బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు ఉత్పత్తి, పంపిణీలో పారదర్శకత

Posted On: 26 MAR 2025 1:01PM by PIB Hyderabad

బొగ్గు ఉత్పత్తి, పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి కింది చర్యలను ప్రభుత్వం తీసుకుంది:

i.             కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) / సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ప్రధాన సమాచార సాంకేతిక (ఐటీ) కార్యక్రమాలను చేపట్టాయి. సంస్థ వనరుల ప్రణాళిక (ఈఆర్పీ) వ్యవస్థల ద్వారా బొగ్గు ఉత్పత్తిని నివేదిస్తున్నారు.

ii.           బొగ్గును పారదర్శకంగా పంపిణీ చేయడం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ రూపొందించిన విధానం, జారీ చేసిన మార్గదర్శకాలను సీఐఎల్/ ఎస్సీసీఎల్ అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలు – నూతన బొగ్గు పంపిణీ విధానం (ఎన్సీడీపీ), భారత్ లో కోయల (బొగ్గు) పారదర్శక వినియోగం, కేటాయింపు కోసం పథకం (శక్తి), అనియంత్రిత రంగం (ఎన్ఆర్ఎస్) కోసం వేలం ద్వారా బొగ్గు సరఫరా ఒప్పందాలు, లింకేజీ విధానాల్లో అంతరాలను తొలగించడం, సింగిల్ విండో తరహాలో అన్ని రవాణా విధానాల్లోనూ బిడ్డర్లకు ఇ-వేలం, లింకేజీల హేతుబద్ధీకరణ మొదలైనవి. అవసరానికి అనుగుణంగా ఈ విధానాలకు సవరణలు జరుగుతాయి. బొగ్గు కంపెనీలు, వినియోగదారుల మధ్య ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం వినియోగదారుడికి బొగ్గు సరఫరా చేస్తారు.

దేశంలోని బొగ్గు గనుల్లో పర్యావరణ సుస్థిరతను పెంపొందించడం కోసం- మొక్కలు నాటడం/ జీవ పునరుద్ధరణ, సామాజిక ఉపయోగం కోసం గని నీటిని వినియోగించుకోవడం, పర్యావరణ పరిరక్షణ పార్కుల ఏర్పాటు, తక్కువ ఇంధనంతో ఎక్కువ ఫలితాలనిచ్చే చర్యల వంటి వివిధ సుస్థిర, పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది.

వేలంలో గెలిచిన బిడ్డర్, అధికారిక సంస్థ మధ్య ‘వాణిజ్యపరమైన మైనింగ్ కోసం బొగ్గు బ్లాకుల అభివృద్ధి, ఉత్పత్తి ఒప్పందం’ జరుగుతుంది. దీని ప్రకారం- ఆధునిక, విస్తృత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బొగ్గు గనిలో యంత్రాల సాయంతో బొగ్గు వెలికితీత, రవాణా, తరలింపులు చేపట్టాల్సి ఉంటుంది. దీని ప్రకారం వేలంలో గెలిచిన బిడ్డర్ పారిశ్రామిక బొగ్గు గనుల్లో చేపట్టే కార్యకలాపాల నుంచి విడుదలయ్యే కర్బనోద్గారాలను తగ్గించడానికి విస్తృతంగా చర్యలు తీసుకోవాలి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలి.

బొగ్గు గనుల నుంచి కర్బనోద్గారాలను తగ్గించడానికి బొగ్గు కంపెనీలు కింది చర్యలు తీసుకుంటున్నాయి:

i.  మొక్కలను నాటడం ద్వారా కర్బన శోషణ ఏర్పాట్లు చేయడం.

ii. సారం కోల్పోయిన భూమిని పునరుద్ధరించడం.

iii. బొగ్గు పొరల నుంచి మీథేన్ వెలికితీత, బొగ్గును సంశ్లిష్ట వాయువుగా మార్చడం సహా బొగ్గుకు సంబంధించి వివిధ పర్యావరణ హిత సాంకేతికతలను వినియోగించడం.  

iv. రోడ్డు రవాణాను తగ్గించడం, బొగ్గును లోడ్ చేయడంలో యంత్రాల వినియోగాన్ని పెంచడం, బొగ్గ గని నుంచి నిర్దేశిత ప్రాంతానికి అంతరాయం లేకుండా బొగ్గును తరలించేలా రవాణా సదుపాయాలను మెరుగుపరచడం.

v.  తక్కువ ఇంధనంతో మెరుగైన ఫలితాలను సాధించేలా చర్యలు తీసుకోవడం.

vi. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, భూతాప శక్తి వంటి మొదలైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టడం.

బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయించిన మొత్తం ఆధీన/ వాణిజ్య ప్రైవేటు బొగ్గు గనుల సంఖ్య 28. వీటికి గనుల ప్రారంభానికి సంబంధించిన అనుమతులు లభించాయి. వీటిలో 26 బొగ్గు గనులు ఉత్పత్తిని ప్రారంభించాయి.

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)/ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వాటి ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు ఆస్పత్రులు/ డిస్పెన్సరీలలో వైద్య చికిత్స సదుపాయాన్ని అందిస్తాయి. దానితోపాటు అవసరాన్ని బట్టి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక వైద్య చికిత్స సదుపాయాలను పొందేందుకు దేశవ్యాప్తంగా తమ పరిధిలో ఉన్న హాస్పిటళ్లకు కూడా వెళ్లవచ్చు. సీఐఎల్/ అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకు కంపెనీ ఆసుపత్రులు/డిస్పెన్సరీలలో అందుబాటులో ఉన్న విధంగానే ఇండోర్, ఓపీడీ సదుపాయాలను అందిస్తున్నారు. నిర్ణీత సభ్యత్వ రుసుమును చెల్లించిన ఎస్సీసీఎల్ తాత్కాలిక ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములను కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్‌లో చేర్చారు. దీని ప్రకారం ఆయా సంస్థలకు సంబంధించిన హాస్పిటళ్లలో వారు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతానికి సీఐఎల్/ ఎస్సీసీఎల్ బొగ్గు గని కార్మికులకు ఆరోగ్య బీమా పథకం లేదు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లోకసభలో ఈరోజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2115572) Visitor Counter : 18