ప్రధాన మంత్రి కార్యాలయం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి
హిసార్ నుంచి అయోధ్యకు వాణిజ్య విమానం; హిసార్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి
దీనబంధు ఛోటు రామ్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ఆధునిక విద్యుత్ యూనిట్.. యమునా నగర్‌లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేయనున్న మోదీ
భారత్‌మాల పరియోజన కింద రేవారీ బైపాస్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
12 APR 2025 4:48PM by PIB Hyderabad
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆ తరువాత, మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన యమునానగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు.
విమాన ప్రయాణం మరింత సురక్షితంగా, సరసమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో రూ. 410 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అత్యాధునిక ప్రయాణీకుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ భవనం దీనిలో ఉంటాయి. హిసార్ నుంచి అయోధ్యకు మొదటి వాణిజ్య విమానాన్ని ఆయన ప్రారంభిస్తారు. హిసార్ నుంచి అయోధ్యకు (వారానికి రెండుసార్లు), జమ్మూ-అహ్మదాబాద్, జైపూర్-చండీగఢ్‌లకు వారంలో మూడుసార్లుగా షెడ్యూల్ చేసిన విమానాలతో, ఈ అభివృద్ధి హర్యానా విమానయాన కనెక్టివిటీలో గణనీయమైన ముందడుగును సూచిస్తుంది.
ఈ ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు, దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ సౌకర్యం కల్పించాలనే దార్శనికతకు అనుగుణంగా, ప్రధానమంత్రి యమునానగర్‌లో దీనబంధు ఛోటు రామ్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 233 ఎకరాల్లో దాదాపు రూ.8,470 కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ యూనిట్ హర్యానా ఇంధన స్వయం సమృద్ధిని మెరుగుపరచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్‌ను అంటే గోబర్ధన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రధానమంత్రి యమునానగర్‌లోని ముకరబ్‌పూర్‌లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2,600 మెట్రిక్ టన్నులు, ఇది సేంద్రీయ వ్యర్థాల సమర్థ నిర్వహణలో సహాయకరంగా ఉంటుంది అలాగే శుద్ధ ఇంధన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది.
భారత్‌మాల పరియోజన కింద దాదాపు రూ.1,070 కోట్ల నిధులతో నిర్మించిన 14.4 కిలోమీటర్ల పొడవైన రేవారీ బైపాస్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది రేవారీ నగరంలో రద్దీని గణనీయంగా తగ్గించనుంది. ఢిల్లీ-నార్నాల్ ప్రయాణ సమయాన్ని దాదాపు ఒక గంట వరకు తగ్గించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థిక-సామాజిక కార్యకలాపాలను వేగవంతం చేయనుంది.
***
(Release ID: 2121704)
Visitor Counter : 11
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam