ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 28 FEB 2025 10:10PM by PIB Hyderabad

డాక్టర్ కరణ్ సింగ్ గారు, ముజఫర్ అలీ గారు, మీరా అలీ గారు, కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా!

   ఈ రోజు ‘జహాన్-ఎ-ఖుస్రో’ కార్యక్రమానికి హాజరు కావడం సహజంగానే నాకెంతో ఆనందం కలిగించింది. ఖుస్రోకు వసంత రుతువు ఎంతో ఇష్టమైన కాలం. ఇవాళ ఢిల్లీలో విరిసిన ఈ వసంతం ప్రాంగణ వాతావరణమంతటా అలముకుంది. హజ్రత్ ఖుస్రో మాటల్లోనే చెబితే-

సకల్‌ బన్‌ ఫూల్‌ రహీ సరసే, సకల్‌ బన్‌ ఫూల్‌ రహీ సరసే,
ఆమ్బ్వా ఫూటే టేసూ ఫూలే, కోయల్‌ బోలే డార్‌-డార్‌...
(వనమంతా పూచిన ఆవాల పూలు... వనమంతా పూచిన ఆవాల పూలు
మామిడి చివుళ్లు.. లేలేత పూతను ఆస్వాదిస్తూ కొమ్మకొమ్మనా కోయిల పాటలు)

   ఈ వాతావరణం చూస్తే ఆ దృశ్యమే కనులముందు కదులుతోంది. ఈ వేడుకకు హాజరయ్యే  ముందు మార్కెట్ (తా బజార్)ను సందర్శించే అవకాశం నాకు లభించింది. అటుపైన బాఘ్‌-ఎ-ఫిర్దాస్‌లో కొందరు మిత్రులతో శుభాకాంక్షలు పంచుకున్నాను. అయితే, ఇప్పుడు ‘నజర్-ఎ-కృష్ణ’ సహా వివిధ ప్రదర్శనల సమయంలో కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మరోవైపు మైక్‌ కూడా కళాకారులను చికాకు పెట్టింది. కానీ, వారు ప్రకృతి తోడ్పాటుతో ప్రదర్శనను కొనసాగించే ప్రయత్నం చేసినా కాస్త నిరాశే మిగిలి ఉంటుంది. వారితోపాటు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన ప్రేక్షకులు కూడా కొంత నిస్పృహకు లోనై ఉంటారు. ఏదేమైనా, ఇలాంటి జీవితానుభవాలు మనకెన్నో పాఠాలు నేర్పుతుంటాయి. నేటి ఈ సందర్భం కూడా అలాంటిదేనని నా భావన.

మిత్రులారా!

   దేశంలో కళాసంస్కృతులు పరిఢవిల్లడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం. అవి మనకు మానసికోల్లాసాన్ని కూడా ఇస్తాయి. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘జహాన్-ఎ-ఖుస్రో’ కార్యక్రమం 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ పాతికేళ్లుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడం ద్వారా ఈ కార్యక్రమం గొప్ప విజయం సాధించింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ కరణ్ సింగ్, నా మిత్రుడు ముజఫర్ అలీగారు, సోదర మీరా అలీగారు తదితరులకు నా అభినందనలు. జహాన్-ఎ-ఖుస్రో పుష్పగుచ్ఛం ఇలాగే సౌరభాలు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ రూమీ ఫౌండేషన్‌తోపాటు మీకందరికీ శుభాకాంక్షలు. ఇక పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మీతోపాటు దేశవాసులందరికీ ముందస్తు శుభాకాంక్షలు. నేనీ రోజున సుందర్ నర్సరీకి వచ్చాను కాబట్టి, దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గౌరవనీయ యువరాజు కరీం అగాఖాన్‌ను సర్మించుకోవడం అత్యంత సహజం. ఈ దిశగా ఆయన కృషి ఇవాళ లక్షలాది కళారాధకులకు ఒక వరంగా మారింది.

మిత్రులారా!

   గుజరాత్‌లోని సర్ఖేజ్ రోజా సూఫీ సంప్రదాయానికి ప్రధాన కేంద్రం. ఈ ప్రదేశం ఒకనాడు కాలం వేటుకు బలై శిథిల స్థితిలో ఉండేది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దాని జీర్ణోద్ధరణపై దృష్టి సారించాను. సర్ఖేజ్ రోజా ప్రాంగణంలో కృష్ణ ఉత్సవాల వైభవం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యవారు. అక్కడి వాతావరణంలో కృష్ణ భక్తి సారం నేటికీ పరిమళిస్తూ ఉంటుంది. సర్ఖేజ్ రోజాలో ఏటా నిర్వహించే సూఫీ సంగీతోత్సవంలో నేను తరచూ పాల్గొనేవాడిని. అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఏకం చేసే సూఫీ సంగీతం మన ఉమ్మడి వారసత్వం. మనమంతా ఇలాగే పెరిగి పెద్దవారమయ్యాం. ఈ నేపథ్యంలో ఇక్కడ నేటి నజర్‌-ఎ-కృష్ణ ప్రదర్శన మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించింది.

మిత్రులారా!

   జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ సౌరభం ఎంతో విభిన్నం. ఇది హిందూస్థాన్‌ మట్టి పరిమళానికి ప్రతీక. హజ్రత్ అమీర్‌ ఖుస్రో సాక్షాత్తూ స్వర్గంతో పోల్చిన ఈ భరత భూమి ఆ స్వర్గంలోని ఉద్యానం. ఈ గడ్డపై సకలవర్ణ సంస్కృతీ సుమాలు వికసించాయి. ఈ నేలకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది.. అందుకే సూఫీ సంప్రదాయం ఇక్కడ పాదం మోపినపుడు ఈ సీమను తనదైన బంధంతో అది పెనవేసుకుంది. బాబా ఫరీద్ ఆధ్యాత్మిక బోధనలు మన హృదయాలకు సాంత్వన చేకూర్చాయి. హజ్రత్ నిజాముద్దీన్ భక్తి సమావేశాలు ప్రేమ జ్యోతులను వెలిగించాయి. హజ్రత్ అమీర్ ఖుస్రో తన మాటలతో అల్లిన ఆణిముత్యాల మాల కింది ప్రసిద్ధ  పద్యంగా రూపుదాల్చింది.

బన్‌ కే పంఛీ భయె బావ్‌రే, బన్‌కే పంఛీ భయె బావ్‌రే
ఐసీ బీన్‌ బజాయీ సావ్‌రే, తార్‌ తార్‌ కీ తాన్‌ నిరాలీ
ఝూమ్‌ రహీ సబ్‌ వన్‌ కీ డారీ
(అడవిలో పక్షులు సందడి చేస్తున్నాయి.. అడవిలో పక్షులు సందడి చేస్తున్నాయి
సుందర నాదాలతో మురళీ రవం అందంగా వినిపిస్తోంది.. ప్రతి తంతువులోనూ
ఈ నాదం ప్రత్యేకం.. అడవిలో చెట్ల కొమ్మలన్నీ నర్తిస్తున్నాయి)

   మన దేశంలో సూఫీ సంప్రదాయం తనదైన విశిష్ట గుర్తింపు తెచ్చుకుంది. నాటి సూఫీ సాధువులు మసీదులకు, ఖాన్కాలకు పరిమితం కాలేదు. వారు ఒకవైపు ఖురాన్ పఠిస్తూనే మరోవైపు వేద శ్రవణం చేసేవారు. తమ ఆజాన్‌కు మన భక్తిగీతాల మాధుర్యాన్ని మిళితం చేసేవారు. అందుకే, “ఏకం సత్‌ విప్ర బహుధా వేదాంతి” అని ఉపనిషత్తులు సంస్కృతంలో చెప్పినట్లుగా “హర్‌ ‌ఖ్వామ్‌ రాస్త్‌ రహే, దీన్‌-ఎ- కిబ్లా గహే” వంటి గీతాలాపనతో హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా తన సూఫీ సంగీతం ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. భాష.. శైలి.. పద ప్రయోగం భిన్నమేగానీ, సందేశం మాత్రం ఒక్కటే. ఆ సంప్రదాయానికి నేడు జహాన్-ఎ-ఖుస్రో ఆధునిక ప్రతిబింబంగా మారింది.

మిత్రులారా!

   ఏ దేశ నాగరికత-సంస్కృతికైనా సంగీతం-గానమే గళంగా మారుతాయి. ఆ విధంగా అది కళల రూపంలో ప్రతిఫలిస్తుంది. కాబట్టే, ‘భారతీయ సంగీతం సమ్మోహనం’ అని హజ్రత్‌ ఖుస్రో అన్నారు. అడవిలోని జింక సంగీత సమ్మోహితమై ప్రాణభయం మరచి స్థాణువులా నిలిచిపోయిందని అభివర్ణించారు. భారతీయ సంగీత జలధిలో భిన్న ప్రవాహంలా ప్రవేశించిన సూఫీ సంగీతం మహా సముద్రంలో అందమైన కెరటంగా మారిపోయింది. సూఫీ, భారత శాస్త్రీయ సంగీత ప్రాచీన స్రవంతులు పరస్పర సమ్మిళితమై మనకు ప్రేమ, భక్తి సహిత సరికొత్త నాదాలను వినిపించాయి. హజ్రత్ ఖుస్రో ఖవ్వాలీలో మనకు కనిపించేది ఇదే; బాబా ఫరీద్ పద్యాల్లోనూ ఇదే వినిపిస్తుంది; బుల్లా షా గళంలో, మీర్ గీతాల్లోనే కాదు... కబీర్, రహీమ్, రస్ ఖాన్ తదితరుల కవిత్వంలో ప్రతిధ్వనించే సరికొత్త నాదం ఇదే. ఈ సాధువులు, ఔలియాలు (ఆధ్యాత్మికవేత్తలు) ఈ విధంగా భక్తికి కొత్త కోణాన్ని జోడించారు. సూరదాస్, రహీమ్, రస్ ఖాన్‌ల రచనలు చదివినా, అర్ధనిమీలిత నేత్రాలతో హజ్రత్ ఖుస్రో గీతాలు వింటూ తాదాత్మ్మం చెందినా అన్నీ మనను ఒకేచోటకు చేరుస్తాయి. అదే అత్యున్నత ఆధ్యాత్మిక ప్రేమ భావన. అక్కడ మానవీయ ఆంక్షలు పటాపంచలై జీవాత్మ-పరమాత్మల ఐక్యతానుభూతి మనను నిలువెల్లా ఆవహిస్తుంది. చూడండి... రస్ ఖాన్ ముస్లిం అయినప్పటికీ, హరిభక్తుడు. ఆయన కూడా- “ఆ శ్రీహరి రూపమే ప్రేమ, సూర్యుడు-అరుణ కాంతి ఎలాగో.. అలా హరి కూడా ప్రేమ స్వరూపుడు” అన్నారు. హజ్రత్‌ ఖుస్రో కూడా- “ఖుస్రో దరియా ప్రేమ్‌ కా, సో ఉలటీ వాకీ ధార్‌, జో ఉతరా సో డూబ్‌ గయా, జో డూబా సో పార్‌” (ప్రేమలో పూర్తిగా మునిగితేనే వివక్ష అవరోధాలు అంతమైపోతాయి) అంటూ తన మనోభావనను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో భాగమైన అద్భుత ప్రదర్శన మనను ఆ లోతైన ఆధ్యాత్మిక ప్రేమ భావనలో లీనం చేసింది.

మిత్రులారా!

   సూఫీ సంప్రదాయం మానవాళి మధ్య ఆధ్యాత్మిక అంతరాన్ని తగ్గించడమే కాదు.. దేశాల మధ్య అగాధాలకు వారధి కట్టింది. నేను 2015లో ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటనకు వెళ్లినపుడు ఎంతో ఉద్వేగభరిత ప్రసంగంతో రూమీని గుర్తుచేసుకున్నాను. ఆ దేశంలోని బాల్ఖ్‌లో 8 శతాబ్దాల కిందట రూమీ జన్మించారు. ఈ నేపథ్యంలో రూమీ రచనల హిందీ అనువాదం నుంచి కొన్ని అంశాలను ఉటంకించదలచాను. ఎందుకంటే ఆ వాక్కులకు ఈ కాలంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది. ఆయనేమన్నారంటే- “పదాలకు ప్రాముఖ్యమివ్వండి... గళానికి కాదు. ఎందుకంటే- వర్షం కురిసినపుడే పూలు వికసిస్తాయి తప్ప తుఫానులో కాదు.” ఆయన పలుకులు మరికొన్ని మన మాటల్లో... “నేను తూర్పు లేదా పశ్చిమ దిక్కులకు చెందినవాడిని కాను... నేను సముద్రం లేదా భూమి నుంచి పుట్టలేదు.. నాదంటూ ఏ ప్రదేశమూ లేదు.. దిక్కులన్నీ నావే.. ప్రతిచోటా నేనే” అన్నారు. “వసుధైక కుటుంబకం” (యావత్‌ ప్రపంచం ఒకే కుటుంబం) అనే ప్రాచీన భారత స్ఫూర్తికి ఈ తాత్త్వికత భిన్నమైనదేమీ కాదు. ప్రపంచ పర్యటనలలో నాకెంతో మనోబలాన్నిచ్చేది ఈ దృక్పథమే. ఇరాన్‌లో సంయుక్త విలేకరుల సమావేశం సందర్భంగా మీర్జా గాలిబ్ ద్విపద “జనూనత్ గరబే, నఫ్సే-ఖుద్, తమామ్ అస్త్. జే-కాశీ, పా-బే కషాన్, నీమ్ గామ్ అస్త్” (మనలో చైతన్యం మేల్కొంటే కాశీ-కాశన్‌ మధ్య దూరం ఓ అరడుగు మాత్రమే అనిపిస్తుంది)ను ఉటంకించాను. మానవాళికి యుద్ధం తీరని నష్టం చేస్తున్న నేటి ప్రపంచంలో ఈ సందేశం నిజంగానే ప్రయోజనకరం.

మిత్రులారా!

   హజ్రత్ అమీర్ ఖుస్రో ‘తుతి-ఎ-హింద్’గా ప్రసిద్ధులు. భారత్‌ను కీర్తిస్తూ, ఈ గడ్డపై ప్రేమతో ఖుస్రో ఆలపించిన గీతాలతోపాటు భారత్ గొప్పదనాన్ని, సౌందర్యాన్ని ప్రశంసించిన తీరు ఆయన రచించిన ‘నుహ్-సిఫర్‌’ పుస్తకంలో కనిపిస్తాయి. ఆ కాలంలో ప్రపంచంలోని అనేక పెద్ద   దేశాలకు భారత్‌ తలమానికమని హజ్రత్ ఖుస్రో అభివర్ణించారు. సంస్కృతాన్ని ప్రపంచ అత్యుత్తమ భాషగా ఆయన ప్రకటించారు. భారత రుషిపుంగవులను మహా పండితులలో అగ్రగణ్యులుగా ఖుస్రో గౌరవించారు. గణిత, విజ్ఞాన, తత్త్వశాస్త్రాలు సహా శూన్యాంకం (సున్నా) వంటి భారతీయ విజ్ఞానం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించింది? భారతీయ గణితం అరబ్బులకు చేరువై “హింద్సా”గా ఎలా ప్రాచుర్యం పొందింది? ఈ వాస్తవాలన్నిటినీ హజ్రత్‌ ఖుస్రో తన రచనలలో ప్రస్తావించడమే కాకుండా సగర్వంగా చాటారు. సుదీర్ఘ వలస పాలన, తదుపరి విధ్వంసాల నేపథ్యంలో భారత్‌ ఉజ్వల చరిత్ర పరిరక్షణతోపాటు ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో హజ్రత్ ఖుస్రో రచనలు గణనీయ పాత్ర పోషించాయి.

మిత్రులారా!

   ఈ వారసత్వాన్ని మనం సుసంపన్న చేసుకోవాలి. ఆ మేరకు 25 ఏళ్ల నుంచీ జహాన్-ఎ-ఖుస్రో ద్వారా సాగుతున్న కృషి ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. పాతికేళ్లుగా ఈ నిరంతర యజ్ఞాన్ని కొనసాగించడం నిజంగా అసాధారణం. ఇందుకుగాను నా మిత్రులను ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడంపై మీకందరికీ మరోసారి నా అభినందనలు. కొన్ని ఇబ్బందులు కలిగినా ఈ వేడుకను ఆస్వాదించే అవకాశం కల్పించినందుకు నా మిత్రుడికి కృతజ్ఞతలు.

అనేకానేక ధన్యవాదాలు!
అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగం హిందీలో సాగింది... ఇది దానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

****


(Release ID: 2107519) Visitor Counter : 6