సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ యాంటీ-పైరసీ ఛాలెంజ్
అత్యాధునిక పరిష్కారాలతో కంటెంట్ భద్రతను బలోపేతం చేయడం
Posted On:
08 MAR 2025 12:35PM by PIB Hyderabad
అత్యాధునిక పరిష్కారాలతో కంటెంట్ భద్రతను బలోపేతం చేయడం
పరిచయం
క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్‌లో వేవ్స్ యాంటీ-పైరసీ ఛాలెంజ్ కీలక భాగంగా ఉంది, వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలో డిజిటల్ కంటెంట్ భద్రత లక్ష్యంగా దీన్ని రూపొందించారు. డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ పైరసీ, అనధికారిక పంపిణీ, కంటెంట్‌లో మోసపూరిత మార్పులు చేయడం వంటి సవాళ్లూ పెరుగుతూనే ఉన్నాయి. ఫింగర్‌ప్రింటింగ్, వాటర్‌మార్కింగ్ టెక్నాలజీల్లో వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ఈ ఛాలెంజ్ దోహదం చేస్తుంది, వ్యక్తులు, పరిశోధన బృందాలు, అంకురసంస్థలు, ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించే ఈ పోటీకి 1,296 రిజిస్ట్రేషన్లు రావడం డిజిటల్ కంటెంట్ భద్రత పట్ల బలమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.
మొత్తం మీడియా, వినోద రంగాలను ఏకం చేసే హబ్ అండ్ స్పోక్ ప్లాట్‌ఫామ్‌గా సిద్ధం చేసిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) లో ఈ ఛాలెంజ్ భాగంగా ఉంది. ప్రపంచ మీడియా, వినోద రంగాల దృష్టిని ఆకర్షించి, వాటిని భారత మీడియా, వినోద రంగంతో పాటు దాని ప్రతిభతో అనుసంధానించే లక్ష్యంతో ఈ ప్రీమియర్ గ్లోబల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమిట్ జరగనుంది. బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఏవీజీసీ - ఎక్స్ఆర్, డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్, ఫిల్మ్స్ అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి సారిస్తూ భారత వినోదరంగ భవిష్యత్తును ప్రదర్శించడానికి వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రంగానికి చెందిన ప్రముఖులు, క్రియేటర్స్, సాంకేతిక నిపుణులను ఒక చోటకు చేర్చనుంది. వేవ్స్ యాంటీ-పైరసీ ఛాలెంజ్ అనేది కంటెంట్ సమగ్రతను పరిరక్షిస్తూ సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న పద్ధతులపై దృష్టిసారించే బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ విభాగానికి చెందినది.

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ కోసం ఔత్సాహిక, ప్రొఫెషనల్ క్రియేటర్స్ నుంచి 73,000లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి, భారత మీడియా, వినోద వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుంది.
లక్ష్యాలు
ఫింగర్ ప్రింటింగ్, వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ వంటి రంగాల్లో స్వదేశీ కంపెనీలు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఛాలెంజ్ రూపొందించారు. స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా, ఈ ఛాలెంజ్ కింది వాటి కోసం ప్రయత్నిస్తుంది:
· దేశీయ కంపెనీలు తమ పరిష్కారాలను ప్రదర్శించడానికి, ఈ రంగంలో గుర్తింపును పొందడానికి ఒక వేదికను అందించడం.
· డిజిటల్ మీడియా భద్రత, ట్రేసబిలిటీని పెంపొందించే నూతన పద్ధతుల అభివృద్ధిని ప్రోత్సహించడం.
· ప్రస్తుత మీడియా పనితీరుతో సజావుగా విలీనం చేయగల ఆచరణీయ అనువర్తనాలను ప్రోత్సహించడం.
· కంటెంట్ భద్రతలో ప్రస్తుతం ఉన్న, కొత్తగా తలెత్తుతున్న సవాళ్లను పరిష్కరించే కొత్త సాంకేతికతల వృద్ధికి ఊతమివ్వడం.
అర్హత ప్రమాణాలు
· డిజిటల్ కంటెంట్ భద్రత గురించిన నైపుణ్యాలు లేదా దాని పట్ల ఆసక్తి గల వ్యక్తులు, పరిశోధనా బృందాలు, అంకుర సంస్థలు, ప్రముఖ సంస్థలు ఈ ఛాలెంజ్‌లో పోటీపడవచ్చు.
· సాంకేతికత పనిచేసే ప్రాథమిక నమూనాను అన్ని సమర్పణలు తప్పనిసరిగా కలిగి ఉండి, దాని ప్రధాన కార్యాచరణను, వాస్తవ ప్రపంచంతో అనువర్తించగల సామర్థ్యాన్ని ప్రదర్శించేవిగా ఉండాలి.
· ఒక బృందంలో గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఉండవచ్చు.
సమర్పణ కేటగిరీలు
ఫింగర్‌ప్రింటింగ్ సాంకేతికతలు : ప్రత్యేకమైన, అదృశ్య మార్కర్స్ ఉపయోగించి డిజిటల్ కంటెంట్ గుర్తించడం, ట్రాక్ చేయడం కోసం గల పరిష్కారాలు.
వాటర్‌మార్కింగ్ సాంకేతికలు : యాజమాన్యాన్ని గుర్తించి, పంపిణీని ట్రేస్ చేయడానికి డిజిటల్ కంటెంట్‌లో సమాచారాన్ని పొందుపరచడం.
ఇతరాలు : బ్లాక్ చెయిన్, డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ (డిఆర్ఎమ్) వంటి సాంకేతికతలను, ఇతర కంటెంట్ భద్రతా పద్ధతులను ఉపయోగించే విన్నూత్న పరిష్కారాలు.
మూల్యాంకన ప్రమాణాలు
వినూత్నత : సాంకేతికత కొత్తదనం, వాస్తవికత.
ప్రభావశీలత : డిజిటల్ కంటెంట్‌ను సమర్థంగా రక్షించగల, ట్రాక్ చేయగల సామర్థ్యం.
ఆచరణీయత : ప్రస్తుత వ్యవస్థల్లో అమలుచేయగల, సమీకృతం చేయగల సౌలభ్యం.
స్కేలబిలిటీ : విస్తృతస్థాయి స్వీకరణ సామర్థ్యం, ప్రభావం.
వినియోగదారుల అనుభవం : ఉపయోగించు సౌలభ్యం, ప్రస్తుతం కంటెంట్ పనితీరుపై ప్రభావం.
ప్రాథమిక నమూనా కార్యాచరణ : సాంకేతికత ప్రధాన లక్షణాల నాణ్యత, ఆచరణీయతను ప్రదర్శించడం.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్స్ : ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు
ఆలోచనల సమర్పణ : ఫిబ్రవరి 4 నుంచి 28 వరకు
ఆలోచనల మూల్యాంకనం : మార్చి 3 నుంచి 10 వరకు
అవార్డులు, గుర్తింపు
గుర్తింపు : పరిశ్రమకు చెందిన ప్రముఖ ప్రచురణల్లో కవరేజ్, పరిశ్రమకు సంబంధించిన కీలక సమావేశాల్లో ప్రజెంటేషన్
అవకాశాలు : పరిశ్రమ ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశం, సాంకేతికత వాణిజ్యీకరణకు అవకాశాలు
ముగింపు
ఫింగర్ ప్రింటింగ్, వాటర్‌మార్కింగ్ టెక్నాలజీల్లో స్వదేశీ ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా డిజిటల్ కంటెంట్ భద్రతను బలోపేతం చేసే దిశగా వేవ్స్ యాంటీ-పైరసీ ఛాలెంజ్ కీలక ముందడుగు అవుతుంది. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్‌లో భాగంగా, పైరసీ, అనధికార పంపిణీని ఎదుర్కోవడంలో అధునాతన పరిష్కారాల తక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తూ ఇది అత్యంత ఆసక్తిని ఏర్పరిచింది. పరిశ్రమ ప్రముఖులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక మార్గదర్శకుల మద్దతుతో, ఈ ఛాలెంజ్ సంచలనాత్మక ఆలోచనలను ప్రదర్శించే వేదికను అందించడమే కాకుండా డిజిటల్ మీడియా సమగ్రతను పరిరక్షించగల వాస్తవ-ప్రపంచ అనువర్తనాలకు మార్గం సుగమం చేస్తుంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ ప్రపంచంలోని, భారతీయ ప్రముఖులు, క్రియేటర్స్, సాంకేతిక నిపుణులను ఒక చోటకు చేర్చడం ద్వారా, ఈ ఛాలెంజ్ మీడియా, వినోద భద్రతలో అత్యాధునిక పురోగతుల కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
References:
Kindly find the pdf file
మీడియా & వినోదం (ఎమ్ & ఈ) రంగం కోసం కీలకమైనది అయిన మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో మే 1 నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని ముంబయిలో జరగనుంది.
పరిశ్రమ నిపుణులు, పెట్టుబడిదారులు, క్రియేటర్ లేదా ఆవిష్కర్తలను ఎమ్ & ఈ రంగానికి అనుసంధానించడానికి, సహకరించడానికి, ఆవిష్కరణలు చేయడానికి, తోడ్పాటునందించడానికి ఈ సమిట్ ఒక తిరుగులేని ప్రపంచస్థాయి వేదికను అందిస్తుంది.
భారత సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, కంటెంట్ క్రియేషన్, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా భారత్ స్థానాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో వేవ్స్ రూపుదిద్దుకుంది. బ్రాడ్‌కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై ఇది దృష్టి సారించింది.
ఏవైనా సందేహాలున్నాయా? సమాధానాలు here
రండి, మాతో కలిసి ముందుకుసాగండి! ఇప్పుడే ( now ) వేవ్స్ కోసం నమోదు చేసుకోండి (త్వరలో!).
***
(Release ID: 2109761)
Visitor Counter : 12