సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జాతీయ వస్తుప్రదర్శనశాలలో వేసాక్ దినోత్సవం..
బుద్ధునికి శ్రద్ధాసుమాంజలి అర్పించిన కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, శ్రీ కిరెన్ రిజిజూ
బుద్ధ పూర్ణిమ సందర్భంగా జాతీయ వస్తుప్రదర్శనశాలలో
పవిత్ర అవశేషాలకు విధివిధాన సహితంగా పూజలు
ఆరాధన భావం, సంస్కృతి, సృజనాత్మకతల మేలి కలయికతో
బుద్ధ జయంతి నిర్వహణ
Posted On:
12 MAY 2025 6:21PM by PIB Hyderabad
‘బుద్ధ పూర్ణిమ’ సందర్భంగా న్యూఢిల్లీ లోని జాతీయ వస్తుప్రదర్శనశాలలో భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలకు విధివిధాన సహితంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలు, సంస్కృతి, కళాత్మక అభివ్యక్తి... వీటి సమాహారంగా భాసిల్లింది. ‘బుద్ధ పూర్ణిమ’నే వేసాక్ అని, బుద్ధ జయంతి అని కూడా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, పార్లమెంటరీ వ్యవహారాలు, అల్పసంఖ్యాకవర్గాల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ.. వీరు ఇద్దరి ఆధ్వర్యంలోనూ సంప్రదాయబద్ధంగా పుష్పాంజలి సమర్పణను నిర్వహించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పక్షాన ప్రపంచంలోని బౌద్ధ సమాజానికి శుభాకాంక్షలను కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ తెలియజేయంతో పాటు, బుద్ధుని కరుణ, సద్భావనల ప్రబోధాలకు నేటి ప్రపంచంలో సందర్భ శుద్ధి మరింతగా పెరిగిందని స్పష్టంచేశారు. ఇంత పెద్ద ఎత్తున అనేక మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని పవిత్ర అవశేషాల పట్ల ఆరాధనభావాన్ని కనబరచడాన్ని చూస్తూ ఉంటే తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
బుద్ధుని జీవనంలో జరిగిన ఘటనలను, ప్రత్యేకించి ఎనిమిది మహా అలౌకిక ఘట్టాలను (అష్ట మహాప్రతిహార్యాలు) కళ్లకు కట్టే స్తంభాలలో ఒక దానిని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ శ్రద్ధగా చూశారు. మహాయాన, వజ్రయాన బౌద్ధ ధర్మాల్లోని విభిన్న బౌద్ధ దేవతల ప్రతిమలను అతిథులుగా విచ్చేసిన వారు ఎంతో ఆసక్తితో తిలకించారు. వాటిలో బోధిసత్వులు, కిరీట ధారి బుద్ధుడు, పారలౌకిక బుద్ధులు (పంచతథాగతులు), దేవీదేవతలు, సహాయక దేవతలు (ఇష్టదైవాలు).. వీరందరి ప్రతిమలు ఉన్నాయి.
ఈ శుభ సందర్భంగా తరలివచ్చిన వారిలో జాతీయ వస్తుప్రదర్శనశాల డైరెక్టర్ జనరల్ శ్రీ గుర్మీత్ సింగ్ చావ్లా, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య డైరెక్టర్ జనరల్ శ్రీ అభిజీత్ హల్దర్, సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సమర్ నందా సహా ఇతర ప్రముఖ భిక్షువులు, పండితులు, ఇతర సందర్శకులు ఉన్నారు.
మార్గదర్శకులు వెంట రాగా మంత్రులు బుద్ధ చిత్రశాలలో కలియదిరిగారు. భగవాన్ బుద్ధుని జీవనం, బోధనలు, బౌద్ధ తత్వాన్ని వివరించే కళాత్మక వస్తువులు, ప్రాచీన వస్తువులను గురించి అనేక విషయాలను మంత్రులకు అర్థమయ్యేటట్లు గైడ్లు వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పిపర్‌హవా నుంచి తవ్వకాల్లో వెలికితీసిన కపిలవస్తు అవశేషాలను ఈ గ్యాలరీలో ఒక ప్రత్యేక స్థానంలో ఉంచారు. సందర్శకులను ఇవి చాలా ఆకట్టుకున్నాయి.
బౌద్ధ ధర్మం అభివృద్ధి చెందుతూ వచ్చిన క్రమాన్ని మథుర, గాంధారల్లో ఆరంభిక ప్రతీకాత్మక చిత్రణ మొదలు సారనాథ్, పాల్, చోళ, భౌమకార కాలాల్లో దీని శైలియుక్త వికాసాన్ని ప్రదర్శనలో క్రమానుగతంగా పొందుపరచారు. మహాయాన, వజ్రయాన సంప్రదాయాల్లో బోధిసత్వులు, పంచతత్వగత, ఇష్టదేవతల ప్రతిమలు .. ఇవన్నీ కలిసి ఆధ్యాత్మిక అనుభూతిని, కళాత్మక అనుభవాన్ని పెంపొందింపచేశాయి.
ఈ పవిత్ర సందర్భానికి మరింత హుషారును థంగ్‌కా గ్యాలరీ సైతం జోడించింది. భావచక్రం (ఇది జీవ చక్రానికి సూచిక) సహా ఎంతో నైపుణ్యంతో తయారుచేసిన స్క్రాల్ పెయింటింగులు సందర్శకుల మనసును ఆకట్టుకున్నాయి. ఈ భక్తిరసప్రధాన కళాకృతులు ప్రతిబింబించిన ప్రతీకాత్మకత, ధ్యానభరిత విలువల గాఢత్వాన్ని మంత్రులు ప్రశంసించారు.
కార్యక్రమం ముగింపు దశలో భాగంగా యువజనులు, వృద్ధులు అని తేడా లేకుండా ఆగంతుకులంతా పలు ఇంటరాక్టివ్ వర్క్‌షాపులలో, డీఐవై (డూ ఇట్ యువర్‌సెల్ఫ్) కౌంటర్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యకలాపాల్లో ప్రార్థన పతాకాన్ని రూపొందించడం, బౌద్ధ ప్రతిమలను ఎలా తయారు చేయవచ్చో నేర్చుకోవడం, థంగ్‌కా కలరింగ్ షీట్లను ఉపయోగించడం, స్వీయచిత్రాలను తీసుకొనేందుకు ఏర్పాటు చేసిన బూత్‌లను సందర్శించడం, బౌద్ధ చిత్రాల ప్రదర్శనలకు హాజరు కావడం, లఘు బుద్ధ శిల్పాలను తయారు చేయడం వంటివి భాగంగా ఉన్నాయి.
భగవాన్ బుద్ధుని చిరస్థాయి వారసత్వానికి, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి అద్దం పడుతున్న బుద్ధ చిత్రశాలను అత్యంత పవిత్ర దినమైన ‘బుద్ధ పూర్ణిమ’ నాడు ప్రజలంతా చూసేందుకు వీలుగా రోజంతా తెరచి ఉంచారు.
***
(Release ID: 2128437)
Visitor Counter : 6