బొగ్గు మంత్రిత్వ శాఖ
2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఒక బిలియన్ టన్నుల స్థాయిని దాటిన భారత్ బొగ్గు రంగం
* బొగ్గు రవాణాలోనూ గణనీయ పురోగతి
Posted On:
01 APR 2025 4:13PM by PIB Hyderabad
ఒక అసాధారణ విజయం.. భారత బొగ్గు రంగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పాదన ఒక బిలియన్ టన్నుల (బీటీ) స్థాయిని అధిగమించింది. ఇంతకు ముందు కనివిని ఎరుగని ఈ ఘట్టం ఉత్పత్తిని పెంచడానికి, రవాణాను వ్యవస్థీకరించడానికి, దేశ ఇంధన భద్రతను బలపరచడానికి బొగ్గు శాఖ అలుపెరుగక చేసిన కృషిని స్పష్టం చేస్తోంది.

బొగ్గు మొత్తం ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక బిలియన్ టన్నుల స్థాయిని అధిగమించి, ప్రస్తుతం 1047.57 మెట్రిక్ టన్నులకు (తాత్కాలిక అంచనా) చేరుకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 997.83 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పోల్చి చూస్తే 4.99 శాతం మేరకు చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసింది. వాణిజ్య, సొంత, ఇతర సంస్థలు కూడా బొగ్గు ఉత్పత్తిలో మహత్తరమైన స్థాయిలో 197.50 మెట్రిక్ టన్నుల (తాత్కాలికం) ఉత్పత్తిని సాధించాయి. ఇది గత సంవత్సరం నమోదైన 154.16 మెట్రిక్ టన్నుల స్థాయి కన్నా 28.11 శాతం వృద్ధిని సూచిస్తోంది.

బొగ్గు తరలింపులో కూడా ప్రశంసాపూర్వకమైన వృద్ధి కనిపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బొగ్గు రవాణా ఒక బిలియన్ టన్ను (బీటీ) ని దాటి, 2023-24 ఆర్థిక సంవత్సరంలోని 973.01 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 5.34 శాతం అధికంగా 1024.99 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. . వాణిజ్య , సొంత, ఇతర సంస్థల నుంచి బొగ్గు రవాణా సైతం గణనీయంగా పెరిగి, మునుపటి సంవత్సరంలోని 149.81 మెట్రిక్ టన్నుల కన్నా 31.39 శాతం వృద్ధిని చూపి 196.83 మెట్రిక్ టన్నులకు చేరుకొంది.
ఈ ఘట్టం అంతకంతకూ పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి సమర్థమైన పంపిణీ చర్యలు చేపడుతూనే దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని స్పష్టం చేస్తోంది. దేశ ఇంధన భద్రతకు, ఆర్థిక దృఢత్వానికి దన్నుగా నిలవడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ స్వయంసమృద్ధిని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు దీర్ఘకాలం మనుగడలో ఉండగలిగే గనుల తవ్వకం పద్ధతులను ముందుకు తీసుకుపోవడానికి కట్టుబడి ఉంది.
***
(Release ID: 2117495)