భారత ఎన్నికల సంఘం
2,300 మందికి పైగా క్షేత్ర స్థాయి ఎన్నికల అధికారులకు ఐఐఐడీఈఎంలో శిక్షణనిచ్చిన ఈసీఐ
Posted On:
07 MAY 2025 3:52PM by PIB Hyderabad
భారతీయ ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది...తమిళ నాడు, పుదుచ్చేరిలకు చెందిన క్షేత్ర స్థాయి ఎన్నికల సిబ్బందికి తమిళ భాషలో శిక్షణనిచ్చేందుకు నడుం బిగించింది. ఢిల్లీలోని ఐఐఐడీఈఎంలో ఏర్పాటు చేసిన ఈ మిక్స్‌డ్-బ్యాచ్ శిక్షణ కార్యక్రమంలో 293 మంది పాల్గొన్నారు. వారిలో 264 మంది బీఎల్ఓ సూపర్‌వైజర్లు, 14 మంది ఈఆర్ఓలు, ఇద్దరు డీఈఓలతోపాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) శ్రీ జ్ఞానేశ్ కుమార్ తన ప్రారంభోపన్యాసంలో ఎన్నికలకు సంబంధించిన విధులను నిర్వహించడంలో ఓటర్లకు, ఈసీఐకి మధ్య మొట్టమొదటి సమాచార వారధిగా ఉండేది బీఎల్ఓలే అన్నారు. సరైన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడంతోపాటు ఓటర్ల జాబితాలను తాజా స్థితికి తగ్గట్టు సవరించడంలో బీఎల్ఓలది కీలక పాత్ర అని ఆయన ప్రధానంగా చెప్పారు. దీనితో కలిపి, గత కొన్ని వారాలుగా ఐఐఐడీఈఎంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సుమారు 2,300 మంది సద్వినియోగ పరచుకొన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో దేశంలో ఒక లక్షమందికి పైగా బీఎల్ఓలు సహా అన్ని స్థాయిల ఎన్నికల సిబ్బందికీ విస్తృత శిక్షణనివ్వాలన్న ఉద్దేశానికి అనుగుణంగా ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఉంది.
బీఎల్ఓ సూపర్‌వైజర్లకు ఫారం 6, 7, 8లు సహా వేర్వేరు ఫారాలను ఖచ్చితత్వంతో నింపేలా చూడడానికి సంభాషణ ప్రధాన కార్యక్రమాల ద్వారాను, ఇతరత్రా పద్ధతుల్లోనూ శిక్షణనిస్తున్నారు. ఐటీ మాధ్యమం సేవల్ని ఉపయోగించడంలో ఆచరణపూర్వక శిక్షణను కూడా అందిస్తున్నారు. ఈ బీఎల్ఓ సూపర్‌వైజర్లను అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రయినర్లుగా తీర్చిదిద్దుతున్నారు. వీరు ఇతర బీఎల్ఓలకు శిక్షణను అందించాల్సి ఉంటుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 24 (ఎ)లో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం లేదా తత్సమాన శ్రేణికి చెందిన అధికారి)తోపాటు, ఇదే చట్టంలోని సెక్షన్ 24 (బీ)లో భాగంగా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ముఖ్య అధికారి (సీఈఓ) ద్వారా ప్రచురణ పూర్తి అయిన తుది ఓటర్ల జాబితాలకు వ్యతిరేకంగా ఒకటో అపీలు, రెండో అపీలుకు సంబంధించిన నిబంధనలపై ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అవగాహనను కల్పిస్తున్నారు.
(Release ID: 2127551)