వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
03 APR 2025 2:13PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షుడు వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నిటి దిగుమతులపైనా విలువను బట్టి వర్తించే తరహా సుంకాలను (యాడ్-వాలొరెమ్ డ్యూటీస్) 10 శాతం మొదలు 50 శాతం మధ్య అదనంగా విధిస్తూ పరస్పర పన్నులకు సంబంధించిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. 10 శాతం బేస్‌లైన్ డ్యూటీ ఈ సంవత్సరం ఎల్లుండి (ఏప్రిల్ 5) నుంచి అమల్లోకి రానుంది. ఆయా దేశాలకు విధించిన అదనపు యాడ్-వాలొరెమ్ డ్యూటీ ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కార్యనిర్వాహక ఉత్తర్వులోని అనుబంధం I లో పేర్కొన్న ప్రకారం భారత్‌కు విధించిన అదనపు సుంకం 27 శాతంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు తీసుకున్న వివిధ చర్యలు, చేసిన ప్రకటనల వల్ల కలిగే పర్యవసానాలేమిటన్నది వాణిజ్య విభాగం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, ఈ విభాగం భారతీయ పరిశ్రమ, ఎగుమతిదారు సంస్థలు సహా ఆసక్తిదారులందరినీ సంప్రదిస్తూ, పన్నుల విషయంలో వాటి అభిప్రాయాన్ని సేకరిస్తూ, స్థితిని అంచనా వేస్తోంది. అమెరికా వాణిజ్య విధానంలో చోటు చేసుకొన్న ఈ కొత్త పరిణామం కారణంగా లభించగల అవకాశాలేమేమిటన్నది కూడా ఈ విభాగం అధ్యయనం చేస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఫిబ్రవరి 13న ‘మిషన్ 500’ను ప్రకటించారు. 2030 సంవత్సరానికల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కన్నా ఎక్కువగా 500 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలనేది ఈ మిషన్ ధ్యేయం. దీనికి అనుగుణంగా, ఇరుపక్షాలకూ ప్రయోజనకరంగా ఉండే, అనేక రంగాలకు వర్తించగల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాయపరుచుకోవాలని భారత, అమెరికా వాణిజ్య బృందాల మధ్య చర్చలు సాగుతున్నాయి. సరఫరా వ్యవస్థ సంధానాన్ని విస్తరించే అంశం సహా అనేక విషయాలు ఈ చర్చలలో ప్రస్తావనకు వస్తున్నాయి. రెండు దేశాలకూ తమ వ్యాపారాన్ని, పెట్టుబడులను, టెక్నాలజీ బదలాయింపులను పెంపొందించుకోవడానికి అనువైన స్థితిని ఏర్పరచడంపై ఈ చర్చలలో శ్రద్ధ తీసుకొంటున్నారు. ఈ అంశాలపై ట్రంప్ పాలనాయంత్రాంగంతో సంప్రదింపులు కొనసాగిస్తూ రాబోయే కాలంలో వాటిని ఫలప్రదంగా ముందుకు తీసుకుపోగలమని భారత్ భావిస్తోంది.
అమెరికాతో ఏర్పరుచుకున్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువనిస్తోంది. 21వ శతాబ్దిని దృష్టిలో పెట్టుకొని ఇండియా-యూఎస్ ‘కేటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలటర పార్ట్‌నర్‌షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీఅ’ (సీఓఎంపీఏసీటీ.. ‘కంపాక్ట్) అమలుకు అమెరికాతో కలసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది. భారత్, అమెరికా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే చెప్పుకోదగ్గ మార్పులకు ఇరుదేశాల వ్యాపార సంబంధాలూ చోదక శక్తిగా ఉంటూ ఉభయదేశాల సమృద్ధికీ ఓ మూలస్తంభంగా నిలిచేటట్లు చూడాలన్నది భారత్ ఉద్దేశం.
***
(Release ID: 2118234)