సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినీ ప్రముఖులందరినీ ఒక్కచోటికి తెచ్చి భారతీయ సినిమా అంతర్జాతీయ విస్తృతిని చర్చించిన వేవ్స్-2025
సినీ రంగంపై ప్రభుత్వం ఇంత శ్రద్ధ కనబరచడం తొలిసారి చూస్తున్నాను: ఆమిర్ ఖాన్
వేవ్స్ కేవలం చర్చ మాత్రమే కాదు - ఇది విధానానికి వారధి.. ఇది ఆశాజనకమైన ఆరంభం: ఆమిర్ ఖాన్
Posted On:
02 MAY 2025 8:42PM
|
Location:
PIB Hyderabad
వివిధ దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్ల ద్వారా భారతీయ సినిమా వీక్షణ పరిధిని విస్తృతం చేయడంపై దేశంలోని దర్శకులు, నిర్మాతలు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రఖ్యాత నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. ‘స్టూడియోస్ ఆఫ్ ది ఫ్యూచర్: పుటింగ్ ఇండియా ఆన్ వరల్డ్ స్టూడియో మ్యాప్’ పేరిట నిర్వహించిన నిపుణుల బృంద చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)- 2025 రెండో రోజైన శుక్రవారం నాడు జియో వరల్డ్ సెంటర్‌లో ఈ చర్చను నిర్వహించారు.
సినీ విమర్శకుడు మయాంక్ శేఖర్ సంధానకర్తగా వ్యవహరించిన ఈ సదస్సు సినీ తారలు, ప్రముఖులందరినీ ఒకే వేదికపైకి చేర్చింది. నిర్మాత రితేష్ సిధ్వానీ, ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్‌కు చెందిన నమిత్ మల్హోత్రా, సినీ నిర్మాత దినేశ్ విజన్, పీవీఆర్ సినిమాస్ అజయ్ బిజిలీ, ప్రఖ్యాత అమెరికన్ నిర్మాత చార్లెస్ రోవెన్ చర్చలో పాల్గొన్నారు.
భారతీయ సినిమాలకు గల అపారమైన అవకాశాలపై మాట్లాడుతూ.. మొదటి నుంచే అంతర్జాతీయ పరిధిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరముందని ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించారు.
థియేటర్లు, ఓటీటీల్లో విడుదల మధ్య చాలా తక్కువ వ్యవధి మాత్రమే ఉండడం వల్ల అది ధియేటర్లలో సినిమాల వీక్షణను ఎలా తగ్గిస్తున్నదీ ఓటీటీపై చర్చ సందర్భంగా ఆమిర్ ఖాన్ వివరించారు.
థియేటర్‌లో సినిమా ఎన్నటీ బలంగానే నిలిచి ఉంటుందని గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘ఓపెన్ హైమర్’ నిర్మాత చార్లెస్ రోవెన్ స్పష్టం చేశారు. ‘‘టీవీ, ఓటీటీ వేదికలు విస్తరిస్తున్నప్పటికీ థియేటర్‌లో సినిమా చూసిన అనుభవాన్ని ఏదీ భర్తీ చేయలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం దేశీయంగానే పరిమితం కాకుండా, అంతర్జాతీయ పరిధిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను రూపొందించాలని భారతీయ చిత్రకారులకు చార్లెస్ రోవెన్ సూచించారు.
దినేశ్ విజన్ మాట్లాడుతూ ప్రామాణికమైన కథనం, అంతర్జాతీయ చిత్రకారులతో (స్టూడియోలు) సహకారం అత్యంత ప్రధానమైన అంశమన్నారు. “ఇది బడ్జెట్లకు సంబంధించినది మాత్రమే కాదు” అన్నారు. “చిన్న నగరాలు సినిమాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే, మనం ప్రపంచవ్యాప్తం కావాలంటే- నాణ్యమైన కంటెంట్, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెట్టాలి.”
కథనాన్ని మెరుగుపరచడంలో, భారతీయ ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను చేరుకోవడంలో సాంకేతికత, అందునా ఏఐ వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని నమిత్ మల్హోత్రా అన్నారు.
ఓటీటీ వేదికల ద్వారా అవకాశాలు విస్తృతమవుతున్నాయని రితేశ్ సింధ్వానీ పేర్కొన్నారు. “ఓటీటీ ద్వారా భారతీయ కంటెంటును ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. “ఫార్మాట్, కథనాలతో ప్రయోగాలకు ఇది వీలు కల్పిస్తుంది.”
కోవిడ్ తర్వాత ధియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గడంపై అజయ్ బిజిలీ ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లు, డిజిటల్ వేదికల్లో విడుదలల మధ్య వ్యవధిని సమన్వయంతో నిర్వహించడం చాలా ముఖ్యమైదని, దీని ద్వారా రెండింటి ద్వారా కొంత ఆర్జనకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
తగిన విధంగా లిప్ సింక్‌లను అందించడం ద్వారా భాషాపరమైన అవరోధాలను అధిగమించడానికి సాంకేతికత ఉపయోగపడుతుందని కూడా దినేశ్ విజన్ తెలిపారు. విస్తృతంగా ప్రేక్షకులను చేరడంతోపాటు స్థానిక నిర్దిష్టతకు అవకాశాన్నిస్తుంది.
ఈ కీలకమైన సమయంలో ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలదన్న చర్చతో ముగించారు. వేవ్ సదస్ససు సందర్భంగా ఆమిర్ ఖాన్ ఇలా వ్యాఖ్యానించారు: - “మన పరిశ్రమపై ఓ ప్రభుత్వం ఇంతలా శ్రద్ధ కనబరచడం మొదటిసారిగా చూస్తున్నాను. వేవ్స్ కేవలం చర్చ మాత్రమే కాదు – ఇది విధానం దిశగా వారధి. ఇదో ఆశాజనకమైన ఆరంభం. మన చర్చలు విధానాల రూపాన్ని సంతరించుకుంటాయన్న దృఢమైన నమ్మకం నాకుంది’’.
***
Release ID:
(Release ID: 2126535)
| Visitor Counter:
6