సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత పురోగతి మేకిన్ ఇండియా ద్వారా మౌలిక వసతుల బలోపేతం
Posted On:
01 APR 2025 8:13PM by PIB Hyderabad
పరిచయం
దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో పెనుమార్పులు జరుగుతున్నాయి. మేకిన్ ఇండియా కార్యక్రమం అభివృద్ధి, వికాసాలకు చోదకంగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఆర్థిక పురోగతికి వెన్నెముక వంటివని గుర్తించిన ప్రభుత్వం.. వరుసగా విప్లవాత్మకమైన కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా రవాణా, తత్సంబంధిత మౌలిక సదుపాయాలను, పట్టణాల్లో సౌకర్యాలను బలోపేతం చేసింది. భారతమాల పరియోజన కింద.. ఎక్స్ ప్రెస్ రహదారులు, ఆర్థిక కారిడార్‌ల ద్వారా రోడ్డు రవాణా సదుపాయాలను పెంచుతుండగా.. నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిలో సాగరమాల కార్యక్రమం విప్లవాత్మకమైన మార్పులు తెస్తోంది. ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ ఏకీకరణ ద్వారా ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ పట్టణ కేంద్రాల రూపురేఖలను మార్చేస్తోంది. మరోవైపు వస్తువులు, ప్రజల రవాణాలో అంతరాయాలు కలగకుండా ఉండేందుకు ‘పీఎం గతిశక్తి’ ద్వారా ప్రభుత్వం అన్ని రవాణా వ్యవస్థలను ఏకీకృతం చేసి క్రమబద్ధీకరిస్తోంది. మరింత సమర్థమైన, పరస్పర అనుసంధాన, దృఢతరమైన భారత్ కు ఈ కార్యక్రమాలు పునాది వేస్తున్నాయి.
ఇంజినీరింగ్ నైపుణ్యాలను, ఆ దిశగా నిబద్ధతను చాటేలా భారత్ సాధించిన ఘన విజయాలను బట్టి ఈ ఆశయం ఎంత ఉన్నతమైనదో స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గమైన అటల్ సొరంగ మార్గం, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ బ్రిడ్జి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు దేశ సామర్థ్యానికి నిదర్శనాలు. మరోవైపు ప్రపంచంలో అతి ఎత్తైన ‘ఐక్యతా విగ్రహం’, ఆసియాలోనే అతి పొడవైన ‘జోజిలా టన్నెల్’ మొదలైనవి సవాళ్లను అధిగమిస్తూ సృజనాత్మకతను చాటడంలో భారత అంకితభావాన్ని చాటుతున్నాయి. ఇవేకాకుండా ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల విస్తరణ, ఆధునిక విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధన గ్రిడ్ లు... సవాళ్లను అధిగమించి భవిష్యత్ సన్నద్ధంగా ఉండేలా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో దేశ అంకిత భావాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. మౌలిక సదుపాయాల వృద్ధిని పారిశ్రామిక విస్తరణతో అనుసంధానం చేయడం ద్వారా.. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం భౌతికంగా అన్ని రంగాల రూపురేఖలను మార్చడమే కాదు.. పెట్టుబడులు, ఉపాధి, ఆవిష్కరణల్లో కొత్త అవకాశాలను అందిస్తోంది.
ఆర్థిక పురోగతి
వేగవంతమైన భారత ఆర్థిక పురోగతికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చోదకంగా నిలుస్తున్నాయి. దేశీయ తయారీ, పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయడంలో మేకిన్ ఇండియా కీలకపాత్ర పోషిస్తోంది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఐసీడీపీ) ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాలను నెలకొల్పుతుండగా.. ‘పీఎం గతి శక్తి’తో డేటా ఆధారిత ప్రణాళిక ద్వారా అన్ని రకాల రవాణా వ్యవస్థలను ఏకీకృతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు రవాణా మౌలిక సదుపాయాల్లో అంతరాయాలను తొలగించడంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. తద్వారా భారత్ ను అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా నిలుపుతున్నాయి.
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఐసీడీపీ)
ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశవ్యాప్తంగా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను ప్రోత్సహించడం కోసం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం ఎన్ఐసీడీపీ. వివిధ రవాణా వ్యవస్థల ఏకీకరణ (మల్టీ మోడల్ కనెక్టివిటీ)తో ఆధునిక సాంకేతికతలను అనుసంధానం చేయడం ద్వారా.. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల తయారీ కేంద్రాలను నెలకొల్పడం ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రణాళికల రూపకల్పన, వాటి అమలులో సమర్థత కోసం ఈ పారిశ్రామిక కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.
కీలక పరిణామాలు:
· 2024 ఆగస్టులో ఎన్ఐసీడీపీ కింద 10 రాష్ట్రాల్లో రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటును ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.
· ఆరు ప్రధాన కారిడార్ల వెంబడి ఈ పారిశ్రామిక కూడళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇవి దేశంలో తయారీకి మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల సమర్థతను పెంచుతాయి.
పీఎం గతి శక్తి
పీఎం గతి శక్తి - రవాణా వ్యవస్థల ఏకీకరణ కోసం బృహత్ప్రణాళికను 2021లో ప్రారంభించారు. తయారీ, ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వడం ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి ‘మేకిన్ ఇండియా’ లక్ష్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ డిజిటల్ వేదిక రైల్వేలు, రోడ్డు మార్గాలు సహా 16 మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుంది. దానితోపాటు జియోస్పేషియల్ చిత్రణ, డేటా ఆధారిత నిర్ణయాలతో రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలను మరింత సమర్థంగా తీర్చిదిద్ది, ప్రాజెక్టుల్లో జాప్యాన్ని తగ్గిస్తుంది. ఇది రవాణా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా పారిశ్రామిక కారిడార్లను బలోపేతం చేస్తుంది, సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతుంది, కీలక రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది. రూ.500 కోట్లు దాటిన అన్ని ప్రాజెక్టులను నెట్‌వర్క్ ప్రణాళికా బృందం (ఎన్పీజీ) మదింపు చేయడం ద్వారా సజావుగా అమలయ్యేలా చూస్తుంది.
ఈ ఏడాది మార్చి 13 నాటికి.. ఈ కార్యక్రమం కింద రూ.6.38 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 13,500 కిలోమీటర్ల మేర 115 జాతీయ రహదారులు, రోడ్డు ప్రాజెక్టులను మదింపు చేశారు. మరింత సమర్థంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.
రోడ్డు, సముద్ర రవాణా
దేశంలో రహదారి, సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ‘మేకిన్ ఇండియా’ లక్ష్యాల్లో ప్రధానమైనది. అది పరిశ్రమల కోసం అంతరాయం లేకుండా అనుసంధానాన్ని కల్పించడంతోపాటు, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది. భారతమాల, సాగరమాల వంటి వ్యూహాత్మక కార్యక్రమాలు సరుకు రవాణాను మెరుగుపరుస్తూ, రవాణా మౌలిక సదుపాయాలను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతూ, రవాణా వ్యవస్థలను ఆధునికీకరిస్తూ.. దేశ తయారీ, వాణిజ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాయి.
భారతమాల పరియోజన
ఆర్థిక కారిడార్లు, ఎక్స్‌ప్రెస్ రహదారులు, కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి ద్వారా కీలకమైన అంతరాలను పరిష్కరిస్తూ.. భారతమాల పరియోజన దేశంలో మౌలిక సదుపాయాలను ముందుకు తీసుకెళ్తోంది. మేకిన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా.. రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కీలకమైన కేంద్రాలతో అనుసంధానాన్ని మెరుగుపరిచి పారిశ్రామిక వృద్ధిని పెంపొందించడం, సురక్షితమైన, మరింత ప్రామాణికమైన రవాణా వ్యవస్థలను నెలకొల్పడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా.. దేశీయంగా తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. రవాణా, సంబంధిత మౌలిక సదుపాయాల్లో భారత్ మరింత స్వావలంబన సాధించేలా భరోసా ఇస్తుంది. 2017లో ఆమోదం పొందినప్పటి నుంచి, ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించింది:
· ప్రణాళిక రూపొందించిన 34,800 కి.మీ.లలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 26,425 కి.మీ. ప్రాజెక్టులు మంజూరవగా.. 19,826 కి.మీ. నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భారతమాల పరియోజన కింద చేసిన మొత్తం వ్యయం రూ. 4,92,562 కోట్లు.
· ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కొత్తగా 6,669 కి.మీ. మేర హైస్పీడ్ కారిడార్లు మంజూరవగా, వాటిలో 4,610 కి.మీ. పూర్తయ్యాయి.
జాతీయ రహదారి వ్యవస్థ
గత దశాబ్ద కాలంలో దేశంలోని జాతీయ రహదారుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అధికంగా బడ్జెట్ కేటాయింపులు, నిర్మాణాలను వేగవంతం చేయడం ఇందుకు దోహదం చేశాయి. దేశంలో జాతీయ రహదారులు 2014లో 91,287 కి.మీ. ఉండగా, 2024 నాటికి 60 శాతం వృద్ధితో 1,46,145 కి.మీ.లకు పెరిగింది. ఇది అనుసంధానాన్ని గణనీయంగా పెంచింది, ప్రయాణ సమయాన్ని తగ్గించింది, దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చింది.
సాగర్‌మాల
‘సాగర్‌మాల’ కార్యక్రమాన్ని 2015లో మొదలుపెట్టారు. దేశంలోని విస్తృత సముద్రతీరప్రాంతాన్ని, నౌకాయానం కోసం జలమార్గాల సామర్థ్యాన్నీ వినియోగించుకోవాలనే ధ్యేయంతో ఓడరేవుల ఆధారిత అభివృద్ధిపై ఈ కార్యక్రమం దృష్టిని కేంద్రీకరిస్తూ, భారత ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. దేశీయ వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యం.. ఈ రెండిటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం ద్వారా భారత తయారీ, ఎగుమతి సామర్థ్యాలను పెంచడం సాగర్‌మాల కార్యక్రమ లక్ష్యంగా ఉంది. నౌకాశ్రయాల్లో మౌలిక సదుపాయాలతోపాటు సంధానాన్ని మెరుగుపరచడంపై, కోస్తా ప్రాంతాల్లో ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడంపై ఈ కార్యక్రమం శ్రద్ధవహిస్తోంది. ఈ ఉద్దేశాలు నెరవేరితే తయారీ రంగంలో వృద్ధికి ఊతం లభిస్తుంది. ఇక రో-పాక్స్ ఫెర్రీ సర్వీసులు, క్రూజ్ టర్మినల్స్, కోస్తాప్రాంత సముదాయాల నైపుణ్యాలను పెంచడం వంటి కార్యక్రమాలను అమలుపరచడం స్వయంసమృద్ధ నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఇకోసిస్టమ్) వర్ధిల్లడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ పరిణామాలు ‘ప్రపంచానికి తయారీ కూడలి’గా మారాలన్న భారత్ దార్శనికతకు దన్నుగా నిలిచేవే.
Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007T25V.png
ఆమోదం లభించినప్పటి నుంచి, ఈ కార్యక్రమం గణనీయ పురోగతిని సాధించింది:
· ఈ సంవత్సరం మార్చి నెల 19 నాటికి సాగర్‌మాలలో భాగంగా రూ.5.79 లక్షల కోట్ల వ్యయమయ్యే 839 ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో 272 ప్రాజెక్టులను పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టులకు రూ.1.41 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు.
· నౌకావాణిజ్య సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి నౌకాశ్రయాల సంధానంతోపాటు కోస్తాతీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పెంచారు.
రైల్వేల రంగంలో మౌలిక సదుపాయాలు
భారతదేశంలో రైలు రంగ మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయ పురోగతి చోటుచేసుకొంది. ఈ పురోగతి సంధానాన్ని, భద్రతను, పట్టణ ప్రాంతాలలో రాకపోకల స్థితులను పటిష్టపరిచింది. వందే భారత్ రైళ్లు, మెట్రో రైల్ విస్తరణ వంటి ప్రధాన కార్యక్రమాలు ప్రయాణికులకు ఇదివరకటితో పోలిస్తే చక్కని అనుభూతిని అందిస్తూ ట్రాన్జిట్ హబ్స్ సరికొత్త రూపును అందిపుచ్చుకొంటున్నాయి. అడ్డంకులు ఎదురవని యాత్రకు మార్గం సుగమం అవుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతలో భాగంగా రైల్వే నెట్‌వర్క్ విస్తరణను ప్రోత్సహించడం వృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు అందించాలన్న నిబద్ధతతోపాటు దక్షత కలిగిన రవాణా సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న నిబద్ధతను కూడా స్పష్టం చేస్తోంది.
వందే భారత్ రైళ్లు
వందే భారత్ రైళ్లను 2019లో ఆరంభించారు. ఈ రైళ్లు ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతకు ఒక ఉదాహరణ. రైల్వే రంగంలో ఆధునికీకరణ విషయంలో దేశ ఇంజినీరింగ్ శక్తియుక్తులకు ఈ రైళ్లు అద్దంపడుతున్నాయి. మొట్టమొదటిసారిగా దేశంలో డిజైన్ చేసి, నిర్మించిన సెమీ-హై-స్పీడ్ రైళ్లు ఇవి. వీటిలో ఆధునిక రైలుపెట్టెలు, ఉన్నతస్థాయి సురక్ష సదుపాయాలు, ప్రయాణికులకు మెరుగైన ఏర్పాట్లు సమకూర్చారు. ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, శరీరానికి ఏ ఇబ్బందీ కలగకుండా హాయిగా వెన్నును వాల్చి విశ్రాంతిగా కూర్చోవడానికి అనువైన ఎర్గోనోమిక్ సీట్లు, ప్రయాణికుల్లో ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ చార్జింగ్ సాకెట్లతో ఉన్న ఈ రైళ్లు భలే ప్రయాణానుభవాన్ని పంచుతున్నాయి. మధ్య, స్వల్ప దూర మార్గాల్లో రాకపోకలు జరుపుతూ ఈ రైళ్లు సంధానాన్ని మెరుగుపరుస్తున్నాయి, ప్రయాణానికి పట్టే కాలాన్ని కూడా గణనీయంగా తగ్గించేస్తున్నాయి.
భారతీయ రైల్వేలు వందే భారత్ స్లీపర్ రైలును రంగంలోకి తీసుకువచ్చి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే తీరును కూడా మార్చివేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 16 రైలుపెట్టెలతో ఉండే మొట్టమొదటి రైలును తయారు చేశారు. ఈ రైలు ఈ ఏడాది జనవరి 15న ముంబయి-అహమదాబాద్ మార్గంలో 540 కిలోమీటర్ల మేర ప్రయాణించి, ప్రయోగాత్మక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రైలు తయారీ కిందటి ఏడాది డిసెంబరు 17న ముగిసిన తరువాత కోటా డివిజన్‌లో గంటకు 180 కి.మీ. వేగంతో పరీక్షించారు. ఈ రైలు సుదూర ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంటూ, ఉత్తమ పనితీరును కనబరిచింది.
ఈ కార్యక్రమం ఆరంభమైంది మొదలు గణనీయ పురోగతిని సాధించింది:
· ఈ సంవత్సరం మార్చి నెల 18 నాటికి దేశమంతటా 136 వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లు ప్రపంచ స్థాయి ప్రయాణానుభూతిని అందిస్తున్నాయి.
· వివిధ నిర్వహణ షెడ్యూళ్లను పరిశీలిస్తే, వారంలో 6 రోజులు తిరిగే సర్వీసులు 122, వారంలో 4 రోజులు తిరిగే సర్వీసులు 2, వారంలో మూడు సార్లు తిరిగే సర్వీసులు 8, వీక్లీ సర్వీసులు 4 ఉన్నాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం
‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ దేశమంతటా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు చేపట్టిన ఒక దీర్ఘకాలిక కార్యక్రమం. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించడంతోపాటు బహుళ విధ సంధానాన్ని (మల్టీమోడల్ కనెక్టివిటీ), సమగ్ర మౌలిక సదుపాయాల స్వరూపాన్ని పెంచడం దీని ఉద్దేశం. నిరంతర అభివృద్ధిపై ఈ పథకం దృష్టిని కేంద్రీకరిస్తూ, స్టేషన్ల రూపురేఖలను ఆధునిక యాత్రాకూడళ్లలా తీర్చిదిద్దాలని ధ్యేయంగా పెట్టుకొంది. 1,337 స్టేషన్లను వాటి స్థాయిని పెంచడం కోసం (అప్‌గ్రేడేషన్) ఈ ఏడాది మార్చి నెల 12 నాటికి గుర్తించారు. ఆయా స్టేషన్లకు చేరుకొనే మార్గాలను మెరుగుపరచడం, మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు ఎలాంటి అంతరాయాలు ఎదురవని ప్రయాణానుభూతి లభించేటట్లు చూడటానికే ఈ అప్‌గ్రేడేషన్ ప్రయత్నం.
మెట్రో రైలు విస్తరణ
పట్టణ ప్రాంతాల్లో రవాణా రూపురేఖలను ఎంతో మార్చివేయడంలోనూ, సాంప్రదాయక ప్రయాణ పద్ధతులకు బదులు వేగవంతమైన, విశ్వసనీయమైన, పర్యావరణహితకరమైన ప్రత్యామ్నాయ పద్ధతిని అందించడంలోనూ భారత మెట్రో రైల్ వ్యవస్థ గొప్ప పాత్రను పోషిస్తోంది. ప్రభుత్వం మరింతగా దృష్టిని కేంద్రీకరిస్తుండడంతో ఈ నెట్‌వర్క్ విస్తరణ జోరందుకొని, పెద్ద నగరాల్లో అడ్డంకులు ఎదురవని సంధానానికి రాచబాట వేస్తోంది. 2014 తరువాతి కాలంలో, మెట్రో వ్యవస్థ శరవేగంగా వృద్ధిచెందింది. దీంతో రద్దీ సమస్య తీరి, పట్టణ ప్రాంతాలలో రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా, రక్షణ శాఖ పరిధిలోకి వచ్చే ‘షెడ్యూల్ ఎ’ కంపెనీ బీఈఎంఎల్ మెట్రో రైలుపెట్టెల తయారీలో కీలక పాత్రను పోషించింది. కిందటేడాది మే నెల నాటికి, బీఈఎంఎల్ ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబయిలు సహా వివిధ మెట్రో కార్పొరేషన్లకు 2,000 మెట్రో రైలుపెట్టెలను సరఫరా చేసింది.
మెట్రో నెట్‌వర్కులకు తోడు, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్జిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్)ను ప్రవేశపెట్టి భారత్ కూడా చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్‌లో రాకపోకలు సాగిస్తున్న నమో భారత్ రైళ్లు వివిధ ప్రాంతాల్లో వేగవంతమైన, మరింత సమర్ధమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ, ప్రజా రవాణా వ్యవస్థల ఆధునికీకరణ విషయంలో భారత్ నిబద్ధతకు ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తున్నాయి.
Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008U5OH.jpg
ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి గణనీయ పురోగతిని సాధించింది:
· మెట్రో నెట్‌వర్క్ 2014లో 248 కిలోమీటర్ల మేరకు ఉండగా ఈ సంవత్సరం మార్చి నెలకల్లా 1,100 కి.మీ. స్థాయికి చేరుకొంది. 20కి పైగా నగరాల్లో మెట్రో నెట్‌వర్క్ విస్తరించింది.
· ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్‌లో రాకపోకలు కొనసాగిస్తున్న భారతదేశ మొట్టమొదటి నమో భారత్ రైలు అత్యాధునిక మౌలిక వసతులతో అలరారుతూ ప్రాంతీయ సంధాన సదుపాయాన్ని పెంచింది.
పౌర విమానయానం
అంతకంతకు పెరుగుతున్న డిమాండు, వాయు మార్గ సంధానాన్ని బలపరచే ఉద్దేశంతో ప్రభుత్వం అమలుచేస్తున్న చురుకైన విధానాలతో, దేశ విమానయాన రంగం ఇదివరకు ఎరుగనంత వృద్ధిని సాధించింది. ప్రాంతీయ సంధానంపై, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడంతో విమాన సర్వీసుల లభ్యత మెరుగుపడి, దేశం నలుమూలల ఆర్థిక వృద్ధితోపాటు రాకపోకలు కూడా పెరిగాయి.
Description: https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009N43R.jpg
విస్తరణ పథంలో మునుముందుకు సాగిపోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రంగం గమనించదగ్గ విజయాల్ని చేజిక్కించుకొంది:
· పని చేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74గా ఉండగా, ఈ సంవత్సరంలో మార్చి నెలకల్లా 159కి వృద్ధి చెందింది. ఇది ప్రాంతీయ సంధానం పెరిగిందని సూచిస్తోంది.
· దేశంలో ఒక రోజులో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2024 నవంబరు 17న 5 లక్షలను మించింది. ఇది ఒక కొత్త రికార్డు.
· ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థల (ఎఫ్‌టీఓస్) సంఖ్య 2016 జూన్‌లో 29గా ఉండగా, 2024 డిసెంబరు కల్లా 38కి పెరిగింది. దీనిలో 57 బేసులు కూడా ఏర్పడ్డాయి. తత్ఫలితంగా పైలట్ ట్రైనింగ్ సామర్థ్యం పుంజుకొంది.
ముగింపు
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో భారత మౌలిక సదుపాయాల కల్పన రంగం, నిర్మాణ రంగాలది ముఖ్య పాత్ర. ఈ రెండు రంగాలు పారిశ్రామిక వృద్ధితోపాటు ఆర్థిక వ్యవస్థ విస్తరణకు వెన్నెముకగా నిలిచాయి. రోడ్డు, రైలు, నౌకావాణిజ్యంలతోపాటు పట్టణాభివృద్ధి రంగాల్లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఇటు సంధానాన్ని మెరుగుపరచడం ఒక్కటే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ జీవన నాణ్యతను కూడా పెంచాయి. ‘పీఎం గతి శక్తి’, ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ వంటి చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యే పథకాలతోపాటు జాతీయ రహదారులు, మెట్రో నెట్‌వర్కులు, ఆధునిక రైలు సర్వీసులు దీర్ఘకాలిక వృద్ధి విషయంలో భారత్ ఎంతగా కట్టుబడి ఉందో చాటిచెబుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికపరమైన నవకల్పన.. వీటిలో అదేపనిగా పెట్టుబడులు పెడుతూ, పరిశ్రమలకు కొత్త కొత్త అవకాశాలను అందించడానికి, ఉపాధికి ఊతాన్ని ఇవ్వడానికి, ఆర్థిక పురోగతిని పెంచడానికి ఇండియా సన్నద్ధమవుతోంది. దీంతో ప్రపంచ తయారీ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ కూడలి (గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్-లాజిస్టిక్స్ హబ్)గా భారత్ తన స్థానాన్ని పటిష్టపరుచుకోనుంది.
అదనపు సమాచారం కోసం:
Kinldy find the pdf file
***
(Release ID: 2118094)
Visitor Counter : 13