సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజనతో చేరిన ఏఐ: వేవ్స్ 2025 వేదికగా భవిష్యత్తు డిజిటల్ వ్యక్తీకరణలో భారత్ పాత్రను వివరించిన పరిశ్రమ ప్రముఖులు
“ఏఐ ఉద్యోగాలకు ముప్పు కాదు.... లక్ష్యసాధనకు మార్గం” – రిచర్డ్ కెర్రీస్, ఎన్విడియా
“సృజనాత్మకతతో ప్రతి రంగంలో మార్పు వచ్చింది.” – శంతను నారాయణ్, అడోబ్
Posted On:
01 MAY 2025 8:52PM
|
Location:
PIB Hyderabad
కృత్రిమ మేధస్సు చర్చల కేంద్రంగా, ఆవిష్కరణ, సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతికతల కలయికకు వేవ్స్ 2025 వేదికగా నిలిచింది. ముంబయిలో ఈరోజు సమ్మిట్ ప్రారంభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గల పరిశ్రమ ప్రముఖుల నేతృత్వంలో జరిగిన మూడు సమావేశాలు, మీడియా, కథలు చెప్పడం, డిజిటల్ ప్రొడక్షన్ రంగాలతో ఏఐకి గల అనుబంధాన్ని వివరించాయి.. ఈ సృజనాత్మక-సాంకేతిక పరిణామంలో పెరుగుతున్న భారత స్థాయిని పునరుద్ఘాటించాయి.
“సృజనాత్మకతతో ప్రతి రంగంలో మార్పు వచ్చింది.” – శంతను నారాయణ్, అడోబ్
"ఏఐ యుగంలో డిజైన్, మీడియా, సృజనాత్మకత" అనే అంశంపై కీలకోపన్యాసం చేసిన అడోబ్ ఛైర్మన్, సీఈఓ శంతను నారాయణ్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న సృజనాధారిత ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణ అందించారు. ఇంటర్నెట్ నుంచి మొబైల్‌కు అలాగే ఇప్పుడు కృత్రిమ మేధస్సుకు పురోగమిస్తున్న డిజిటల్ ప్రయాణాన్ని వివరిస్తూ, 50 కోట్ల మందికి పైగా భారతీయులు ఆన్‌లైన్ కంటెంట్‌ను వినియోగిస్తున్నారని, ప్రాంతీయ భాషల దిశగా గణనీయమైన మార్పు వచ్చిందని నారాయణ్ వెల్లడించారు.
ఏఐ సృజనాత్మకతను నాశనం చేయడంలేదనీ, దానిని విస్తృతం చేస్తోందని ఆయన స్పష్టం చెప్పారు. "భారత సృజనకారులు సంప్రదాయిక మాధ్యమాలను మించి ముందుకు సాగేందుకు జనరేటివ్ ఏఐ వీలు కల్పిస్తోంది" అని ఆయన అన్నారు. ఇమేజింగ్, వీడియో, డిజైన్ రంగాల్లో విభిన్నంగా కథలు చెప్పడానికి ఇది ఎలా మద్దతు ఇస్తుందో వివరించారు. సినిమా నుంచి రియల్-టైమ్ మొబైల్ స్టోరీ టెల్లింగ్ వరకు, సృజనాత్మక సామర్థ్యం విస్తరిస్తోందన్నారు.
అప్లికేషన్ల నుండి డేటా మౌలిక సదుపాయాల వరకు ఏఐ-ఆధారిత విధానాల రూపకల్పనలో భారత ప్రత్యేక స్థానాన్ని స్పష్టం చేసిన నారాయణ్... సృజనాత్మకతను, ఉత్పాదకతను క్రియాశీలం చేయడం, వ్యాపార నమూనాలను ఆవిష్కరించడం, ఏఐ- నైపుణ్యాలు గల సిబ్బందితో ముందుకుసాగడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం వంటి నాలుగు అంచెల వ్యూహాన్ని వివరించారు. వేవ్స్ వంటి దార్శనిక వేదికను రూపొందించిన భారత ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
“ఏఐ ఉద్యోగాలకు ముప్పు కాదు... లక్ష్యసాధనకు మార్గం” – రిచర్డ్ కెర్రీస్, ఎన్విడియా
"ఏఐ బియాండ్ వర్క్" శీర్షికతో ఆలోచింపజేసే, ఆసక్తికరమైన సంభాషణల ద్వారా, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ కెర్రిస్, ఎన్విడియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ ధూపర్, వ్యక్తిగత కంప్యూటింగ్, సృజనాత్మక ఉత్పాదకతను ఏఐ ఎలా పునర్నిర్వచిస్తుందో వివరించారు.
పీసీ యుగ పరిణామాన్ని వివరిస్తూ, ధూపర్ ఇలా వ్యాఖ్యానించారు, "ఆఫీసు పనివేళల తర్వాత పీసీలు విశ్రాంతి తీసుకునేవి. కానీ మానవులకు విశ్రాంతి లేకపోయేది." పీసీలను సృజనాత్మక సహచరులుగా భావించడమనే ఎన్విడియా ప్రాథమిక భావనను వివరించిన ఆయన... నేటి ఏఐ ఆధారిత ప్రపంచంలో దాని ప్రభావాన్ని వివరించారు.
గతంలో 3డీ యానిమేషన్‌ను నేర్చుకోవడంలో ఉన్న సంక్లిష్టతలను గుర్తు చేసుకుంటూ కెర్రిస్ ఒక చారిత్రక దృక్పథాన్ని వివరించారు. "ఇప్పుడు, జనరేటివ్ ఏఐతో మన ఆలోచన నుంచి సృజన వరకు చాలా వేగంగా వెళ్ళవచ్చు" అన్నారు. అయినప్పటికీ, ప్రాథమిక అంశాలతో సంబంధాన్ని కోల్పోకూడదని హెచ్చరించిన ఆయన, "మనందరికీ మన ఫోన్‌లో కెమెరా ఉండడం మనందరినీ గొప్ప ఫోటోగ్రాఫర్లుగా చేయదు." అనే వాస్తవాన్ని ఉటంకించారు.
ఏఐ మానవ సృజనాత్మకతను భర్తీ చేయడానికి బదులుగా దానిని మరింత మెరుగుపరుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. "ఏఐ మీ చేతుల్లో సాధనాలను ఉంచుతుంది... ఎలా పని చేయాలో తెలియడం, ఇతర ప్రాథమిక అంశాలను తెలుసుకోవడం ఇప్పటికీ అవసరమే" అని కెర్రిస్ స్పష్టం చేశారు. "సృజనాత్మకత గల వ్యక్తులు ప్రాణం పెట్టి పని చేస్తారు. ఏఐ దానిని భర్తీ చేయలేదు. అది ఆ పనిలో సహాయం మాత్రమే చేస్తుంది." అంటూ ధుపర్ తన ప్రసంగాన్ని ముగించారు.
“జనరల్ ఏఐతో కథలకు జీవం పోయడం” — అనీష్ ముఖర్జీ, ఎన్విడియా
మూడో సమావేశంలో నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో... ఎన్విడియాలో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌గా ఉన్న అనీష్ ముఖర్జీ మాట్లాడుతూ మీడియాలో జనరేటివ్ ఏఐ ఆచరణాత్మక అనువర్తనాల గురించి అద్భుతంగా వివరించారు. “జనరేటివ్ ఏఐతో కథలకు ప్రాణం పోయడం” అనే శీర్షికతో సాగిన ఈ సమావేశం... హార్డ్‌వేర్‌ను మించి పరివర్తన సాధనాల దిశగా సాగే ఎన్విడియా ప్లాట్‌ఫామ్ విధానంపై ప్రధానంగా దృష్టి సారించింది.
స్టాటిక్ చిత్రాలను డిజిటల్ మానవులుగా మలచడం, బహుభాషా వాయిస్-ఓవర్లు, ఆడియో-ఆధారిత క్యారెక్టర్ యానిమేషన్ వంటి ఏఐ-ఆధారిత పరిష్కారాలను ముఖర్జీ వివరించారు. ఎన్విడియా ఫుగాటో మోడల్‌ను ఉపయోగించి... ఏఐ ద్వారా సంగీతం, డబ్బింగ్ ప్రక్రియలో వాస్తవిక లిప్-సింకింగ్‌ను ఆయన ప్రదర్శన ద్వారా చూపించారు. ఓమ్నివెర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా వీడియో జనరేషన్, సిమ్యులేషన్-ఆధారిత శిక్షణ కోసం ప్రాథమిక నమూనాల సూట్ అయిన కాస్మోస్‌ను కూడా ముఖర్జీ పరిచయం చేశారు.
ఏఐ యానిమేషన్, డిఎల్ఎస్ఎస్లతో అతిపెద్ద భాషా నమూనాలను మిళితం చేసే ప్రక్రియను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గేమ్ రూపకల్పనలో లీనమయ్యేలా కథను చెప్పే అనుభవాలను సృష్టించడంలో వాటి పాత్రను ఆయన వివరించారు. "ఆటగాళ్ల కోసం తెలివిగా స్పందించే ఏఐ- ఆధారిత పాత్రలు లీనమయ్యే విధంగా కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించాయి" అని ఆయన పేర్కొన్నారు.
కంప్యూటర్ సామర్థ్యం, సమృద్ధిగా సమాచారం గల డేటాసెట్లు, అల్గారిథమ్‌ల శక్తిని ఉపయోగించి జనరేటివ్ ఏఐ పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ముఖర్జీ తన ప్రసంగాన్ని ముగించారు. అవసరానికి అనుగుణంగా మోడళ్లను రూపొందించడంలో సృజనకారులకు సాధికారత కల్పించే నెమోస్టాక్ సహా ఎన్విడియా ఓపెన్-సోర్స్ వ్యవస్థ ఈ రంగంలో ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకువెళుతుంది.
వేవ్స్ 2025: ఏఐ నేతృత్వంలో విప్లవాత్మకమైన సృజనాత్మక మార్పులకు వేదికను సిద్ధం చేయడం
ఈ సమావేశాల్లో కొనసాగిన చర్చలు ఏఐ ప్రత్యామ్నాయం కాదు... సాధికారతకు ఒక సాధనం అనే ఒక ఏకీకృత సందేశాన్ని అందించాయి. డిజైన్, సినిమా, యానిమేషన్, కథ చెప్పడం వంటి రంగాల్లో ప్రాథమిక అంశాలను అర్థం చేసుకుని, సరికొత్త సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటూ, విలువలు, సృజనాత్మకత, సమ్మిళితత్వంతో ముడిపడిన వ్యవస్థలను నిర్మించే వారిదే భవిష్యత్తు. అందుకే ప్రపంచ సృజనాత్మక, సాంకేతిక రంగాల్లో భారత్ పోషించే కీలక పాత్రకు వేవ్స్ -2025 నిదర్శనంగా నిలుస్తుంది.
***
Release ID:
(Release ID: 2126309)
| Visitor Counter:
13