సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మంత్రుల స్థాయి భాగస్వామ్యంతో వేవ్స్ 2025కు కేంద్ర బిందువు కానున్న ప్రపంచ మీడియా చర్చా వేదిక
వేవ్స్ 2025లో 60 దేశాల ప్రతినిధులతో పాటు మీడియా చర్చల్లో చేరనున్న యూకే, జపాన్, రష్యా
గ్లోబల్ మీడియా డైలాగ్ లో భాగంగా వేవ్స్ డిక్లరేషన్
Posted On:
01 MAY 2025 7:02PM
|
Location:
PIB Hyderabad
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సదస్సులో భాగంగా రేపు ప్రపంచ మీడియా చర్చా వేదికను (జిఎండి)ను భారత్ మొదటిసారిగా నిర్వహిస్తోంది. ఇది ప్రపంచ మీడియా, వినోద రంగాలతో భారత్ అనుసంధానం కావడంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. ఈ చర్చా వేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా నుంచి ప్రతినిధులతో పాటు 60కి పైగా దేశాలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. రష్యా, జపాన్, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా సహా పలు దేశాల మంత్రిత్వ స్థాయి, సీనియర్ అధికార స్థాయి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, ఉత్తమ విధానాలను పంచుకోవడం, ప్రపంచ మీడియా రంగంలో విధాన సమన్వయం, ప్రతిభ మార్పిడి, సామర్థ్యవృద్ధికి అవకాశాలను అన్వేషించడం ఈ చర్చా వేదిక లక్ష్యం.
ఈ చర్చా వేదిక ఫలితంగా ‘ వేవ్స్ డిక్లరేషన్’ రూపుదిద్దుకోనుంది. ఇందులో పాల్గొంటున్న దేశాలు మీడియా, వినోద రంగాలలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడంతో పాటు, భవిష్యత్ సహకారాలు, భాగస్వామ్యాలకు పునాది వేయనున్నాయి. చైతన్యవంతమైన మీడియా వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద పరిశ్రమతో, భారతదేశం ఇలాంటి ఒక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వడానికి ప్రత్యేక అర్హత కలిగిన దేశంగా నిలిచింది. ఈ ప్రపంచ మీడియా సదస్సు ప్రపంచాన్ని విలువలతో మలచడంలో మీడియా పాత్రపై జరుగుతున్న అంతర్జాతీయ చర్చలకు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా నిలబెట్టే ఒక కీలక క్షణాన్ని సూచిస్తోంది.
సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయ సహకారాన్ని రూపొందించడంలో పెరుగుతున్న మీడియా, వినోద రంగాల పాత్ర గురించి చర్చించడానికి గ్లోబల్ మీడియా డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన వాటాదారులను ఏకతాటిపైకి తెస్తుంది. ఇది మీడియా, వినోద రంగాలలో వేగంగా మారుతున్న దృశ్యాలను గురించి స్వేచ్ఛాయుత చర్చలకు వేదికగా నిలవనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, కంటెంట్ ధోరణులలో మార్పు, పెరుగుతున్న అంతర్జాతీయ అనుసంధానత నేపథ్యంలో, ఈ చర్చల ద్వారా సమాజాలను తీర్చిదిద్దడంలో ఆవిష్కరణకు ప్రేరణనివ్వడం, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, అనుభవాలు, అభిప్రాయాలు, దృక్పథాలను పరస్పరం పంచుకునే అవకాశాన్ని కల్పించడంలో మీడియా పాత్రపై చర్చిస్తారు.
ఇందులో భాగంగా బ్రిటన్, రష్యా, ఇండోనేషియా, కెన్యా, భూటాన్, ఈజిప్ట్ సహా 10 దేశాలతో పాటు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) వంటి అంతర్జాతీయ సంస్థలతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భారత్ నిబద్ధతను ఈ కార్యకలాపాలు ప్రతిబింబిస్తాయి.
ఈ కార్యక్రమానికి గౌరవ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, గౌరవ రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సహా సీనియర్ భారతీయ నాయకులు హాజరవుతారు. ఉన్నత స్థాయి ప్రముఖులు పాల్గొననుండడం బలమైన, సమ్మిళిత, ముందుచూపు కలిగిన ప్రపంచ మీడియా వాతావరణాన్ని పెంపొందించడానికి భారత్ నిబద్ధతను తెలియచేస్తోంది.
***
Release ID:
(Release ID: 2126016)
| Visitor Counter:
20