సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
బెర్లినేల్ 2025 వేదికగా వేవ్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్
వేవ్స్ 2025 సమిట్ కోసం చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులకు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆహ్వానం
మీడియా, సాంకేతిక రంగాల్లో భారత ప్రపంచస్థాయి సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రముఖ సినీదర్శకులు శేఖర్ కపూర్
Posted On:
15 FEB 2025 8:01PM by PIB Hyderabad
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 సందర్బంగా ఈరోజు వేవ్స్ 2025 అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాతలతో భారత ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం భారత ప్రాచీన నాగరికత, ఆధునిక సాంకేతికతల విశిష్ట కలయికను చాటడమే కాకుండా మీడియా, సాంకేతిక రంగాల్లో ప్రపంచ సహకారాన్ని మరింత మెరుగుపరిచే వేదికగా నిలిచింది. ఏవీజీసీ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం వేదికగా ప్రముఖ సినీ నిర్మాతలు, సాంకేతిక రంగ ప్రముఖులను వేవ్స్ 2025 సమిట్‌కు ఆహ్వానించారు.
బెర్లినేల్ సందర్భంగా ప్రముఖ దర్శకులు, నటులు శ్రీ శేఖర్ కపూర్ మాట్లాడుతూ, భారత మీడియా సామర్థ్యాన్ని గురించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ కోసం ప్రపంచ స్థాయి వేదికను అందించడం ద్వారా వారిని శక్తిమంతం చేయడం పట్ల ప్రధానమంత్రి దార్శనికతను ఆయన వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, అలాగే ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగంతో కలిసి పనిచేయడం కోసం ఈ రంగంలోని అంతర్జాతీయ స్థాయి ప్రముఖులకు వేవ్స్ ఒక చక్కటి వేదిక అవుతుందన్నారు.
భారత సాంకేతిక వృద్ధిని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ శేఖర్ కపూర్, ఈ రంగంలో భారత్ త్వరలోనే ప్రపంచానికి మార్గదర్శనం చేసే స్థాయికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర వృద్ధి, ఆవిష్కరణలతో భారత కంపెనీలు ప్రపంచంలోని ప్రధాన సాంకేతిక రంగ కంపెనీలకు గట్టిపోటీని ఇవ్వగలవన్నారు.
శ్రోత దృక్కోణంలో కథను చెప్పడం ప్రత్యేక కళ అని వ్యాఖ్యానించిన ఆయన, కథ చెప్పేందుకు వివిధ మాధ్యమాల అవసరం ఉందన్నారు. క్రియేటర్స్ వారి కథలను వినూత్నంగా, ఆకర్షణీయంగా చెప్పేందుకు అత్యాధునిక వేదికలను వేవ్స్ 2025 వారికి అందిస్తుందన్నారు.
బెర్లినేల్‌గా సుపరిచితమైన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ నలుమూలల నుంచి ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలు, సినీరంగ ప్రముఖులను ఆకర్షించే అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా నిలుస్తోంది. ప్రతియేటా జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే ఈ వేడుకలు సృజనాత్మకతను పంచుకునేందుకు, సినిమా గురించిన వైవిధ్యమైన అభిప్రాయాలను, కథను చెప్పేందుకు సరికొత్త పద్ధతులను అందిస్తోంది. బెర్లినేల్‌లో కీలక పాత్ర పోషించే యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్ (ఈఎఫ్ఎమ్), అంతర్జాతీయ సినీ, మీడియా కంపెనీల కలయిక, సహకారం, వ్యాపార అవకాశాల అన్వేషణ కోసం అవకాశం కల్పిస్తుంది.
అంతకుముందు, భారత సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలు, అత్యాధునిక సాంకేతికత వినియోగం గురించి కేంద్రమంత్రి ఈ కార్యక్రమంలో చక్కగా వివరించారు. ఈ ప్రసంగం సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, అలాగే ఎక్స్ఆర్ (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) వంటి రంగాల్లో ప్రపంచ దేశాల భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తూనే, శక్తిమంతమైన భారత పారిశ్రామిక రంగం ఎన్నో ఆవిష్కరణల దిశగా సాగుతున్న తీరును స్పష్టం చేసింది. ప్రపంచ మీడియా రంగానికి భారత ప్రతిభను ప్రదర్శించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వేవ్స్ కార్యక్రమం ద్వారా లభించే వివిధ అవకాశాలను ఆహుతులకు వివరించారు.
ఈ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
· కథను చెప్పడానికి గల భారత ప్రాచీన సంప్రదాయాలను ఆధునిక డిజిటల్ ఫార్మాట్‌లతో అనుసంధానించడంలో వేవ్స్ పాత్ర.
· బి2బి సహకారం, వేవ్స్ బజార్ వంటి వేవ్స్ వేదికల ద్వారా భారత, ప్రపంచ క్రియేటర్ల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించడం.
· వేవ్ ఎక్సిలెరేటర్ కార్యక్రమం ద్వారా యానిమేషన్, గేమింగ్, ఎక్స్ఆర్ సాంకేతికతల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గల అవకాశాలు.
· క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ వన్ కింద 30కి పైగా సవాళ్ల ద్వారా ఊహాశక్తి, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రదర్శించడం
· మీడియా, వినోద రంగాల్లో కంటెంట్ క్రియేటర్స్, అంకుర సంస్థలు, సాంకేతిక పురోగతులకు మద్దతునిచ్చే ప్రభుత్వ కార్యక్రమాలు
వేవ్స్ 2025 గురించి:
మీడియా, వినోదం, సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వేవ్స్ 2025 గ్లోబల్ సమిట్ మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబయిలో జరగనుంది. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, అలాగే ఎక్స్ఆర్ (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగాల్లో నూతన అవకాశాలను అన్వేషించేందుకు క్రియేటర్స్, పరిశ్రమ ప్రముఖులు అలాగే పెట్టుబడిదారులను ఒకే వేదికకు తెచ్చే కార్యక్రమమే వేవ్స్. ఏవీసీజీ-ఎక్స్ఆర్ రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ను నిలిపేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ప్రపంచస్థాయి సహకారాన్ని వేవ్స్ 2025 ప్రోత్సహిస్తోంది.
(Release ID: 2103906)
Visitor Counter : 20