ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ లోని హర్సిల్ లో శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
మరోసారి దేవభూమి ఉత్తరాఖండ్ కు రావడం నా అదృష్టం: ప్రధాని
ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దే: ప్రధాని
మన పర్యాటక రంగంలో వైవిధ్యం, ఏడాది పొడవునా దానిని కొనసాగించడం ఉత్తరాఖండ్ కు ఆవశ్యకం: ప్రధాని
విరామ సమయమంటూ ఉండొద్దు... ప్రతీ రుతువులోనూ ఉత్తరాఖండ్ లో పర్యాటకం కొనసాగాలి: ప్రధాని
ఉత్తరాఖండ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి: ప్రధాని
Posted On:
06 MAR 2025 12:54PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో ట్రెక్, బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... అనంతరం శీతాకాల పర్యాటక కార్యక్రమంలో పాల్గొన్నారు. మఖ్వా ప్రాంతంలోని శీతాకాలపు గంగామాత దర్శన ప్రాంతాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనా గ్రామంలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారని, ఇది బాధిత కుటుంబాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుందని అన్నారు.
“దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉన్నది. చార్ ధామ్ సహా అసంఖ్యాకమైన పవిత్ర ప్రాంతాలు ఇక్కడున్నాయి” అని ప్రధానమంత్రి అన్నారు. జీవదాయిని అయిన గంగమ్మకు శీతాకాల నివాసంగా ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. మరోసారి ఉత్తరాఖండ్ ను సందర్శించి ఇక్కడి ప్రజలను, వారి కుటుంబాలను కలుసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గంగమ్మ దయ వల్లే ఇది సాధ్యపడిందన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాఖండ్ కు సేవలందించే భాగ్యం తనకు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గంగమ్మే తనను పిలిపించుకున్నదంటూ కాశీలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ.. “గంగమ్మ ఆశీస్సులే నన్ను కాశీకి నడిపించాయి. అక్కడ నేనిప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను” అని శ్రీ మోదీ అన్నారు. అయితే ఆ నదీమతల్లి తనవాడిగా సొంతం చేసుకున్నదని ఇప్పుడే తెలిసిందన్నారు. గంగా మాతకు ఈ బిడ్డపై ఉన్న ప్రేమాభిమానాల వల్లే తన తల్లిగారి ఇల్లయిన మఖ్వా గ్రామానికి వచ్చి.. ముఖీమఠ్- మఖ్వాను దర్శించుకుని పూజ చేసే భాగ్యాన్ని ప్రసాదించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తాను ‘దీదీ-భులియాస్’ అని పిలుచుకునే హార్సిల్ మహిళలు తనపై ఎంతో ఆప్యాయతను కనబరిచారంటూ ఆ ప్రాంతంలో పర్యటన సందర్భంగా తన అనుభవాలను శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. హార్సిల్ రాజ్మా, ఇతర స్థానిక ఉత్పత్తులను ఇచ్చి తనపై ఆత్మీయ భావాన్ని చూపారన్నారు. వారి ఆప్యాయత, అనుబంధం, బహుమతుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
బాబా కేదార్ నాథ్ ను సందర్శించిన సమయంలో ‘‘ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దే’’ అని ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. బాబా కేదార్ నాథే ఆ మాట చెప్పే శక్తిని తనకు ప్రసాదించారని వ్యాఖ్యానించారు. బాబా కేదార్ నాథ్ ఆశీస్సులతో ఈ లక్ష్యం క్రమంగా సాకారమవుతోందన్నారు. ఉత్తరాఖండ్ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయని, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. నిరంతర విజయాలు, కొత్త లక్ష్యాలను సాకారం చేసుకోవడం ద్వారా ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలు నిజమవుతున్నాయని పేర్కొన్నారు. “శీతాకాల పర్యాటకం ఈ దిశగా పడిన తొలి అడుగు. ఉత్తరాఖండ్ ఆర్థిక సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఇది దోహదపడుతుంది’’ అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రాష్ట్రం పురోగమించాలని ఆకాంక్షించారు.
“పర్యాటకాన్ని బహుముఖీనంగా విస్తరించడం, ఆ రంగంలో ఏడాది పొడవునా కార్యకలాపాలు జరిగేలా చూడడం ఉత్తరాఖండ్ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన, అత్యావశ్యకమైన అంశం’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ పర్యాటకంలో విరామ కాలమంటూ ఉండొద్దని, ప్రతి రుతువులోనూ పర్యాటక రంగం పురోగమించాలని సూచించారు. కొండల్లో పర్యాటకం ఈ కాలానికి అనువైనదనీ.. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు. అయితే తర్వాతి కాలంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ శీతాకాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాలు ఖాళీగా ఉంటున్నాయని చెప్పారు. ఈ అసమతౌల్యం వల్ల ఉత్తరాఖండ్ లోని చాలా ప్రాంతాల్లో అనేక రోజులపాటు ఆర్థిక స్తబ్ధత ఆవరిస్తోందని, పర్యావరణపరమైన సవాళ్లూ ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
“శీతాకాలంలో ఉత్తరాఖండ్ సందర్శన ద్వారా ఈ దేవభూమి దివ్య తేజస్సును స్పష్టంగా ఆస్వాదించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ట్రెక్కింగ్, స్కీయింగ్ వంటివి శీతాకాలంలో మరింత ఉల్లాసాన్నిస్తాయని ప్రముఖంగా పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక యాత్రలకు శీతాకాలం ప్రత్యేకమైనదని, అనేక పవిత్ర క్షేత్రాల్లో ఈ సమయంలో ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారని చెప్పారు. మఖ్వా గ్రామంలోని ఆధ్యాత్మిక వేడుక ఈ ప్రాంత ప్రాచీన, అద్భుత సంప్రదాయాలలో అంతర్భాగమన్నారు. ఏడాది పొడవునా పర్యాటకం దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సంకల్పం.. ప్రజలకు ఆధ్యాత్మిక అనుభవాలను పొందే అవకాశాన్నిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ఇది స్థానిక ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాఖండ్ యువతకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.
‘‘ఉత్తరాఖండ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థిలనూ తట్టుకునేలా చార్ ధామ్ రహదారి, ఆధునిక ఎక్స్ ప్రెస్ మార్గాలు, రాష్ట్రంలో రైల్వేలు, వాయు రవాణా, హెలికాప్టర్ సేవల విస్తరణ సహా గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేదారనాథ్ రోప్ వే ప్రాజెక్టు, హేమకుండ్ రోప్ వే ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించిందని తెలిపారు. కేదారనాథ్ రోప్ వే ప్రయాణ సమయాన్ని 8-9 గంటల నుంచి దాదాపు 30 నిమిషాలకు తగ్గిస్తుందని చెప్పారు. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుందనీ.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు ప్రయాణ ఇబ్బందులను తొలగిస్తుందనీ అన్నారు. ఈ రోప్ వే ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు శ్రీ మోదీ తెలిపారు. ఈ విప్లవాత్మక కార్యక్రమాలపట్ల ఉత్తరాఖండ్ తో పాటు యావత్ దేశానికీ ఆయన అభినందనలు తెలిపారు.
కొండ ప్రాంతాల్లో పర్యావరణ హితమైన దుంగలతో నిర్మించిన ఆవాస (ఎకో లాగ్ హట్) సదుపాయాలు, సమావేశ కేంద్రాలు, హెలిప్యాడ్ మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. టిమ్మర్ సైన్ మహాదేవ్, మనా గ్రామం, జాడంగ్ గ్రామం వంటి ప్రదేశాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలను కొత్తగా అభివృద్ధి చేస్తున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు. 1962 నాటికి ఖాళీగా ఉన్న మనా, జాదుంగ్ గ్రామాలను పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఫలితంగా ఉత్తరాఖండ్ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగిందని శ్రీ మోదీ చెప్పారు. చార్ ధామ్ యాత్రకు హాజరయ్యేవారి సంఖ్య 2014కు ముందు ఏటా సగటున 18 లక్షలుగా ఉండేదని, ఆ సంఖ్య ఇప్పుడు 50 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది బడ్జెటులో 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులు చేశామని, ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలుగా హోటళ్లను అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం పర్యాటకులకు మెరుగైన సదుపాయాలను అందిస్తుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తుందని పునరుద్ఘాటించారు.
ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాలకూ పర్యాటక రంగ ప్రయోజనాలు లభించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి విశదీకరించారు. ఈ మేరకు “ఒకనాడు దేశానికి ‘చిట్టచివరి గ్రామాలు’గా పరిగణించబడినవన్నీ నేడు ‘ప్రవేశ గ్రామాలు’గా రూపొందాయి” అని గుర్తుచేశారు. ఆ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ‘సాధికార గ్రామాల కార్యక్రమం’ అమలు చేయడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. ఆ కార్యక్రమం కింద రూపాంతరం చెందిన వాటిలో ఈ ప్రాంతంలోని 10 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఇక నెలాంగ్, జాడుంగ్ గ్రామాల పునరావాసానికి చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా జాడుంగ్ వరకూ బైక్ ర్యాలీని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ‘ఆతిథ్యగృహ’ (హోమ్‌స్టే) నిర్మాణం కోసం ‘ముద్ర’ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో ఈ దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. దీంతో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలే కరవైన గ్రామాలు నేడు సరికొత్త ‘ఆతిథ్యగృహాలు’ ప్రారంభిస్తున్నాయని చెప్పారు. ఈ పరిణామం పర్యాటక రంగం అభివృద్ధికి దోహదం చేయడమేగాక స్థానికుల ఆదాయార్జనకు మార్గంగా మారిందని వివరించారు.
ఈ సందర్భంగా దేశం నలుమూలలాగల ప్రజలకు... ముఖ్యంగా యువతరానికి ప్రధాని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శీతాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాలు పొగమంచుతో నిండిపోవడాన్ని ఉటంకిస్తూ- పర్వత ప్రాంతాల్లో నులివెచ్చని సూర్యస్పర్శ ఎంతో ఆనందానుభూతినిస్తుందని గుర్తుచేశారు. ఈ సానుకూలతను ఓ విశిష్ట కార్యక్రమంగా రూపొందించే వీలుందని శ్రీ మోదీ సూచించారు. ఆ మేరకు దేశీయ పర్యాటకులను శీతాకాలంలో ఉత్తరాఖండ్ సందర్శనకు ఆకర్షించేలా గఢ్వాలిలో “శీతాకాల సూర్యస్నాన పర్యాటకం” (ఘమ్ తాపో టూరిజం) పేరిట వినూత్న కార్యక్రమాలు నిర్వహించవచ్చునని సలహా ఇచ్చారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లో సభలు, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనల (ఎంఐసిఇ-MICE) రంగానికిగల విస్తృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదనుగుణంగా ఆయా కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించడం ద్వారా శీతాకాల పర్యాటకంలో భాగస్వాములు కావాల్సిందిగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇప్పటికే యోగా, ఆయుర్వేద రంగాల ద్వారా సందర్శకులు పునరుత్తేజం పొందే అవకాశాలను కల్పిస్తున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే విద్యార్థుల శీతాకాల పర్యటనలకు ఉత్తరాఖండ్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు-కళాశాలలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
మన దేశంలో వివాహ ఆర్థిక వ్యవస్థను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని విలువ రూ.వేల కోట్లలో ఉంటుందని, ‘భారత్‌లో పెళ్లి వేడుక’లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శీతాకాలపు వివాహాలకు ప్రాధాన్య గమ్యంగా ఉత్తరాఖండ్‌ను ఎంచుకోవాలని సూచించారు. భారత చలనచిత్ర పరిశ్రమ పరంగా తన అంచనాలను వెల్లడిస్తూ- ఉత్తరాఖండ్ “అత్యంత చలనచిత్ర మైత్రీ పూర్వక రాష్ట్రం”గా పేరొందిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, శీతాకాలంలో సినిమాల చిత్రీకరణకు అనువైన గమ్యస్థానంగా మారిందని తెలిపారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో శీతాకాల పర్యాటకానికిగల ఆదరణను శ్రీ మోదీ గుర్తుచేశారు. అటువంటి దేశాల అనుభవాల నుంచి తనదైన శీతాకాల పర్యాటక విధానాన్ని ఉత్తరాఖండ్ రూపొందించుకోవాలని సూచించారు. హోటళ్లు, రిసార్టులు సహా సహా రాష్ట్ర పర్యాటక రంగ భాగస్వామ్య సంస్థలన్నీ శీతల దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని కోరారు. తద్వారా స్వీయ కార్యాచరణను రూపొందించుకుని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. స్థానిక సంప్రదాయాలు, సంగీతం, నృత్యం, వంటకాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని వేడినీటి ఊటలను ఆరోగ్య-శ్రేయో ప్రదేశాలుగా తీర్చిదిద్దవచ్చునని, అదే తరహాలో మంచు దుప్పటి కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో శీతాకాలపు యోగాభ్యాస శిబిరాలను నిర్వహించవచ్చని సూచించారు. యోగా గురువులు ఏటా యోగా శిబిరాలు నిర్వహించాలని కోరారు. శీతాకాలంలో ప్రత్యేక వన్యప్రాణుల సందర్శన పర్యటనల ద్వారా ఉత్తరాఖండ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని కూడా సూచించారు. ఈ లక్ష్యాల దిశగా ఒక సంపూర్ణ విధానాన్ని అమలు చేస్తూ, ప్రతి స్థాయిలోనూ తగినవిధంగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
సౌకర్యాల కల్పనతోపాటు అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టడం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ శీతాకాల పర్యాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దేశంలోని యువ సృష్టికర్తలు కీలకపాత్ర పోషించాల్సి ఉందని చెప్పారు. పర్యాటక రంగ ప్రగతిలో వారి గణనీయ సహకారాన్ని ప్రస్తావిస్తూ- ఉత్తరాఖండ్‌లో కొత్త సందర్శక గమ్యాలను గుర్తించి, ఆయా అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా పర్యాటకంపై యువతరానికి లఘు చిత్రాల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందే రంగం ఇదేనని స్పష్టం చేస్తూ- ఈ దిశగా ఏడాది పొడవునా పర్యాటక ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ టమ్టా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది శీతాకాల పర్యాటక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాదిగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఆతిథ్య గృహాలు, పర్యాటక వ్యాపారాలు తదితరాల వృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది.
***
MJPS/SR
(Release ID: 2108861)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam