సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్-1: భారత్ సృజనాత్మక భవితకు రూపకల్పన
· క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ కింద 32 సృజనాత్మక పోటీల విజేతలకు వేవ్స్-2025 సత్కారం.. 60కిపైగా దేశాల నుంచి తుది దశకు ఎంపికైన 750 మందికిపైగా పోటీదారులు ఆవిష్కరణాత్మక ప్రతిభా ప్రదర్శనకు సిద్ధం · ఈ ప్రయాణం ఇప్పుడే ఆరంభం.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలతో భారత సృజనాత్మక మేధ సాధికారతకు మేం నిబద్ధతతో ఉన్నాం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ · సాంకేతికతతో సృజనాత్మకత మేళవింపులో యువ మేధావుల నైపుణ్య ప్రదర్శనకు ఇదొక చక్కని ఉదాహరణ: కేంద్ర సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్
Posted On:
02 MAY 2025 8:08PM by PIB Hyderabad
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 (వేవ్స్)లో భాగంగా ప్రపంచవ్యాప్త సృష్టికర్తలను ఎంతగానో ఆకర్షించి, వారి కల్పనా నైపుణ్యాన్ని ఒడిసిపట్టిన ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సిఐసి) సీజన్-1 ముగింపు వేడుక ‘వేవ్స్’ వేదికపై ఆనందోత్సాహాల నడుమ సమాప్తమైంది. ఆ మేరకు భారత సృజనాత్మక రంగంలో ఇదొక కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా మీడియా-వినోద పరిశ్రమలో భాగమైన “యానిమేషన్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్ నుంచి ఏఐ, సంగీతం, డిజిటల్ ఆర్ట్” వరకూ అన్ని విభాగాల్లో నిర్వహించిన 32 విభిన్న పోటీల విజేతలు ఘన సంత్కారం పొందారు.
ఈ కార్యక్రమంలో యువ సృష్టికర్తలు, దార్శనికులనుద్దేశించి కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగిస్తూ- ఇదొక చారిత్రక ఘట్టమని వ్యాఖ్యానించారు. “సృజనాత్మకతను ప్రత్యేకంగా గుర్తించి పురస్కార ప్రదానం చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దీంతో మీరిక సరికొత్త అవకాశాల ప్రపంచంలో అడుగు పెడతారు. ఆవిష్కరణలకు, వ్యక్తీకరణకు బలమైన పునాది వేయడంలో భాగంగా సృజనాత్మకత శిక్షణ కోసం ‘ఐఐటి’ తరహాలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసిటి)ని కూడా మేం ప్రారంభిస్తున్నాం” అని ఆయన ప్రకటించారు.
అనంతరం సమాచార-ప్రసారశాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ- యువతరం గతిశీల శక్తిసామర్థ్యాలను, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రస్తుతిస్తూ వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు “మీకందరికీ నా శుభాకాంక్షలు. సాంకేతికతతో సృజనాత్మకత మేళవింపులో యువ మేధావుల నైపుణ్య ప్రదర్శనకు ఈ వేదిక ఓ చక్కని ఉదాహరణ. ఇది నారీశక్తి బలంతోపాటు భారతీయ కంటెంట్ సృష్టి భవితను కూడా ప్రతిబింబిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు తన ప్రసంగంలో ‘సిఐసి’ పరిణామం గురించి వివరించారు. “నిరుడు ఆగస్టులో మేమీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినపుడు మీడియా-వినోద రంగాల పరిధిలో పోటీల సంఖ్య 25గా ఉంది. అయితే, సెప్టెంబరులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ‘సిఐసి’ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. దీంతో ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా పోటీల సంఖ్య కూడా 32కు పెరిగింది. వీటన్నిటిలో పాల్గొనేందుకు యువత ఉత్సాహం ఫలితంగా మాకు లక్షకుపైగా దరఖాస్తులు అందాయి. ఆ భారీ సంఖ్య నుంచి నేడు 750 మంది తుదిదశకు ఎంపికయ్యారు. అయితే, వీరిలో ప్రతి ఒక్కరూ విజేతలే” అని ఆయన అభివర్ణించారు.
వర్ధమాన ప్రతిభావంతుల వికాసానికి ఒక అంతర్జాతీయ వేదిక రూపకల్పన, యువ మేధావుల శక్తిమంతమైన సృజనా ప్రదర్శన లక్ష్యంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం రూపొందింది. దీనికింద పోటీలు వివిధ విభాగాలకు విస్తరించాయి. తద్వారా వివిధ రకాల మీడియాలలో అన్వేషణ, అవధులు మించిన నైపుణ్య ప్రదర్శనకు అవకాశం కల్పించారు. ఈ మేరకు యానిమే ఛాలెంజ్ నుంచి ఏఐ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ సహా ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ వరకూ ప్రతి విభాగంలో ప్రపంచవ్యాప్త సృష్టికర్తలు, సాంకేతిక నిపుణులు, కథకులను ఇది ఒకే వేదికపైకి చేర్చి, వినూత్న ప్రతిభా వ్యక్తీకరణను ప్రోత్సహించింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా ‘సిఐసి’ గణనీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మేరకు 60కిపైగా దేశాల నుంచి 1,100 మంది అభ్యర్థులు సహా దరఖాస్తులు వెల్లువెత్తడమే ‘సిఐసి’ ప్రపంచవ్యాప్త విజయానికి నిదర్శనం. సృజనాత్మకత, సాంకేతికతల సమ్మేళనం సహా వినూత్న-ప్రభావశీల కొత్త రకం మాధ్యమాల రూపకల్పనకు అవకాశాలకు నిరంతరం పెరిగే డిమాండ్‌ను ఈ విశేష ప్రతిస్పందన స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పరిశ్రమ దిగ్గజాలైన ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, అక్కినేని నాగార్జున, విక్రాంత్ మాసే, ప్రసూన్ జోషి, అరూణ పురీ వంటివారు సహా ఇతర ప్రముఖులు, అధికారుల చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది.
పరిశ్రమలోని ప్రముఖ సంస్థల సహకారంతో ఈ 32 రకాల పోటీలను నిర్వహించారు. దీంతో విస్తృత సృజనాత్మక విభాగాలు, సాంకేతికత ఆధారిత ప్రాజెక్టులు, భవిష్యత్ సంసిద్ధ కంటెంట్‌ను ఒకే వేదికపైకి చేర్చడం ద్వారా ‘సిఐసి’ తన సంపూర్ణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేయగలిగింది.
ప్రపంచ వినోద-సాంకేతికావరణ వ్యవస్థలో భారత్ స్థానాన్ని పునర్నిర్వచించగల భవిష్యత్తరం సృష్టికర్తలకు ఈ కార్యక్రమం ఒక ప్రయోగవేదికగా ఉపయోగపడింది. స్వదేశీ ప్రతిభకు పదును పెట్టడం, వివిధ మాధ్యమ రూపాల్లో వినూత్న కంటెంట్ సృష్టికి గుర్తింపునివ్వడంలోగల ప్రాధాన్యానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది.
***
(Release ID: 2126533)
|