ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 28 MAR 2025 8:00PM by PIB Hyderabad

గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.

టీవీ9 నెట్‌వర్క్‌కు ప్రాంతీయ ప్రేక్షకుల సంఖ్య విస్తారంగా ఉంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులు చాలా మంది ఈ సమ్మిట్‌తో ప్రత్యక్ష భాగస్వామ్యం కలిగి ఉన్నారు. వివిధ దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి అభివాదం చేయడం నేను చూస్తున్నాను. వారందరికీ నా శుభాకాంక్షలు. దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు ఉత్సాహంతో ఈ సమావేశంలో పాలుపంచుకోవడం కింద తెరమీద నేను చూస్తున్నాను. వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

మిత్రులారా,

నేడు, ప్రపంచం దృష్టి మన భారత్‌పైనే ఉంది. మీరు ఏ దేశాన్ని సందర్శించినా, అక్కడి ప్రజలు భారత్ గురించి కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. 70 ఏళ్ల కాలంలో ప్రపంచంలోని 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం నేడు కేవలం 7-8 సంవత్సరాల్లో 5వ స్థానానికి చేరుకుంది. ఇటీవలే ఐఎమ్ఎఫ్ నుంచి కొత్త డేటా వెలువడింది, దాని ప్రకారం గత 10 ఏళ్లలో రెట్టింపు జీడీపీని నమేదు చేసిన ప్రపంచంలోని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమే. గత దశాబ్దంలో, భారత్ తన ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల డాలర్లను జోడించింది. జీడీపీని రెట్టింపు చేయడం కేవలం అంకెలపరమైన ఘనత కాదు.. అది నిజమైన ప్రభావాన్ని చూపుతుంది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు, వారు నవ మధ్యతరగతి వర్గంలో భాగమయ్యారు. ఈ నవ-మధ్యతరగతి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది, కొత్త కలలతో ముందుకు సాగుతోంది, మన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది, దానిని మరింత శక్తిమంతం చేస్తోంది. నేడు, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాను కలిగి ఉంది. ఈ యువకులు వేగంగా నైపుణ్యాలను పొందుతున్నారు, ఆవిష్కరణలను నడిపిస్తున్నారు, దేశాన్ని మెరుగ్గా మారుస్తున్నారు. వీటన్నిటి మధ్య, "ఇండియా ఫస్ట్" భారత్ విదేశాంగ విధాన మంత్రం మారింది. గతంలో, భారత్ విధానం అన్ని దేశాల నుంచి సమాన దూరం పాటించడం అనే విధానాన్ని అనుసరించింది అయితే ఈ "సమాన-దూరం" సరైన విధానం కాదు. కానీ నేడు, భారత్ విధానం "సమాన-సాన్నిహిత్యం"గా మారింది.. అంటే అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం. ఇప్పుడు భారత్ అభిప్రాయాలు, ఆవిష్కరణలు, ప్రయత్నాలను గతంలో కంటే ఎక్కువ విలువైనవిగా ప్రపంచం భావిస్తోంది. "భారత్ నేడు ఏమి ఆలోచిస్తుంది" అని తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తిగా భారత్ వైపు చూస్తోంది.

మిత్రులారా,

నేడు, భారత్ ప్రపంచ క్రమంలో పాల్గొనడమే కాకుండా భవిష్యత్తును రూపొందించడానికి, సురక్షితంగా ఉంచడానికి కూడా సహకారం అందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచం దీనిని ప్రత్యక్షంగా చూసింది. ప్రతీ భారతీయుడు వ్యాక్సిన్ పొందడానికి సంవత్సరాలు పడుతుందని చాలామంది విశ్వసించినా, భారత్  అది తప్పు అని నిరూపించింది. మనం మన సొంత వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాం, మన పౌరులకు అత్యంత వేగంగా టీకాలు అందించడంతో పాటు 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్స్ సరఫరా చేసాం. సంక్షోభ సమయంలో, భారత్ చర్యలు ప్రపంచానికి మన విలువలు, మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని చాటి చెప్పాయి.

మిత్రులారా,

గతంలో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఒక ప్రపంచ సంస్థ ఏర్పడినప్పుడల్లా, దానిపై తరచుగా కొన్ని దేశాలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ భారత్ గుత్తాధిపత్యాన్ని కోరుకోలేదు.. బదులుగా మనం అన్నింటికంటే మానవత్వానికి ప్రాధాన్యమిచ్చాం. 21వ శతాబ్దపు ప్రపంచ సంస్థలను రూపొందించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది, అవి అందరినీ కలుపుకొనేలా, ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించే స్వేచ్ఛ ఉండేలా చూసుకుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏ దేశానికి బలమైన రక్షణ శక్తి ఏమీ లేదు, అవి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈరోజు, మయన్మార్‌ను ఒక పెద్ద భూకంపం తాకింది, మనం టెలివిజన్‌లో చూసినట్లుగా, భారీ భవనాలు కూలిపోయాయి, వంతెనలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులను గుర్తించిన భారత్, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) అనే ప్రపంచ సంస్థను ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు.. ప్రకృతి వైపరీత్యాలకు ప్రపంచాన్ని సన్నద్ధం చేయడం పట్ల ఇది ప్రపంచ నిబద్ధత. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వంతెనలు, రోడ్లు, భవనాలు, పవర్ గ్రిడ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను సురక్షితంగా ఉంచేందుకు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా వాటిని నిర్మించడం కోసం భారత్ కృషి చేస్తోంది.

మిత్రులారా,

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. అలాంటి ఒక సవాలు మన ఇంధన వనరులు. అందుకే, ప్రపంచ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, భారత్ అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)ని ప్రతిపాదించింది. చిన్న దేశాలు కూడా సుస్థిర ఇంధనాల నుంచి ప్రయోజనం పొందేలా ఈ కార్యక్రమం పనిచేస్తుంది. ఇది వాతావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన అవసరాలను కూడా సురక్షితం చేస్తుంది. భారత్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 100కి పైగా దేశాలు చేరడం గర్వించదగిన విషయం.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో, ప్రపంచ వాణిజ్యంలో అసమతుల్యతలను, రవాణా వ్యవస్థలో సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, భారత్ కొత్త కార్యక్రమాల రూపకల్పనలో ప్రపంచంతో కలిసి పనిచేస్తోంది. అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ఈసీ). ఈ ప్రాజెక్ట్ ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యాలను వాణిజ్యం, అనుసంధానం ద్వారా కలుపుతుంది. ఇది ఆర్థిక అవకాశాలను పెంచడమే కాకుండా ప్రపంచ సప్లయి చెయిన్‌ను బలోపేతం చేస్తూ, ప్రపంచానికి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను కూడా అందిస్తుంది.

మిత్రులారా,

ప్రపంచ వ్యవస్థలను మరింత భాగస్వామ్యం కలిగి ఉండేలా, ప్రజాస్వామ్యబద్ధంగా మార్చడానికి భారత్ అనేక చర్యలు తీసుకుంది. ఇక్కడే, భారత్ మండపంలో, జీ20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ సందర్భంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు - ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం లభించింది. చాలా కాలంగా ఉన్న డిమాండ్ భారత్ అధ్యక్షతన నెరవేరింది. నేడు, ప్రపంచస్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని భారత్ స్పష్టంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నుంచి డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రపంచస్థాయి విధానాన్ని రూపొందించడం నుంచి అనేక ఇతర కార్యక్రమాల వరకు, భారత్ ప్రయత్నాలు నూతన ప్రపంచ క్రమంలో తన ఉనికిని పటిష్టం చేసుకున్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. ప్రపంచ వేదికపై భారత్ బలం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది!

మిత్రులారా,

21వ శతాబ్దంలో ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 25 సంవత్సరాల్లో, మా ప్రభుత్వం 11 సంవత్సరాలు దేశానికి సేవ చేసింది. "ఈ రోజు భారత్ ఏమి ఆలోచిస్తుంది" అనే దాని గురించి మనం మాట్లాడేటప్పుడు, మనం గతాన్ని కూడా చూడాలి - ఎదురైన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు కూడా మనం చూడాలి. భారత్ ఆధారపడటం నుంచి స్వావలంబనకు, ఆకాంక్షల నుంచి విజయాలకు, నిరాశ నుంచి అభివృద్ధికి ఎలా మారిందో అశేష టీవి9 ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. దశాబ్దం క్రితం గురించి ఆలోచిస్తే, గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండేది, మహిళలు చీకటి పడే వరకు లేదా తెల్లవారుజాము వరకు వేచి ఉండాల్సి వచ్చేది. నేడు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. 2013 వరకు వైద్య చికిత్స గురించిన చర్చలన్నీ అధిక ఖర్చుల చుట్టూ తిరిగేవి. నేడు, ఆ సమస్యకు పరిష్కారం ఆయుష్మాన్ భారత్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. పేద కుటుంబాల వంటగది గురించి ఆలోచించినప్పుడు, పొగతో నిండిన గదులే దర్శనమిచ్చేవి. నేడు, ఉజ్వల యోజన ద్వారా ఆ సమస్య కూడా పరిష్కారమైంది. మహిళలకు కనీసం బ్యాంకు ఖాతాలు లేని దుస్థితి ఉండేది. నేడు, జన్ ధన్ యోజన కారణంగా, 30 కోట్లకు పైగా మహిళలు తమ సొంత బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. గతంలో, బావులు, చెరువుల నుంచి తాగునీటిని తీసుకురావడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. నేడు, హర్ ఘర్ నల్ సే జల్ పథకంతో ఆ సమస్య పరిష్కారమైంది. మారింది దశాబ్దం మాత్రమే కాదు, ప్రజల జీవితాలు కూడా మారిపోయాయి. ప్రపంచం దీనిని గమనించింది, భారత అభివృద్ధి నమూనాను గుర్తిస్తోంది. నేడు, భారత్ కేవలం కలలు కనే దేశం కాదు –  విజయాలను సాధించే దేశం!

మిత్రులారా,

ఒక దేశం తన పౌరుల సౌకర్యాన్ని, సమయాన్ని విలువైనదిగా భావించినప్పుడు, దేశ పురోగతి వేగవంతం అవుతుంది. నేడు మనం భారత్‌లో ఈ పరివర్తనను చూస్తున్నాం. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గతంలో పాస్‌పోర్ట్ పొందడం ఎంతో కష్టమైన పనో మీకు తెలుసు. దీర్ఘకాల నిరీక్షణలు, సంక్లిష్టమైన డాక్యుమెంటేషన్, రాష్ట్ర రాజధానుల్లో మాత్రమే ఉన్న పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో పని పూర్తవాలంటే చిన్న పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు ఒకటీ, రెండు రోజులు నగరంలోనే ఉండాల్సి వచ్చేది. కానీ నేడు, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2013కు ముందు భారతదేశంలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు మాత్రమే ఉంటే, నేడు వాటి సంఖ్య 550కి పైగా ఉంది. పాస్‌పోర్ట్ పొందడానికి 50 రోజుల వరకు నిరీక్షించాల్సిన స్థితి నుంచి నేడు వేచి ఉండే సమయం కేవలం 5-6 రోజులకు తగ్గింది!

మిత్రులారా,

బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో కూడా ఇలాంటి పరివర్తననే మనం చూశాం. సుమారు 50-60 ఏళ్ల క్రితం,  ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచడానికే బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు చెప్పేవారు. కానీ వాస్తవం మనందరికీ తెలుసు. దశాబ్దాలుగా, లక్షలాది గ్రామాలకు బ్యాంకింగ్ సౌకర్యాలు లేవు. మేం ఈ పరిస్థితిని మార్చాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రతి ఇంటికీ చేరుకుంది. నేడు, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో, కనీసం ఒక బ్యాంకింగ్ టచ్ పాయింట్ ఉంది. మేం బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేశాం. నేడు, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఎ) గణనీయంగా తగ్గాయి. నేడు, బ్యాంకుల లాభాలు 1.4 లక్షల కోట్ల రూపాయలు దాటి, కొత్త రికార్డును సృష్టించాయి. ఇది మాత్రమే కాదు, ప్రజల డబ్బును దోచుకున్నవారు ఆ డబ్బును తిరిగి ఇవ్వవలసి వస్తోంది. తరచుగా విమర్శలను ఎదుర్కొనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), 22,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను అక్రమార్కుల నుంచి రాబట్టింది. ఈ డబ్బును దోచుకున్న వారి నుంచి వసూలు చేసి, వారి కారణంగా నష్టపోయిన బాధితులకు చట్టబద్ధంగా తిరిగి ఇస్తోంది.

మిత్రులారా,

సామర్ధ్యం పాలనను ప్రభావవంతంగా చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తయినప్పుడు, తక్కువ వనరులతో ఎక్కువ వృద్ధి సాధించినప్పుడు, వృధా లేనప్పుడు, రెడ్ టేప్ స్థానంలో రెడ్ కార్పెట్ పరిచినప్పుడు - ఇది నిజంగా దేశ వనరులను గౌరవించే ప్రభుత్వంతోనే సాధ్యం. గత 11 సంవత్సరాలుగా, ఇది మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉంది. నా అభిప్రాయాన్ని కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.

మిత్రులారా,

గత ప్రభుత్వాలు మంత్రిత్వ శాఖల్లో ఎంత ఎక్కువ మందికి ఎలా అవకాశం కల్పించాయో మనం చూశాం. కానీ మా మొదటి పదవీకాలంలోనే, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మేం అనేక మంత్రిత్వ శాఖలను విలీనం చేశాం. గతంలో, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు ప్రత్యేక మంత్రిత్వ శాఖలుగా ఉన్నాయి. మేం వాటిని గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో విలీనం చేశాం. అదేవిధంగా, విదేశీ వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల శాఖలు వేర్వేరుగా ఉండగా మేం వాటిని విలీనం చేశాం. గతంలో, జల వనరులు, నదుల అభివృద్ధి, తాగునీటి మంత్రిత్వ శాఖలు వేర్వేరు మంత్రిత్వ శాఖలుగా ఉండగా, మేం వాటిని జల్ శక్తి మంత్రిత్వ శాఖలో కలిపాం. రాజకీయ అవసరాల కంటే దేశ అవసరాలు, వనరులకు మేం ప్రాధాన్యం ఇచ్చాం.

మిత్రులారా,

మా ప్రభుత్వం అనవసరమైన సంక్లిష్టతలను తొలగించడం ద్వారా నియమాలు, నిబంధనలను సరళీకృతం చేసింది. ఔచిత్యాన్ని కోల్పోయిన దాదాపు 1,500 పాత చట్టాలను రద్దు చేశాం. దాదాపు 40,000 సమ్మతులను రద్దుచేశాం. దీనివల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలు అనవసరమైన వేధింపుల నుంచి విముక్తి పొందారు, రెండోది, ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థంగా మారింది. జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) దీనికి ఒక గొప్ప ఉదాహరణ. గతంలో, 30 కంటే ఎక్కువ రకాల పన్నులు ఉండేవి, వాటిని ఇప్పుడు ఒకే పన్నులో విలీనం చేశారు. దీని ద్వారా ఎంతో సమయం, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఆదా అయ్యింది.

మిత్రులారా,

ప్రభుత్వ కొనుగోళ్లలో వృధా ఖర్చులు, అవినీతి నాడు సర్వసాధారణంగా ఉండేవి, మీడియా తరచుగా నివేదించేది వీటి గురించే. దీన్ని తొలగించడానికి, మేం జీఈఎమ్ (ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్) ను ప్రవేశపెట్టాం. ఇప్పుడు, ప్రభుత్వ విభాగాలు ఈ ప్లాట్‌ఫామ్‌లో వారి అవసరాలను పేర్కొంటాయి. విక్రేతలు పారదర్శకంగా బిడ్‌లు వేస్తారు. తదనుగుణంగా ఆర్డర్లు ఇస్తారు. ఫలితంగా, అవినీతి గణనీయంగా తగ్గింది, ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసింది. మరొక గేమ్-ఛేంజింగ్ సంస్కరణ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ). ఈ నమూనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. డీబీటీ భారతీయ పన్ను చెల్లింపుదారులకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసి, ఆ డబ్బు అనర్హులకు చేరకుండా నిరోధించింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అనుభవిస్తున్న అనర్హులు, అసలు ఉనికిలో లేని వారిని ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించగలిగాం.

మిత్రులారా,

మా ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా నిజాయితీగా ఉపయోగించేందుకు కృషి చేస్తోంది. మేం పన్ను చెల్లింపుదారులను గౌరవిస్తాం, పన్ను వ్యవస్థను మరింత వినియోగదారుల-హితంగా మార్చాం. ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) దాఖలు ఇప్పుడు గతంలో కంటే వేగంగా, సులభంగా ఉంది. గతంలో, సీఎ లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడం దాదాపు అసాధ్యం. నేడు, ఎవరైనా నిమిషాల్లోనే తమ ఐటీఆర్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు, రిటర్న్‌లు దాఖలు చేసిన కొన్ని రోజుల్లోనే రీఫండ్‌లు ప్రాసెస్ చేస్తున్నారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ స్కీమ్ పన్ను చెల్లింపుదారులకు అనవసరమైన ఇబ్బందులను తొలగించింది. ఇటువంటి పాలనాపరమైన సంస్కరణల ద్వారా, భారత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది - సమర్థ పాలనకు కొత్త నమూనాగా ఉంది.

మిత్రులారా,

గత 10-11 సంవత్సరాల్లో, భారత్ అన్ని రంగాల్లో మెరుగైన పరివర్తన సాధించి, గణనీయంగా అభివృద్ధి చెందింది. కానీ అతిపెద్ద మార్పు మన మనస్తత్వంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల వరకు, దేశంలో విదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉన్నతమైనవిగా భావించే మనస్తత్వాన్ని ప్రోత్సహించారు. దుకాణాల్లో కూడా, ఏదైనా అమ్మేటప్పుడు దుకాణదారుడు మొదట చెప్పేది - 'సోదరా, దీన్ని తీసుకోండి, ఇది దిగుమతి చేసుకున్నది!' అనే, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు, ప్రజలు 'సోదరా, ఇది భారత్‌లో తయారైందేనా?' అని ముందుగానే అడుగుతున్నారు

మిత్రులారా,

ఈ రోజు మనం భారత్ తయారీ రంగంలో నవ శకాన్ని చూస్తున్నాం. కేవలం 3-4 రోజుల క్రితం, భారత్ తన మొదటి ఎమ్ఆర్ఐ యంత్రాన్ని నిర్మించిందనే వార్తలు చూశాం. దాని గురించి ఆలోచించండి - దశాబ్దాలుగా, మన దగ్గర స్వదేశీ ఎమ్ఆర్ఐ యంత్రం లేదు. ఇప్పుడు మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా ఎమ్ఆర్ఐ యంత్రం ఉంది కాబట్టి, వైద్య పరీక్షల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

మిత్రులారా,

ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు దేశ తయారీ రంగంలో కొత్త శక్తిని నింపాయి. గతంలో, ప్రపంచం భారత్‌ను కేవలం ప్రపంచ మార్కెట్‌గా చూసింది, కానీ నేడు, అదే ప్రపంచం భారత్‌ను ఒక ప్రధాన తయారీ కేంద్రంగా చూస్తోంది. ఈ విజయ స్థాయిని వివిధ రంగాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకు, మన మొబైల్ ఫోన్ పరిశ్రమను తీసుకోండి. 2014-15లో, మన మొబైల్ ఎగుమతుల విలువ ఒక బిలియన్ డాలర్లు కూడా లేదు. కానీ ఒక దశాబ్దంలోనే, మనం ఇరవై బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాం. నేడు, భారత్ ప్రపంచ టెలికాం, నెట్‌వర్కింగ్ పరిశ్రమలో శక్తి కేంద్రంగా ఎదుగుతోంది. మన ఆటోమోటివ్ రంగం విజయం గురించి కూడా మీకు బాగా తెలుసు. ఆటోమోటివ్ విడిభాగాల ఎగుమతిలో భారత్ బలమైన ముద్ర వేస్తోంది. గతంలో, మనం పెద్ద సంఖ్యలో మోటార్‌సైకిల్ విడిభాగాలను దిగుమతి చేసుకున్నాం. కానీ నేడు, భారత్‌లో తయారైన విడిభాగాలు యుఎఇ, జర్మనీ వంటి దేశాలకు చేరుతున్నాయి. సౌరశక్తి రంగం కూడా అద్భుతమైన వృద్ధిని సాధించింది. మన సౌర ఘటాలు, సౌర మాడ్యూళ్ల దిగుమతులు తగ్గాయి, ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి. గత దశాబ్దంలో, మన రక్షణ ఎగుమతులు కూడా 21 రెట్లు పెరిగాయి. ఈ విజయాలన్నీ మన తయారీరంగ ఆర్థిక బలాన్ని, దేశవ్యాప్తంగా ప్రతి రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనను గురించి చాటుతున్నాయి.

మిత్రులారా,  

ఈ టీవీ9 సమ్మిట్‌లో, వివిధ అంశాలపై విస్తృతమైన, లోతైన చర్చలు జరుగుతాయి. ఈ రోజు మనం ఏమనుకుంటున్నా, ఏ దృష్టితో ముందుకు సాగినా, అది మన దేశ భవిష్యత్తును రూపొందిస్తుంది. గత శతాబ్దంలోని ఇదే దశాబ్దంలో, భారత్ నూతన శక్తితో స్వాతంత్య్ర సాధన దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. మనం 1947లో విజయవంతంగా స్వాతంత్య్రాన్ని సాధించాం. ఇప్పుడు, ఈ దశాబ్దంలో, మనం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపు కదులుతున్నాం. 2047 నాటికి 'వికసిత్ భారత్' కలను మనం నెరవేర్చుకోవాలి. నేను ఎర్రకోట నుంచి చెప్పినట్లుగా, ఈ మిషన్‌ కోసం 'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి కృషి) చాలా అవసరం. ఈ సమ్మిట్‌ను నిర్వహించడం ద్వారా, టీవీ9 కూడా సానుకూల చొరవ తీసుకుంది. మరోసారి, ఈ సమ్మిట్ విజయవంతం కావాలని కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ముఖ్యంగా నేను టీవీ9ని అభినందించాలనుకుంటున్నాను ఎందుకంటే మీడియా సంస్థలు గతంలో సమ్మిట్‌లను నిర్వహించినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం ఒక చిన్న ఫైవ్ స్టార్ హోటల్ గదిలో, కొందరు వక్తలు, కొందరు ప్రేక్షకులు, ఒకే వేదికతో జరిగాయి. టీవీ9 ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి కొత్త నమూనాను ప్రవేశపెట్టింది. నా మాటలను గుర్తుంచుకోండి - రెండు సంవత్సరాల్లో, అన్ని మీడియా సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, 'టీవీ9 థింక్స్ టుడే' ఇతరులకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, మీ మొత్తం బృందాన్ని అభినందిస్తున్నాను. అత్యంత ప్రశంసనీయమైన అంశం ఏమిటంటే, మీరు ఈ కార్యక్రమాన్ని కేవలం మీడియా సంస్థ ప్రయోజనం కోసం కాకుండా దేశ సంక్షేమం కోసం నిర్వహిస్తున్నారు. 50,000 మందికి పైగా యువత మిషన్ మోడ్‌లో పాల్గొనడం, వారిని ఒక లక్ష్యంతో అనుసంధానించడం, ఆశాజనకమైన వ్యక్తులను ఎంచుకోవడం, వారి తదుపరి శిక్షణను నిర్ధారించడం నిజంగా ఒక అసాధారణ కార్యక్రమం. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతిభావంతులైన యువతతో ఫోటో తీసుకునే అవకాశం కూడా నాకు లభించింది, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరితో కలిసి నేను ఫోటో దిగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2047లో దేశం 'వికసిత్ భారత్'గా మారినప్పుడు నేను నేడు చూస్తున్న యువతరం అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అప్పటికి, అభివృద్ధి చెందిన భారత్‌లో మీరు మీ కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు, మీకు అవకాశాలు అంతులేనివిగా ఉంటాయి. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.


 

***


(Release ID: 2116959) Visitor Counter : 9