రక్షణ మంత్రిత్వ శాఖ
మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్న ‘ఐఓఎస్ సాగర్’
Posted On:
27 APR 2025 3:10PM by PIB Hyderabad
నైరుతి హిందూ మహాసముద్రంలో మోహరింపు ప్రక్రియలో భాగంగా నేషనల్ కోస్ట్ గార్డ్ (ఎన్‌సీజీ) మారిషస్‌తో పాటు సంయుక్త ఈఈజడ్ నిఘాలో మొదటి దశను పూర్తి చేసిన తరువాత ‘ఐఓఎస్ సాగర్’ గత శనివారం (ఈ నెల 26న) మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ హార్బరుకు చేరుకొంది. విదేశీ మిత్ర దేశాలతో పాటు ప్రాంతీయ నౌకావాణిజ్య సహకారం పట్ల, సామర్థ్యాల పెంపుదల పట్ల భారత్ కనబరుస్తున్న నిబద్ధతలో ఓ ముఖ్య అధ్యాయాన్ని ఈ యాత్ర సూచిస్తోంది.
భారతీయ నౌకాదళానికి చెందిన సునయన (ఐఓఎస్ సాగర్) ఈ ఏడాది ఏప్రిల్ 5న కార్వార్ నుంచి బయలుదేరింది. దీనిలో హిందూ మహాసముద్ర ప్రాంతానికి (ఇండియన్ ఓషన్ రీజియన్.. ఐఓఆర్) చెందిన 9 మంది విదేశీ మిత్ర దేశాల నౌకాదళ సిబ్బంది 44 మంది ఉన్నారు. వీరిలో మారిషస్‌కు చెందిన ఇద్దరు అధికారులు, ఆరుగురు నావికులు కూడా ఉన్నారు.
సామూహిక పురోగతి, సహకారాలపై శ్రద్ధ వహిస్తూ ఇంటర్ ఆపరబులిటీని, పరస్పర శిక్షణను, ప్రాంతీయ నౌకా వాణిజ్య భద్రతను పెంచడానికి భారతీయ నౌకాదళం చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది.
నౌకతోపాటు నౌక నిర్వహణ సిబ్బందికి ఆత్మీయ, ఉత్సాహపూరిత స్వాగతం లభించింది. ఈ ఘట్టం భారత్, మారిషస్‌ల సన్నిహిత బంధానికే కాక కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన మైత్రిని కూడా చాటిచెప్పింది.
స్వాగత కార్యక్రమంలో పోలీస్ కమిషనరు శ్రీ సురోజెవల్లీ, ప్రధానమంత్రి కార్యాలయం, మారిషస్ పోలీస్ దళం, భారత హైకమిషన్, ఎన్‌సీజీ మారిషస్‌ల ఉన్నతాధికారులు అనేక మంది పాల్గొన్నారు. స్వాగత కార్యక్రమం ముగిసిన తరువాత, ప్రముఖులకు నౌకలో కలియదిరిగే అవకాశాన్ని కల్పించారు. అనంతరం, మిత్ర దేశాల సిబ్బందితో కలిసి తమ తమ ఆలోచనలను వెల్లడించే కార్యక్రమం కూడా చోటుచేసుకొంది.
నౌకను కొంతకాలం పాటు ఓడరేవులో ఉంచుతారు. ఈ కాలంలో, మారిషస్ పోలీస్ కమిషనరుతోనూ, భారత్‌కు చెందిన హై కమిషనరుతోనూ ఐఓఎస్ సాగర్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ సమావేశమవుతారు. ఓడరేవులో రెండు రోజుల విడిది సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మారిటైం ఎయిర్ స్క్వాడ్రన్‌ను, స్పెషల్ మొబైల్ పోలీస్ స్క్వాడ్రన్‌ను, పోలీస్ హెలీకాప్టర్ స్క్వాడ్రన్‌ను ‘ఐఓఎస్ సాగర్’ సిబ్బంది కలుసుకోవడమే కాక ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఐఓఎస్ సాగర్‌కు చెందిన బహుళజాతీయ సిబ్బందితో మారిషస్ పోలీస్ కమిషనర్ సైతం పోలీస్ ప్రధాన కేంద్రంలో మాటామంతీ జరుపుతారు. సందర్శకులను నౌక లోపలకు వెళ్లి చూడడానికి ఒక్క రోజు మాత్రం అనుమతిస్తారు. నౌక పోర్ట్ లూయిస్‌లో ఉండే కాలంలో ట్రెక్కింగ్, సంయుక్త యోగాభ్యాసాలకు తోడు స్నేహపూర్వక ఆటల నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందించారు.
తిరుగుప్రయాణమయ్యే కన్నా ముందు, ‘ఐఓఎస్ సాగర్’ ఎన్‌సీజీ మారిషస్‌తో కలిసి సంయుక్త ఈఈజడ్ నిఘా తాలూకు రెండో దశను మొదలుపెడుతుంది. ఈ దశను పూర్తి చేసిన తరువాత సీషెల్స్‌లోని విక్టోరియా ఓడరేవు దిశగా పయనమవుతుంది.
ఐఎన్ఎస్ సునయన ఒక అత్యాధునిక ‘సరయు’ శ్రేణి ఎన్ఓపీవీ (నావల్ ఆఫ్‌షోర్ పాట్రల్ వెసల్). సముద్రంలో దోపిడీ ఘటనలను ప్రతిఘటించడానికి, సముద్ర నిఘాకు, హెచ్ఏడీఆర్ (హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్) కోసం దీనిని రూపొందించారు. ఆధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఈ నౌకలో అమర్చారు. దీనిలో మధ్య దూర, సమీప దూర శతఘ్నులు, క్షిపణుల రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఒక హెలికాప్టరును కూడా ఈ నౌక తీసుకుపోగలదు. ఇది దీని నిర్వహణ, నిఘా సామర్థ్యాలకు ఒక అదనపు హంగుగా అమరింది.
***
(Release ID: 2125006)
Visitor Counter : 4