ప్రధాన మంత్రి కార్యాలయం
మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
నేను మారిషస్‌కు వచ్చినప్పుడల్లా నా వాళ్ల మధ్యకు వచ్చినట్లుంటుంది: ప్రధానమంత్రి
మారిషస్ ప్రజలు, మారిషస్ ప్రభుత్వం వారి అత్యున్నత పౌర పురస్కారాన్ని నాకు ప్రదానం చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయాన్ని నేను అత్యంత గౌరవంతోనూ, వినయపూర్వకంగానూ స్వీకరిస్తున్నాను: ప్రధానమంత్రి
ఇది నా ఒక్కరికే దక్కిన గౌరవం కాదు.. ఇది భారత్, మారిషస్‌ల చారిత్రక సంబంధాలకు దక్కిన గౌరవం: ప్రధానమంత్రి
మారిషస్ ఒక ‘మినీ ఇండియా’ అన్నట్లుంది: ప్రధానమంత్రి
మా ప్రభుత్వం నలందా విశ్వవిద్యాలయానికి, ఆ విశ్వవిద్యాలయ స్ఫూర్తికి సరికొత్త జవసత్వాలనిచ్చింది: ప్రధానమంత్రి
బీహార్‌లోని మఖానా త్వరలోనే ప్రపంచమంతటా అల్పాహార జాబితాలో చోటుచేసుకొంటుంది: ప్రధానమంత్రి
మారిషస్‌లో భారతీయ ప్రవాసుల్లో ఏడో తరం వారికి ఓసీఐ కార్డును ఇవ్వాలని నిర్ణయించాం: ప్రధాని
మారిషస్ ఓ భాగస్వామ్య దేశం మాత్రమే కాదు.. మా దృష్టిలో మారిషస్ ఓ కుటుంబం: ప్రధానమంత్రి
భారతదేశ సాగర్ దార్శనికతలో మారిషస్‌కు కీలక స్థానం: ప్రధానమంత్రి
మారిషస్ సమృద్ధి చెందినప్పుడు, ముందుగా పండుగ చేసుకొనేది భారతే: ప్రధానమంత్రి
Posted On:
11 MAR 2025 9:37PM by PIB Hyderabad
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మారిషస్ ప్రధాని శ్రీ రాంగులామ్ ఈ కార్యక్రమంలో శ్రీ మోదీకి స్వాగతం చెప్పారు. మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ (జీసీఎస్‌కే)ను జాతీయ దినోత్సవాల సందర్భంగా భారత ప్రధానికి ప్రదానం చేయనున్నట్లు శ్రీ రాంగులామ్ ప్రకటించారు. ఈ అసాధారణ గౌరవానికి ప్రధాని శ్రీ మోదీ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో, మారిషస్ ప్రధాని తన పట్ల చూపిన ఆత్మీయతకు, స్నేహానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్, మారిషస్‌ల మధ్య చక్కని సంబంధాలను బలపరచడానికి ఆయన అందిస్తున్న తోడ్పాటుకు కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని శ్రీ రాంగులామ్, ఆయన సతీమణి శ్రీమతి వీణ రాంగులామ్.. ఈ ఇద్దరికీ ఓసీఐ కార్డులను శ్రీ మోదీ అందజేశారు. మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా మారిషస్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఇరు దేశాల ఉమ్మడి చారిత్రక ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చారు. మారిషస్ స్వాతంత్య్రం కోసం పోరాడిన సర్ శివూసాగర్ రాంగులామ్, సర్ అనిరుద్ జగన్నాథ్, మణిలాల్ డాక్టర్ తదితరులకు శ్రీ మోదీ నివాళులు అర్పించారు. మారిషస్ జాతీయ దినోత్సవాల ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండడం తనకు దక్కిన ఒక గౌరవమని ప్రధాని అన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సన్నిహిత సంబంధాలు నెలకొనడానికి ఉమ్మడి వారసత్వం, కుటుంబ సంబంధాలు బలమైన పునాదిగా నిలిచాయంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మారిషస్‌లోని భారతీయ సముదాయం తమ సాంస్కృతిక మూలాలను పదిలపర్చుకోవడంతోపాటు వాటిని పెంచి పోషిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. ఈ బంధాలను మరింత బలపరచడానికి, మారిషస్ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా మారిషస్‌లోని భారతీయ సముదాయంలో ఏడోతరానికి చెందిన వారికి ఓసీఐ కార్డులను అందించనున్నట్లు చెప్పారు. గిర్‌మిటియా వారసత్వాన్ని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలకు భారత్ మద్దతివ్వనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
మారిషస్ అభివృద్ధిలో సన్నిహిత భాగస్వామ్య దేశం అయ్యే సౌభాగ్యం భారత్‌కు దక్కిందని ప్రధాని అన్నారు. భారత్ ‘సాగర్’ దార్శనికతలో, గ్లోబల్ సౌత్ దేశాలతో భారత్ సంధానం కావడంలో ఒక కీలక పాత్రను ఇండియా-మారిషస్ ప్రత్యేక బంధం పోషించిందని తెలిపారు. వాతావరణ మార్పునకు సంబంధించిన ఉమ్మడి సవాలును పరిష్కరించడాన్ని గురించి మాట్లాడుతూ, అంతర్జాతీయ సౌరకూటమిలో, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయన్స్ కార్యక్రమాలలో మారిషస్ భాగస్వామ్యం పంచుకోవడాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగానే, సర్ శివూసాగర్ రాంగులామ్ బొటానిక్ గార్డెన్‌లో ఓ మొక్కను ఆయన నాటారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు: here.
ఇదే కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ (ఐజీసీఐసీ), మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ (ఎంజీఐ)లతోపాటు అన్నా మెడికల్ కాలేజీలకు చెందిన కళాకారులతో ఒక మనోహరమైన సాంస్కృతిక కార్యక్రమం కూడా చోటుచేసుకుంది.
*****
MJPS/SR
(Release ID: 2110721)
Visitor Counter : 8