సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘‘క్రియేటివ్ కంటెంట్ రంగంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే వేదికగా వేవ్స్ మారుతుందని విశ్వసిస్తున్నా’’: అల్లు అర్జున్
Posted On:
01 MAY 2025 9:48PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (వేవ్స్) 2025కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురువారం హాజరయ్యారు. దీంతో కలల నగరం మరింత ప్రకాశవంతమైంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ‘టాలెంట్ బియాండ్ బోర్డర్స్’ పేరుతో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కీర్తి, మనుగడ, స్ఫూర్తి అంశాల్లో మనసుల్ని హత్తుకున్న మాస్టర్‌క్లాస్‌గా ఈ కార్యక్రమం నిలిచింది.
కథ చెప్పే రంగంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాధాన్యాన్ని చాటి చెప్పే వేదికగా ఈ సదస్సును అల్లు అర్జున్ ప్రశంసించారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ స్ఫూర్తిని కనబరుస్తూనే ఉంది. దాన్ని ప్రదర్శించే వేదిక కూడా ఇప్పుడు మనకు ఉంది’’ అని అన్నారు. ‘‘క్రియేటివ్ కంటెంట్ రంగంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే వేదికగా వేవ్స్ మారుతుందని విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఆరు నెలల పాటు తనను విశ్రాంతికే పరిమితం చేసిన ప్రమాదం గురించి పుష్ప నటుడు మాట్లాడుతున్నప్పుడు ఈ సంభాషణ మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘ఆ విరామం ఓ వరం లాంటిది’’ అన్నారు. ‘‘ఇది నా దృష్టిని సాహసం నుంచి వాస్తవం వైపు మళ్లించింది. శారీరక పటుత్వం తగ్గుతున్నప్పుడు, నైపుణ్యం పెంచుకోవాలని నేను గుర్తించాను. నటన నా మొదటి ప్రాధాన్యంగా మారింది’’
దర్శకుడు అట్లీతో తన తదుపరి చిత్రం తెరకెక్కుతున్నట్లు అల్లు అర్జున్ ధ్రువీకరించారు. ‘‘భారతీయ భావోద్వేగాలు నిండిన చిత్రం’’ అని పేర్కొన్నారు. ‘‘దేశ ఆత్మతో అంతర్జాతీయ సాంకేతితకతను మనం మిళితం చేస్తున్నాం -- భారత్ కోసం ఓ చిత్రం, భారత్ నుంచి ప్రపంచానికో చిత్రం’’ అని ఉద్విగ్నతతో పలికారు.
నిరంతరం అభివృద్ధి చెందే సినీ రంగంలో మనుగడ సాగించడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి కూడా చర్చించారు. ‘‘ప్రతి భాషలోఅద్భుతమైన ప్రతిభ ఉన్న యువ నటులు వస్తున్నారు. నిజాయతీగా, ఉత్సాహంగా, బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండాలి’’ అని సూచించారు. ‘‘ఇది కేవలం పరిశ్రమ కాదు.. సృజనాత్మకతకు, స్థిరత్వానికి, పరిణామానికి సంబంధించిన యుద్ధభూమి’’ అన్నారు.
తన మూలాల గురించి మాట్లాడుతున్ననప్పుడు సభలో ఉన్నవారు మొత్తం ఆసక్తిగా విన్నారు. తన తాతయ్య అల్లు రామలింగయ్య, తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, చిరకాలం స్ఫూర్తినిచ్చే మామయ్య చిరంజీవికి ఉద్వేగం నిండిన గొంతుతో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను స్వయంకృషితో ఇది సాధించలేదు’’ అని అంగీకరించారు. ‘‘నా చుట్టూ ఉన్నవారి మార్గదర్శకత్వం, మద్దతు, వారి గొప్పతనం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ విషయంలో నేను అదృష్టవంతుడ్ని’’ అని అన్నారు.
తన బలం ఏమిటనే ప్రశ్నకు అభిమానులే అని సమాధానమిచ్చారు. ‘‘ప్రభ తగ్గినప్పుడు చప్పట్లు కూడా తగ్గిపోతాయి. నన్ను పైకి తీసుకొచ్చింది మీరే. నేనెందుకు ఇది చేస్తున్నానో గుర్తు చేసేదీ మీరే. నా బలం.. మీరే’’
భారత సృజనాత్మక సాహసయాత్రలో చరిత్రాత్మకంగా నిలిచిపోనున్న వేవ్స్ 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
***
Release ID:
(Release ID: 2126054)
| Visitor Counter:
24