ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నగదు రహిత భారత్ దిశగా ప్రయాణం


తక్కువ విలువ ఉన్న భీమ్ – యూపీఐ లావాదేవీలకు రూ.1,500 కోట్లతో ప్రోత్సాహక పథకం

Posted On: 24 MAR 2025 2:09PM by PIB Hyderabad

·         తక్కువ విలువ ఉన్న భీమ్ - యూపీఐ (పీ2ఎం) లావాదేవీలను, చిన్న వ్యాపారుల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

·         రూ. 2,000 లోపు చేసే యూపీఐ లావాదేవీలపై చిన్న వ్యాపారులకు సున్నా ఎండీఆర్‌తో పాటు 0.15 శాతం ప్రోత్సాహకాన్ని ఈ పథకం అందిస్తుంది.

·         గ్రామీణ, సెమీ- అర్బన్ ప్రాంతాల్లో యూపీఐ 123 పే, లైట్, లైట్‌ఎక్స్ తదితర సేవల ద్వారా యూపీఐ మౌలిక సదుపాయాలను విస్తరించడమే ఈ పథకం లక్ష్యం.

·         ఏసీఐ ప్రపంచవ్యాప్త నివేదిక 2024 ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆన్లైన్ లావాదేవీల్లో 49 శాతం భారత్‌లోనే జరిగాయి. ఇది డిజిటల్ చెల్లింపుల్లో అంతర్జాతీయ స్థాయిలో భారత్ నాయకత్వాన్ని తెలియజేస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తక్కువ విలువ ఉన్న భీమ్ - యూపీఐ చెల్లింపుల ప్రోత్సాహాక పథకం (వ్యక్తి నుంచి వ్యాపారికి - పీ2ఎం)ను ఆమోదించారు. ఇది డిజిటల్ చెల్లింపులను పెంపొందించడం, యూపీఐని స్వీకరించేలా చిన్నవర్తకులను ప్రోత్సహించడం, ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.

భారత్‌లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడం

ఆర్థిక సమ్మిళతత్వాన్ని సాధించడం, చెల్లింపుల్లో సామాన్యుడికి విస్తృతమైన అవకాశాలను కల్పించాలన్న వ్యూహంలో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

వినియోగదారులు/వ్యాపారులకు సేవలు అందించడానికి అయ్యే ఖర్చును మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా డిజిటల్ పేమెంట్ సంస్థలు తిరిగి పొందుతాయి. డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై వ్యాపారులు పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థలకు చెల్లించాల్సిన రుసుమే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)‌. సాధారణంగా లావాదేవీ మొత్తంపై ఒక శాతం రుసుమును ఎండీఆర్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ ప్రకారం, కార్డులకు సంబంధించిన అన్ని సంస్థల్లో డెబిట్ కార్డు లావాదేవీలపై 0.90 శాతం వరకు ఎండీఆర్ వర్తిస్తుంది. ఎన్‌పీసీఐ ప్రకారం యూపీఐ పీ2ఎం (వ్యక్తి నుంచి వ్యాపారికి) లావాదేవీలపై 0.30 శాతం వరకు ఎండీఆర్ వర్తిస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టం, 2007లోని సెక్షన్ 10 ఏ, ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్‌యూలకు చేసిన సవరణల ద్వారా జనవరి 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భిమ్ - యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను సున్నా చేశారు.

కేబినెట్ ఆమోదం అనంతరం రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ ఉన్న భీమ్-యూపీఐ (పీ2ఎం) లావాదేవీల ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది చెల్లింపు వ్యవస్థల్లో పాల్గొనే వారికి సమర్థవంతమైన సేవలను అందించడంలో మద్దతు అందిస్తుంది. ఈ ప్రోత్సాహాకాన్ని అక్వైరింగ్ బ్యాంకు (వ్యాపారి ఖాతా  ఉన్న బ్యాంకు)కి చెల్లిస్తుంది.  అనంతరం ఈ బ్యాంకు లావాదేవీలో భాగస్వామ్యం ఉన్న ఇతరులకు అంటే ఇష్యూయర్ బ్యాంకు (వినియోగదారుని ఖాతా ఉన్న బ్యాంకు), లావాదేవీ సేవలను అందించిన బ్యాంకు (యూపీఐ సేవలు/ఏపీఐ ఏకీకృత ప్రక్రియను సులభతరం చేయడం), యాప్ ప్రొవైడర్లు (టీపీఏపీలు)తో ప్రోత్సాహకాన్ని పంచుకుంటుంది. గడచిన మూడు ఆర్థిక సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించిన ప్రోత్సాహక మొత్తం (రూ. కోట్లలో):    


ఇక్కడ గ్రాఫ్ వాడాలి


పథకం గురించి

తక్కువ విలువ ఉన్న భీమ్ - యూపీఐ లావాదేవీల (పీ2ఎం) ప్రోత్సాహక పథకం రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో 2024, ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు అమలవుతుంది. ఇది ముఖ్యంగా రూ. 2,000 వరకు యూపీఐ (వ్యక్తి నుంచి వ్యాపారికి -పీ2ఎం) లావాదేవీలను కవర్ చేస్తుంది. ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని స్వీకరించేలా చిన్న వ్యాపారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇటీవలి కాలంలో యూపీఐ లావాదేవీల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ లావాదేవీల మొత్తం విలువ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.3 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది జనవరి నాటికి రూ.213.8 లక్షల కోట్లకు చేరుకుంది. అందులోనూ వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎం) జరుగుతున్న చెల్లింపులు క్రమంగా పెరిగి రూ.59.3 కోట్లకు చేరుకున్నాయి. ఇది వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను స్వీకరిస్తున్నారని సూచిస్తోంది.


ఇక్కడ గ్రాఫ్ వాడాలి

పీ2పీ – వ్యక్తి నుంచి వ్యక్తికి, పీ2ఎం – వ్యక్తి నుంచి వ్యాపారికి

పథకం లక్ష్యాలు

·         భీమ్ – యూపీఐ వేదికను ప్రోత్సహించడం: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల విలువైన లావాదేవీలను చేరుకోవడమే లక్ష్యం.

·         చెల్లింపులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం: సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను రూపొందించే వారికి తోడ్పాటు.

·         విశ్వసనీయతకు హామీ: కంప్యూటర్లు నిరంతరం పని చేసేలా చూడటం, సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడాన్ని తగ్గించడం

·         గ్రామీణ ప్రాంతాల్లో వినియోగాన్ని పెంచడం: దిగువ పేర్కొన్నవాటిని ఉపయోగించి టైర్ 3 నుంచి 6 వరకు ఉన్న నగరాలు, మారుమూల ప్రాంతాల్లో యూపీఐ సేవలు విస్తరించడం

·    యూపీఐ 123పే (ఫీచర్ ఫోన్లకు)

·    యూపీఐ లైట్, యూపీఐ లైట్ఎక్స్ (ఆఫ్‌లైన్ పేమెంట్లకు)


ప్రోత్సాహకాలు అందించే విధానం

ఇక్కడ గ్రాఫ్ వాడాలి

కేంద్రం ఆమోదించిన పథకం ప్రకారం, వ్యాపార వర్గం, లావాదేవీ విలువ ఆధారంగా ప్రోత్సాహకాలను రూపొందించారు. చిన్నవ్యాపారుల విషయంలో.. రూ. 2,000 వరకు చేసే లావాదేవీలకు సున్నా మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తిస్తుంది. దీనితో పాటు 0.15 శాతం ప్రోత్సాహకం లభిస్తుంది. లావాదేవీలు రూ.2,000 దాటితే  సున్నా ఎండీఆర్ వర్తిస్తుంది. కానీ ప్రోత్సాహకం లభించదు. అదే పెద్ద వ్యాపారులకైతే, విలువతో సంబంధం లేకుండా అన్ని లావాదేవీలకు సున్నా ఎండీఆర్ ఉంటుంది. ఎలాంటి ప్రోత్సాహకం లభించదు.

రీఎంబర్స్మెంట్ విధానం

1.     వ్యాపారి ఖాతా ఉన్న బ్యాంకు క్లెయిమ్ చేసుకోవడానికి అంగీకరించిన మొత్తంలో 80 శాతాన్ని ప్రతి త్రైమాసికంలోనూ ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేస్తారు.

2.    మిగిలిన 20 శాతాన్ని దిగువ పేర్కొన్న పని తీరు ప్రమాణాల ఆధారంగా విడుదల చేస్తారు:

·         అక్వైరింగ్ బ్యాంకు టెక్నికల్ డిక్లైన్ రేటు (సాంకేతిక కారణాల వల్ల విఫలమైన లావాదేవీలు) 0.75 శాతాని కంటే తక్కువ ఉంటే  క్లెయిము చేసుకున్న మొత్తంలో 10 శాతం విడుదల చేస్తారు.

·         మిగిలిన 10 శాతాన్ని అక్వైరింగ్ బ్యాంకు సాంకేతిక పరికరాల (అందుబాటులో ఉన్న వారి సాంకేతిక వ్యవస్థలు) పనితీరు 99.5 శాతం కంటే ఎక్కువ ఉంటేనే చెల్లిస్తారు.


ఇక్కడ గ్రాఫ్ వాడాలి


యూపీఐ- వ్యాపారులకు కలిగే ప్రయోజనాలు

పథకం ప్రధాన ప్రయోజనాలు

·         సౌలభ్యం, వేగం: అవరోధాలు లేని, సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపులు నగదు ప్రవాహాన్ని పెంచుతాయి, డిజిటల్ క్రెడిట్ సౌకర్యాన్ని అందిస్తాయి.

·         అదనపు ఛార్జీలు ఉండవు: ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండాను పౌరులు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

·         చిన్న వ్యాపారులకు తోడ్పాటు: యూపీఐ చెల్లింపులను స్వీకరించేలా చిన్న వ్యాపారులను ప్రోత్సహిస్తుంది.

·         స్వల్ప నగదు గల ఆర్థిక వ్యవస్థ: జవాబుదారీతనం ఉన్న అధికారిక లావాదేవీలను ప్రోత్సహిస్తుంది.

·         వ్యవస్థల సామర్థ్యం: ఉత్తమ పనితీరు కలిగిన సాంకేతిక వ్యవస్థ, స్వల్ప వైఫల్య రేటు ఉన్న పరిస్థితులు 24x7 నమ్మకమైన చెల్లింపు సేవలను అందిస్తాయి.

·         సమతౌల్య విధానం: ప్రభుత్వ వ్యయాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తూనే డిజిటల్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

భీమ్-యూపీఐ ప్రత్యేక లక్షణాలు

·         మొబైల్ పరికరాల ద్వారా 24 గంటలు, ఏడాదిలో 365 రోజులూ ఏ సమయంలోనైనా తక్షణమే నగదు బదిలీ చేయవచ్చు.

·         ఏకీకృత సేవలు: వివిధ బ్యాంకు ఖాతాలను  ద్వారా చెల్లింపుల చేయడానికి ఒకే మొబైల్ యాప్

·         సింగిల్ క్లిక్ 2ఎఫ్ఏ: దృఢమైన, అవరోధాలు లేని రెండంచెల ధ్రువీకరణ

·         వర్చువల్ చిరునామాలు: మెరుగైన భద్రత – బ్యాంకు లేదా కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు.

·         క్యూఆర్ కోడ్ చెల్లింపులు: సులభంగా స్కాన్ చేసి చెల్లించే అనుభవం

·         బహుముఖ ప్రయోజనాలు: యాప్‌లో కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లులు, విరాళాలు, సేకరణ తదితరమైన ఎన్నో పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

·          నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం: వినియోగదారులు తమ సమస్యలను మొబైల్ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

యూపీఐ అంతర్జాతీయ విస్తరణ:

సరిహద్దులు దాటి విస్తరిస్తున్న యూపీఐ, రూపేలతో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఏడు దేశాల్లో యూపీఐ సేవలు అందిస్తోంది. అవి: యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్.

·         ఐరోపాలో యూపీఐ సేవలు ఫ్రాన్స్ నుంచి మొదలయ్యాయి. ఇది విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సులభంగా చెల్లింపులు చేసేందుకు దోహదపడుతోంది.

·         చెల్లింపులు, ఆర్థిక సమ్మిళతత్వం పెంపొందించేందుకు, అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు బ్రిక్స్ గ్రూపులో సైతం యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

·         ఏసీఐ ప్రపంచ నివేదిక 2024 ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆన్లైన్ లావాదేవీల సంఖ్యలో 49 శాతం భారత్‌లో జరిగాయి. ఇది డిజిటల్ చెల్లింపుల్లో అంతర్జాతీయ స్థాయిలో భారత్ నాయకత్వాన్ని తెలియజేస్తుంది.


ఇక్కడ గ్రాఫ్ వాడాలి


సమ్మిళిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం

భారత్ డిజిటల్ ప్రయాణంలో వేసిన ముఖ్యమైన ముందడుగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన ప్రోత్సాహక పథకం. ఇది చిన్నవ్యాపారుల్లో భీమ్-యూపీఐ వినియోగాన్ని పెంచడమే కాకుండా దేశ ఆర్థిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయంగా రాణిస్తున్న యూపీఐతో ఆవిష్కరణ, సమ్మిళితత్వం, సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల్లో ప్రమాణాలను భారత్ నిర్దేశిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని రకాల వ్యాపారాలను ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవని, సురక్షితమైన, చౌకగా లభించే నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.  



 

***


(Release ID: 2114815) Visitor Counter : 18