సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్‌ సిందూర్‌: జాతీయ భద్రతలో స్వ‌యం స‌మృద్ధ ఆవిష్క‌ర‌ణోద‌యం


నానాటికీ ఇనుమ‌డిస్తున్న‌ భారత సాంకేతిక స్వావలంబన

Posted On: 14 MAY 2025 8:46PM by PIB Hyderabad

పరిచయం

సాయుధ సిబ్బందితోపాటు నిరాయుధ పౌరులు లక్ష్యంగా పుట్టుకొచ్చిన పొంతనలేని యుద్ధ రీతికి క్రమబద్ధ సైనిక ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ రూపొందింది. పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఎంతమాత్రం సహించరాని అమానుష ఉగ్రదాడి ఫలితమే ఈ పరిణామం. తదనుగుణంగా భారత్‌ వివేచనాత్మక, సమతూక, వ్యూహాత్మక రీతిలో ప్రతిస్పందించింది. ఈ మేరకు నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించకుండానే భారత దళాలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి, అనేకరకాల ముప్పులను తప్పించాయి. అయితే, యుద్ధ కౌశలానికి మించి అత్యాధునిక దేశీయ సాంకేతిక వ్యవస్థలను జాతీయ రక్షణతో సముచితంగా ఏకీకృతం చేయడం ఈ సందర్భంగా విశేషం. డ్రోన్ యుద్ధరీతిలో, అంచెలవారీ గగనతల రక్షణలో లేదా ఎలక్ట్రానిక్ యుద్ధరీతిలో ఆపరేషన్ సిందూర్ ఓ కీలకఘట్టంగా నిలిచిపోతుంది. సైనిక కార్యకలాపాల్లో సాంకేతిక స్వావలంబన దిశగా భారత్‌ తిరుగులేని పయనానికి ఇదొక సంకేతం.

గగనతల రక్షణ సామర్థ్యాలు: తొలి అంచె రక్షణగా సాంకేతికత

ఉత్తర-పశ్చిమ భారత్‌లోని అనేక సైనిక స్థావరాలు, శిబిరాలు లక్ష్యంగా మే 07-08 అర్ధరాత్రి  పాకిస్తాన్ దాడికి యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్‌, భుజ్‌ తదితర ప్రాంతాలపై డ్రోన్‌లు, క్షిపణులు ప్రయోగించింది. కానీ, భారత సమీకృత ప్రతిదాడి మానవరహిత వైమానిక వ్యవస్థల (యుఎఎస్‌) గ్రిడ్తోపాటు గగనతల రక్షణ వ్యవస్థలు పాక్‌ ఆయుధాలను ఆకాశంలోనే తుత్తునియలు చేశాయి.

రాడార్లు, నియంత్రణ కేంద్రాలు, శతఘ్ని దళం సహా విమానాలు, ఉపరితల క్షిపణుల నెట్‌వర్క్‌ సాయంతో గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తాయి. ఇవి మెరుపు వేగంతో ముప్పును పసిగట్టి, అనుసరించి, నిర్వీర్యం చేస్తాయి.

ఈ కవ్వింపు చర్యలకు బదులిస్తూ మే 8న ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాలలో గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలతోపాటు లాహోర్‌లోని కీలక గగనతల రక్షణ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశాయి.[1]

మన వ్యవస్థల సామర్థ్యం

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా వినియోగించిన వ్యవస్థలివే:

·        పెచోరా, ఒఎస్‌ఎ-ఎకె, ఎల్‌ఎల్‌ఎడి గన్స్‌ (దిగువ-గగనతల రక్షణ తుపాకులు) వంటి యుద్ధ-సన్నద్ధ గగనతల రక్షణ వ్యవస్థలు.

·        ఆకాష్ వంటి స్వదేశీ వ్యవస్థలు- ఇవెంతో అద్భుత సామర్థ్యం ప్రదర్శించాయి.

దుర్బల కేంద్రాలు, ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేందుకు ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి  ఆకాష్. ఆకాష్‌ ఆయుధ వ్యవస్థ సామూహిక పద్ధతి (గ్రూప్ మోడ్)లో లేదా స్వయంప్రతిపత్తి పద్ధతి (అటానమస్ మోడ్‌)లో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో నిర్వీర్యం చేయగలదు. అంతర్నిర్మిత ‘ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్స్’ (ఇసిసిఎం) వంటి ప్రత్యేకతలు ఇందులో  ఉన్నాయి. ఇది సంచార ఆయుధ వ్యవస్థ కావడం విశేషం.[2]

గగనతల రక్షణ సామర్థ్యాలు

1.    భారత వైమానిక దళ ప్రాథమిక వనరులు సహా సైన్యం, నావికాదళ అంచెలవారీ-సమీకృత గగనతల రక్షణ వ్యవస్థల వనరులు

2.  దిగువ పేర్కొన్న బహుళ అంచెల ‘ఎడి’ సెన్సర్లు-ఆయుధ వ్యవస్థలు

·         పాయింట్‌ డిఫెన్స్‌ వెపన్స్‌ (లో లెవల్‌ ‘ఎడి’ గన్స్‌, మాన్‌పాడ్స్‌, షార్ట్‌ రేంజ్‌ ‘ఎస్‌ఎఎంఎస్‌’)

·         ఏరియా డిఫెన్స్‌ వెపన్స్‌ (‘ఎడి’ ఫైటర్స్‌, లాంగర్‌ రేంజ్‌ ‘ఎస్‌ఎఎంఎస్‌’)

3.  కౌంటర్‌ యుఎఎస్‌ సిస్టమ్స్‌- దేశీయంగా రూపొందించిన సాఫ్ట్‌ అండ్‌ హార్డ్‌ కిల్‌ సిస్టమ్స్‌. డ్రోన్‌ల వరుస దాడిని, మానవరహిత గగనతల యుద్ధ వాహనాలను ఈ రెండు రకాల వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయి.

భారత గగనతల రక్షణ వ్యవస్థలన్నీ భారత వైమానిక దళ ప్రాథమిక ఆయుధ సంపత్తి సహా సైన్యం, నావికాదళ సంపత్తితో సంయుక్తంగా అసాధారణ సమన్వయంతో పనిచేశాయి. ఇవన్నీ కలసి సృష్టించిన దుర్బేధ్య ఛత్రం పాక్‌ పలుమార్లు చేసిన ప్రతీకార దాడులను భగ్నం చేసింది.

భారత వైమానిక దళ సమీకృత గగనతల నిర్దేశక-నియంత్రణ వ్యవస్థ (ఐఎసిసిఎస్‌) ఈ శక్తులన్నిటినీ ఏకీకృతం చేస్తూ, ఆధునిక యుద్ధరీతికి కీలకమైన నికర-కేంద్రీకృత కార్యాచరణ సామర్థ్యాన్ని సమకూర్చింది.

అత్యంత కచ్చితత్వంతో ఎదురు దాడులు

పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాలు- ‘నూర్ ఖాన్, రహిమ్యార్ ఖాన్‌’ లక్ష్యంగా అత్యంత కచ్చితత్వంతో భారత్‌ ఎదురుదాడి చేసింది. ఈ మేరకు అత్యంత కీలక శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలను అన్వేషించి, ధ్వంసం చేయడం కోసం ‘సంచార ఆయుధ వాహక’ (లాయిటరింగ్ మ్యునిషన్స్‌) డ్రోన్లను ఉపయోగించింది.

‘సంచార ఆయుధ వాహకాలు’.. వీటిని “ఆత్మాహుతి డ్రోన్లు లేదా కామికాజీ డ్రోన్లు”గానూ వ్యవహరిస్తారు. ఈ ఆయుధ వ్యవస్థలు గగనతలంలో నిర్దిష్ట ప్రదేశంలో నిలిచి లేదా ఒక వలయంగా సంచరిస్తూ లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించి దాడి చేయగలవు.

ఈ దాడులలో భారత ఆయుధ సంపత్తికి ఎంతమాత్రం నష్టం లేకుండా శత్రు లక్ష్యాలను మన సాయుధ దళాలు ధ్వంసం చేశాయి. మన నిఘా-ప్రణాళిక-అమలు వ్యవస్థల సామర్థ్యానికి ఇదొక సుస్పష్ట నిదర్శనం.  దీర్ఘ-శ్రేణి డ్రోన్ల నుంచి గైడెడ్ ఆయుధ సామగ్రి వరకూ ఆధునిక దేశీయ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా సైనికంగా, రాజకీయంగా అత్యంత ప్రభావశీల రీతిలో ఈ దాడులన్నిటినీ క్రమబద్ధంగా నిర్వహించడం విశేషం.

ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థల స్తంభన లేదా కళ్లుగప్పడం ద్వారా మన సాంకేతిక నైపుణ్యాన్ని చాటుతూ భారత వైమానిక దళం కేవలం 23 నిమిషాల్లోనే లక్ష్యాలను ఛేదించింది.

ముప్పును తిప్పికొట్టడంపై సాక్ష్యాలు

శత్రు సాంకేతికతలను విచ్ఛిన్నం చేయడంలో భారత వ్యవస్థల సామర్థ్యాన్ని కచ్చితమైన సాక్ష్యాలతో ఆపరేషన్ సిందూర్ రుజువు చేసింది:

·        పిఎల్‌-15 (చైనా సరఫరా) క్షిపణుల శకలాలు

·        “యిహా” లేదా ఈహా” (టర్కీ సరఫరా)గా వ్యవహరించే ‘యుఎవి’లు (మానవరహిత గగనతల వాహనాలు).

·        దీర్ఘ-శ్రేణి రాకెట్లు, క్వాడ్‌కాప్టర్లు, వాణిజ్య డ్రోన్లు

ఈ ఆయుధ శకలాలన్నిటినీ భారత దళాలు స్వాధీనం చేసుకుని, గుర్తించాయి. అత్యాధునిక విదేశీ సరఫరా ఆయుధాల ముసుగుతో పాకిస్థాన్‌ దాడి చేసినప్పటికీ వాటిని నిర్వీర్యం చేయడంలో భారత స్వదేశీ గగనతల రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ నెట్‌వర్కులు తమ ఉన్నత సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి.

వ్యవస్థల సామర్థ్యం: భారత సైన్యం గగనతల రక్షణ చర్యలు

ఆపరేషన్ సిందూర్ గురించి మే 12నాటి విలేకరుల సమావేశం సందర్భంగా- భారత వారసత్వ, ఆధునిక వ్యవస్థల సమ్మేళనం అద్భుత సామర్థ్యాన్ని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రముఖంగా ప్రస్తావించారు:

సన్నద్ధత... సమన్వయం

నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించకుండా ఉగ్రవాదులపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసిన నేపథ్యంలో సరిహద్దు ఆవలి నుంచి పాకిస్థాన్‌ ప్రతీకార స్పందనను ముందుగానే పసిగట్టాయి.

·         సైన్యం, వైమానిక దళం రెండింటి ‘మానవరహిత ప్రతిదాడి గగనతల వ్యవస్థలు’ (కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్), ‘ఎలక్ట్రానిక్ యుద్ధరీతి’ సంబంధిత ఆయుధ సంపత్తిసహా వైమానిక దళ గగనతల రక్షణ ఆయుధాల ప్రత్యేక సమ్మేళనం.

·         అంతర్జాతీయ సరిహద్దు నుంచి అంతర్గతంగా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు:

ఎ. కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్

బి. భుజం మీదినుంచి ప్రయోగించగల ఆయుధాలు

సి. వారసత్వ గగనతల రక్షణ ఆయుధాలు

డి. ఆధునిక గగనతల ఆయుధ వ్యవస్థలు

ఈ బహుళ-అంచెల రక్షణ వ్యవస్థలే మే 9-10 అర్ధరాత్రి మన వైమానిక క్షేత్రాలు, సైనిక సదుపాయాలపై పాకిస్థాని గగనతల దాడులను తిప్పికొట్టాయి. గత దశాబ్ద కాలంలో క్రమం తప్పని ప్రభుత్వ పెట్టుబడులతో రూపొందించిన ఈ వ్యవస్థలన్నీ ఆపరేషన్ సిందూర్‌ వేళ బహుగుణ శక్తిగా నిరూపించుకున్నాయి. ఆ మేరకు శత్రువు ప్రతీకార దాడి సందర్భంగా దేశవ్యాప్తంగా పౌర ఆవాసాలు, సైనిక మౌలిక సదుపాయాలపై పెద్దగా ప్రభావం పడకుండా ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి.

ఇస్రో పాత్ర: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్‌ఆర్‌ఒ-ఇస్రో) చైర్మన్‌ వి.నారాయణన్‌ మే 11నాటి కార్యక్రమంలో మాట్లాడుతూ- దేశ పౌరుల భద్రత-రక్షణకు భరోసా ఇస్తూ వ్యూహాత్మక ప్రయోజనాల దిశగా కనీసం 10 ఉపగ్రహాలు అనుక్షణం కాపలా కాస్తున్నాయని తెలిపారు. దేశ భద్రతకు భంగం కలగకుండా ఉపగ్రహాల ద్వారా సేవలందించడం అవశ్యం. తదనుగుణంగా 7,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీర ప్రాంతాలపై నిశిత నిఘా ఉంచాలి. ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూండాలి. ఉపగ్రహం, డ్రోన్ సాంకేతికతలు లేనిదే  దేశం ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించజాలదు.[3]

వాణిజ్య డ్రోన్ల సామర్థ్యం: వర్ధమాన దేశీయ పరిశ్రమ

డ్రోన్ ఫెడరేషన్ ఇండియా (డిఎఫ్‌ఐ), దేశవ్యాప్తంగాగల 550కిపైగా డ్రోన్ కంపెనీలు, 5500 మంది పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రముఖ పారిశ్రామిక సంస్థ[4]. మన దేశాన్ని 2030 నాటికి ప్రపంచ డ్రోన్ కూడలిగా మార్చాలదన్నదే ‘డిఎఫ్‌ఐ’ లక్ష్యం. భారతీయ డ్రోన్, కౌంటర్-డ్రోన్ సాంకేతికతల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, స్వీకరణతోపాటు ప్రపంచవ్యాప్త  ఎగుమతులను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా వ్యాపార సౌలభ్య కల్పనతోపాటు  డ్రోన్ సాంకేతిక పరిజ్ఞాన అనుసరణను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా భారత్ డ్రోన్ మహోత్సవ్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తూంటుంది.[5] డ్రోన్ల రంగంలో భాగస్వామ్యంగల కొన్ని కంపెనీలు:

·         ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ (బెంగళూరు): ‘స్కైస్ట్రైకర్‌’ రూపకల్పనలలో ఇజ్రాయెల్ సంస్థ ‘ఎల్బిట్ సిస్టమ్స్‌’తో భాగస్వామ్యం.

·         టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్: రక్షణ-భద్రత రంగాలన్నిటా సంపూర్ణ సమీకృత మార్గాలను రూపొందిస్తుంది. ఈ మేరకు భారత సాయుధ దళాలకు ఆరు దశాబ్దాలకుపైగా విశ్వసనీయ భాగస్వామిగా సేవలందిస్తోంది[6]

·         పారస్ డిఫెన్స్ అండ్‌ స్పేస్ టెక్నాలజీస్: రక్షణ-అంతరిక్ష విభాగాల్లో కృషి చేస్తోంది. దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి, తయారుచేసే (ఐడిడిఎం) విభిన్న  సామర్థ్యాలపై ఇది కృషి చేస్తూంది. [7]

·         ఐజి డ్రోన్స్: రక్షణ, ఇతర పరిశ్రమల సంబంధిత ప్రత్యేకతలుగల డ్రోన్ల తయారీ, పరిశోధన-అభివృద్ధి రంగంలో పనిచేస్తున్న సాంకేతిక సంస్థ. అలాగే దీంతోపాటు పరిశ్రమ నిపుణులతో డ్రోన్ సర్వే, మ్యాపింగ్, తనిఖీ వంటి సేవలందిస్తుంది. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతరత్రా సంస్థలతో  దీనికి భాగస్వామ్యం ఉంది.[8]

భారత డ్రోన్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచ డ్రోన్ మార్కెట్‌లో 12.2 శాతం వాటాతో 11 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా.[9]

డ్రోన్లు.. రకాలు

సమూహ (స్వార్మ్) డ్రోన్లు:

శత్రు రక్షణ వ్యవస్థల కళ్లుగప్పడానికి అనేక డ్రోన్ల సమూహం సమన్వయంతో పనిచేస్తుంది. ఈ స్వార్మ్‌ డ్రోన్‌ సాంకేతికతను తీర్చిదిద్దడంపై ‘డిఆర్‌డిఒ’తోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి.

నిఘా... భూ పరిశీలన (ఐఎస్‌ఆర్‌) డ్రోన్లు:

ఈ డ్రోన్లను ప్రధానంగా నిఘా, పర్యవేక్షణ, భూ పరిశీలన అవసరాల కోసం వినియోగిస్తారు.

భారత్‌ వద్ద ప్రస్తుతం:

తపస్‌-బిహెచ్‌-201 (గగనతల నిఘా కోసం అధునాతన వ్యూహాత్మక వేదికలు)

రుస్తుం (డిఆర్‌డిఒ రూపకల్పన)

హెరాన్‌ (ఇజ్రాయెల్‌)

వాణిజ్య/మార్పుచేసిన పౌర డ్రోన్లు:

ఆఫ్ ది షెల్ఫ్ (అమ్మకానికి సిద్ధంగాగల) డ్రోన్లు, వీటిని మార్పుచేర్పులతో చట్టవిరుద్ధ సరిహద్దు కార్యకలాపాల కోసం వాడుతుంటారు.

సంచార ఆయుధ వాహక డ్రోన్లు (లాయిటరింగ్‌ మ్యునిషన్స్‌):

ఈ డ్రోన్లు నిర్దిష్ట ప్రాంతంలో సంచరిస్తూ లేదా ఒకేచోట నిలిచి లేదా వలయంగా ఏర్పడి లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించి దాడి చేసేలా రూపొందాయి.

భారత్‌ వద్ద ప్రస్తుతం:

నాగాస్త్ర (సోలార్‌ ఇండస్ట్రీస్‌, జడ్‌మోషన్‌ సంస్థల తయారీ)

వార్‌మేట్‌ (పోలాండ్‌ సరఫరా) ఉన్నాయి.

సాయుధ/యుద్ధ డ్రోన్లు:

ఈ మానవ రహిత గగనతల యుద్ధ డ్రోన్లు (యుసిఎవి) బాంబులు జారవిడవడంతోపాటు క్షిపణులను కూడా ప్రయోగించగలవు.

భారత్‌ వద్ద ప్రస్తుతం:

ఘాతక్‌ (డిఆర్‌డిఒ- రూపకల్పన దశలో ఉన్నాయి)

హెరాన్‌ టిపి (ఇజ్రాయెల్‌ సరఫరా)

ఆధునిక యుద్ధరీతిలో డ్రోన్ల కీలకపాత్ర

భారత సైనిక విధానంతో డ్రోన్ యుద్ధరీతిని విజయవంతంగా ఏకీకృతం చేయడంలో ఏళ్ల తరబడి సాగిన దేశీయ పరిశోధన-అభివృద్ధితోపాటు విధానపరమైన సంస్కరణలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ మేరకు 2021 నుంచి డ్రోన్ల దిగుమతిపై నిషేధం సహా వాటి తయారీపై ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) ప్రవేశపెట్టడంతో ఆవిష్కరణలు వేగం పుంజుకున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డ్రోన్లు-వాటి విడి భాగాలపై  2021 సెప్టెంబరు 30న ‘పిఎల్‌ఐ’ని ప్రకటించింది. ఇందుకోసం మూడు (2021-22 నుంచి 2023-24) ఆర్థిక సంవత్సరాలకుగాను రూ.120 కోట్లు కేటాయించింది.[10] భవిష్యత్తులో ఏఐ చోదిత నిర్ణయాత్మక సామర్థ్యంగల స్వయంప్రతిపత్త డ్రోన్ల ప్రాబల్యం కొనసాగనున్న నేపథ్యంలో భారత్‌ ఇప్పటికే దీనికి పునాది వేసింది.

భారత్‌ నుంచి 2024-25లో రక్షణ ఎగుమతులు దాదాపు రూ.24,000 కోట్ల రికార్డును దాటాయి. ఈ పరిమాణాన్ని 2029 నాటికి రూ.50,000 కోట్లతో పెంచడంతోపాటు దేశాన్ని వికసిత భారత్‌గా, 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుగా రూపుదిద్దాలని ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకుంది.[11]

రక్షణ రంగ వృద్ధి వేగానికి ఉత్తేజమిస్తున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతోపాటు స్వావలంబనకు బలమైన ప్రోత్సాహం ఫలితంగా భారత్‌ నేడు ప్రపంచంలో ఒక ప్రధాన రక్షణ తయారీ కూడలిగా రూపొందింది. ఈ మేరకు 2023–24లో స్వదేశీ రక్షణ ఉత్పత్తి పరిమాణం రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక 2024–25లో ఎగుమతుల పరిమాణం కూడా 2013–14నాటి స్థాయితో పోలిస్తే 34 రెట్లు పెరిగి, రూ.23,622 కోట్లకు చేరింది. వ్యూహాత్మక సంస్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం సహా బలమైన పరిశోధన-అభివృద్ధి వ్యవస్థలు తమవంతు చేయూతనిచ్చాయి. దీంతో దేశంలో నేడు “ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మెయిన్ బాటిల్ ట్యాంక్ అర్జున్, లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్, ఆకాష్ మిస్సైల్ సిస్టమ్, వెపన్ లొకేటింగ్ రాడార్, 3డీ టాక్టికల్ కంట్రోల్ రాడార్-సాఫ్ట్‌ వేర్ డిఫైన్డ్ రేడియో సహా.. డిస్ట్రాయర్లు, స్వదేశీ విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్‌లు, ఫాస్ట్ పట్రోల్ నౌకలు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్-ఆఫ్‌షోర్ పట్రోల్ నౌకలు వంటి నావికా దళ ఆయుధ సంపత్తి అభివృద్ధి సాధ్యమైంది.

రక్షణ తయారీ రంగం వృద్ధిలో ప్రభుత్వం కూడా తనవంతు పాత్ర పోషించింది. ఈ మేరకు రికార్డు స్థాయి కొనుగోలు ఒప్పందాలు, ‘ఐడెక్స్‌’ కింద ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ‘శ్రీజన్‌’  వంటి కార్యక్రమాలు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు తదితరాల ద్వారా చేయూతనిచ్చింది. ‘ప్రచండ్‌’ వంటి లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలు, ‘అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌’కు ఆమోదం వంటివి స్వదేశీ సామర్థ్యం వైపు ప్రగతిశీల మార్పును ప్రముఖంగా చాటుతాయి. ఈ నేపథ్యంలో 2029 నాటికి రూ.3 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, రూ.50,000 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా స్వయం సమృద్ధం కావడంతోపాటు ప్రపంచవ్యాప్త పోటీతత్వ రక్షణ తయారీ శక్తిగా రూపొందడానికి భారత్‌ తననుతాను మలచుకుంటోంది.

ముగింపు

ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం వ్యూహాత్మక విజయగాథకు పరిమితం కాదు. భారత రక్షణ రంగ దేశీయీకరణ విధానాలకు ఒక గుర్తింపు. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి డ్రోన్లదాకా, కౌంటర్-యుఎఎస్ సామర్థ్యం నుంచి నికర-కేంద్రీకృత యుద్ధ వేదికల వరకూ  స్వదేశీ సాంకేతికత అత్యంత కీలక సమయంలో అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ రంగ ఆవిష్కరణ, ప్రభుత్వ రంగ అమలు, సైనిక దృక్కోణాల సమ్మేళనం ఇందుకు దోహదం చేసింది. తద్వారా భారత్‌ తన ప్రజలను, భూభాగాన్ని రక్షించుకోవడమేగాక ఈ 21వ శతాబ్దంలో అధునాతన సాంకేతిక సైనిక శక్తిగా తన పాత్రను ప్రస్ఫుటం చేసే అవకాశం లభించింది. భవిష్యత్ సంఘర్షణల సందర్భాల్లో యుద్ధ క్షేత్రాలు అధికశాతం సాంకేతికత చోదితం కాగలవు. ఆ మేరకు తన జనశక్తి నైపుణ్యం, కృతనిశ్చయంతో కూడిన ప్రభుత్వ మద్దతు, దేశీయ ఆవిష్కరణల దన్నుతో భారత్‌ ఇందుకు సంసిద్ధంగా ఉన్నదని ఆపరేషన్ సిందూర్‌ స్పష్టం చేసింది.

 

****


(Release ID: 2128792)