రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తమపై దాడికి గట్టి జవాబు చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన ‘ప్రతిస్పందించే హక్కు’ను ఉపయోగించుకుంది: రక్షణ మంత్రి


కచ్చితత్వం, ముందుజాగ్రత్త, మానవత్వంతో కూడిన ప్రణాళికతో పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి చరిత్ర లిఖించిన సాయుధ బలగాలు

బిఆర్ఓకు చెందిన 50 మౌలికవసతుల ప్రాజెక్టులను వీడియో అనుసంధానం ద్వారా జాతికి అంకింతం చేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ఎనిమిది సరిహద్దు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచి, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడం కోసం మొత్తం రూ. 1,879 కోట్ల వ్యయంతో నిర్మితమైన ప్రాజెక్టులు

Posted On: 07 MAY 2025 5:50PM by PIB Hyderabad

"ఆపరేషన్ సిందూర్ ద్వారా, భారత్ తమ గడ్డపై జరిగిన దాడికి బదులిచ్చేందుకు తన 'ప్రతిస్పందించే హక్కు'ను ఉపయోగించుకుంది.. పాకిస్తాన్, పీఓకేలో ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను నాశనం చేయడానికి సాయుధ దళాలు కచ్చితత్వం, ముందుజాగ్రత్త, మానవత్వంతో వ్యవహరించి సరికొత్త చరిత్రను లిఖించాయి" అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని మానెక్‌షా సెంటర్‌లో జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) 66వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను నాశనం చేశామనీ, ఈ దాడిలో సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చిన సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు.

"మన సాయుధ దళాలు ఈరోజు ఏమి చేశాయో ప్రపంచమంతా చూసింది. ఈ చర్య చాలా ఆలోచనాత్మకంగా, ప్రణాళికకు అనుగుణంగా జరిగింది. ఉగ్రవాదుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో, వారి శిక్షణ శిబిరాలు, ఇతర మౌలిక సదుపాయాలకే ఈ దాడులు పరిమితం అయ్యాయి. యావత్ దేశం తరపున నేను మన సాయుధ బలగాలను అభినందిస్తున్నాను. దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిలో మరింత స్థైర్యాన్ని నింపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కూడా నేను అభినందిస్తున్నాను" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఓకు చెందిన వ్యూహాత్మక ప్రాముఖ్యం గల 30 వంతెనలు, 17 రహదారులు అలాగే మూడు ఇతర ప్రాజెక్టులు సహా మొత్తం 50 మౌలికవసతుల ప్రాజెక్టులను రక్షణ మంత్రి జాతికి అంకితం చేశారు. మొత్తం రూ. 1,879 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులు ఆరు సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లలో విస్తరించి ఉన్నాయి. ఇవి మారుమూల ప్రాంతాల్లో భారత భద్రతను, కనెక్టివిటీని, అభివృద్ధిని బలోపేతం చేయనున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలోనే, రికార్డు స్థాయిలో రూ. 5,600 కోట్ల విలువైన 161 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బీఆర్ఓ పూర్తి చేసింది, వీటిలో గత ఏడాది పూర్తయిన 111 ప్రాజెక్టులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో మొత్తం రూ. 13,743 కోట్ల వ్యయంతో 456 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బీఆర్ఓ పూర్తి చేసింది.

ఈరోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంపొందిస్తాయని, జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని అలాగే ఈ ప్రాంతాల ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహిస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. "ఈ ప్రాజెక్టులు రక్షణపరంగా సంసిద్ధతను పెంపొందించడంతో పాటు ఈ ప్రాంతాల్లో రవాణా, పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయన్నారు. ఇవి కేవలం మౌలిక సదుపాయాల ఆస్తులు మాత్రమే కాదు.. ఇవి ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.

బీఆర్ఓ పనుల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆధునిక రక్షణ సామర్థ్యం కేవలం ఆయుధాలపైనే కాకుండా దానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలపై కూడా ఆధారపడి ఉంటుందని రక్షణ మంత్రి తెలిపారు. "మీరు అత్యంత వేగవంతమైన ట్యాంక్ లు.. అత్యంత అధునాతన విమానాలను కలిగి ఉండవచ్చు, కానీ అవి అవసరమైన చోటికి సమయానికి చేరుకోలేకపోతే, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా, సరైన సన్నద్ధతతో ఉండేలా నిర్ధారించడంలో బీఆర్ఓ కీలక పాత్ర పోషిస్తుంది," అని వ్యాఖ్యానించిన రక్షణ మంత్రి, తెరవెనుక అలుపెరగని కృషితో జాతీయ భద్రతకు దోహదపడే బీఆర్ఓ కర్మయోగులను ప్రశంసించారు.

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సాయుధ దళాలకు కొత్త తరం మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఓ సన్నాహాలు యుద్ధ స్థాయిలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

సరిహద్దు ప్రాంత అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన రక్షణ మంత్రి, వ్యూహాత్మక ప్రాముఖ్యం గల ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంపొందించే సంకల్పానికి నిదర్శనంగా నిలిచే సెలా సొరంగ మార్గాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సరిహద్దు గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను వివరించిన ఆయన, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల కింద ప్రభుత్వం ప్రతిరోజూ 35 కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తూ కనెక్టివిటీని పెంచుతోందని తెలిపారు.

డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ (డీజీబీఆర్) లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ మాట్లాడుతూ, నానాటికీ పెరుగుతున్న బీఆర్ఓ జాతీయ ప్రాముఖ్యతను వివరించారు. అత్యంత సవాలుతో కూడిన భూభాగాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వ శాఖల ప్రాధాన్య ఎంపిక ఏజెన్సీగా ఈ సంస్థ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. జీఆర్ఈఎఫ్ సిబ్బంది, సాధారణ వేతన కార్మికులు సహా తమ సిబ్బంది శ్రేయస్సు, గౌరవం పట్ల బీఆర్ఓ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన, ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది శిక్షణ వ్యవహారాల, అణుఇంధన, అంతరిక్ష శాఖల సహాయమంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డే, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, మిజోరాం ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సింహా, లెఫ్టినెంట్ గవర్నర్ లదాఖ్ బ్రిగేడియర్ (డాక్టర్) బిడి మిశ్రా (రిటైర్డ్)లు వీడియో అనుసంధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

****


(Release ID: 2127620) Visitor Counter : 33