రక్షణ మంత్రిత్వ శాఖ
రష్యా పర్యటన సందర్భంగా మాస్కోలో విక్టరీ డే వేడుకల్లో పాల్గొన్న రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ సేథ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ
ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో
రష్యా మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ సంజయ్ సేథ్
Posted On:
10 MAY 2025 4:46PM by PIB Hyderabad
రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ ఈ నెల 8, 9 తేదీలలో రష్యా పర్యటన సందర్భంగా విజయ దినోత్సవ (విక్టరీ డే) వేడుకల్లో పాల్గొన్నారు. మే 09, 2025న మాస్కోలో ఈ వేడుకలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం (1941–45) లో సోవియట్ ప్రజలు సాధించిన విజయం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శ్రీ సంజయ్ సేథ్ అజ్ఞాత సైనికుల సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, ఇతర దేశాలకు చెందిన ప్రముఖ ప్రతినిధులతో కలిసి విక్టరీ డే పరేడ్ ను వీక్షించారు. విక్టరీ డే పరేడ్ లో భారత రక్షణ శాఖ సహాయ మంత్రి పాల్గొనడం భారత్- రష్యా మధ్య దీర్ఘకాలిక, ప్రత్యేక, ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ పర్యటనలో భాగంగా శ్రీ సంజయ్ సేథ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిసి 80వ విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు.
రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ తో శ్రీ సంజయ్ సేథ్ ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించారు. ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటంలో మద్దతు ఇస్తున్నందుకు రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బహుముఖ సైనిక, సైనిక - సాంకేతిక సహకారం గురించి కూడా ఇద్దరు మంత్రులు చర్చించారు. ఇప్పటికే ఉన్న సంస్థాగత యంత్రాంగాల పరిధిలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వారు అంగీకరించారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు.
మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో భారతీయ సమాజం ముఖ్యసభ్యులతో కూడా శ్రీ సంజయ్ సేథ్ సంభాషించారు.
***
(Release ID: 2128209)
Visitor Counter : 2