సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఏఐ అవతార్ క్రియేటర్
Posted On:
20 FEB 2025 4:17PM by PIB Hyderabad
ఊహలకు వాస్తవరూపం ఇవ్వండి
డిజిటల్ వ్యవస్థ రూపురేఖలను మారుస్తూ... వర్చువల్ ప్రదేశాల్లో మనుషుల్లాగే ప్రవర్తిస్తూ, వ్యక్తిగత అభిరుచులకు తగినట్టుగా, ప్రతిస్పందించే, ఏఐ ఆధారిత డిజిటల్ రూపాలను ఏఐ అవతార్లు ప్రదర్శిస్తున్నాయి. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్కెటింగ్, కంటెంట్ రచన, వినోద రంగాలో ఏఐ అవతార్లు శక్తిమంతమైన సాధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, అవతార్ మెటా ల్యాబ్స్ సంయుక్తంగా ఏఐ అవతార్ క్రియేటర్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నాయి. ఏఐ అవతార్ల రూపకల్పనలో ఉన్న అనంతమైన అవకాశాలను అన్వేషించడానికి ఆవిష్కర్తలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు 1,251 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 102 మంది విదేశీయులు ఉన్నారు.


క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్)లో రెండో ప్రధానాంశమైన ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, అధునాతన సాంకేతికతలైన ఆగ్మంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, మెటావర్స్) విభాగంలో అవతార్ క్రియేటర్ ఛాలెంజ్ పోటీలు జరుగుతున్నాయి. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో మే 1-4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
భారత్‌లో మీడియా, వినోదం (ఎం అండ్ ఈ) పరిశ్రమను నూతన విజయ శిఖరాలకు చేర్చడమే వేవ్స్ లక్ష్యం. ప్రధానంగా వేవ్స్ నాలుగు అంశాలపై దృష్టి సారించింది: బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్, ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాల్టీ), డిజిటల్ మీడియా – ఆవిష్కరణలు, సినిమాలు. ఆగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, మెటావర్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలను స్వీకరించిన ఏవీజీసీ-ఎక్స్ఆర్ విభాగంలో ఏఐ అవతార్ క్రియేటర్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు.
నిబంధనలు
ఏఐ అవతార్ క్రియేటర్ పోటీల్లో పాల్గొనే ముందు ఈ ముఖ్యమైన వివరాలను పరిశీలించండి:
· ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కనీసం 18 ఏళ్ల వయసుండాలి. అలాగే వయసు నిర్ధారణకు చెల్లుబాటయ్యే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
· ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. అలాగే ఎన్ని ఏఐ అవతార్లనైనా ఈ పోటీలకు సమర్పించవచ్చు. అయితే మీరు సమర్పించే ప్రతి అవతార్ పూర్తిగా ఏఐ ఆధారంగా రూపొందించినదే అయి ఉండాలి. ప్రతి ఎంట్రీకి ప్రత్యేకమైన పేరు, ప్రొఫైల్ ఉంటాయి.
· మీరు రూపొందించిన అవతార్ పూర్తిగా సొంతమే అని, నిజ జీవితంలోని వ్యక్తులు లేదా ఏఐ మోడళ్ల హక్కులను ఉల్లంఘించలేదని నిర్ధారించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఇతరుల పనిని లేదా గుర్తింపును ఉపయోగించిన ఎంట్రీలు అనర్హతకు గురవుతాయి.
నమోదు ప్రక్రియ

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్న వారు అవతార్ మెటా ల్యాబ్స్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. వెబ్సైట్లోని ‘రిజిస్టర్ ఇంట్రెస్ట్’ అనే బటన్ క్లిక్ చేసి మీ పేరు, సంప్రదించాల్సిన సమాచారం, మీ ఏఐ అవతార్ ఇతివృత్తం, మీరు నివసిస్తున్న ప్రదేశం సహా ఇతర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అన్ని ముఖ్యమైన షరతులు, నిబంధనలను చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28.
మూల్యాంకన ప్రమాణాలు
నిపుణులతో కూడిన ప్యానెల్ ఏఐ అవతార్ క్రియేటర్ ఛాలెంజ్‌కు వచ్చిన దరఖాస్తులను కొన్ని ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. ముఖ్యంగా మూడు అంశాలపై వారు దృష్టి సారిస్తారు. అవి తెలివి, సాంకేతికత, ఉద్దేశం.

మూడు కేటగిరీల్లోనూ ప్రతి ఎంట్రీకి పాయింట్ల విధానంలో మార్కులు ఇస్తారు. వాటి ఆధారంగా మొత్తం స్కోరు ఇస్తారు.
బహుమతి
పోటీలకు వచ్చిన సమర్పణల నుంచి తుది జాబితాలో 10 దరఖాస్తులకు చోటు కల్పిస్తారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారిని వేవ్స్ 2025 సమ్మేళనంలో పరిశ్రమకు చెందిన దిగ్గజాల ముందు తాము రూపొందించిన ఏఐ అవతార్లను ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తారు. విజేతగా నిలిచిన వారికి రూ. 1,00,000 నగదు బహుమతి అందుతుంది. మొదటి పది స్థానాల్లో నిలిచినవారికి ఈ పోటీల్లో పాల్గొన్నట్లుగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ద్రువీకరణ పత్రం లభిస్తుంది.
విజేత లేదా రన్నరప్‌గా ప్రకటించిన వారు తాము రూపొందించిన ఏఐ అవతార్ ఇమేజ్‌లను, వారికి సంబంధించిన సోషల్ మీడియా ఛానళ్లను - ప్రెస్/పీఆర్, డబ్బు చెల్లించి ఇచ్చే ప్రకటనలు, సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ సహా ఇతర మార్కెటింగ్ వేదికల్లో ఉపయోగించుకొనేందుకు అంగీకరించాల్సి ఉంటుంది.

References:
· https://wavesindia.org/challenges-2025
· https://aiavatarchallenge.com/
· https://aiavatarchallenge.com/termsandconditions.php
Kindly find the pdf file
***
(Release ID: 2105211)
Visitor Counter : 9