో వ్యవహరించి అదనపు నష్టాన్ని నివారించారు.
· ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే నిర్వీర్యం చేసి, పౌరులకు హాని జరగకుండా చూశారు.
తుది లక్ష్యాలు:
వివిధ ఏజెన్సీల నుంచి వచ్చిన నిఘా సమాచారం ఆధారంగా 9 ఉగ్రవాద శిబిరాలు:
కీలక లక్ష్యాలు: బహవల్పూర్, ముర్దికే (ఉగ్రవాద శిక్షణ శిబిరాలు).
దాడుల ఫలితం:
· ఈ కాల్పుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
· పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
· పాక్ చొరబాటుకు ప్రతిగా భారత సైన్యం భారీ నష్టం కలిగించింది.
కరుడు కట్టిన తీవ్రవాదుల హతం
· యూసఫ్ అజహర్
· అబ్దుల్ మాలిక్ రవూఫ్
· ముదస్సిర్ అహ్మద్
వీరికి ఐసీ-814 హైజాక్, పుల్వామా పేలుళ్లతో సంబంధం ఉంది.
|
దీనిపై అత్యంత అనైతికంగా, దారుణంగా స్పందించిన పాకిస్తాన్ మే 7, 8, 9 తేదీల్లో రాత్రి సమయాల్లో భారత పౌర, ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే, భారత భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, శతృదేశం యథేచ్ఛగా ప్రయోగించిన మానవ రహిత విమానాలు, క్షిపణులను అడ్డుకుని నిర్వీర్యం చేసింది. తద్వారా తీవ్ర నష్టం వాటిల్లకుండా నివారించగలిగింది. భారత్ బలంగా, క్రమబద్ధంగా స్పందించింది. అమలులో సంయమనాన్నీ వ్యూహాత్మక ఆధిక్యాన్నీ కొనసాగిస్తూనే సార్వభౌమత్వాన్ని, పౌరులను కాపాడుకోవడంలో భారత్ సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటించింది.
దీటుగా బదులిచ్చిన భారత్:
కింది ప్రాంతాల్లో భారత్ ప్రతీకార దాడులు నిర్వహించింది:
· లాహోర్‌లోని రాడార్ కేంద్రాలు.
· గుర్జన్ వాలా సమీపంలో రాడార్ సౌకర్యాలను ధ్వంసం చేసింది.
· 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు సమన్వయంతో, కచ్చితత్వంతో క్షిపణి దాడులు చేశాయి. నాలుగు స్థావరాలు పాకిస్థాన్‌లో (బహవల్పూర్. మురిద్కే సహా)నూ, అయిదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (ముజఫరాబాద్, కోట్లి వంటివి)నూ ఉన్నాయి. పుల్వామా (2019), ముంబయి (2008) వంటి ప్రధాన దాడులకు కారణమైన జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన కీలక కమాండ్ సెంటర్లుగా ఉన్నాయి.
· పంజాబ్, బహవల్పూర్ సహా పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో తీవ్రమైన దాడులతో ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే ప్రభుత్వాలు ఒకటేనని తేటతెల్లమైంది.
· మూడు గంటల్లోనే నూర్ ఖాన్, రఫీఖీ, మురీద్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కర్దు, భోలారి, జకోబాబాద్ సహా 11 సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.
· ప్రధాన ఆయుధ డిపోలతోపాటు ఎఫ్-16, జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరించిన సర్గోధా, భోలారీ వంటి వైమానిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడి చేశారు. దాదాపు 20% పాకిస్తాన్ వైమానిక దళ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
· నియంత్రణ రేఖ వెంబడి పూంచ్-రాజౌరీ సెక్టార్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఫిరంగులు, మోర్టార్ దాడులు చేయడంతో, భారత బలగాలు ప్రతిదాడి చేశాయి. ఉగ్రవాద బంకర్లను, పౌరులను లక్ష్యంగా చేసుకున్న సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
|
మే 12న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అనేది కేవలం ఓ పేరు కాదని, దేశంలోని కోట్లాది ప్రజల మనోభావాలకు ప్రతిబింబమని స్పష్టం చేశారు. అది న్యాయం దిశగా చేసిన భీషణ ప్రతిజ్ఞగా అభివర్ణించారు. “దేశాన్ని, ప్రజలను కాపాడుకునేలా బలమైన చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. యుద్ధక్షేత్రంలో పాకిస్తాన్‌ను మేమెప్పుడూ ఓడిస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా. ఆపరేషన్ సిందూర్ ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది” అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్, సీమాంతర ఉగ్రవాదాలకు సంబంధించి ప్రధానమంత్రి ఈ అంశాలను వివరించారు.
· మొదటిది, భారత్ పై ఉగ్రదాడి జరిగితే దీటుగా బదులిస్తాం.
· రెండోది, అణ్వస్త్ర బెదిరింపులను భారత్ సహించదు. న్యూక్లియర్ బెదిరింపుల మాటున పెరుగుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితంగా, నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది.
· మూడోది... ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికీ, ఉగ్రవాద సూత్రధారులకూ మధ్య తేడా చూపబోము. భారత్‌ను, మా పౌరులను ఎలాంటి ముప్పు నుంచైనా కాపాడుకునేందుకు మేం ఎల్లప్పుడూ నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకుంటాం.
· భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది... ఉగ్రవాదమూ చర్చలూ ఒకేసారి కుదరవు... ఉగ్రవాదమూ వాణిజ్యమూ ఒకేసారి కొనసాగలేవు... నీళ్లూ నెత్తురూ ఒకేసారి ప్రవహించడం సాధ్యం కాదు.
· పాక్తో చర్చలు జరిపితే అది ఉగ్రవాదంపైనే.. పాక్తో చర్చలు జరిపితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పైనే.
మరింత నష్టాన్ని తట్టుకోలేక, పాకిస్తాన్ సైనిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) భారత డీజీఎంవోను సంప్రదించడం ద్వారా ఆ దేశం కాల్పుల విరమణను కోరింది. శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను కూడా పాకిస్తాన్ సంప్రదించింది. మే 10న సాయంత్రం 5 గంటలకు భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైనిక చర్యల నిలిపివేతకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
కాల్పుల విరమణ కోరినప్పటికీ.. భారత పౌర, సైనిక కేంద్రాలపైకి డ్రోన్లను పంపి పాకిస్తాన్ వెంటనే దానిని ఉల్లంఘించింది. తగురీతిలో స్పందించేలా ఫీల్డ్ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన భారత్.. ఈ చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, సీమాంతర ఉగ్రవాదంపై భారత పోరాటానికి సంకేతమైన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. సరిహద్దు వెంబడి ప్రత్యర్థి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాయి.
బలంగా, కచ్చితత్వంతో స్పందించిన భారత్‌కు అంతర్జాతీయంగా విస్తృతమైన మద్దతు లభించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ప్రాంతీయ సుస్థిరతను కాపాడడంలో భారత కృషిని గుర్తించిన అంతర్జాతీయ సమాజం భారత్ వైఖరిని స్పష్టంగా సమర్థించింది.
బ్రిటన్
“పహల్గాం హత్యలపై భారత ఆగ్రహానికి సరైన కారణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు” అని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ అన్నారు. మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. “ఏ ప్రజాస్వామ్య దేశమూ సీమాంతర ఉగ్రవాదాన్ని సహించకూడదు” అని ఆయన పేర్కొన్నారు.
రష్యా
రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ.. “ఉగ్రవాద చర్యలన్నింటినీ రష్యా తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తుంది. ఈ విపత్తును ఎదుర్కొనే దిశగా అంతర్జాతీయ సమాజం చేతులు కలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది” అని అన్నారు. భారత్, పాకిస్తాన్ రెండూ సంయమనం పాటించాలని ఆమె కోరారు. దౌత్యపరమైన చర్చల ద్వారా అన్ని విభేదాలూ శాంతియుతంగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇజ్రాయెల్
“భారత ఆత్మరక్షణ హక్కుకు ఇజ్రాయెల్ మద్దతిస్తుంది. అమాయకులపై తాము పాల్పడిన హేయమైన నేరాల నుంచి తప్పించుకునే చోటేదీ లేదని ఉగ్రవాదులు తెలుసుకోవాలి” అని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ వ్యాఖ్యానించారు. భారత్కు పూర్తిగా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అమెరికా
ఆపరేషన్ సిందూర్ ఔచిత్యాన్ని సమర్థిస్తూ... “ఉగ్రవాదంపై పోరాడే సార్వభౌమిక హక్కు భారత్ కు ఉంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాట్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సంయమనం పాటించాలని కోరిన ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్.. ‘‘ప్రధానంగా ఇది ప్రాంతీయమైన అంశం. ఇది అమెరికా యుద్ధమో, మేం నియంత్రించడానికి ప్రయత్నించాల్సిన అంశమో కాదు’’ అని వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన అసువులు బాసిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. “ఫ్రాన్స్ తన మిత్రదేశాలతో కలిసి అవసరమైన ప్రతిచోటా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై భారత పోరులో ఫ్రాన్స్ మద్దతును ఈ సందేశం స్పష్టంగా వెల్లడిస్తోంది.
నెదర్లాండ్స్
పహల్గాంలో జరిగిన భయంకరమైన సీమాంతర ఉగ్రవాద దాడిపట్ల నెదర్లాండ్స్ ప్రధానమంత్రి డిక్ షూఫ్ సంతాపం తెలిపారు. ఈ పిరికి చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమయినా నెదర్లాండ్స్ పూర్తిగా వ్యతిరేకిస్తుందంటూ తమ వైఖరిని దృఢంగా పునరుద్ఘాటించారు.
జపాన్
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతానీ శాన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు దృఢమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
సౌదీ అరేబియా
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దీనిని హేయమైన హింసాత్మక చర్యగా పేర్కొన్నది. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు సౌదీ అరేబియా పూర్తిగా వ్యతిరేకమంటూ తన వైఖరిని దృఢంగా పునరుద్ఘాటించింది. బాధిత కుటుంబాలకు మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారత్కు సంఘీభావం ప్రకటించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత ఆత్మరక్షణ హక్కుకు యూఏఈ మద్దతు తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించని దేశంగా- భారత్‌తో యూఏఈకి ఉన్న వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనం. ఈ మద్దతు గల్ఫ్ దేశాల్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంతోపాటు ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడంలో యూఏఈ పాత్రను చాటుతుంది.
ఇరాన్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్వయంగా ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి పహల్గాం దాడిపై సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన ప్రాంతీయ సహకారం అత్యావశ్యకమని స్పష్టం చేశారు.
ఖతార్
ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జైశంకర్‌కు ఫోన్ చేసి ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై ‘తీవ్ర ఆందోళన’ వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదన్న ఖతార్ వైఖరిని పునరుద్ఘాటించారు. భారత చర్యలకు మద్దతివ్వడం ద్వారా.. ఉగ్రవాదంపై పోరాటంలో, భారత్‌తో దౌత్య సంబంధాల బలోపేతంపై తన నిబద్ధతను ఖతార్ పునరుద్ఘాటించింది.
పనామా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కాని పనామా.. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ తీసుకున్న చర్యల ఔచిత్యాన్ని సమర్థించింది. భారత్కు మద్దతిస్తూ, ఉగ్రవాద ముప్పుపై ముక్తకంఠంతో స్పందించాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
శ్రీలంక
పహల్గాం ఉగ్రదాడి అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకె భారత్‌కు సంఘీభావం తెలిపారు. “26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి శ్రీలంక తరఫున సంఘీభావం తెలిపాను. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌తో ఉమ్మడిగా కట్టుబడి ఉంటామని చెప్పాను. బాధితుల కుటుంబాల పరిస్థితిపై మా హృదయాలు విలపిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని, అమాయక పౌరుల హత్యను యూరోపియన్ యూనియన్ (ఈయూ), దాని 27 సభ్య దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. “ఉగ్రవాదం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి. ఉగ్రవాద చర్యల నుంచి పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత, హక్కు ప్రతి దేశానికీ ఉంది.”
|
మాల్దీవులు
అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఈ దాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటానికి మాల్దీవులు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
|
పాలస్తీనా
ఈ దాడిని హేయమైన చర్యగా ఖండించిన అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.
|
కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా చేసిన ప్రతిపాదనకు స్పందిస్తూ.. పరిష్కరించాల్సిన ఏకైక సమస్య పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను(పీఓకే) తిరిగివ్వడానికి సంబంధించినదే అని భారత్ పునరుద్ఘాటించింది. సీమాంతర ఉగ్రవాదంపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప చర్చలు సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని తోసిపుచ్చిన భారత్.. కాశ్మీర్ తమ సార్వభౌమత్వానికి సంబంధించిన, ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నది. సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడంపై దేశ దృఢ సంకల్పాన్ని స్పష్టం చేస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని భారత్ తేల్చి చెప్పింది.
***
(Release ID: 2128938)