యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయతో ప్రత్యేక సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, క్రీడాకారులు


తొలి ‘అస్మిత’ సమాచార పత్రాన్ని సంయుక్తంగా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి, ఒలింపిక్ షట్లర్‌ గోపీచంద్‌

Posted On: 08 MAR 2025 1:02PM by PIB Hyderabad

   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని కన్హా శాంతివనంలో ఇవాళ ప్రత్యేక సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడలు-యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సహా రాష్ట్ర క్రీడా మంత్రులు, క్రీడాకారులు పాలుపంచుకున్నారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ మాండవీయ మాట్లాడుతూ- “ఈ సైకిల్ ర్యాలీ మన నారీశక్తి సామర్థ్యానికి ఒక ఉదాహరణ. క్రీడారంగంలోనే కాకుండా అన్నింటా మహిళల దృఢ సంకల్పం, నాయకత్వం, నైపుణ్యానికి ఇది నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.

   అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో నిర్వహించే 2028 ఒలింపిక్‌ క్రీడలకు సన్నాహకాల దిశగా కన్హా శాంతివనంలో వివిధ రాష్ట్రాల క్రీడాశాఖ మంత్రులు, కీలక భాగస్వాములతో మేధామధన శిబిరం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో దీనికి అనుబంధంగా ప్రత్యేక సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఒలింపిక్స్‌ సన్నద్ధతతోపాటు భారత్‌లో 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు ప్రతిపాదనలు సమర్పించే అంశంపైనా ఈ శిబిరంలో చర్చించారు. ఆరోగ్య-ఆధ్యాత్మిక కార్యకలాపాల కేంద్రమైన కన్హా శాంతివనం సభ్యులు కూడా ఈ సైకిల్‌ ర్యాలీలో అమితాసక్తితో పాల్గొన్నారు.

   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘అస్మిత’ పేరిట రూపొందించిన తొలి సమాచార పత్రాన్ని డాక్టర్‌ మన్సుఖ్ మాండవీయతోపాటు క్రీడాశాఖ కార్యదర్శి శ్రీమతి సుజాత చతుర్వేది, మాజీ ఒలింపియన్-బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా ప్రముఖ క్రీడాకారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రభుత్వం 2021లో ‘మహిళల కోసం క్రీడలు’ పేరిట ప్రారంభించిన కార్యక్రమ విశేషాలను ఈ సమాచార పత్రం వివరిస్తుంది. ‘అస్మిత’ లీగ్‌ పోటీలకు అద్భుత ఆదరణను, క్రీడలను వృత్తిగా స్వీకరించడం ద్వారా యువతుల జీవితాలు రూపాంతరం చెందే తీరును ఈ పత్రం ప్రస్ఫుటం చేస్తుంది.

   సైనా నెహ్వాల్, పి.వి.సింధు వంటి ఒలింపిక్ విజేతలకు శిక్షణ ఇచ్చిన పూర్వ ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్ గోపీచంద్ మాట్లాడుతూ- “దేశం కోసం ఒలింపిక్‌ పతకాలు సాధించినవారిలో మహిళల సంఖ్యే అధికం. అందువల్ల వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ నేపథ్యంలో క్రీడల భవిష్యత్తుపై చర్చతోపాటు మన ఒలింపిక్‌ కలల సాకారం దిశగా 15 మంది క్రీడా మంత్రులు డాక్టర్ మాండవీయతో సమావేశం కావడంలో ‘అస్మిత’ ఓ గొప్ప వేదికగా మారింది. ఇది నిజంగా గొప్ప కార్యక్రమం. దీనికింద సముచిత కార్యక్రమాలకు రూపకల్పన చేయడమేగాక సవ్యంగా అమలు చేయడం అవశ్యం” అన్నారు.

   కన్హా శాంతివనంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీకి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మహిళా శిక్షణార్థులు, పారిస్ పారాలింపిక్స్-2024 కాంస్య పతక విజేత దీప్తి జీవన్జీ, గౌరవనీయ అస్సాం క్రీడా మంత్రి శ్రీమతి నందిత గోర్లోసా నాయకత్వం వహించారు.

   డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ- ఆరోగ్యకర జీవనశైలి దిశగా సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవడంలోని ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించారు. డాక్టర్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ‘సండేస్ ఆన్ సైకిల్’ (ఆదివారాల్లో సైకిల్‌ ప్రయాణం) కార్యక్రమం దేశవ్యాప్త ప్రజాదరణ పొందింది. నిత్య జీవితంలో సైక్లింగ్‌ను దినచర్యగా మార్చుకోవడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

   “సైక్లింగ్ అనేది ఒక అభిరుచిగా, అలవాటుగా, ఊబకాయం-జీవనశైలి వ్యాధులపై పోరాడే సాధనంగా మారాలి. ఈ దిశగా ప్రతి ఆదివారం కనీసం ఒక గంట శరీర దృఢత్వ సాధనకు కేటాయించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పౌరులందరికీ నా విజ్ఞప్తి” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

   కన్హా శాంతి వనంలో ఉషోదయాన.. ఉల్లాస శీతల పవనాల మధ్య.. భానుడి కిరణాల నులివెచ్చని స్పర్శను ఆస్వాదిస్తూ.. నిండు పసుపు వర్ణం పరిసరాలను కమ్ముకోగా ఎంతో ఉత్సాహంతో 3 కిలోమీటర్ల దూరం ఈ సైకిల్‌ ర్యాలీ సాగింది.

   ఈ సందర్భంగా శ్రీమతి గోర్లోసా మాట్లాడుతూ- “దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నేను మళ్లీ సైకిల్‌ సవారీ చేశాను. ఇది నాకెన్నో మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. నేను కూడా సైకిల్‌ తొక్కుతానని డాక్టర్ మాండవీయ చెప్పినపుడు, కాదనలేకపోయాను.. అందుకు నేనేమీ చింతించడం లేదు. మహిళా దినోత్సవం నాడు అదొక ప్రత్యేకానుభూతి మాత్రమే కాదు.. సైక్లింగ్ అంటే దృఢత్వం.. మన శక్తి స్రవంతిని క్రమబద్ధం చేసే ఉత్తమ మార్గమనే సందేశంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను." అన్నారు.

‘అస్మిత’ గురించి:

   ‘అస్మిత’ (మహిళలకు ప్రేరణద్వారా క్రీడాలక్ష్యాల సాధన) అంటే- లీగ్‌లు, పోటీల ద్వారా మహిళా లోకంలో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం. ‘క్రీడా భారతం’ (ఖేలో ఇండియా) పథకంలో భాగంగా లింగభేదంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఆ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌-ఎస్‌ఎఐ) జాతీయ, జోన్ల్‌ స్థాయిలో జాతీయ క్రీడా సమాఖ్య ద్వారా బహుళ వయోవర్గాల మధ్య ‘ఖేలో ఇండియా’ మహిళా లీగ్‌ల నిర్వహణకు తోడ్పడుతుంది. ఇది 2021లో ప్రారంభం కాగా, లీగ్‌లతోపాటు క్రీడలలో మహిళల భాగస్వామ్యం పెంచడం సహా దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభాన్వేషణకు వేదికగా ఇది ఉపయోగపడుతోంది.

 

***


(Release ID: 2109445) Visitor Counter : 37