సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినీ దర్శకులు, యానిమేటర్లకు నిపుణులతో ప్రత్యేక తరగతులు: లీడింగ్ క్రియేటివ్ స్టూడియోతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం
యానిమేషన్ దర్శకుల పోటీ (ఏఎఫ్ సీ): అంతర్జాతీయ గుర్తింపు, మార్గనిర్దేశం, నిధులు సమకూర్చుకునేందుకు వేదిక
సినీ దర్శకులు, యానిమేటర్లకు ప్రముఖ నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు
Posted On:
27 FEB 2025 6:29PM by PIB Hyderabad
ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)- యానిమేషన్ దర్శకుల పోటీ (ఏఎఫ్ సీ)లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, డాన్సింగ్ ఆటమ్స్ (లాస్ ఏంజెల్స్, భారత్ కేంద్రాలుగా ఉన్న క్రియేటివ్ స్టూడియో) నిపుణులతో ప్రత్యేక శిక్షణ తరగతులను ముందుకు తెస్తున్నాయి. విజేతలకు అంతర్జాతీయంగా గుర్తింపు, ఉన్నతస్థాయి నిపుణుల మార్గనిర్దేశంతోపాటు నిధులు సమకూర్చుకునే అవకాశమూ లభిస్తుంది.
స్వతంత్ర సృజనకారులు, విద్యార్థులు, స్టూడియోలు ఏఎఫ్ సీలో పాల్గొని తమ యానిమేటెడ్ లఘు చిత్రాలను ప్రదర్శించవచ్చు. ఈ నైపుణ్య శిక్షణ తరగతుల్లో ఈ రంగంలో ప్రముఖులు స్క్రీన్ ప్లే రచన, చిత్ర దర్శకత్వం, సినీ నిర్మాణం, కథనం, యానిమేషన్, అంతర్జాతీయ మార్కెట్లపై తమ పరిజ్ఞానాన్ని ఔత్సాహికులతో పంచుకుంటారు.
వచ్చే సదస్సుల్లో శిక్షణ తరగతుల షెడ్యూలు, వివరాలు:
మార్చి 3 – బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించడం
వక్త: శోభు యార్లగడ్డ (బాహుబలి సిరీస్ నిర్మాత)
ముఖ్యాంశాలు: హై ఇంపాక్ట్ చిత్రాల రూపకల్పన, నిధులు, నిర్మాణం
మార్చి 4 – ప్రపంచ ప్రేక్షకుల కోసం సినీ నిర్మాణం
వక్త: గుణీత్ మోంగా (ఆస్కార్ పురస్కారం పొందిన నిర్మాత)
ముఖ్యాంశాలు: భారతీయ సినిమాలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకుపోవడం ఎలా?; కో-ప్రొడక్షన్, నిధులను సమకూర్చుకోవడం
మార్చి 5 (టీబీసీ) – పాత్రల యానిమేషన్, కాల్పనిక ప్రతిసృష్టి (వరల్డ్ బిల్డింగ్)
వక్త: ఆర్నౌ ఒల్లె లోపెజ్ (యానిమేషన్ నిపుణులు)
ముఖ్యాంశాలు: పాత్రల ద్వారా కథనాన్ని నడిపించే విధానం, కాల్పనిక ప్రతిసృష్టి
మార్చి 6 – వివిధ మాధ్యమాల్లో కథాకథనం
వక్త: అను సింగ్ చౌదరి (చిత్రకథా రచయిత్రి, జర్నలిస్ట్)
ముఖ్యాంశాలు: స్క్రీన్ ప్లే నైపుణ్యాలు; సినిమాలు, సిరీస్ లకు కథలు చెప్పడం, పుస్తకాలు
ఇంతకుముందు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రెండు ప్రత్యేక నైపుణ్య శిక్షణ సదస్సులు నిర్వహించారు. ఫిబ్రవరి 26న రచయిత, స్క్రీన్ ప్లే నిపుణుడు ఫరూఖ్ ధోండి నేతృత్వంలో చిత్ర కథా రచన, ట్రైలర్లపై ఓ సదస్సు నిర్వహించారు. కథలు చెప్పడం, చిత్రకథా రచన, వాణిజ్య రచనల్లో ప్రావీణ్యాన్ని పెంచేలా దీనికి రూపకల్పన చేశారు. ఫిబ్రవరి 27న సినీ నిర్మాణం & విజువల్ డెవలప్మెంట్ పై ప్రొడక్షన్ డిజైనర్, విజువల్ ఆర్టిస్ట్ రూపాలి గట్టి ఓ సదస్సు నిర్వహించారు. యానిమేషన్, లైవ్ యాక్షన్ ప్రాజెక్టులకు సంబంధించి, తాదాత్మ్యం చెందేలా దృశ్య కథనాలను తీర్చిదిద్దడంలో ఆచరణాత్మకమైన పరిజ్ఞానాన్ని అందించడానికి ఉద్దేశించిన కార్యక్రమమిది.
నెట్వర్కింగ్, ప్రాజెక్టుల సమర్పణ
అత్యుత్తమ భారత సృజనాత్మక ప్రతిభను చాటే అంతర్జాతీయ మార్కెట్ అయిన వేవ్స్ బజార్ కు తమ ప్రాజెక్టులను సమర్పించేలా భారతీయ సృజనకారులను వేవ్స్ ప్రోత్సహిస్తుంది. ఈ వేదిక భారతీయ కంటెంటును ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో అనుసంధానించడం ద్వారా.. నెట్వర్కింగ్, సహకారం, అంతర్జాతీయ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. మరిన్ని వివరాల కోసం waves@dancingatoms.com ను సంప్రదించవచ్చు.
వేవ్స్ గురించి:
మీడియా, వినోద రంగంలో మైలురాయి వంటి కార్యక్రమమైన ఈ తొలి ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)ను మహారాష్ట్రలోని ముంబయిలో కేంద్రప్రభుత్వం మే 1 నుంచి 4 వరకు నిర్వహించనుంది.
మీరు ఈ రంగంలో నిపుణులైనా, పెట్టుబడిదారులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలైనా... మీడియా, వినోద రంగంలో భాగస్వాములై, సృజనాత్మక ఆవిష్కరణలను అందించే అత్యున్నత అంతర్జాతీయ వేదికను ఈ సదస్సు అందిస్తుంది.
దేశ సృజన శక్తిని పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడం వేవ్స్ లక్ష్యం. సమాచార ప్రసారం, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, సౌండ్, సంగీతం, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలు, ఉత్పాదక ఏఐ, అగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్ టెండెడ్ రియాల్టీ (ఎక్స్ఆర్) వంటి పరిశ్రమలు, రంగాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టిసారించింది.
ఇంకా సందేహాలున్నాయా? ఇక్కడ మీకు జవాబులు దొరుకుతాయి.
రండి, మాతో కలిసి పయనించండి! ఇప్పుడే వేవ్స్ కోసం నమోదు చేసుకోండి (త్వరలో మీ ముందుకు రాబోతున్నాం!).
***
(Release ID: 2107288)
Visitor Counter : 35