సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ, భారతీయ కథకుల మధ్య ఒక వేదికగా సృజనాత్మక సమన్వయాన్ని మరింత పెంచిన వేవ్స్: నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరాండాస్
Posted On:
03 MAY 2025 3:56PM
|
Location:
PIB Hyderabad
ముంబయి లోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (వేవ్స్) లో మూడో రోజు నెట్ ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సారాండోస్ నటుడు సైఫ్ అలీఖాన్ తో చర్చలో పాల్గొన్న సందర్భంగా, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు భారత్ లో చిత్ర నిర్మాణాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.
"స్ట్రీమింగ్ ది న్యూ ఇండియా: కల్చర్, కనెక్టివిటీ అండ్ క్రియేటివ్ క్యాపిటల్" అనే అంశంపై జరిగిన ఈ సెషన్లో ప్రస్తుత డిజిటల్ యుగంలో కథ చెప్పే విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్ ప్రభావం, ప్రపంచ వినోద రంగంలో పెరుగుతున్న భారత్ స్థానం మొదలైన అంశాలపై చర్చ జరిగింది.
కథ చెప్పే కళ భవిష్యత్తు గురించి అడిగినప్పుడు, "కథ ఎటువైపు వెళ్తుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశం స్థిరంగా ఉంటుంది. కోవిడ్ తర్వాత భారత్ లో మా పెట్టుబడులు రెండు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక ప్రభావాన్ని సృష్టించాయి” అని టెడ్ సారండోస్ అన్నారు.
అదంతా కొత్తగా ఏర్పడిన ఉద్యోగాలు, అభివృద్ధి చేసిన నైపుణ్యాలు, మద్దతు ఇచ్చిన మౌలిక సదుపాయాల రూపంలోనే కనిపిస్తుంది. మేము భారత్‌లోని 23 రాష్ట్రాల్లో 100కు పైగా పట్టణాలు, నగరాల్లో చిత్రీకరణ జరిపాం. 25,000 మందికి పైగా స్థానిక నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాం" అని నెట్ ఫ్లిక్స్ సిఇఒ తెలిపారు.
ప్రముఖ వెబ్‌సిరీస్ సేక్రెడ్ గేమ్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌తో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ నటుడు సైఫ్ అలీ ఖాన్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల మార్పు సామర్ధ్యాన్ని వివరించారు. “ ఇంతకుముందు మేము కఠినమైన ఫార్మాట్లకు అనుగుణంగా పనిచేయాల్సివచ్చేది” అని ఆయన అన్నారు. స్ట్రీమింగ్ నటులను, చిత్రనిర్మాతలను ఆ పరిమితుల నుంచి విముక్తం చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సంప్రదాయ సినిమాల్లో కూడా చూడలేకపోయిన మన కథలను చూడవచ్చని ఆయన అన్నారు.
దేశంలో సినిమా నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని విపులంగా వివరిస్తూ “ప్రేక్షకులు ఎప్పుడైనా విభిన్నమైన కథలను వీక్షించగలగడం మాత్రమే కాదు, సృజనశీలులకు అవి చెప్పడానికి ఇప్పుడు మరింత స్వేచ్ఛ ఉంది. ఇది చూడటం–చేయడం అనే నిరంతర ప్రక్రియలా మారింది” అని ఆయన అన్నారు.
సినిమా, స్ట్రీమింగ్ ల పరస్పర సహజీవనం గురించి మాట్లాడుతూ టెడ్ సారండోస్, ధియేటర్లలో విడుదల ప్రాముఖ్యత ఇప్పటికీ ఉందని స్పష్టం చేశారు. “సినిమా హాళ్లు పాతబడిపోయినవి కావు. అలాగే స్ట్రీమింగ్, థియేటర్లు పరస్పర పోటీదారులు కాదు. ఇవి రెండూ కలిసి ముందుకు సాగవచ్చు, ఎందుకంటే మన ముందున్న మార్కెట్ చాలా విస్తృతమైనది” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ అభిప్రాయాన్ని సైఫ్ అలీ ఖాన్ సమర్థిస్తూ, తనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు భారతీయ సంస్కృతిలో భాగమైనవే అని అన్నారు. “విదేశాల్లో ఎవరికైనా నా సినిమాల గురించి అడిగితే, నేను ఓంకారా లేదా పరిణీతా వంటి చిత్రాల గురించి చెప్పుతాను — ఇవి మన సంస్కృతితో గాఢంగా అనుసంధానమైన సినిమాలు. మన కథలను ప్రపంచానికి చెప్పడంలో ఓ అనిర్వచనీయ ఉత్కంఠ ఉంటుంది” అని ఆయన తెలిపారు.
సారండోస్, సైఫ్ ఇద్దరూ వేవ్స్ సదస్సును ప్రపంచ, భారతీయ కథకుల మధ్య సృజనాత్మక సమన్వయాన్ని ప్రోత్సహించే అద్భుత వేదికగా అభివర్ణించారు. సారండోస్ ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ “ఇక్కడ ప్రతిపాదించిన ఆలోచనలు ఫలిస్తే, అవి ఊహకు మించి విజయం సాధిస్తాయి. అలాంటి ప్రభంజనానికి వేవ్స్ ఒక అద్భుతమైన వేదిక” అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దార్శనికులు, పరిశ్రమ నిపుణులను ఒకేచోట చేర్చి, చర్చలు, ఆవిష్కరణలు, సాంస్కృతిక మార్పిడుల ద్వారా వినోద పరిశ్రమ భవిష్యత్తును రూపుదిద్దే ప్రయత్నాన్ని వేవ్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగిస్తోంది.
***
Release ID:
(Release ID: 2126822)
| Visitor Counter:
5