పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఐక్యరాజ్యసమితి అటవీ ఫోరం 20వ సమావేశంలో అటవీ సంరక్షణ, సుస్థిర అటవీ నిర్వహణలో తాను సాధించిన విజయాలను తెలిపిన భారత్
అంతర్జాతీయ పులుల సంరక్షణ కూటమిలో చేరాలని ఇతర దేశాలను ఆహ్వానించిన భారత్
Posted On:
09 MAY 2025 9:59AM by PIB Hyderabad
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 2025, మే 5 నుంచి 9 వరకు జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్స్ (యూఎన్ఎఫ్ఎఫ్20) 20 వ సమావేశంలో భారత్ పాల్గొంది.
అటవీ పరిరక్షణ, సుస్థిర అటవీ నిర్వహణలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని భారత్ వివరించింది. అలాగే అడవుల కోసం ఐక్యరాజ్యసమితి వ్యూహాత్మక ప్రణాళిక 2017-2030 ద్వారా వాలంటరీ నేషనల్ కంట్రిబ్యూషన్స్ (వీఎన్‌సీ)ను సాధించడంలో తనకున్న అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. అడవులు, చెట్లు విస్తరణలో స్థిరమైన పెరుగుదల నమోదవుతున్నట్టు భారత్ తెలిపింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ తాజా నివేదికలో అడవులు, చెట్లు భారత్ భౌగోళిక విస్తీర్ణంలో 25.17 శాతం మేర ఉన్నాయని తెలిపింది. ఆరావళి గ్రీన్ వాల్ కింద భూ పునరుద్ధరణ, గడచిన దశాబ్దంలో మడ అడవులు 7.86 శాతం పెరగడం, గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా 1.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పైగా అడవుల పెంపకం, ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ కోసం మొక్క) ద్వారా 1.4 బిలియన్ మొక్కలను నాటడం లాంటి కార్యక్రమాల ద్వారా భారత్‌లో అడవులు, చెట్ల విస్తరణలో వృద్ధి సాధ్యమైందని తెలిపింది.
సంయుక్త పరిశోధన, పరస్పర విజ్ఞాన సహకారం, సామర్థ్య నిర్మాణం ద్వారా ఏడు రకాల పెద్ద పులుల జాతులను సంరక్షించడానికి, భారత్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)లో చేరాల్సిందిగా యూఎన్ సభ్యదేశాలను భారత్ ఆహ్వానించడం ఈ సమావేశంలో కీలకమైన పరిణామం.
అటవీ అగ్నిప్రమాదాల తగ్గింపు, అటవీ గుర్తింపు ప్రధానాంశాలుగా 2023 అక్టోబర్‌లో భారత్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన కంట్రీ-లెడ్ ఇనీషియేటివ్ (సీఎల్ఐ) ఒప్పందాలపై అంతర్జాతీయంగా చర్యలు చేపట్టాలని భారతీయ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రియా దేశాలు చేపట్టిన సీఎల్ఐ కార్యక్రమాలను భారత్ ప్రశంసించింది. అదేవిధంగా ప్రాధాన్యమున్న అటవీ అంశాలకు మద్ధతు ఇవ్వడానికి సీఎల్ఐ ఒప్పందాలను అంతర్జాతీయ అధికారిక యంత్రాంగాలతో ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.
ఈ సమావేశాల్లోనే ‘‘క్షీణించిన అటవీ భూములను పునరుద్ధరించడం: సుస్థిర అటవీ నిర్వహణ, వాతావరణ స్థిరత్వం సాధించేందుకు భారత్ అనుసరిస్తున్న విధానం’’ అనే అంశంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని మన దేశం నిర్వహించింది. విధాన ఆవిష్కరణలు, వనరుల ఏకీకరణ, ప్రజల చురుకైన భాగస్వామ్యం, పర్యవేక్షణ-మదింపు కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా అటవీ పునరుద్దరణలో భారత్ అనుభవాలను ఈ కార్యక్రమం తెలియజేసింది. అంతర్జాతీయ అటవీ లక్ష్యాల దిశగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ సెషన్లో ప్రదర్శించారు.
అలాగే ‘‘జాతీయ విధానం, వ్యూహంలో అటవీ వ్యవస్థలకు ప్రాధాన్యం’’ అనే అంశంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, రాజస్థాన్, పులుల అభయారణ్యాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో కనుగొన్న అంశాల గురించి భారత ప్రతినిధులు పంచుకున్నారు. భూవాతావరణం నుంచి కార్భన్ డై ఆక్సైడ్‌ను తొలగించడం, నీటి సరఫరా, జీవవైవిధ్య పరిరక్షణ తదితర సేవలను అంచనా వేయడానికి సిస్టమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్-ఎకనామిక్ అకౌంటింగ్ (ఎస్‌ఈఈఏ), మిలీనియం ఎకో సిస్టమ్ అసెస్మెంట్ (ఎంఈఏ) లాంటి విధానాలను ఉపయోగించారు. మార్కెటేతర సేవల విలువను గుర్తించడంలో ఎదురవుతున్న సవాళ్లను అంగీకరిస్తూనే.. అటవీ నిర్వహణ, దీర్ఘకాలంలో పర్యారణ స్థిరత్వాన్ని సాధించేదుకుగాను పర్యావరణ వ్యవస్థ విలువను జాతీయ ప్రణాళికతో ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది.
యూఎన్ఎఫ్ఎఫ్20లో పాల్గొన్న భారత బృందానికి అటవీ శాఖ డైరెక్టర్ జనరల్, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ అవస్థి నేతృత్వం వహించారు.
***
(Release ID: 2127952)