యు పి ఎస్ సి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ అజయ్ కుమార్ పదవీబాధ్యతల స్వీకారం
Posted On:
15 MAY 2025 1:11PM by PIB Hyderabad
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ అజయ్ కుమార్ ఈ రోజు పదవీప్రమాణం స్వీకరించారు. కమిషన్‌లో అత్యంత సీనియర్ సభ్యుడైన లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా (రిటైర్‌డ్) డాక్టర్ అజయ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. డాక్టర్ అజయ్ కుమార్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్. చదివిన డాక్టర్ అజయ్ కుమార్... అమెరికాలోని మినెసోటాలో అప్లయిడ్ ఎకనామిక్స్‌లో ఎం.ఎస్. చేశారు. అమెరికాలోనే మినెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్‌సన్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీని పొందారు. యామిటీ విశ్వవిద్యాలయం ‘ఆనరరీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ని ఆయనకు 2019లో ప్రదానం చేసింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) 1985 బ్యాచ్‌లో కేరళ కేడరుకు చెందిన అధికారి డాక్టర్ అజయ్ కుమార్. 35 సంవత్సరాలకు పైగా ప్రతిష్ఠాత్మక వృత్తి జీవనంలో భాగంగా ఆయన కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం మేనేజింగ్ డైరెక్టరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనను వరించిన ముఖ్య పదవులు . కేంద్రంలో సైన్స్-టెక్నాలజీ డైరెక్టరుగా, కమ్యూనికేషన్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటరుకు డైరెక్టర్ జనరల్‌గా, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యదర్శిగా ప్రధాన పదవులను డాక్టర్ అజయ్ కుమార్ నిర్వహించారు. రక్షణ శాఖలో కార్యదర్శిగా ఇటీవలి వరకు తన సేవలను అందించారు.
ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలను ఎన్నిటినో ప్రవేశపెట్టడంలో డాక్టర్ అజయ్ కుమార్ ప్రమేయం ఉంది. ఈ కార్యక్రమాల్లో... పింఛనుదారులకు ఉద్దేశించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ‘‘జీవన్ ప్రమాణ్’’, ప్రజా కేంద్రిత వేదిక ‘మైగవ్’ (myGov), ప్రధానమంత్రి పాల్గొనే డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ వేదిక ‘ప్రగతి’, బయో-మెట్రిక్ హాజరు వ్యవస్థ, ఏఐఐఎంఎస్‌లో ఓపీడీ నమోదు వ్యవస్థ, క్లౌడ్ సేవల ప్రదాత సంస్థలు ఉపయోగించుకొనేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ ‘‘క్లౌడ్ ఫస్ట్’’ విధానం వంటివి... కొన్ని.
అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో డాక్టర్ అజయ్ కుమార్ వ్యాసాలు రాశారు. అంతేకాకుండా, ఆయన పలు అవార్డులు కూడా అందుకున్నారు. వాటిలో జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ 1994లో ఇచ్చిన ‘‘సిల్వర్ ఎలిఫెంట్’’ పతకం, దేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రోత్సహించినందుకుగాను 2012లో ‘‘ఎలక్ట్రానిక్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డు, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ 2015లో ఇచ్చిన ‘‘టెక్నొవేషన్ సారాభాయ్ అవార్డు’’, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ 2017లో ప్రదానం చేసిన ‘‘ఛాంపియన్ ఆఫ్ ఛేంజ్’’ వంటి పురస్కారాలు ఉన్నాయి.
***
(Release ID: 2128861)