సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మారుతున్న వ్యవసాయ- పాడి పరిశ్రమ రంగాల ముఖ చిత్రం ఇటీవలి విధాన నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులే కారణం
Posted On:
20 MAR 2025 6:49PM by PIB Hyderabad
సారాంశం
రూ. 1,000 కోట్ల అదనపు బడ్జెట్‌తో సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి
కార్యక్రమం (ఎన్‌పీడీడీ)ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
పశు సంవర్థక రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 1,000 కోట్ల అదనపు వ్యయంతో
సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం)ను కూడా కేంద్ర కేబినెట్
ఆమోదించింది.
వ్యవసాయాన్ని దేశాభివృద్ధికి అతి ముఖ్యమైన చోదక శక్తిగా 2025-26 కేంద్ర బడ్జెట్ వర్ణించింది.
డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)కి ఒకసారి వర్తించే విధంగా ప్రత్యేక
ప్యాకేజీని 2025, జనవరి 1 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు
పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జనవరి 1న ఈ నిర్ణయం
తీసుకున్నారు.
రూ. 2481 కోట్ల అంచనాతో జాతీయ సహజ వ్యవసాయ కార్యక్రమం (ఎన్ఎంఎన్ఎప్)ను
ప్రారంభించేందుకు 2024, నవంబర్ 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వ్యవసాయం, రైతు మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత
పథకాల (సీఎస్ఎస్)ను ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి యోజన (పీఎం-ఆర్కేవీవై),
కృషోన్నతి యోజన (కేవై) అనే రెండు ప్రధాన పథకాలుగా హేతుబద్ధీకరణకు 2024,
అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ. 10,103 కోట్ల వ్యయంతో జాతీయ వంటనూనెలు - నూనెగింజల కార్యక్రమానికి
అక్టోబర్ 3, 2024న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
పరిచయం
భారత్‌లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, పశుసంవర్థక రంగాలను మరింత అభివృద్ధి
చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ నెల 19న రెండు ముఖ్యమైన నిర్ణయాలు
తీసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పశు సంవర్థకం, పాడి
పరిశ్రమలు ముఖ్యమైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని
సాధించడంలో ఈ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
కేంద్ర ప్రాయోజిత పథకమైన సవరించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి
కార్యక్రమం (ఎన్‌పీడీడీ)ను రూ. 1,000 కోట్ల అదనపు బడ్జెట్ తో కేబినెట్
ఆమోదించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధి (2021-22 నుంచి
2025-26)కి గాను ఈ మొత్తం రూ.2,790 కోట్లకు చేరుకుంటుంది.
సవరించిన ఎన్‌పీడీడీ ప్రధాన లక్ష్యాలు:
* పాల ఉత్పత్తి, శుద్ధి సామర్థ్యం, నాణ్యతా నియంత్రణను పెంపొందించడం
* విలువను జోడించడం ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం,
మెరుగైన ధరలను కల్పించడం
* పాడి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రామీణ ఆదాయం, అభివృద్ధిని మెరుగుపరచడం
సవరించిన ఎన్‌పీడీడీలో భాగాలు:
1. భాగం ఎ: పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాలను మెరుగుపరడంపై దృష్టి
2. భాగం బి: జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) భాగస్వామ్యంతో
సహకార సంస్థల ద్వారా పాడి పరిశ్రమ నిర్వహణ (డీటీసీ)
సవరించిన ఎన్‌పీడీడీ ద్వారా ఆశిస్తున్న ఫలితాలు:
* 10,000 కొత్త పాడి సహకార సంఘాల ఏర్పాటు
* అదనంగా 3.2 లక్షల ఉద్యోగ అవకాశాలు, వీటిలో 70 శాతం మేర లబ్ధి మహిళలకు అందుతుంది.
పశు సంవర్థక రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 1,000 కోట్ల అదనపు వ్యయంతో
సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం)కు కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధి (2021-22 నుంచి 2025-26)కి
మొత్తం బడ్జెట్ రూ. 3,400 కోట్లకు చేరుకుంటుంది.
సవరించిన ఆర్‌జీఎంకు జోడించిన ముఖ్యాంశాలు:
1. ఆవు దూడల పెంపకం కేంద్రాలు: 15,000 ఆవు దూడలను పెంచేందుకు 30
కేంద్రాలను ఏర్పాటు చేయడానికయ్యే పెట్టుబడి వ్యయంలో ఒకసారికి వర్తించేలా
35 శాతాన్ని సాయంగా అందిస్తుంది.
2. జన్యుపరంగా అత్యుత్తమ లక్షణాలు (హెచ్‌జీఎం) కలిగిన లేగదూడల కొనుగోలుకు
సాయం: పాల సంఘాలు/ఆర్థిక సంస్థల ద్వారా హెచ్‌జీఎం ఐవీఎఫ్ దూడలను కొనుగోలు
చేసేందుకు రైతులు తీసుకున్న రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ
ఆర్‌జీఎం కింద కొనసాగుతున్న కార్యక్రమాలు:
* వీర్య కేంద్రాలు, కృత్రిమ గర్భధారణ (ఏఐ) వ్యవస్థల బలోపేతం
* లింగ ఆధారంగా వేరు చేసిన వీర్యం ఉపయోగించి ఎద్దుల ప్రజననం, జాతిని వృద్ధి చేయడం
* నైపుణ్యాభివృద్ధి, రైతులకు అవగాహనా కార్యక్రమాలు
ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేంద్రీయ పశువుల గర్భధారణ కేంద్రాలను బలోపేతం చేయడం
సవరించిన ఆర్‌జీఎం నుంచి ఆశిస్తున్న ఫలితాలు:
* పాడిపరిశ్రమలో ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఆదాయాన్ని పెంపొందించడం
* దేశీయ గోజాతులను శాస్త్రీయంగా పరిరక్షించడం
ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారు, రెండో అతిపెద్ద కూరగాయలు, పండ్ల
ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. ఆర్గానిక్ ఉత్పత్తులు, విలువ జోడించిన పాల
ఉత్పత్తులు, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులకు అంతర్జాతీయంగా డిమాండ్
పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, రైతులకు మార్కెట్
అవకాశాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించింది. గడచిన
ఆరు నెలల్లో ఈ రంగాలను ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన
విధాన నిర్ణయాలను ప్రవేశపెట్టింది. లక్ష్య ఆధారిత పెట్టుబడులు, నియంత్రణా
సంస్థల మద్ధతు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని
పెంపొందించేందుకు, పశుగణంలో వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తోంది. వీటితో
పాటుగా చిన్న, సన్నకారు రైతులుకు ప్రయోజనం చేకూర్చేలా సహకార ఉద్యమాలను
ప్రోత్సహించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యసాధనలో కీలకమైన అంశం
కేంద్ర బడ్జెట్ 2024-25. దీనిలో వ్యవసాయం, పశు ఆరోగ్యం,
గ్రామీణాభివృద్ధికి గణనీయంగా కేటాయింపులు చేశారు.
వ్యవసాయం, పశుసంవర్ధకంతోపాటు పాడిపరిశ్రమకు సంబంధించి 2024-25 కేంద్ర
బడ్జెటులో కేటాయింపులు
వ్యవసాయం భారతదేశ అభివృద్ధికి అత్యంత ప్రధాన చోదకశక్తి అని 2025-26
కేంద్ర బడ్జెటు స్పష్టం చేసింది. ఉత్పాదకతను, రైతుల ఆదాయాలను, గ్రామీణ
ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనను, కీలక సరకులలో స్వయంసమృద్ధిని
మెరుగుపరచడంపైన బడ్జెటులో దృష్టిని కేంద్రీకరించారు. ప్రధాన రంగం సంపూర్ణ
వృద్ధికి పూచీపడడానికి పశు సంవర్ధకం, పాడిపరిశ్రమ, చేపల పరిశ్రమలకు కూడా
కేటాయింపులను వర్తింపచేశారు.
1. వ్యవసాయ రంగానికి కేటాయింపులు
1.1 ప్రధానమంత్రి ధన- ధాన్య కృషి యోజన
* ఉత్పాదకత తక్కువగా ఉంటున్న 100 జిల్లాల్లో ఒక కొత్త పథకాన్ని అమలుచేస్తారు.
* వ్యావసాయిక ఉత్పాదకత, పంటల వివిధీకరణ, దీర్ఘకాలం పాటు కొనసాగే
విధానాలు, నీటిపారుదలతోపాటు పంటకోతల అనంతర కాలంలో నిల్వ సదుపాయాలను
పెంచడంపై శ్రద్ధ తీసుకొంటారు.
* ఈ పథకంతో 1.7 కోట్ల మంది రైతులు లాభపడే అవకాశం ఉంది.
1.2 గ్రామీణ సమృద్ధి, దృఢత్వ కార్యక్రమం
వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగినంతగా లభించకుండా ఉన్న స్థితిని
చక్కదిద్దడానికంటూ ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని అనేక రంగాల పరిధిలో
అమలుచేయనున్నారు.
* నైపుణ్యాలను అలవరచడం, పెట్టుబడి, టెక్నాలజీ ప్రధాన మార్పు.. ఈ అంశాలపై
దృష్టిని కేంద్రీకరించనున్నారు.
* మొదటి దశలో 100 వ్యవసాయ ప్రధాన జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
1.3 పప్పుధాన్యాల్లో స్వయంసమృద్ధి సాధనకో మిషన్
* ఈ మిషన్‌ను ఆరు సంవత్సరాల పాటు అమలుచేస్తారు. దీనిలో భాగంగా కంది,
మినప, ఎర్రపప్పు (మసూర్ దాల్)లపై దృష్టిపెడతారు.
* భిన్న వాతావరణ స్థితులను తట్టుకొనే తరహా విత్తనాలను
అభివృద్ధిపరచడంతోపాటు ప్రొటీన్ పాళ్లను పెంచుతారు.
* నాలుగు సంవత్సరాల పాటు నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లతో కొనుగోళ్లను నిర్వహించి
ఈ పద్ధతిలో మంచి లాభదాయక ధరలు దొరికేటట్లు చూస్తారు.
1.4 కాయగూరలు, ఫలాల కోసం ఒక విస్తృత కార్యక్రమం
* సరఫరాలకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి కాయగూరలను, పండ్లను
పండించడాన్ని ప్రోత్సహిస్తారు.
* విలువను జోడించడం, ప్రాసెసింగు, మెరుగైన మార్కెట్ ధరలు లభించేటట్లు
చూడడంపై శ్రద్ధ పెడతారు.
* రాష్ట్రాలతో, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌తో (ఎఫ్‌పీఓలు)
భాగస్వామ్యాన్ని ఏర్పరచడం ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతారు.
1.5 అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్
* అధిక దిగుబడిని ఇచ్చే, తెగుళ్లకు తట్టుకొని నిలిచే, వివిధ రకాలైన
వాతావరణ స్థితులకు తట్టుకొని నిలిచే విత్తనాల కోసం మరిన్ని పరిశోధనలను
ప్రోత్సహిస్తారు.
* గత సంవత్సరం జులై మొదలు ఇంతవరకు 100కు పైగా విత్తనాల రకాలను వాణిజ్య
సరళిలో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
1.6 పత్తి ఉత్పాదకత మిషన్
* పత్తి దిగుబడిని, దీర్ఘకాలికతను మెరుగుపరచడానికి అయిదు సంవత్సరాల పాటు
ఒక మిషన్‌ను చేపడతారు.
* పత్తి రైతులకు మేలు చేయడానికి మరింత పొడుగైన పింజ రకం పత్తిని ప్రోత్సహిస్తారు.
• వస్త్ర రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని 5ఎఫ్ దార్శనికతను సాకారం
చేస్తారు. ఇక్కడ 5ఎఫ్‌లు ఏవేవంటే ఫారం టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్
టు ఫారిన్.
1.7 కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) రుణ పరిమితిలో పెంపు
* మార్పు చేసిన ప్రకారం రుణానికి చెల్లించాల్సిన వడ్డీలో కొంతమొత్తాన్ని
ప్రభుత్వం చెల్లించే పథకం (ఇంటరెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్)లో భాగంగా రుణ
పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
* ఇది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు.. వీరందరూ కలిపి మొత్తం 7.7
కోట్ల మందికి ప్రయోజనం కలిగించవచ్చని ఒక అంచనా.
1.8 అసోంలో యూరియా కర్మాగారం
* అసోంలోని నామరూప్‌లో ప్రతి ఒక్క ఏడాదిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల
ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండే ఒక కొత్త యూరియా కర్మాగారాన్ని
ఏర్పాటుచేస్తారు.
* ఈ కర్మాగారం యూరియా ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సత్తాను పెంచుతుందని
భావిస్తున్నారు.
2. పశుసంవర్ధకం, పాడిపరిశ్రమ
2.1 బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
* మఖానా ఉత్పాదన, ప్రాసెసింగ్, విక్రయాల కోసం ఒక ప్రత్యేక బోర్డును
ఏర్పాటు చేయనున్నారు.
* మఖానా రైతులను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజే షన్స్ (ఎఫ్‌పీఓస్)లో చేర్చుకొంటారు.
2.2 మత్స్య పరిశ్రమ అభివృద్ధికో ఫ్రేంవర్క్
* అండమాన్, నికోబార్ తోపాటు లక్షద్వీప్ దీవులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు.
* ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్), హై సీస్ నుంచి అండదండలను అందుకొంటూ
మత్స్యపరిశ్రమ దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండేలా చూస్తారు.
* దీంతో సముద్ర రంగంలో అవకాశాలు పెరగడంతోపాటు ఎగుమతులు వృద్ధి
చెందుతాయన్న అంచనా ఉంది.
3. రుణం, అన్ని వర్గాలకు ఆర్థిక సేవలు
3.1 గ్రామీణ క్రెడిట్ స్కోరు
* స్వయంసహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులతోపాటు గ్రామీణ ప్రాంతాల రుణ
అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఒక ఫ్రేంవర్కును
సిద్ధం చేస్తారు.
3.2 సూక్ష్మ వాణిజ్య సంస్థలకు రుణసదుపాయం విస్తరణ
* ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన సూక్ష్మ వాణిజ్య సంస్థలకు రూ.5 లక్షల పరిమితి
కలిగి ఉండే కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను తీసుకువస్తారు.
* మొదటి సంవత్సర కాలంలో 10 లక్షల కార్డును జారీ చేస్తారు.
4. పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి
4.1 పంటల జెర్మ్‌ప్లాజమ్ కోసం జీన్ బ్యాంకు
* రాబోయే కాలానికి ఆహార భద్రతను అందించడానికి 10 లక్షల జెర్మ్‌ప్లాజమ్
లైన్లతో రెండో జన్యు బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు.
4.2 వ్యవసాయంలో పరిశోధన, అభివృద్ధి
* ప్రైవేటు రంగం ఆధ్వర్యంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని
ప్రోత్సహించడానికి మరింత ఎక్కువ మద్దతును అందించనున్నారు.
* వ్యవసాయం, పశుసంవర్ధకం, పాడిపరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని 2025-26
కేంద్ర బడ్జెటులో చేసిన కేటాయింపులు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను
ప్రోత్సహించాలని, రైతులకు ఆర్థిక స్థిరత్వాన్నికలగజేయాలని, వ్యవసాయంతో
అనుబంధం కలిగి ఉన్న రంగాలను బలోపేతం చేయాలన్న
ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయి.
మంత్రిమండలి 2024 అక్టోబరు నుంచి తీసుకున్న నిర్ణయాల పరిశీలన
1. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తోపాటు కొన్ని
మార్పుచేర్పులు చేసిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం
(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ల కొనసాగింపు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తోపాటు కొన్ని
మార్పుచేర్పులు చేసిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకాన్ని
(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) 2021-22 నుంచి 2025-26 వరకు రూ.69,515.71 కోట్ల
వ్యయంతో 2025-26 దాకా కొనసాగించడానికి కేంద్ర మంత్రిమండలి ఈ ఏడాది జనవరి
1న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం నివారించడానికి వీలు ఉండని ప్రకృతి
వైపరీత్యాలు తలెత్తితే పంటల విషయంలో దేశవ్యాప్తంగా రైతులకు ఎదురయ్యే నష్ట
భయం నుంచి వారు రక్షణను పొందడంలో తోడ్పడుతుంది.
వీటితో పాటూ పథకం అమలులో పెద్ద ఎత్తున సాంకేతికతను పరిచయం చేసేందుకు
కేంద్ర మంత్రివర్గం ఫండ్ ఫర్ ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ పేరిట
(ఎఫ్ఐఏటీ-ఫియట్) రూ. 824.77 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఈ చర్య వల్ల
మెరుగైన పారదర్శకత, క్లెయిముల లెక్కింపు, పరిష్కారం సాధ్యపడగలవని
భావిస్తున్నారు.
2. డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) పై ఒకసారికి పరిమితమైన ప్రత్యేక
ప్యాకేజీ పొడిగింపు
రైతులకు డీఏపీ అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూసేందుకు డీఏపీపై ఒకసారికి
పరిమితమైన ప్రత్యేక ప్యాకేజీని పొడిగించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనని
కేంద్ర మంత్రివర్గం 2025, జనవరి 1న ఆమోదించింది. ఎన్బీసీ టన్నుకు రూ.
3,500 చొప్పున అందిస్తున్న సబ్సిడీకి ఇది అదనం. ఈ పొడిగింపు 01.01.2025
నుంచీ మొదలై తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకూ అమల్లో ఉంటుంది.
ఇందుకుగాను సుమారు రూ. 3,850 కోట్ల బడ్జెట్ కేటాయింపులు అవసరం కాగలవని భావిస్తున్నారు.
3. 2025 సీజన్ లో ఎండుకొబ్బరికి అందించే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పెంపు
ఎండు కొబ్బరికి 2025 సీజన్లో అందించే కనీస మద్దతు ధరను కేంద్ర ఆర్థిక
వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2024, డిసెంబర్ 20న ఆమోదించింది. మిల్లింగ్
కోప్రా (ఎండుకొబ్బరి)కి క్వింటాలుకు కనీస మద్దతు ధరను 2014 మార్కెటింగ్
సీజన్లోని రూ. 5,250 నుంచీ 2025 మార్కెటింగ్ సీజన్లో రూ. 11,582 కు, అదే
విధంగా బాల్ కోప్రా (ఆహార అవసరాల్లో వినియోగించే కొబ్బరి కురిడీ)
ఎంఎస్పీని రూ. 5500 (2014 రేటు) నుంచీ రూ. 12,100 (2025 రేటు)కు పెంచుతూ
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మిల్లింగ్ కోప్రా ఎంఎస్పీలో 121%,
కురిడీ కొబ్బరి ఎంఎస్పీలో 120 % వృద్ధి నమోదైంది. ఎంఎస్పీ పెంపు కొబ్బరి
రైతుల పెట్టుబడికి అధిక లాభాన్ని ఇవ్వడమే కాక, దేశీయంగా, అంతర్జాతీయంగా
కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండుకి అనుగుణంగా సాగును పెంచేందుకు
రైతులకు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.
4. సహజ వ్యవసాయం పై జాతీయ మిషన్ ప్రారంభం
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ చేపట్టిన ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ
పథకం – నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్)ను
ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం 2024, నవంబర్ 25న ఆమోదం తెలిపింది.
15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసే వరకూ (2025-26) ఈ పథకానికి రూ. 2481
కోట్లను కేటాయించారు. (కేంద్ర ప్రభుత్వ వాటా – రూ. 1584 కోట్లు,
రాష్ట్రాల వాటా – రూ. 897 కోట్లు)
. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ సురక్షితమైన, పోషక విలువలున్న
ఆహారాన్ని పండించేందుకు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తోంది. తద్వారా
పంటలు పండించే రైతులు ఇతర ముడిసరుకుల మీద ఆధారపడటం తగ్గుతుంది. సహజ
వ్యవసాయ పద్ధతులు మట్టి ఆరోగ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాదటమే కాక,
వాతావరణ మార్పులను తట్టుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాయి.
· సహజ వ్యవసాయం: ఈ తరహా వ్యవసాయం రసాయన రహిత సంప్రదాయ పద్ధతులు, స్థానిక
వాతావరణానికి అనుకూలమైన సాగు సూత్రాలు, విభిన్నమైన పంట పద్ధతులను అవలంబిస్తుంది.
· సహజ పద్ధతుల్లో చేపట్టే వ్యవసాయంలో రసాయనిక, పురుగు మందులు, ఎరువుల
వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నివారణ, ఖర్చు తగ్గుముఖం, భూసార
పరిరక్షణ సాధ్యపడతాయి. విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటలు,
పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతాయి.
5. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన
(కేవై)ల ప్రారంభం
వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ద్వారా అమలయ్యే అన్ని కేంద్ర
ప్రభుత్వ పథకాల (సీఎస్ఎస్) హేతుబద్ధీకరణ చేపట్టాలన్న వ్యవసాయం, రైతు
సంక్షేమ విభాగ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం 2024, అక్టోబర్ 3న ఆమోదం
తెలిపింది. దరిమిలా శాఖ కింద అమలయ్యే అన్ని పథకాలను ప్రధానమంత్రి
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన (కేవై) అనే
రెండు కీలక పథకాల కింద పొందుపరచాలని నిర్ణయించారు.
పీఎం-ఆర్కేవీవై సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం అందించనుండగా, కేవై ఆహార
భద్రత, వ్యవసాయంలో స్వయం సమృద్ధికి దన్నుగా నిలుస్తుంది. ఈ రెండు పథకాలను
రూ. 1,01,321.61 కోట్ల ప్రతిపాదిత ఖర్చుతో అమలు చేస్తారు, ఇవి రాష్ట్ర
ప్రభుత్వాల ద్వారా అమలవుతాయి.
మొత్తం రూ. 1,01,321.61 కోట్ల ఖర్చులో వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం
వాటా రూ. 69,088.98 కోట్లు, రాష్ట్రాల వాటా రూ. 32,232.63 కోట్లగా
ఉండనుంది. ఇందులో పీఎం-ఆర్కేవీవై కోసం రూ. 57,074.72 కోట్లు, కేవై కోసం
44,246.89 కోట్లను కేటాయించారు.
6. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ సీడ్స్ కు ఆమోదం
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్ (ఎన్ఎంఈఓ– ఆయిల్ సీడ్స్)
పేరిట చేపట్టిన బృహత్తర పథకం దేశంలో నూనెగింజల సాగుని పెంచేందుకు, వంట
నూనెల ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఉద్దేశించినది. ఈ పథకానికి
కేంద్ర మంత్రివర్గం 2024, అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. పథకం ఏడేళ్ళ
పాటు, అనగా 2024-25 నుంచీ 2030-31 వరకు అమల్లో ఉంటుంది. ఇందుకోసం రూ.
10,103 కోట్లను కేటాయించారు.
2022-23లో 39 మిలియన్ టన్నుల స్థాయిలో ఉన్న ప్రాథమిక నూనెగింజల
ఉత్పత్తిని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచాలన్న లక్ష్యంతో
పథకం కొనసాగుతోంది. ఎన్ఎంఈఓ-ఓపీ (ఆయిల్ పామ్)తో కలిసి, 2030-31 నాటికి
దేశీయ ఆహార నూనె ఉత్పత్తిని 25.45 మిలియన్ టన్నులకు పెంచాలని మిషన్
లక్ష్యంగా పెట్టుకుంది, ఇది మన దేశీయ అవసరాలని సుమారు 72 శాతం మేరతీర్చగలదు.
· వ్యవసాయం, పాడి పరిశ్రమ, పశు పోషణ రంగాల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు
. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్): 2019లో ప్రారంభించిన
పీఎం-కిసాన్ పథకం రైతుల ఆదాయానికి మద్దతు కల్పిస్తూ, ప్రతి రైతుకు
ఏడాదికి 3 సమాన విడతల్లో రూ. 6,000ను అందిస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల
ద్వారా 11 కోట్లకి పైగా రైతులకు రూ. 3.46 లక్షల కోట్లను విడుదల చేశారు.
2025 ఫిబ్రవరి 24న, పీఎం-కిసాన్ పథకంలోని 19వ విడతను ప్రభుత్వం విడుదల
చేసింది. దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది
రైతులు 19వ విడత ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ
(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-డీబీటీ) ద్వారా మధ్యవర్తుల ప్రమేయం
లేకుండా రూ. 22,000 కోట్లకు మించిన సొమ్ముని నేరుగా ఆర్థిక సహాయ రూపేణా
అందుకుంటారు.
· ప్రధానమంత్రి కిసాన్ మానధన్ యోజన (పీఎంకేఎంవై): కేంద్ర రంగ పథకమైన
పీఎంకేఎంవై 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతుల కోసం స్వచ్ఛంద,
భాగస్వామ్య పింఛన్ పథకంగా రూపొందించబడింది. 60 సంవత్సరాలకి
చేరుకున్నప్పుడు, షరతులకు లోబడి రూ. 3,000 నెలవారీ పింఛన్ ను అందిస్తారు.
పథకం ప్రారంభమైన నాటి నుంచీ 24.67 లక్షల మందికి పైగా చిన్న, సన్నకారు
రైతులు పీఎంకేఎంవై పథకంలో చేరారు.
. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై): పీఎంఎఫ్బీవై పథకాన్ని
2016లో ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న అధిక ప్రీమియం రేట్ల
సమస్యను, అత్యధిక సొమ్ము పరిమితి కారణంగా బీమా మొత్తం తగ్గిపోతున్న
సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పీఎంఎఫ్బీవై అమలులో
8 సంవత్సరాలుగా, 63.11 కోట్ల రైతుల దరఖాస్తులు నమోదు అవగా 18.52 కోట్ల
(తాత్కాలిక) రైతు దరఖాస్తుదారులు రూ. 1,65,149 కోట్ల పైగా క్లెయిములను
పొందారు. రైతులు వారి భాగస్వామ్య ప్రీమియం రూపంలో రూ. 32,482 కోట్లను
చెల్లించగా రూ. 1,65,149 కోట్ల (తాత్కాలిక) క్లెయిములను చెల్లించారు. ఈ
విధంగా చూస్తే, రైతులు చెల్లించిన ప్రతి 100 రూపాయల ప్రీమియంకి సుమారు
రూ. 508ను క్లెయిములుగా వాపసు పొందారు.
• నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం):
ఈ పథకం ప్రధానంగా ఉపాధి సృష్టి, వ్యాపార అభివృద్ధి, పశువుల ఉత్పాదక శక్తి
పెంపు, తద్వారా మాంసం, మేకపాలు, గుడ్లు, ఉన్ని ఉత్పత్తుల పెంపు లక్ష్యంగా
పెట్టుకుంది. 2024-25 సంవత్సరానికి ఈ పథకం కోసం రూ. 324 కోట్లను
కేటాయించారు.
• యానిమల్ హజ్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (ఏహెచ్ఐడీఎఫ్):
ఈ పథకం వ్యక్తిగత వ్యాపారస్తులు, ప్రైవేటు సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు
ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ లు), సెక్షన్ 8 సంస్థల ద్వారా
పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిన పథకం. పాల
ప్రాసెసింగ్-అదనపు విలువ జోడింపు మౌలిక సదుపాయాలు, మాంసం
ప్రాసెసింగ్-అదనపు విలువ జోడింపు మౌలిక సదుపాయాలు, పశు ఆహార కేంద్రాలు,
పశు జాతుల వృద్ధి సాంకేతికతలు, పశు ఔషధాలు, టీకాలు, వ్యర్థాల నిర్వహణకు
అవసరమయ్యే పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. తదనుగుణంగా
డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (డీఐడీఎఫ్)ను ఏహెచ్ఐడీఎఫ్ లో
విలీనం చేశారు, దరిమిలా సవరించిన వ్యయం రూ. 29,610 కోట్లకు పెరిగింది.
• నేషనల్ యానిమల్ డీజీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్ఏడీసీపీ): 2030 నాటికి
బ్రూసెల్లోసిస్, ఎఫ్ఎండీ వ్యాధుల నిరోధం ప్రధాన లక్ష్యంగా 2019లో
ప్రారంభించిన ఈ పథకం, ఈ తరహాలో ప్రపంచంలోనే అతి విస్తృతమైనది. ఇప్పటివరకూ
గేదెలు, ఇతర పశువులకు 99.71 కోట్ల ఫుట్ అండ్ మౌత్ వ్యాధి టీకాలు వేశారు.
ఇది 7.18 కోట్ల రైతు కుటుంబా లకు లబ్ధి చేకూర్చింది.
ముగింపు
పాడిపరిశ్రమ, పశు పోషణ, వ్యవసాయ రంగాల్లో ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల
అభివృద్ధి, సుస్థిరతలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యాన్ని ఇటీవలి కాలంలో
తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. వ్యాధుల
నియంత్రణ, సహకార రంగ బలోపేతం, నూతన సాంకేతిక అవలంబన, ఆయా రంగాల్లో
ఉత్పాదకతను పెంచి రైతులకు ఆదాయ పెంపు వంటి అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఈ
కీలక రంగాల దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుంది.
(Release ID: 2113960)
Visitor Counter : 27