భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తొలిసారిగా బూత్ స్థాయి కార్యకర్తల(బీఎల్ఏ)కు కేంద్ర ఎన్నికల కమిషన్ శిక్షణ


గుర్తింపు పొందిన 10 బీహార్ రాజకీయ పార్టీలకు చెందిన 280 మంది బీఎల్ఏలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

Posted On: 16 APR 2025 1:17PM by PIB Hyderabad

రానున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీహార్ కు చెందిన బూత్ స్థాయి కార్యకర్తల (బీఎల్ఏ)కు కేంద్ర  ఎన్నికల కమిషన్ (ఈసీఐ) శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తదనుగుణంగా న్యూఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్మెంట్-ఐఐఐడీఈఎం లో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గుర్తింపు పొందిన 10 బీహార్ రాజకీయ పార్టీల బీఎల్ఏలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  

తొలిసారిగా ఏర్పాటైన ఇటువంటి శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. మార్చి 4న జరిగిన ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈఓ)ల సమావేశంలో శిక్షణా కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఏ పాత్ర ప్రాముఖ్యాన్ని గుర్తించిన కమిషన్, వారికి తగిన శిక్షణనందించడం వల్ల వారి బాధ్యతల నిర్వహణ మరింత మెరుగవగలదని భావించింది. 1950, ’51 ప్రజా ప్రాతినిద్ధ్య (ఆర్పీ) చట్టాలు,1960 ఓటర్ల నమోదు నిబంధనల చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల చట్టం, ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే మార్గదర్శక సూత్రాలు బీఎల్ఏల విధుల గురించి పేర్కొంటున్నాయి.  

చట్టప్రకారం బీఎల్ఏల నియామకం, పాత్ర, బాధ్యతల పట్ల ప్రతినిధులకు అవగాహన కలిగించారు. ఎన్నికల కోసం సన్నద్ధమవడం, తాజా పద్ధతుల పట్ల అవగాహన, ఎన్నికల జాబితాలు, పత్రాలు, పద్ధతుల్లో జరిగే మార్పులు, చేర్పులు సహా ఎన్నికల ప్రక్రియలోని అన్ని అంశాల పట్ల వారికి అవగాహనను కల్పించారు. 1950 ఆర్పీ చట్టం సూత్రాల ప్రకారం ఎటువంటి లోపాలకు తావులేని ఎన్నికల నిర్వహణలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారు, దాంతో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలు వీరిని నియమిస్తాయి. ప్రకటించిన తుది ఎన్నికల ఫలితాల పట్ల అసంతృప్తి చెందిన పక్షంలో 1950 ఆర్పీ చట్టంలోని 24ఏ, 24బీ సెక్షన్ల ప్రకారం మొదటి, రెండో అప్పీళ్ళ ద్వారా తమ ఫిర్యాదుని నమోదు  చేయడం గురించి కూడా బీఎల్ఏలకు  శిక్షణనిస్తున్నారు.   

 

***


(Release ID: 2122163) Visitor Counter : 40