సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ బజార్: ప్రపంచ స్థాయిలో సృజనాత్మక సహకారానికి మార్గదర్శక ఆరంభం
భారతదేశం నుంచి ప్రపంచానికి: ప్రపంచ వినోద రంగాన్ని కలిపే భారీ భాగస్వామ్యాలకు నాంది పలికిన వేవ్స్ బజార్: రూ 800 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నమోదు
Posted On:
03 MAY 2025 8:48PM
|
Location:
PIB Hyderabad
2025 మే 1 నుంచి 3 వరకు ముంబైలో జరిగిన వేవ్స్ బజార్ తొలి ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. సృజనాత్మక రంగాల్లో అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాలకు ఇది ప్రముఖ వేదికగా నిలిచింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ( వేవ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మార్కెట్ విభాగంలో సినిమాలు, సంగీతం, రేడియో, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాల్లో 800 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి. ఒప్పందాలు ఇంకా కొనసాగుతుండటంతో, మొత్తం విలువ మరి కొన్ని రోజుల్లో 1000 కోట్ల రూపాయలను మించవచ్చని అంచనా.
ప్రధాన అంశాలు
వేవ్స్ బజార్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కొనుగోలుదారులు- అమ్మకందారుల మార్కెట్ లో 3,000 పైగా బి2బి సమావేశాలు జరిగాయి. రూ.500 కోట్లు పైగా ఆదాయాన్ని రాబట్టింది. అలాగే వచ్చే రోజుల్లో మరిన్ని ఒప్పందాలు ఖరారు కావచ్చని అంచనా వేస్తున్నారు. 80 సీట్ల స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్రాల ప్రదర్శనకు విశేష స్పందనలు, ఎంపికైన సినిమాలకు ప్రశంసలు లభించాయి. ప్రతిభావంతులైన సృష్టికర్తలను తమ ఐపీలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారుల, భాగస్వాముల ముందు ప్రదర్శించడంలో బజార్ సహాయపడింది, ఇది గణనీయమైన ఆసక్తిని సృష్టించి, కొత్త భాగస్వామ్యాలను పెంపొందించింది.
భారత్ - న్యూజీలాండ్ మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యాలలో ఒక ప్రధాన పురోగతిగా, ఫిల్మ్ ఇండియా స్క్రీన్ కలెక్టివ్, పెట్రీనా డి’రోజారియో నేతృత్వంలోని స్క్రీన్ కాన్టబరీ ఎన్ జెడ్ కలసి వేవ్స్ నుంచి ప్రేరణ పొందిన ఒక భాగస్వామ్య ప్రతిపాదనను ప్రకటించాయి. ఈ ప్రతిపాదన ప్రకారం న్యూజీలాండ్‌లో తొలి భారతీయ చలనచిత్రోత్సవం ప్రారంభిస్తారు. ఇది రెండు దేశాల మధ్య పర్యాటక, సాంస్కృతిక మార్పిడి, కో ప్రొడక్షన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది.
భారత్-రష్యా సహకారం దిశగా ఒన్లీ మచ్ లౌడర్ (ఓఎమ్ఎల్) సీఈఓ తుషార్ కుమార్, గజ్‌ప్రామ్ మీడియా సీఈఓ అలెక్సాండర్ జరోవ్ వివిధ సాంస్కృతిక ఉత్సవాలపై సహకరించే ఒప్పందం గురించి ముందస్తు చర్చలు చేపట్టారు. ఈ చర్చలు రష్యా లోనూ, భారత్ లోనూ హాస్య, సంగీత ప్రదర్శనలను కలిసి నిర్వహించడంపై దృష్టి పెట్టాయి.
ప్రధాన ఒప్పందాల ప్రకటనలు
ప్రైమ్ వీడియో, సిజె ఇఎన్ఎం మధ్య బహుళ శతాబ్ది సహకారాన్ని ప్రకటించడం బజార్‌లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం కొరియన్ కంటెంట్ ను పంపిణీ చేసేందుకు ఉద్దేశించారు. 2025 జూన్‌లో హెడ్ ఓవర్ హీల్స్ ద్వారా ప్రారంభమయ్యే ఈ ఒప్పందం, 240 పైగా దేశాల్లో స్ట్రీమింగ్‌ను కలిగి ఉంటుంది, ఇందులో 28 ఉపశీర్షిక భాషలు, 11 డబ్బింగ్ వెర్షన్లు ఉంటాయి. ఈ ప్రణాళిక, ప్రపంచ స్ట్రీమింగ్ వేదికలపై పెరుగుతున్న ఆసియా సృజనాత్మక ప్రాతినిధ్యాన్ని చాటిచెబుతుంది.
బజార్‌కు విలువను చేకూర్చిన మరో ముఖ్యమైన అంశం దేవీ చౌధురాణి సినిమా ప్రకటన. ఇది భారతదేశ తొలి అధికారిక ఇండో-యూకే సంయుక్త నిర్మాణంగా నిలుస్తుంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఎన్ఎఫ్డిసి, ఎఫ్పిఓ, ఇన్వెస్ట్ ఇండియా మద్దతుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రీ-టీజర్‌ను బజార్‌లో ఆవిష్కరించారు. సన్యాసి-ఫకీర్ తిరుగుబాటు కాలాన్ని ఆధారంగా చేసుకున్న ఈ చారిత్రక చిత్రంలో ప్రొసేన్ జిత్ చటర్జీ, స్రబంతి చటర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని పండిట్ బిక్రమ్ ఘోష్ అందిస్తున్నారు.
‘వయొలేటెడ్‘ అనే ఫీచర్ ఫిల్మ్ ప్రారంభాన్ని ప్రకటించడం కూడా వేవ్స్ బజార్ లక్ష్యాన్ని సమర్థించే మరో ప్రయత్నం. సాహసోపేత మానసిక థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, డింపుల్ దుగర్ తొలి దర్శకత్వ చిత్రంగా ముద్ర వేసుకుంది. మహిళా ఆధిపత్య ప్రాధాన్యత గల కథనంతో ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని యూకేకి చెందిన ఫ్యూషన్ ఫ్లిక్స్, జెవీడి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా డింపుల్ దుగర్ వాణిజ్య విభాగం నుంచి ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలోకి దూసుకెళ్లిన మార్గాన్ని సూచిస్తుంది.
ప్రభావవంతమైన ఆరంభంతో, వేవ్స్ బజార్ ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక సహకారం కోసం ఒక కేంద్రంగా నిలిచింది. అంతేకాకుండా ఇది సరిహద్దులను దాటిన కథలు చెప్పే కొత్త యుగానికి, చిత్రపరిశ్రమలో మార్పుకు వేదికను సృష్టించింది.
ఎప్పటికప్పుడు తక్షణ అధికారిక సమాచారం కోసం మమ్మల్ని అనుసరించండి:
‘ఎక్స్‘ పై
https://x.com/WAVESummitIndia
https://x.com/MIB_India
https://x.com/PIB_India
https://x.com/PIBmumbai
ఇన్‌స్టాగ్రామ్ పై https://www.instagram.com/wavesummitindia
https://www.instagram.com/mib_india
https://www.instagram.com/pibindia
***
Release ID:
(Release ID: 2126652)
| Visitor Counter:
8