సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రోడ్ టు గేమ్ జామ్
Posted On:
15 APR 2025 5:35PM by PIB Hyderabad
2025 వేవ్స్ సదస్సులో మెరుపులు మెరిపించనున్న దేశ యువ గేమ్ డెవలపర్లు
పరిచయం
భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రపంచ దృశ్య-శ్రవణ, వినోద రంగ సదస్సు (వేవ్స్) తొలి సంచికలో భాగంగా ఏర్పాటైన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లోని మొట్టమొదటి ‘రోడ్ టు గేమ్ జామ్’ కార్యక్రమ టాప్-10 గేముల గురించిన ప్రకటన వెలువడింది. దాంతో ఈ పోటీల్లో విజయబావుటా ఎగురవేసిన దేశ యువ గేమ్ డెవలపర్లు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నారు. దేశ గేమింగ్ రంగ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషించే ఈ సాటిలేని టైటిల్స్ ను మే 1వ తేదీ నుంచి 4 వరకూ ముంబయి వేదికగా జరగే వేవ్స్ సదస్సులో ప్రదర్శిస్తారు.
-

గేమ్ డెవలపర్లు తమ సృజనను, ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు రోడ్ టు గేమ్ జామ్ చక్కని అవకాశాలను కల్పిస్తోంది. కేజెన్ (క్రేటోస్ గేమర్ నెట్వర్క్) సహకారంతో గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ప్రారంభించిన ఈ పథకం వేవ్స్ లోని పిల్లర్-2 లో భాగం. ఈ కార్యక్రమం ఏవీజీసీ -ఎక్స్ ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్) పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుంది. నూతన టాలెంట్ కు జాతీయస్థాయి వేదిక కల్పించే ఈ కార్యక్రమం, సృజన, సహకారాలను ప్రోత్సహిస్తూ దేశ గేమింగ్ వాతావరణాన్ని బలోపేతం చేస్తోంది.
స్పందన, భాగస్వామ్యం
దేశంలోని 453 నగరాలు, పట్టణాల్లోని 1,650కి పైగా కళాశాలల నుంచి 5,500కి పైబడిన రిజిస్ట్రేషన్‌లతో, యువ గేమ్ డెవలప్‌మెంట్ ప్రతిభను పెంపొందించడంలో గేమ్ జామ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎంఏ సెషన్‌లు, పరిశ్రమ ప్రముఖుల నేతృత్వంలో వర్క్ షాపులు వంటి కార్యక్రమాలు గేమ్ డిజైన్, స్టోరీటెల్లింగ్, గేమింగ్ వ్యాపారంలో విలువైన పాఠాలను, సూచనలను అందించాయి. పలు దశల వడపోతల అనంతరం దాదాపు 175 జట్లు తాము రూపొందించిన గేములను సమర్పించాయి. వీటిని గేమింగ్ పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞుల జ్యూరీ పరిశీలించింది.
టాప్ టెన్ ఫైనలిస్టులు
రోడ్ టు గేమ్ జామ్ కోసం ఎంపిక చేసిన టాప్-10 గేములను మే 1 నుంచి 4 వరకు ముంబయిలో జరిగే వేవ్స్ సమ్మిట్‌లో ప్రదర్శిస్తారు. ఈ ఒరిజినల్ టైటిల్స్ విద్యార్థి బృందాలు, సోలో డెవలపర్‌లు, ప్రారంభ దశలోని అంకుర సంస్థల సృజనాత్మక స్వరాల పరిధిని ప్రతిబింబించాయి. దేశంలో అభివృద్ధి చెందుతున్న అత్యుత్తమ గేమ్ డెవలప్‌మెంట్ ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి.
-

పురస్కారాలు-గుర్తింపు
తుది పోటీకి అర్హత సాధించిన టాప్-10 విజేత జట్లకు, ముంబయిలో జరిగే వేవ్స్ సమ్మిట్‌కు అన్ని ఖర్చులతో కూడిన పర్యటన బహుమానాన్ని అందిస్తున్నారు. తమ గేమ్‌లను ప్రపంచ పరిశ్రమ జ్యూరీ ఎదుట ప్రదర్శించే అపురూపమైన అవకాశం ఈ జట్లకు లభిస్తుంది. ఇక మొదటి మూడు ఎంట్రీలకు కలిపి రూ. 7 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. తొలి స్థానానికి రూ. 3.5 లక్షలు, రెండో స్థానానికి రూ. 2 లక్షలు, మూడో స్థానం పొందిన వారికి రూ. 1.5 లక్షల బహుమతి సొమ్మును అందజేస్తారు.
-
గేమ్ జామ్ ఇతివృత్తాలు
గేమ్ జామ్ విలక్షణ ఇతివృత్తాలను ఇక్కడ చూడవచ్చు. సాంకేతిక ఆవిష్కరణలతో సృజనాత్మకతను మిళితం చేసేందుకు అవసరమయ్యే ప్రేరణను ఈ ఇతివృత్తాలు కలిగిస్తాయి.
-

గేమ్ డెవలప్మెంట్ రంగంలో పెరుగుతున్న భారత్ ప్రాభవం
గేమింగ్ రంగంలో ప్రపంచ శక్తిగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ మార్గదర్శక, ఇంటరాక్టివ్ మీడియా- గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన లుమికై ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశం 550 మిలియన్లకు పైగా గేమర్‌లకు నిలయంగా ఉంది, వారిలో 175 మిలియన్ల మంది ఇన్-గేమ్ కొనుగోళ్ళు చేస్తున్నారు. అందుబాటు ధరల్లో డేటా లభ్యత, మొబైల్-ఫస్ట్ గేమింగ్ సంస్కృతి, డిజిటల్ అవగాహన మెండుగా ఉన్న యువత, సంఖ్యాపరంగా అత్యధిక యువజనులు వంటి కీలకమైన అంశాలపై ఆధారపడిన భారీ యూజర్ బేస్ లో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ళ లోపు వయసున్న వారు కావడం గమనార్హం.
ఈ రంగంలో దేశం సిసలైన బలం వినియోగదారుల సంఖ్యలో మాత్రమే కాక దాని సృజనాత్మక సామర్థ్యంలో కూడా నిక్షిప్తమై ఉంది. విస్తారమైన ఇంజనీరింగ్, డిజైన్ టాలెంట్.. అభివృద్ధి చెందుతున్న ఇండీ డెవలపర్ కమ్యూనిటీ.. పెరుగుతున్న ప్రభుత్వ, పరిశ్రమల మద్దతుతో గేమ్స్ సృష్టి, గేమింగ్ సొల్యూషన్ల ఉత్పత్తికి గ్లోబల్ హబ్‌గా మారేందుకు దేశం సన్నద్ధంగా ఉంది. నైపుణ్యం, మౌలిక వసతులు, మూలధన నిధులపై పెరుగుతున్న పెట్టుబడులు ఈ రంగానికి బలమైన పునాదిని వేస్తుండటంతో జాతీయ, రాష్ట్ర-స్థాయి గేమింగ్ శిక్షణా కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. గ్లోబల్ పబ్లిషర్‌లు, స్టూడియోలు, ప్లాట్‌ఫాంలు భారతీయ ప్రతిభను అభివృద్ధి పరచడంలో, పెట్టుబడిని పెట్టడంలో ఆసక్తిని చూపుతున్నాయి. ఇవన్నీ గ్లోబల్ గేమింగ్ ఎకోసిస్టమ్‌లో దేశ స్థితిని మరింత సుస్థిరపరుస్తున్నాయి.
ముగింపు
రోడ్ టు గేమ్ జామ్ దేశ నూతన తరం గేమ్ డెవలపర్‌ల అపారమైన ప్రతిభ, సృజనను గుర్తించడమే కాకుండా గ్లోబల్ గేమింగ్ వేదికకు నాయకత్వం వహించేందుకు దేశానికి గల సత్తాను కూడా ప్రదర్శించింది. ఔత్సాహిక సృష్టికర్తలు, పరిశ్రమ మార్గదర్శకులు, అంతర్జాతీయ ప్లాట్‌ఫాంలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఈ కార్యక్రమం బలమైన, మరింత సమగ్రమైన గేమ్ డెవలప్‌మెంట్ వాతావరణానికి పునాదులు వేసింది. ముంబైలో జరిగే వేవ్స్ సమ్మిట్‌లో పాల్గొనే టాప్-10 జట్లు తమ గేమ్ లను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో, వారి ప్రయాణం భారతదేశాన్ని శక్తివంతమైన గేమింగ్ మార్కెట్‌గా మాత్రమే కాకుండా సిసలైన ప్రపంచ స్థాయి గేమ్ సృష్టికర్తగా నిలపాలన్న విస్తృత జాతీయ ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది.
మూలం : సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ
రోడ్ టు గేమ్ జామ్
***
(Release ID: 2122173)
Visitor Counter : 16