ఆర్థిక మంత్రిత్వ శాఖ
బ్రిటన్, ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన నిమిత్తం నేడు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పయనం
రెండు దేశాల్లో ద్వైపాక్షిక సమావేశాలు, మేధావులతో సంప్రదింపులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు సహా ఇండియా-యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ (13 ఈఎఫ్డీ)లో భాగంగా 13వ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొననున్నకేంద్రమంత్రి
Posted On:
07 APR 2025 1:03PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ నెల 8 నుంచి 13 వరకూ బ్రిటన్, ఆస్ట్రియా దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్ళారు. రెండు దేశాల్లో ఏర్పాటైన మంత్రులస్థాయి ద్వైపాక్షిక సమావేశాల్లో మంత్రి పాల్గొంటారు.
పర్యటన సందర్భంగా రెండు దేశాల్లో ద్వైపాక్షిక సమావేశాలు, మేధావులతో సంప్రదింపులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు సహా ఇండియా-యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ (13 ఈఎఫ్డీ)లో భాగంగా 13వ మంత్రుల స్థాయి సమావేశాల్లో శ్రీమతి నిర్మల పాల్గొంటారు.
భారత్-యూకే ఆర్థిక సమావేశాల (13వ ఈఎఫ్డీ) 13వ సంచిక ఏప్రిల్ 9న లండన్ లో ఏర్పాటవుతోంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, బ్రిటన్ ఆర్థిక మంత్రి ఈ సమావేశానికి సంయుక్త అధ్యక్షత వహిస్తారు.
ఆర్థిక సహకారానికి సంబంధించి మంత్రులు, అధికారులు, కార్యకర్తల స్థాయిలోనే కాక, ఆయా నియంత్రణ సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగేందుకు 13 ఈఎఫ్డీ కీలక ద్వైపాక్షిక వేదికగా పనిచేస్తుంది. పెట్టుబడి అవకాశాలు, ఆర్థికరంగ సేవలు, ఆర్థిక నియమ నిబంధనలు, యూపీఐ సంబంధాలు, పన్నుల వ్యవహారాలు, అక్రమ లావాదేవీలు సహా అనేక అంశాలను ఇరుపక్షాలు చర్చిస్తాయి.
13వ ఈఎఫ్డీ కి సంబంధించి, ఐఎఫ్ఎస్ సీ గిఫ్ట్ సిటీ, పెట్టుబడులు, బీమా, పెన్షన్ రంగాలు, ఫిన్ టెక్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులకు సంబంధించి స్థిరమైన నిధుల సేకరణ భారత్ ప్రాధాన్యాలుగా ఉన్నాయి.
సమావేశాల సందర్భంగా ఇరువురు మంత్రులూ భవిష్య సహకారానికి సంబంధించి అనేక నివేదికలను, కొత్త పథకాలను ప్రకటించగలరని భావిస్తున్నారు.
భారత్-యూకే 13వ ఈఎఫ్డీ సమావేశాల నేపథ్యంలో శ్రీమతి సీతారామన్ ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక సమావేశాలు, పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్, కీలక ఆర్థిక సంస్థలు, కంపెనీల అధిపతులతో సమావేశాల్లో పాల్గొంటారు.
బ్రిటన్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ముఖ్య కార్యనిర్వాహక అధికారుల పాల్గొనే భారత్-యూకే పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీమతి నిర్మల కీలకోపన్యాసం చేస్తారు. పెన్షన్ ఫండ్లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు వంటి బ్రిటన్ ఆర్థిక రంగ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
బ్రిటన్ ఆర్థిక, వాణిజ్య మంత్రి జొనాథన్ రెనాల్డ్స్ తో కలిసి కేంద్రమంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. లండన్ నగర భాగస్వామ్యం గల ఈ కార్యక్రమంలో ప్రముఖ పెన్షన్ ఫండ్ల సీఈఓలు, ఉన్నతాధికారులు, ఆస్తుల నిర్వహణ సంస్థల మేనేజర్లు పాల్గొంటారు.
ఇక ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ ఆర్థిక మంత్రి మార్కస్ మార్టెర్బార్, ఫెడరల్ ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ సహా స్థానిక ప్రభుత్వ నేతలతో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో శ్రీమతి సీతారామన్ పాల్గొంటారు.
ఆస్ట్రియా సీఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ దేశ ఆర్థికరంగ, ఇంధన, పర్యాటక మంత్రి వుల్ఫ్ గ్యాంగ్ హ్యాట్ మాన్స్ డోర్ఫర్ తో సహ అధ్యక్షత వహించి, ఇరు దేశాల మధ్య పెట్టుబడి సహకారం పెంపొందించేందుకు గల అవకాశాలను గురించి వారికి శ్రీమతి సీతారామన్ అవగాహన కల్పిస్తారు
(Release ID: 2119915)
Visitor Counter : 8