ప్రధాన మంత్రి కార్యాలయం
మారిషస్ అధికారిక పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి ముందస్తు సందేశం
Posted On:
10 MAR 2025 6:18PM by PIB Hyderabad
నా మిత్రుడు, మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు ఆ దేశ 57వ జాతీయ దినోత్సవంలో పాలు పంచుకునేందుకు నేను రెండు రోజుల అధికారిక పర్యటన చేపట్టబోతున్నాను.
నౌకాయాన పరంగా మారిషస్ మనకి పొరుగు దేశమే కాక, హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామి, ఆఫ్రికా ఖండానికి ద్వారం వంటిది కూడా! చారిత్రకంగా, భౌగోళిక పరంగా, సాంస్కృతికంగా మన రెండు దేశాలూ దృఢమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామిక విలువల పట్ల ఉమ్మడి నమ్మకం, వైవిధ్యాన్ని వేడుక చేసుకునే సంస్కృతీ ఇరు దేశాలకూ బలాన్ని సమకూర్చే అంశాలు! ఇక చారిత్రకంగా ఇరు దేశాల ప్రజల మధ్యగల అనుబంధం మనకు గర్వకారణం. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గత దశాబ్ద కాలంగా అనేక పథకాలతో ముందుకు సాగుతున్నాం.
భారత్-మారిషస్ ల బహుముఖీన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకూ, తద్వారా ఇరుదేశాల ప్రజల ప్రగతి, సౌభాగ్యాల కోసం ఆ దేశ నాయకత్వంతో కలిసి పనిచేసే అవకాశాన్ని స్వాగతిస్తున్నాను. ‘విజన్ సాగర్’ లో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంతంలో భద్రతలను పెంపొందించేందుకు కూడా కృషి చేస్తాం.
మన దేశం, మారిషస్ ల మధ్య స్నేహం ఆధారంగా నిర్మితమైన పునాదులను నా పర్యటన మరింత పటిష్టపరచి, ఇరు దేశాల అనుబంధంలో నూతన అధ్యాయానికి తెర తీయగలదని విశ్వసిస్తున్నాను.
(Release ID: 2110039)
Visitor Counter : 9