వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల విద్యార్థులకు500 ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
ప్రామాణీకరణపై అవగాహన, పరిశ్రమల్లో ప్రయోగాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఇంటర్న్‌షిప్ లక్ష్యం
భారతీయ విద్యాసంస్థల్లో నాణ్యత, ప్రమాణాల సంస్కృతిని పెంపొందించే అంశంలో నిబద్ధతను తెలియజేసిన సమావేశం
Posted On:
22 APR 2025 12:51PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జాతీయ ప్రమాణాల సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తన భాగస్వామ్య సంస్థలకు చెందిన 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే జరిగిన బీఐఎస్ స్టాండర్డైజేషన్ ఛెయిర్, అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భాగస్వామ్య సంస్థల వార్షిక సమ్మేళనంలో దీన్ని ప్రకటించారు.
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా కోర్సులకు చెందిన విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. 8 వారాల ఈ ఇంటర్న్‌షిప్‌లో రెండు ముుఖ్యమైన పరిశ్రమల్లో ప్రి-స్టాండర్డైజేషన్ పని ఉంటుంది. బీఐఎస్ కార్యాలయాల సహకారంతో క్యూసీఓ (నాణ్యతా నియంత్రణ ఉత్తర్వు) అమలుకి సంబంధించిన సర్వేలు చేస్తారు. భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ప్రయోగశాలల్లో క్షేత్రస్థాయి సందర్శనలు ఉంటాయి. తయారీ, పరీక్షా పద్ధతులు, ముడి సరకులు, కొనసాగుతున్న నియంత్రణలు, వస్తు నాణ్యత, నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి తదితర అంశాలపై వివరణాత్మక అధ్యయనాన్ని విద్యార్థులు చేపడతారు.
బీఐఎస్ విద్యాసంస్థలు సాధించిన ప్రధాన విజయాలు:
15 విద్యాసంస్థలకు చెందిన పాఠ్యాంశాల్లో ప్రామాణీకరణకు సంబంధించిన అంశాలను చేర్చారు.
130కి పైగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
50కి పైగా విద్యాసంస్థలు బీఐఎస్ కార్నర్లు, అకడమిక్ డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేశాయి.
52 సంస్థల్లో మొత్తం 198 ప్రామాణిక క్లబ్బులు ఏర్పాటయ్యాయి.
74 సంస్థలకు చెందిన 3,400 మందికి పైగా విద్యార్థులు జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్పులు కల్పించేందుకు ప్రణాళిక రూపకల్పన
బీఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ ప్రారంభోపన్యాసం చేస్తూ, విద్యాసంస్థల్లో నాణ్యత, ప్రమాణాలకు సంబంధించిన సంస్కృతిని పెంపొందించే ఉమ్మడి జాతీయ కార్యక్రమమే ఈ భాగస్వామ్యం అని తెలిపారు. విద్యాసంస్థలు పని ఆధారిత సహకారాలను పెంపొందించుకోవాలని, దేశ నాణ్యతా రంగంలో చురుకైన పాత్ర పోషించాలని బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ప్రామాణీకరణ) శ్రీ రాజీవ్ శర్మ అన్నారు.
ఈ సమ్మేళనంలో భాగంగా పాఠ్యాంశాల ఏకీకరణ, ప్రమాణాల రూపకల్పన, ప్రమాణాల క్లబ్బుల ద్వారా విద్యార్థులను భాగస్వామం చేయడం, ఇతర ప్రోత్సాహక కార్యక్రమాలపై సాంకేతిక కార్యక్రమాలు జరిగాయి. భాగస్వామ్య సంస్థలు విద్యా సంబంధిత సహకారం కోసం తాము అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, సృజనాత్మక విధానాలను ఓ చర్చా కార్యక్రమంలో పంచుకున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ప్రామాణీకరణ సంస్కృతిని బలోపేతం చేసేందుకు, జాతీయ అంతర్జాతీయ నాణ్యతా వ్యవస్థలతో మమేకమయ్యేలా విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమంలో సంయుక్త తీర్మానం చేశారు.
ఈ సదస్సులో 58 భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అవగాహనా ఒప్పందం ఆధారంగా బీఐఎస్ సంబంధిత కార్యకలాపాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అయిదు సంస్థలు - ఐఐటీ రూర్కీ, ఎస్ఎస్ఈసీ చెన్నై, ఎన్ఐటీ జలంధర్, ఎస్వీసీఈ ఛెన్నై, పీఎస్ఎన్ఏసీఈట్ దిండిగల్ సంస్థలను ఈ కార్యక్రమంలో సన్మానించారు.
***
(Release ID: 2123636)
Visitor Counter : 5