సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025 బ్రేక్ అవుట్ సెషన్: భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక కేంద్రంగా మధ్యప్రదేశ్
Posted On:
03 MAY 2025 3:10PM
|
Location:
PIB Hyderabad
“డిజిటల్ డ్రీమ్స్ అండ్ సినిమాటిక్ విజన్స్ - తదుపరి సృజనాత్మక కేంద్రంగా మధ్యప్రదేశ్” పేరుతో ఒక ఉన్నత స్థాయి బ్రేకౌట్ సెషన్ ను ఈరోజు వేవ్స్ 2025లో నిర్వహించారు. ఈ సెషన్‌ను వెరైటీ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ నామన్ రామచంద్రన్ మోడరేట్ చేశారు.
ప్రముఖ నిర్మాత, దర్శకురాలు ఏక్తా కపూర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్ టూరిజం పాలసీ 2025ని అధికారికంగా ప్రారంభించారు. ఇదే సెషన్లో ఎవిజిసి ఎక్స్ఆర్ పాలసీ 2025తో పాటు మధ్యప్రదేశ్ ఫిల్మ్ సెల్ పోర్టల్ రెండో దశను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏక్తా కపూర్ మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ ప్రాంతాన్ని ఎంపిక చేసే సమయంలో రాయితీలు, అనుమతులు పొందడంలో సౌలభ్యం, దృశ్య పరమైన అందాలు, షూటింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు వంటి అంశాలు అత్యంత ముఖ్యమని చెప్పారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ షియో శేఖర్ శుక్లా మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు గుండెగా నిలిచిందని, అదే విధంగా ఇది వేగంగా చిత్ర నిర్మాతల గుండెగా కూడా మారుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో షూటింగ్‌కు అనుకూలమైన వాతావరణం, ఘనమైన చరిత్ర, వారసత్వం, అలాగే ప్రతిభావంతులు ఉన్నారని ఆయన తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఆర్థిక ప్రోత్సాహక విధానాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అనుమతుల కోసం ఏర్పాటయిన సరళీకృత సింగిల్ పోర్టల్ వ్యవస్థ షూటింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. 2.0 పాలసీ లో పెంచిన ప్రోత్సాహకాలు, పునరావృత షూటింగ్ కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. స్థానిక భాషలు, స్థానిక ప్రతిభను ఉపయోగించే చిత్రాలకు, అలాగే మధ్యప్రదేశ్‌లో షూటింగ్ చేసే ఇతర భారతీయ భాషల చిత్రాలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిత్రనిర్మాణాన్ని ప్రోత్సహించే మార్గంలో రాష్ట్రాన్ని బ్రాండ్ చేయడం ద్వారా ముంబయికి గట్టి పోటీనివ్వాలని మధ్యప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, డీఎస్టీ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ దూబే మాట్లాడుతూ, కొత్త ఏవీజీసీ విధానం ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్లకు తోడ్పడుతుందని, యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ ఎక్స్ వంటి సంబంధిత రంగాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. చిత్రనిర్మాతలకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రభుత్వ చురుకైన, రిస్క్ తీసుకునే విధానాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు.
క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ సీఈఓ, ప్రముఖ నిర్మాత శోభా సంత్ మాట్లాడుతూ... స్థానిక ప్రతిభ, సాంకేతిక నిపుణులతో మధ్యప్రదేశ్ లో చిత్రీకరించిన స్త్రీ 2 చిత్రం అనుభవాలను పంచుకున్నారు. అలాగే, లయన్, ఎ సూటబుల్ బాయ్ వంటి అంతర్జాతీయ చిత్రాలను కూడా రాష్ట్రంలోనే చిత్రీకరించారని ఆమె ఉదాహరించారు. రానున్న ఆస్ట్రేలియన్ సంయుక్త నిర్మాణ చిత్రం కూడా మధ్యప్రదేశ్‌ను తన చిత్రీకరణ ప్రదేశంగా ఎంచుకుంది. మధ్యప్రదేశ్‌లో షూటింగ్ చేసిన బృందాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, “ఒకసారి మధ్యప్రదేశ్‌కి వచ్చిన వారు, మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు” అని శోభా సంత్ పేర్కొన్నారు.
ప్యానెల్‌లో ఉన్న ఇతర ప్రముఖులలో ఆగస్ట్ మీడియా గ్రూప్ సీఈఓ జ్యోతిర్మయ్ సాహా మాట్లాడుతూ – కొత్త విధానాలు రాష్ట్రవ్యాప్తంగా సృజనాత్మక కేంద్రాల ఏర్పాటుకు ప్రేరకశక్తిగా పనిచేస్తాయని తెలిపారు. ఫిక్కీ, ఏవీజీసీ విభాగం చైర్మన్ ఆశిష్ కులకర్ణి మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ ఆకర్షణలలో భాగంగా అక్కడి వంటకాలు, గిరిజన మ్యూజియం గ్లోబల్ స్కిల్స్ పార్క్ వంటి ప్రత్యేకతల గురించి ప్రస్తావించారు.
***
Release ID:
(Release ID: 2126560)
| Visitor Counter:
8