పార్లమెంటరీ వ్యవహారాలు
నేషనల్ యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్ 2.0లో దేశవ్యాప్తంగా పౌరులకు అవకాశం
Posted On:
11 MAR 2025 11:20AM by PIB Hyderabad
నవీకరించిన నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ (ఎన్ వైపీఎస్) వెబ్ పోర్టల్ ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. దీనిని ఎన్ వైపీఎస్ 2.0 అని పిలుస్తున్నారు. గతంలో ఇది గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడలా కాకుండా.. ఆర్థిక స్థితి, లింగ, కుల, సంప్రదాయ, మత, జాతి, ప్రాంత, ప్రాదేశిక భేదాల్లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఎన్ వైపీఎస్ 2.0 అందుబాటులో ఉంటుంది. కింది మార్గాల్లో అందులో భాగస్వామ్యాన్ని సులభతరం చేసే చర్యలు చేపట్టారు: -
-
సంస్థాగత భాగస్వామ్యం: పోర్టల్ లో అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అన్ని విద్యా సంస్థలు యూత్ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం ద్వారా ఈ విభాగంలో పాల్గొనవచ్చు. ఆరు నుంచి పన్నెండో తరగతి విద్యార్థులను ‘కిశోర్ సభ’, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను తరుణ సభ ఉప విభాగాలకు ఎంపిక చేయవచ్చు.
-
బృంద భాగస్వామ్యం: పోర్టల్ లో అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం యూత్ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం ద్వారా పౌరుల బృందం ఈ కేటగిరీలో పాల్గొనవచ్చు.
-
వ్యక్తిగత భాగస్వామ్యం: ‘భారతీయ డెమోక్రసీ ఇన్ యాక్షన్’ అనే అంశంపై క్విజ్ నిర్వహించడం ద్వారా వ్యక్తిగత విభాగంలో పౌరులు ఇందులో పాల్గొనవచ్చు.
ఈ పోటీలతో ముడిపడి ఉన్న బహుమతి ప్రదాన వేడుకలు, సన్నద్ధతా తరగతుల వంటి జాతీయ స్థాయి వేదికల ద్వారా.. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, యూనివర్సిటీలు/ కళాశాలలు సహా నేషనల్ యూత్ పార్లమెంట్ పోటీలకు సంబంధించి కీలక భాగస్వాములను ఎన్ వైపీఎస్ 2.0లో పాల్గొనవలసిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా ప్రోత్సహించింది. అంతేకాకుండా ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడం, క్రమశిక్షణను పెంపొందించడం, ఇతరుల అభిప్రాయాలపై సహన శీలత లక్ష్యాలను సాధించడంలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్ ప్రభావాన్ని పెంచేలా.. ఎన్ వైపీఎస్ వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యాన్ని పెంచాలని కోరుతూ.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని శాసన సభలు, మండళ్లకు సంబంధిత మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. తద్వారా పార్లమెంటు పద్ధతులు, ప్రక్రియలను ప్రజలంతా తెలుసుకోవడానికి, ప్రభుత్వ పనితీరు, రాజ్యాంగ విలువలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో జీవితాన్ని గడిపేలా వీలు కల్పించాలని సూచించింది.
పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2110304)
Visitor Counter : 16